Menu Close
Garimella Venkata Lakshmi Narasimham
మారిన విలువలు (కథ)
గరిమెళ్ళ లక్ష్మీ నరసింహం

మా ఊళ్ళోని ఉచ్ఛశ్రేణి న్యాయవాదుల జాబితాలో ‘బొంబాయి లాయరు’ గారి పేరు మొదటి నంబరులో ఉందండి. అదేమిటి; అంత పెద్ద లాయరుగారికి పేరు లేదా అంటున్నారా. లేకపోవడమేమిటి; ఉందండి. చిన్నప్పుడు ఆయన నామకరణోత్సవ సందర్భంగా తండ్రిగారు బియ్యంలో ‘పురుషోత్తం’ అని రాసేరు. పురుషోత్తంగారు ముంబయిలో లా డిగ్రీ పొందినవరకు అది బాగానే పనిచేసింది. కాని ఆయన పట్టా పట్టుకొని మా ఊళ్ళో బోర్డు పెట్టడంతో ఒక సమస్య ఏర్పడిందండి. అదేమిటంటారా. ఆయన ఆ బోర్డు పెట్టినప్పటికి మా ఊళ్లో అదే నామధేయులయిన పురుషోత్తంగారు అప్పటికి పది సంవత్సరములనుండి న్యాయవాదిగా సేవలందిస్తూ ఉండేవారు. ఆ పరిస్థితిలో కొత్త పురుషోత్తం గారిని ఏమని సంబోధించడమా అని మా ఊరి పెద్దలు నిశితంగా ఆలోచించి, కొత్త పురుషోత్తం గారికి ‘బొంబాయి లాయరుగారు’ అని నామకరణం చేసేరు. అదే స్థిరబడిందండి. ఇలాగ కొన్ని ఊళ్ళ పేర్లు కొందరి పేర్లలో ఉండడం కలదు కదండి. క్రికెట్ లో ఉన్నాడు కదా, కుర్రాడు: వాషింగ్టన్ సుందర్. ‘బెజవాడ’ ‘గురజాడ’ ‘రాచకొండ’, ఇలా కొన్ని ఊళ్ల పేర్లు చాలామందికి ఇంటిపేర్లుగా ఉన్నాయికదా. కథ మొదలెడుతూనే పిట్టకథ లోకి వెళ్లిపోయేం అంటారా. మరి పిట్టకథలు లేవండి. కథలోకి వెళదామండి.

మన బొంబాయి లాయరుగారి సహధర్మచారిణి లావణ్య. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. సుహాసిని అనే చక్కని చుక్క, అంతకు మూడేళ్ళు చిన్నవాడు ప్రదీప్. భార్యామణి మాటలను జవదాటే ప్రయత్నం లాయరుగారు పొరబాటున కూడా ఎప్పుడూ చెయ్యరు. అది లాయరుగారి దివంగత మాతృమూర్తి జానకమ్మ సుతరామూ ఇష్టపడేది కాదు. వ్యంగ్యంగా కుమారునికి చేతకానివాడని వాత పెట్టేది. ఒకరోజు లావణ్య పేరంటానికి వెళ్ళిన సమయంలో లాయరుగారు టీ వీ లో ఏదో చర్చ ఆలకిస్తూ ఉండేవారు. అది గమనించి, జానకమ్మ కొడుకు దరి చేరి, “ కుర్రాడా, ఇవాళ అది నీమీద అంతలా విరుచుకుపడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు నోరుమూసుకొని ఏమీ మాట్లాడకుండా ఎందుకు అలా కూర్చున్నావ్. అలా చేసే దాన్ని నెత్తిమీద ఎక్కించుకున్నావ్.” అని తన అక్కసు వెళ్లబుచ్చుకొంది.

“అమ్మా, దాని మాటకు నేనొకటి అంటే అది మరో పది అంటుంది. పెద్ద గొడవయిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏదీ లేదు. ఇల్లు కురుక్షేత్రం అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నాకు ఇంట్లో శాంతి ముఖ్యం. పిల్లలు కూడా పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల ఎదుట మేమిద్దరం కొట్లాడుకోడం మంచిది కాదు. అందుకే నేను అలా వింటూ ఊరుకున్నాను. అది నా చేతకానితనం కాదు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు కదమ్మా. అదే నేను చేస్తున్నాను.” అని చిరునవ్వుతో తల్లికి చెప్పుకొన్నాడు.

