Image by WikiImages from Pixabay
నాటాల్ ఇండియన్ కాంగ్రెస్
గాంధీజీ నాటాల్ Supreme Court లో న్యాయవాది వృత్తి తనకు ప్రధాన వృత్తిగా పరిగణించలేదు. ప్రజా పనుల మీద, సమస్యల మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించటం జరిగింది. ముఖ్యంగా నాటాల్ ప్రభుత్వం శ్వేతజాతీయేతరుల ఓటు హక్కును రద్దు చేయటం, వారికి జరిగే అవమానాలు, కష్ట నష్టాలు, ఇతర సమస్యలు, మొదలగునవి. వీటిమీద అలుపెరుగని ఆందోళన, పోరాటం చేస్తేనే Secretary of State దృష్టికి వెళ్లి తగిన న్యాయం జరుగుతుంది. దీనిని నిర్వహించటం కోసం ఒక శాశ్వత సంస్థను నెలకొల్పవలసిన అవసరం ఉందని ఆయన భావించారు. దీని కోసమై ఆయన సేథ్ అబ్దుల్లా, ఇతర స్నేహితులతో చర్చించటం జరిగింది. చివరకు వారంతా శాశ్వతమైన ఒక ప్రజా సంస్థ స్థాపించాలని నిర్ణయించారు.
సుదీర్ఘ చర్చ తరువాత ఈ సంస్థకు ‘కాంగ్రెస్’ (Congress) అనే పేరు నిశ్చయమైంది. దీనిని గాంధీజీ ఇలా వ్యాఖ్యానించారు:
“కాంగ్రెస్’ అనే పేరు ఇంగ్లండ్ లోని సాంప్రదాయవాదులకు (Conservatives) నిషిద్దమైనా, ఆ పేరున్న పార్టీ భారతావనిలో జీవం ప్రసాదిస్తూ ఉంది. ఇదే పేరును నేను నాటాల్ లో ప్రాచుర్యంలో ఉంచాలనుకున్నాను. ఇది కొంత సందిగ్థత, పిరికితనం సూచిస్తుంది. అందువల్ల నేను ఈ నామానికి తగిన కారణాలతో వివరణ ఇచ్చి ఈ సంస్థకు ‘నాటాల్ ఇండియన్ కాంగ్రెస్’ (Natal Indian Congress) అనే పేరు పెట్టాలని ప్రతిపాదించగా దీనిని అందరూ ఆమోదించటం జరిగింది. చివరకు 1894లో మే 22 వ తేదీన ‘నాటాల్ ఇండియన్ కాంగ్రెస్’ (NIC) స్థాపించబడింది.”
ఈ NIC సంస్థే ఆ తరువాత Transvaal Indian Congress (TIC) and the Cape Indian Congress సంస్థలను స్థాపించటానికి దారి చూపింది. ఈ మూడు సంస్థలు 1919 లో ఏకమయ్యి South African Indian Congress (SAIC) నామం సంతరించుకుంది.
ఆ రోజున (May 22, 1894) దాదా అబ్దుల్లా విశాలమైన గదిలో అందరు సమావేశమయ్యారు. దీనికి రాజ్యాంగం (constitution) రచించటం పూర్తి అయిన తరువాత సభ్యుల చందా గురించి చర్చ జరిగింది. ఆర్ధికంగా బలహీనులు నెలకు 5 షిల్లింగులు, ధనికులు ఎంతయినా ఇవ్వవచ్చు. సేథ్ అబ్దుల్లా, మరో ఇద్దరు నెలకు 2 పౌండ్లు ఇస్తే, చాలామందికి చందా 1 పౌండుగా నిర్ణయించబడింది. మిగతా వారిలో అత్యధికులు 10 షిల్లింగులు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. చాలా మంది భారీ విరాళాలు ఇవ్వటం జరిగింది.
‘నాటాల్ ఇండియన్ కాంగ్రెస్’ (NIC) సంస్థకు గాంధీజీ కార్యదర్శి (Secratary) గా ఎన్నుకోబడ్డారు. ఆయన బాధ్యతలలో ఒకటి సభ్యులనుంచి చందాలు వసూలు చెయ్యటం. కాని నెల నెలా చందాలు వసూలుచేయటం కష్టం కనుక చర్చల తరువాత ప్రతి సభ్యుడు సంవత్సరానికి ఒక్కసారి 3 పౌండ్లు ఇవ్వవచ్చని నిర్ణయం జరిగింది. గాంధీజీ తన నాయకత్వంలో NIC సమావేశం నెలకొకసారి నిర్వహించి సభ్యులకు అప్పుడు నాటాల్ లో నెలకొన్న పరిస్థితులు చర్చించారు. సభ్యులలో అత్యధికులు లేచి మాట్లాడటానికి సందేహించేవారు, భయపడేవారు. వారిలో భయాన్ని క్రమేణా పోగొట్టి వారిలో ప్రజాహిత కార్యక్రమాల గురించి ధైర్యంగా మాట్లాడే నేర్పును గాంధీజీ నింపారు.
