వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 166 వ అంతర్జాల సమావేశం జూన్ 19, 2026 నాడు అంతర్జాలంలో వినూత్నమైన ఆలోచనలతో, నూతన ప్రక్రియలతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ప్రథమంగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గీతామాధవి గారు ప్రారంభిస్తూ తమ తొలిపలుకులలో ఈ రోజు స్వీయ పరిచయ కార్యక్రమ ప్రాసంగీకులు శ్రీ ప్రసాదరావు రామాయణం గారిని, శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారిని వేదికపైకి ఆహ్వానించారు.
ప్రసాదరావు గారు ప్రార్థనా గీతంతో తన ప్రసంగాన్ని ప్రారంభించి, తన చిన్ననాటి విద్యావిధానం తనను సారస్వతము వైపు ఎలా ఆకర్షించిందో తెలిపారు. ఆతరువాత ప్రఖ్యాత రచయితల రచనలు తనను ఎలా ప్రభావితం చేశాయో తెలిపారు. తన గురువుగారైన శ్రీ శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ గారితో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
తరువాత నాటకాల్లో తన అనుభవాన్నీ, మహా రంగస్థల నటులతో పరిచయాలను జ్ఞప్తి చేసుకున్నారు. అలాగే మార్ధంగకునిగా, తబలిస్టీగా తన అనుభవాన్నీ చెప్పుకున్నారు. సాహిత్యంలో తన గురువుగా జంధ్యాల అన్నపూర్ణను గురించి ఉటంకించారు. తను వ్రాసిన పుస్తకాలను, తనకు వచ్చిన పురస్కారాలను తెలిపారు.
తరువాతి ప్రాసంగీకులు శ్రీ వెంకటరత్నం గారు తనకూ నాటకాలలో గల ప్రావీణ్యతను, రచయిత హరనాథరావు, సినీ దర్శకులు టి.కృష్ణగారితో పరిచయాన్ని నెమరు వేసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు తనను చిన్నతనంలో ఎత్తుకున్న విషయాన్ని జ్ఞప్తి చేసుకుని మురిసిపోయారు. సాహిత్యంలో వారు చేసిన విశిష్టమైన ప్రక్రియలను చెప్పి అందరినీ ముగ్ధులను చేశారు. ఈ వయసులో కూడా తాను వేణువు నేర్చుకుంటున్నానని తెలిపినపుడు చప్పట్లు మ్రోగాయి. ఇప్పుడు కూడా వారు చేస్తున్న వివిధ సాహితీ సేవలను, కార్యక్రమాలు మమ్ము అబ్బుర పరిచాయి.
ఈ రెండు ప్రసంగాలనూ కవులందరూ శ్రద్ధగా విని ప్రశంసలు కురిపించారు.ఈ నూతన ప్రక్రియకు అందరూ ఫిదా అయ్యారు!
తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు, డా. రాధా కుసుమ గార్ల సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది. తొలిగా ఆనవాయితీ ప్రకారం గీతగారు "రైలుబండి రాగం"అనే కవితను చదివారు. అతిలోతైన భావుకతతో, జీవిత సత్యాలను నింపుతూ కవిత అందరినీ విశేషంగా ఆకర్షించింది.
"గుండె ఎందుకు ఇంకా రైలు బొగ్గు వాసన వేస్తూంది
బతుకు ఎందుకు రైలు బ్రిడ్జి లాగా గజగజలాడుతుంది" అని ఆ కవితలో అన్నపుడు శ్రోతగా నా గుండె పిండినట్టు అనిపించింది.
పిదప కొత్తూరు వెంకట్ గారు ఒక బర్త్ డే పాట పాడారు. గంటా మనోహర్ గారు తొలకరి వాన పై పాడుతూ 'త్రాగుబోతులు అబద్ధం చెప్పరు, తిరుగుబోతులు నిజం చెప్పరు' అనడం బావుంది!
