“వరదా ఈ బొబ్బిలి యుద్ధం, పలనాటి యుద్ధం ప్రత్యేకత ఏమిటి? కావ్యాలుగా, నాటకాలుగా, గేయకథలుగా రాయబడ్డాయి.” ప్రశ్నించాడు మల్లిఖార్జున.
“నాకు కొద్దిగానే తెలుసు. మా నాన్నగారికి అడిగి తెలుసుకుందాం. విపులంగా చెప్తారు.” అన్నాడు వరదరాజులు.
ఇద్దరూ వరదరాజులు తండ్రి గోవిందరాజులు దగ్గరకు వెళ్లారు.
“నాన్నగారూ, నా స్నేహితుడు మల్లిఖార్జునకు, బొబ్బిలి యుద్ధం, పలనాటి యుద్ధం గురించి తెలుసుకోవాలని ఉందట. కాస్త వివరిస్తారా? నాకైతే కొంచెమే తెలుసు” అన్నాడు వరదరాజులు.
“బొబ్బిలి యుద్ధం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది. బొబ్బిలి కోట విశాఖపట్నానికి ఈశాన్యంగా 140 మైళ్ళ దూరంలో ఉంది.18 వ శతాబ్ది మధ్య కాలంలో బొబ్బిలి జమీందారుగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకు వెళ్ళేవారు. తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ బుస్సీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద విజయరామరాజు భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందార్ల లాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక, తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్, మార్క్ దీ బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం. భారత దేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.” చెప్పాడు గోవిందరాజులు.
“ఇంకొంచెం వివరంగా చెప్పండి.” అడిగాడు మల్లిఖార్జున.
“18 వ శతాబ్దంలో బొబ్బిలికీ విజయనగరానికీ మధ్య అనేక ఘర్షణలు, యుద్ధాలూ జరిగాయి. ఎక్కువగా బొబ్బిలి సంస్థానమే విజయం సాధిస్తూ ఉండేది. వాటిలో ప్రధానమైనవి ఇవి:
పెద విజయరామరాజు, నారాయణపట్నాన్ని ఆక్రమించేందుకు సాగి నారాయణరాజు నేతృత్వంలో సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం బొబ్బిలి పరగణా గుండా పోతున్నపుడు, బొబ్బిలి సైన్యం అడ్డగించి, ఓడించి వెనక్కు పంపింది.
విజయనగరం రాజు తన కింద ఉన్న పాలెగాళ్ళను కూడగట్టి పెద్ద సైన్యంతో బొబ్బిలిపై దాడి చేసాడు. మళ్ళీ బొబ్బిలి సైన్యం చేతిలో ఓడిపోయాడు. బొబ్బిలి సైన్యం రాజును వెంటాడగా, అతడు పారిపోయి కుమిలి కోటలో తలదాచుకున్నాడు.
విజయనగరం రాజు పార్వతీపురానికి దగ్గర్లోని బెలగం వద్ద కోటను నిర్మించి నారాయణ పట్నాన్ని ఆక్రమించాడు. అక్కడి నుండి బొబ్బిలిపై దాడి చేసాడుగాని, విఫలుడయ్యాడు. ఈ యుద్ధాల్లోగానీ, నారాయణపట్నంలో మురికినీళ్ళు తాగడం వలన వచ్చిన రోగాల వలన గానీ 4,000 మంది దాకా సైనికులను కోల్పోయాడు. నారాయణపట్నం ప్రభువు తన తప్పును అంగీకరించి క్షమించమని అడిగాక పరిహారం వసూలుచేసి, అతడి రాజ్యాన్ని అతడికి ఇచ్చివేసాడు.
విజయరామరాజు మళ్ళీ తన సైన్యాన్ని కూడగట్టి బొబ్బిలిపై దాడి తలపెట్టాడు. ఈసారి అతడు దేశస్తులను కూడగట్టాడు. దేశస్తులంటే ఐరోపా వారితో యుద్ధాల్లో పాల్గొన్న దేశీయులు. కానీ ‘బొబ్బిలిని ఓడించడం సాధ్యం కానిపని’ అని వారు రాజును హెచ్చరించారు. తన దీవాను బుర్రా బుచ్చన్న సలహా మేరకు తానుకాక, పూసపాటి రామచంద్రరాజు సారథ్యంలో సైన్యాన్ని దాడి పంపించాడు విజయరామరాజు. బొబ్బిలి సైన్యం వారిని ఓడించి, రామచంద్రరాజు తలను నరికి, దానికి తిరునామాలు పెట్టి, విజయనగరానికి పంపారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా బొబ్బిలిపై పైచేయి సాధించలేకపోయాడు విజయరామరాజు.