“అందరూ కుటుంబం మంచిది అంటే చేసుకున్నాం. బాగా ఉన్నవాళ్లు అని చెప్పడంతో నీకు ముద్దు, ముచ్చట తీరుస్తారని ముందుకు వెళ్ళేం.”

“అమ్మా, కుటుంబం మంచిదేనమ్మా. నన్ను ఎంతో మర్యాదగా చూస్తున్నారు.”

“అవును నాయనా. నన్నూ ఎంతో మర్యాదగాచూస్తున్నారు. దీని వరసే బాగులేదు.” అని నిట్టూర్చింది, మాతృమూర్తి.

“అమ్మా, దాని మాట తీరది గాని, మనిషి చెడ్డది గాదు. నేనన్నా, పిల్లలన్నా, చాలా అభిమానిస్తుంది. నేను గట్టిగా రెండు తుమ్ములు తుమ్మితే గాభరా పడిపోతుంది. పరుగున వెళ్లి విక్స్ డబ్బా తెచ్చి నా ఛాతీకి రాయడానికి సిద్ధమవుతుంది. జీవితంలో అన్నీ మనమనుకొన్నట్లు జరగవమ్మా. కొన్నింటికి రాజీ పడాలి.” అని చిరునవ్వుతో తల్లికి చెప్పుకున్నారు, లాయరుగారు.

“బాగుంది నాయనా నీ వేదాంతం.” అని జానకమ్మ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే లాయరుగారి సెల్ ఫోను మ్రోగడంతో సంభాషణకు తెర పడింది.

జానకమ్మగారి స్వభావం దొరల భాషలో డబుల్ స్టాండర్డ్స్ అంటారండి. అదేమిటంటారా. కోడలు మీద ఆవిడ అభిప్రాయం అటుంచితే, అల్లుడుమీద మాత్రం ఆవిడకు సదభిప్రాయముందండి. అతణ్ణి మెచ్చుకొంటుంది కూడా. అతగాడి గూర్చి మాట్లాడినప్పుడు, “శాస్త్రి మన అదృష్టానికి దొరికేడు. మనపిల్ల ఏమిటంటే అదే చేస్తాట్ట. దానికి చెప్పకుండా ఏ పని చెయ్యట్ట.” అని అల్లునికి కితాబు ఇస్తుంది గాని చేతకానివాడు అని అనదు. అదండి తేడా. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అది మానవస్వభావం అంటారు. అందుచేత మనం అది తప్పుగా పరిగణించకూడదు. ఇంతకూ, భార్యకు అన్నీ చెప్పి చెయ్యడం, చేతకానితనం జాబితాలో వేయకూడదండి. ఏమిటి నీ సిద్ధాంతం అంటారా. వినండి. జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడే శ్రీదేవికి చెప్పకుండా ఏదీ చెయ్యడండి. నీకు ఎవరు చెప్పేరంటున్నారా. నాకు ఒకరు చెప్పడం ఏమిటండి. మొసలిబారిన పడ్డ గజేంద్రుని ఆర్తనాదం, ‘కరుణాలవాల నను బ్రోవంజాలవే..’ విని తక్షణం రక్షించడానికి ఆపద్బాంధవుడు ఆత్రుతతో హుటాహుటిన వెళ్లిన తీరు వర్ణిస్తూ, ‘సిరికిం జెప్పడు: శంఖచక్రయుగముంజేదోయి సంధింపడే ….’ అని లక్ష్మీదేవికైననూ చెప్పకుండా వెళ్లేడని పోతన గారు గజేంద్రమోక్షంలో రాసేరుగదండి. దాని అంతరార్థం ఏమిటి. అంతటి శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవికి చెప్పకుండా గడప దాటడనికదా తెలుస్తోంది. అందుచేత జానకమ్మగారి అల్లుడు చేస్తున్నదానిని మనం తప్పుపట్టడం తప్పండి.