గాంధీజీ నాయకత్వంలో NIC మరొక ముఖ్య కార్యక్రమం, వలసదేశంలో జన్మించిన భారతీయులను విద్యావంతులను చేయటం. సభ్యులలో అత్యధికులు చదువులేనివారే. వీరిని విద్యావంతులను చేయటానికి Indian Educational Association స్థాపించటం జరిగింది. విద్యావంతులయిన కొందరు సభ్యులు చదువులేని వారికి విద్యనందిస్తూ, కష్టనష్టాలకు తగిన పరిష్కారం చూపిస్తూ, వారిలో చైతన్యం కలిగించారు. సభ్యులు తరచు సమావేశమవుతూ వివిధ విషయాలమీద చర్చించారు. ఈ విద్యా సంస్థ ఒక గ్రంధాలయం ఏర్పాటు చేసింది.
ఈ NIC మూడవ కార్యక్రమం, ప్రచారం నిర్వహించటం. ఈ ప్రచారం ద్వారా దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లండ్ లోని ఇంగ్లీషు వారికి, భారత్ లోని ప్రజలకు నాటాల్ లో వలస భారతీయులకు జరిగే విషయాలు, అన్యాయాలు పూసగుచ్చినట్లు వివరించటం కోసం గాంధీజీ రెండు కరపత్రాలు వ్రాసి ముద్రించటం జరిగింది. ఒక కరపత్రం ద్వారా దక్షిణ ఆఫ్రికాలో నివసించే ప్రతి బ్రిటిష్ వ్యక్తికి విజ్ఞాపన చేయటం. రెండవ దాని ద్వారా నాటాల్ లోని భారతీయులకు అచ్చట (నాటాల్ లో) జరిగే అన్యాయాలు తెలియజేయటం, ఈ రెండు కరపత్రాలలో వాస్తవాలు వ్రాయటం, అన్యాయాలకు సంబంధించిన బొమ్మలు వేయటం జరిగింది. విషయాలను సేకరించి ప్రతి నెల ఈ రెండిటిని తయారు చేయటానికి గాంధీజీకి చాలా సమయం పట్టేది. ఈ కార్యక్రమం నిర్వహించటం కష్టతరమైనా, ఫలితం చాలా సంతృప్తిగా ఉండేది. ఈ కరపత్రాలను విస్తృతంగా circulate చేయటం జరిగింది.
గాంధీజీ నిర్వహించిన ఈ కృషికి దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులకు అనేక మంది స్నేహితులు, మంచికోరేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. అలాగే భారతదేశంలో కూడా వారియెడల సానుభూతిపరుల సంఖ్య కూడా విస్తృతంగా పెరిగిపోయింది. ఫలితంగా దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు తమకు జరిగే అన్యాయాలను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకోటానికి వీలయింది.
గాంధిజీ మాటల్లో “నా జీవితమంతా పేదలకు సేవ చేస్తేనే హృదయమంతా సంతృప్తితో నిండి పోతుంది. పేదలతో ఐక్యమయి వారికి సేవ చేయటమే నా జీవిత లక్ష్యం.”
బాలసుందరం
NIC సభ్యులలో చాలా మంది దక్షిణ ఆఫ్రికాలో జన్మించిన గుమస్తా ఉద్యోగులయినా, సభ్యులు కానివారిలో అత్యధికులు నిరక్షరాస్యులు, బానిసత్వానికి లోబడిన కార్మికులు. ప్రారంభంలో ఈ సంస్థ వారికి చెందదు, వారి సమస్యలను సంస్థ పట్టించుకోలేదు. వారు చందా చెల్లించేటంత ధన సంపాదన లేదు. వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తేనే వారికి ఈ సంస్థ ఉనికి సార్ధకమవుతుంది అని గాంధీజీ భావించారు. అనుకోకుండా NIC కి, ఆయనకు, ఒకరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అప్పటికి గాంధీజీ నాటాల్ Supreme Court న్యాయవాది అయి కేవలం 4 నెలలు మాత్రమే; NIC ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఆ సయమంలో ఒక తమిళ వ్యక్తి తలపాగా చేతిలో పట్టుకుని, మొదటి రెండుపళ్లు విరిగి పోయి, నోరు రక్తం ఓడుతూ, వణుకుతూ గాంధీజీ ఎదురుగా నిలబడ్డాడు.
అతని పేరు ‘బాలసుందరం.’ ఈయన డర్బన్ (Durban) నగరంలో ఒక యూరోపియన్ నివాసి వద్ద ఒప్పందం ప్రకారం ఒక బానిసగా ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజు ఆ యజమానికి కోపమొచ్చి, నిగ్రహం, విచక్షణ కోల్పోయి బాలసుందరంను తీవ్రంగా కొట్టి రెండు పళ్లను విరగకొట్టాడు.
ఈ పరిణామం పై గాంధీజీ ఇలా వివరించారు.