ఇది ఇలా ఉండగా…
హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్ బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత విజయనగరం రాజులు తప్ప, ఉత్తర కోస్తా జమీందారులందరూ ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. బుస్సీ నిజాముతో రాజీ కుదుర్చుకుని, సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. 1757 లో బుస్సీ నిజాము సంస్థానం నుండి బయల్దేరి మచిలీపట్నం మీదుగా రాజమండ్రి చేరుకుని, కోటిపల్లి వద్ద మకాం వేసాడు. పాలెగాళ్ళను, జమీందార్లను, సంస్థానాధీశులను వచ్చి తనను కలవమని కబురు పంపాడు. బొబ్బిలి పాలకుడు రంగారావు తప్ప, విజయరామరాజుతో సహా అందరూ వచ్చి కలిసారు. విజయరామరాజు దీన్ని అవకాశంగా తీసుకుని రంగారావుకు వ్యతిరేకంగా బుస్సీ వద్ద, అతడి దివాను హైదర్ జంగు వద్దా ఆరోపణలు చేసాడు. ‘మీరంటే వారికి లెక్కలేదని అందుచేతే మీ వద్దకు వచ్చి కలవలేదనీ, ఫ్రెంచి వారికి ఇవ్వాల్సిన శిస్తు సరిగా చెల్లించడం లేదనీ’ వారికి నూరిపోసాడు. ‘వారి రాజ్యానికి పొరుగున ఉన్న తనకు అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తున్నారని, వారిని బొబ్బిలి నుండి వెళ్ళగొట్టి, దాన్ని తనకు స్వాధీనం చేస్తే, శిస్తు సక్రమంగా చెల్లిస్తాననీ’ అతడు బుస్సీకి చెప్పాడు.
దాంతో బుస్సీ, బొబ్బిలి వదలిపెట్టి పోవాలని రంగారావును ఆదేశించాడు. బొబ్బిలి స్థానంలో అంతకంటే పెద్దదైన వేరే స్థలానికి పోయి రాజ్యాన్ని స్థాపించుకోవచ్చని ప్రతిపాదించాడు. రంగారావు దాన్ని అవమానంగా భావించాడు.
విజయరామరాజు తాను బుస్సీకి కట్టాల్సిన కప్పం పది లక్షలూ కట్టేసాడు, అంతేకాక, మూడు లక్షల లంచం హైదర్ జంగుకు ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని చెప్పాడు. హైదర్ జంగు అందుకంగీకరించాడు.
కొద్ది రోజులకే బుస్సీ కొందరు సిపాయీలను ఒక దూరప్రదేశానికి పంపించాల్సి వచ్చింది. వాళ్ళు బొబ్బిలి రాజ్యం గుండా వెళ్ళాల్సి రాగా, అందుకు తగ్గ అనుమతులు కూడా తీసుకున్నారు. విజయరామరాజు కుటిల రాజకీయ చాతుర్యమో, రంగారావు ప్రణాళిక వల్లనో, ఆ సిపాయీలపై దాడి జరిగింది, 30 మంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. బొబ్బిలి సంస్థానంపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని బుస్సీకి తెలియజేయడానికి విజయరామరాజు ఈ సందర్భాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. బొబ్బిలిని అణగదొక్కేసి, పాలెగారును అక్కడి నుండి తరిమెయ్యాలని బుస్సీ నిశ్చయించుకున్నాడు.