చీదెళ్ళ సీతాలక్ష్మిగారు చుక్కల్లో పిల్లి అనే తనకవితలో ప్రాసలు చాలా బావున్నాయి. తండ్రి యొక్క వైశిష్ట్యాన్ని అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు చెప్పగా, పరిమి సత్యమూర్తి గారు అవినీతిని అంతం లేకుండా చేద్దాం అని నినదించారు. ముప్పాళ్ళ భవానీ గారు ఒక హారతి పాట పాడారు.
శ్రీ సూర్యప్రకాశరావుగారు తన అనంతావతారం కవితలో స్త్రీ ఔన్నత్యాన్ని అందంగా చెప్పారు.
కందేపి రాణి ప్రసాద్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ తో ఉన్న ఒక మహళ అంతరంగాన్ని హృదయ విదారకంగా వర్ణించారు. శ్రీమతి కోదాటి అరుణ గారు తొలకరి వర్షాలలో సామాన్యుని ఇబ్బందుల గురించి తెలిపారు. శ్రీలతగారు అనుభవాలూ, అవగాహన అనే కవిత చదవగా, పరుచూరు నాగేంద్రమ్మగారు గురజాడపై కవిత చదివారు. శ్రీ మోటూరు నారాయణరావుగారు "మరలా గాయం చెయ్యవుకదా" అని గానించగా, ప్రసాదరావు రామాయణం ఓ కవి అంతరంగాన్ని తెలుపుతూ 'కవికి మరణం లేదు' అన్నారు!
శ్రీ ఉప్పలపాటి వెంకట రత్నంగారు తన జారుడు మెట్లు కవితలో రాజకీయాదిగా జారుడుతనం గురించి చదివారు. వైరాగ్యం ప్రభాకర్ గారు తన నూతన ప్రక్రియ చమక్కుల గురించి తెలిపారు.
డా.బృందగారు మాదకద్రవ్య వ్యతిరేక కవితను శ్రావ్యంగా పాడి వినిపించారు. మేడిశెట్టి యోగేశ్వరరావుగారు "ఎలా ఉన్నారు" కవిత సమాజాన్ని విమర్శిస్తూ సాగింది.
దేవులపల్లి పద్మజాగారు 'నమ్రత' కవితలో మట్టిని మనిషిగా మలచాలి అన్నారు. అవధానం అమృత వల్లి గారు, శ్రీ కృష్ణ ప్రసాద్ గారు నాన్న గురించి కవిత చదవగా, మందపాటి అరుణకుమారి నాన్నపై ఒక పద్యం చదివారు.
ప్రియాంక గారి రేపటి శుభోదయం కోసం వేచి చూస్తున్నా కవిత చాలా బావుంది. ఆనం ఆశ్రితారెడ్డి గారు కూడా నాన్నను తలచుకుంటూ చదివారు.
కట్టా శ్యామల గారు రైతు పరితాపాన్ని పాటగా గానం చేశారు.
శ్రీ కందుకూరి శ్రీరాములు గారి 'మర్రిచెట్టు' అందరినీ అలరించింది. శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు గారూ తిరుమల లడ్డుపై చదివిన కవిత రుచిగావుంది.
బుక్కపట్నం రమాదేవిగారు "ఆ నలుగురి" అవసరం తెలియచేయగా, వనజగారు నాన్నపై కవిత చదివారు. అమీనా గారు 'అమ్మా నీవు లేని బ్రతుకు' అని చదువుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
శ్రీ కాకర్ల రమణగారు ప్లాస్టిక్ వల్ల వినడం గూర్చి వివరించగా, శ్రీమతి రాధా కుసుమగారి నేటి దృశ్యం సింప్లీ సూపర్బ్.
భోగెల ఉమామహేశ్వరరావుగారు సంగీతం యొక్క విశిష్టతను తన కవితలో తెలిపారు.
చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుపై గంభీర స్వరంతో ఆవేశంగా చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. డా.గీతామాధవిగారి వందన సమర్పణతో సమావేశం విజయవంతంగా ముగిసింది.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
ఇలా నెలవారీగా పాల్గొనాలని ఉంది. ఎలా? మీ బదులు కోసమే ఎదురు చూస్తుంటా