“నేను బాలసుందరం ను వైద్యుడు వద్దకు పంపించి గాయం గురించి అయన ఇచ్చిన certificate ను, గాయపడ్డ ఈ వ్యక్తిని మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్లాను. ఆయనకు నేను ఈ లిఖిత వాంగ్మూలం కూడా సమర్పించాను. ఈ ఆధారాలను మెజిస్ట్రేట్ చదివి ఆగ్రహించి ఆ యజమానిని న్యాయస్థానం వద్దకు పిలిపించి తగిన శిక్ష వేయటం జరిగింది. నాకు ఆ యజమానికి శిక్ష వేయించటంకంటే బాలసుందరం ఆతని కబంద హస్తాలనుంచి విముక్తుడిని గావించటం ముఖ్యం.
ఒక యజమాని వ్రాతపూర్వక ఒప్పందం (indenture) ప్రకారం ఒక వ్యక్తిని కూలివాడిగా నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించి కారణం లేకుండా ఉద్యోగం వదలి వెళ్ళినప్పుడు ఆ యజమాని ఆ వ్యక్తి మీద దావా వెయ్యవచ్చు. కానీ, ఆ యజమాని అకారణంగా అతనిని బాధించి గాయపరచినప్పుడు న్యాయం ఎవరి వైపున ఉంటుంది అనేది నా ప్రశ్న. దీనికి సమాధానం బ్రిటిష్ న్యాయవాది Sir William Hunter ‘ప్రస్తుతం ప్రజలలో indentured కూలీ (లేక వ్యక్తి) బానిసతో సమానం. యజమాని ఉద్దేశ్యంలో ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా చాలా స్వల్పం. దీనిని న్యాయ వ్యవస్థ అంగీకరించదు’ అని పేర్కొన్నాడు.
బాలసుందరం విడుదల రెండు విధాలుగా జరుగవచ్చు. ఒప్పందం ప్రకారం నియమించబడిన కూలీల రక్షణ బాధ్యత స్వీకరించిన వ్యక్తి (Protector) బాలసుందరంకు యజమానితో ఉన్న ఒప్పందం రద్దు చేయవచ్చు; లేదా బాలసుందరం యజమానితో మాట్లాడి మంచితనంతో ఆ కూలీని విడుదల చేయవచ్చు. నేను ఆ యజమానికి ఇలా సలహా ఇచ్చాను: ‘నాకు నీమీద చర్య తీసుకుని, నిన్ను శిక్షించదలచుకోలేదు. నీవు బాలసందరంను చాలా దారుణంగా కొట్టావని గ్రహించివుంటావు. అతనికి నీతో ఉన్న ఒప్పందం రద్దుచేసి దానిని మరో యజమానికి ఇస్తే అప్పుడు బాలసుందరం ఆయన వద్ద పని చేస్తాడు. దానికి అతను ఒప్పుకున్న తరువాత Protector కి చెప్పి మరో యజమాని వద్దకు వద్ద తమిళ వ్యక్తిని పంపించటం జరిగింది.
నేను ఒక క్రొత్త యజమాని, అదికూడా యూరోపియన్ కోసం వెతికి ఆయన సంతోషంగా ఒప్పుకున్న తరువాత ఆయన వద్ద బాలసుందరంను నియమించాను. నాటాల్ మెజిస్ట్రేట్ మొదటి యజమానిని దోషిగా నిర్ధారించి తగిన శిక్ష వేయటం జరిగింది.
బాలసుందరం సంగతి (కేసు) గురించి నాటాల్ లోని ప్రతి indentured కూలీకి తెలిసిపోయి నన్ను వారి స్నేహితుడుగా పరిగణించటం జరిగింది. వెనువెంటనే బాధిత కూలీలందరు నా వద్దకు తరలివచ్చారు. వారి నుండి వారు పడే కష్ట నష్టాలు తెలుసుకుని వారికి తగిన పరిష్కారం చూపించాను.”
బాలసుందరం కేసు ఎంతోదూరంలో ఉన్న మద్రాసులో కూడా ప్రతిధ్వనించింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రవాస భారతీయులు ఈ సంగతి నాటాల్ లో తమ తోటి కూలీలద్వారా విని తమకు కూడా న్యాయం జరగాలని నన్ను కోరటం జరిగింది. నిజానికి ఈకేసు అసాధారణమైనది కాదు. కాని ఒక వ్యక్తి ఈ indentured కూలీలు పడే బాధలకు పరిష్కారం చూపించి వారిలో సంతోషం, ధైర్యం నింపటం వల్ల వారి జీవితాలు సంతృప్తికరంగా సాగటానికి వీలయింది.”
***సశేషం***
ఆగష్టు 2026 సంచికలో నాటాల్ భారతీయులపై మూడు పౌండ్లు టాక్స్ (The £3 Tax), మతాల గురించి గాంధీజీ తులనాత్మక పరిశీలన, తదితర విషయాల గురించి తెలుసుకుందాము.