ఇబ్రహీం ఖాన్ శ్రీకాకుళంలో ఫ్రెంచి వారి తరపున ఫౌజుదారు. బుస్సీకి నిజాముతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అతడు బుస్సీపై తిరుగుబాటు చేసాడు. రాజమండ్రి కోటలో సైనికులను రెచ్చగొట్టి, తిరుగుబాటు చేయించాడు. ఫ్రెంచి వారు వసూలు చేసిన శిస్తులు వెనక్కి ఇచ్చేయాలని అతడు డిమాండు చేసాడు. బుస్సీ రాజమండ్రి చేరుకోగానే అతడు భయపడి పారిపోయి, బొబ్బిలి రాజుల వద్ద శరణు కోరాడు.
ఈ సంఘటనలన్నీ బుస్సీకి బొబ్బిలిపై ఉన్న కోపాన్ని పెంచి, వారిపట్ల అతడికి ఉన్న శత్రు భావనను మరింతగా పెంచి, అతణ్ణి, యుద్ధం దిశగా నడిపించాయి. యుద్ధాన్ని నివారించేందుకు బొబ్బిలి సంస్థానం ప్రయత్నాలు చేసింది.
విజయరామరాజు ఈసరికే బుస్సీ వద్ద చేరాడని, ఇప్పుడు తాను వెళ్తే అనవసరమైన ఘర్షణ అవుతుందని భావించి బుస్సీని కలవడానికి వెళ్ళకూడదని రంగారావు నిశ్చయించుకున్నాడు. కానీ అది బుస్సీకి, అతడి దివానుకూ కోపం కలిగించిందని గ్రహించిన రంగారావు ఆ సంగతిని బుస్సీకి వివరించాలని అతడు ప్రయత్నించాడు.
హైదర్ జంగుకు, రాజుకూ మధ్య జరిగిన లంచం ఒప్పందం తన వేగుల ద్వారా రంగారావుకు తెలిసింది. హైదర్ జంగుకు విషయం తెలియజెప్పేందుకు రంగారావు తన రాయబారి పంతెన బుచ్చన్నను పంపించాడు. ‘జంగు మన మాట వినకపోతే, మచిలీపట్నం వెళ్ళి అక్కడి ఫ్రెంచి అధికారి ఎం. కమాండరును కలిసి విషయం చెప్ప’మని అన్నాడు. ‘కమాండరు మన గురించి, మన ఆత్మాభిమానం గురించి తెలిసిన వాడు. అతడు మనకు సాయం చేస్తాడు’ అని బుచ్చన్నకు చెప్పి ఇద్దరి పేరిటా ఉత్తరాలిచ్చి పంపించాడు.
బుచ్చన్న పెద్దాపురం చేరుకుని హైదరు జంగును కలిసాడు. అతడు బుచ్చన్న చెప్పే విషయాన్ని వినలేదు. “నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్? మీ ప్రభువు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, మాతో స్నేహం చెయ్యాల్సిన అవసరం లేదనీ అనుకున్నాడు గదా. నువ్వు నీ ప్రభువు దగ్గరికే పో’ అని చెప్పాడు.
“మా దొర కంటే ముందే మా శత్రువు విజయరామరాజు బుస్సీ వద్దకు రావడంతో ఆయన రాలేదని, విజయరామరాజుకు ఇచ్చిన గౌరవమే మా ప్రభువుకూ ఇస్తామని మీరు చెప్తే రావడానికి ఆయన సిద్ధంగానే ఉన్నా”డని బుచ్చన్న చెప్పాడు.
“అతడు రానవసరం లేదు, ముందు మీరు కోట ఖాళీ చేసి వెళ్ళండి” అని హైదర్ జంగు చెప్పాడు.
“మా ఒంట్లో ఊపిరుండగా కోట ఖాళీ చెయ్యడం జరగదు” అని చెప్పి బుచ్చన్న వెళ్ళిపోయాడు.
బుచ్చన్న అట్నుంచటే నేరుగా మచిలీపట్నం వెళ్ళి కమాండరును కలిసి, ఉత్తరం ఇచ్చి, జరిగింది చెప్పాడు. కమాండరు బుస్సీకి తాను ఉత్తరం రాసి, తన అనుచరుణ్ణి బుచ్చన్నకు తోడిచ్చి పెద్దాపురం పంపాడు. ‘బొబ్బిలి ప్రజలు మంచివాళ్ళని, విజయరామరాజు చెప్పుడు మాటలు వినవద్దని’ ఆ ఉత్తరంలో రాసాడు. బుస్సీ ఆ ఉత్తరాన్ని చదివి సానుకూలంగానే మాట్లాడాడుగానీ, అతని చర్యల్లో ఆ సానుకూలత కనిపించలేదు.
ఆ సాయంత్రం, విజయరామరాజు హైదర్ జంగును కలిసి, ‘చూసారా నేను చెప్పిందే నిజమైంది, రంగారావు మిమ్మల్ని కలవడానికి రాకుండా, కమాండరు ద్వారా బుస్సీకి ఉత్తరం పంపించాడు, అతడికి మీరంటే లెక్కే లేదు’ అని అతణ్ణి రెచ్చగొట్టాడు. బుస్సీ కశింకోట నుండి బయలుదేరి, దేవుపల్లిలో మకాం పెట్టినపుడు, రంగారావు చెలికాని వెంకయ్య ద్వారా గౌరవ పురస్సరంగా అతడి వద్దకు పాన్ సుపారీ పంపించాడు. హైదర్ జంగు అతణ్ణి ‘మీ దొర కోటను వదలిపెట్టి వెళ్ళాడా లేదా’ అని గద్దించాడు. ‘మాకు కోటను విడిచి వెళ్ళే అవసరం లేదని, వెళ్ళే ప్రసక్తే లేదనీ’ అతడు తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు.
బుస్సీ అక్కడి నుండి ససైన్యంగా బొబ్బిలి వెళ్ళి కోట ఎదురుగా శిబిరం విడిచాడు. అప్పుడు కోట గోడపైనుండి వెలమ దొరలు మొగలు చక్రవర్తి తమకు బహూకరించిన నౌబత్తును (దుందుభి, భేరి వంటి పెద్ద చర్మ వాయిద్యం) మోగించారు, హైదర్ జంగుకు అది విని ఆగ్రహం కలిగింది. హుసేన్ ఆలీ ఖాన్ను రాయబారిగా కోటలోకి పంపించాడు. నౌబత్తును ఆపి, కోటను ఖాళీ చేసి వెళ్ళమని రాయబారి రంగారావుకు చెప్పాడు.
రంగారావు ఇలా సమాధానమిచ్చాడు: “నౌబత్తు మాకు మొగలు చక్రవర్తి ఇచ్చినది, దాన్ని మోగించడం ఆపం. ఇక కోటను ఖాళీ ఎందుకు చెయ్యాలో మీరు చెప్పలేదు. అతి తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో కూడా మేమీ కోటను వీడి వెళ్ళలేదు. ఇది మాకు సంపదలను సౌభాగ్యాలనూ ఇచ్చింది. దీన్ని విడిచి వెళ్ళం. విజయరామరాజు పరాక్రమానికీ మా పరాక్రమానికీ మీరు పోటీ పెట్టే పనైతే మా ప్రతిపాదనలు వినండి.
సర్కారు వారి పసుపుపచ్చ జెండాను విజయరామరాజు 40 వేల సైన్యం ముందు ఉంచండి. మేం మా నాలుగు వేల సైన్యంతో దాన్ని లాక్కోగలిగితే మమ్మల్ని అతడి జమీందారీకి ప్రభువులను చెయ్యండి. లాక్కోలేకపోతే, మమ్మల్ని, మా జమీందారీని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
మీ రాగద్వేషాలు మీకందుతున్న ధనంపై ఆధారపడి ఉన్నట్లైతే, విజయరామరాజు మీకిచ్చిన దానికి రెండింతలు ధనమిస్తాం. అతడి రాజ్యాన్ని మాకిప్పించండి.
మీకు మూడో మార్గం కూడా చెబుతాం. రాజును అతడి 40,000 సైన్యాన్నీ మేం మా 4,000 సైన్యంతో ఎదుర్కొంటాం. మేం గెలిస్తే అతడి రాజ్యం మాది. అతడు గెలిస్తే మా రాజ్యం అతడిది.
ఈ మూడు మార్గాలు కూడా మీకు రుచించక పోతే, మామాట చెబుతున్నాం వినండి. మా బొందిలో ప్రాణాలున్నంతవరకూ మేం బొబ్బిలి కోటను వదలి, పోము.” అని ఖరాఖండిగా చెప్పాడు.
ఆ తరువాత యుద్ధం జరిగింది.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.