సుహాసిని అందాలరాశి అని ఇదివరలోనే చెప్పుకున్నాం కదండి. ఆ అందానికి తెలివితేటలు జోడయ్యేయి. అలా బుద్ధిగా చదువుకొంటూ సుహాసిని 12 లో అడుగు పెట్టింది. ఒకరోజు లాయరుగారు అమ్మాయి పై చదువు గూర్చి భార్యామణి అభిప్రాయం తెలియగోరేరు. “మీకు ఇదివరకే చెప్పానుగా. దాన్ని ఇంజనీరింగు లోనే పెట్టాలని.” అని పునరుద్ఘాటించింది, లావణ్య. “అమ్మాయి అభిప్రాయం కూడా ఏమిటో తెలుసుకోవాలి కదా.” అని లాయరుగారు ప్రతిస్పందించేరు. “చిన్న పిల్ల. దాని అభిప్రాయం తెలుసుకోడానికి దానికేమిటి తెలుస్తుంది. మనం చెప్పినట్లే చేస్తుంది.” అని లావణ్య నొక్కివక్కాణించింది. దానితో సంభాషణకు ఫులుస్టాప్ పడింది.

అమ్మాయి చదువు విషయంలో లావణ్యకు అంత దృఢమయిన అభిప్రాయం ఏర్పడడానికి ఒక బలమయిన కారణం ఉందండి. అదేమిటంటారా. ఆవిడ అన్నయ్య పిల్లలిద్దరూ స్వదేశంలో ఇంజనీరింగు చేసి అమెరికాలో సతీమణులతోబాటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓ మారు లావణ్య అన్నయ్య, వదిన, అమెరికా వెళ్లి పిల్లలవద్ద రెండు నెలలు గడిపేరు. స్వదేశం వచ్చేక లావణ్య వదినగారు, తాము అమెరికాలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు కళ్లకుకట్టినట్లు చెబుతూ, తమ పిల్లలిద్దరికీ రెండేసి కార్లున్నాయని, వాళ్ల ఇళ్లలో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని, ఉన్నవాటినన్నింటి వివరాలు పూసగుచ్చినట్టు సగర్వంగా చెబుతూ ఉంటే విని, తన పిల్లలు కూడా తప్పక అమెరికాలోనే ఉద్యోగాలు చెయ్యాలని లావణ్య అప్పుడే కృతనిశ్చయానికి వచ్చిందండి. ఆ వదినగారు హాఫ్ ట్రూత్ చెప్పేరండి. అదేమిటంటారా. వారి ఇద్దరు పిల్లలూ వాళ్ల కార్లు వారే శుభ్రపరచుకొంటారని, వాళ్ల బట్టలు వాళ్ళే ఉతుక్కొంటారని, ఇంటి పని, వంట పని, వారే చేసుకొంటారన్న నిజాలు దాచిపెట్టేరు. ఫరవాలేదు. అది మానవ స్వభావం అంటారు. అందుచేత మనం దానిని పట్టించుకోకూడదు.

ఒకరోజు భోజనాల సమయంలో అమ్మాయి చదువు విషయంలో పురోగతి తెలియగోరి లావణ్య, “తల్లీ, నువ్వు ఇంజనీరింగు పరీక్షలకి బాగా ప్రిపేర్ అవుతున్నావా. ఐఐటీల గూర్చే బాగా ప్రయత్నించు. ఇవాళ పేపర్లో చూసేను; ప్రత్యేకించి వాటికోసమే కోచింగ్ క్లాసులు పెడుతున్నారట. అందులో జాయినయితే తప్పక వాటిలో సీటు దొరకొచ్చు.” అని కూతురుకు సలహా ఇచ్చింది. “అమ్మా, వాళ్ళ కోచింగు సంగతి నాకు తెలుసు. నా సీనియరు ఓ అమ్మాయి గత సంవత్సరం అందులో చేరింది. వాళ్ల కోచింగు ఏమీ బాగులేదని చెప్పింది. ఈ సంవత్సరం మళ్లీ తనే ప్రిపేరయి రాస్తోంది. నువ్వు బెంగపడకమ్మా. నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. సీటు తప్పక వస్తుంది.” అని సుహాసిని తల్లికి హామీ ఇచ్చింది. ఆ సంభాషణ విన్న లాయరుగారు, “అమ్మాయి కాన్ఫిడెంటుగా ఉంది. కోచింగు క్లాసుల సంగతి నాకూ తెలుసు. వాళ్ళదగ్గర పాసయిన వాళ్ల గూర్చే ఎడ్వటైజ్ చేస్తారు గానీ, ఎంతమంది ఫెయిలయ్యేరో తెలియబరచరు.” అని అమ్మాయితో శృతి కలిపేరు. “వాళ్ల ఎడ్వర్టైజ్మెంటు చూసి చెప్పేను గాని. నీకు ధైర్యముంటే నువ్వే ప్రిపేర్ అవమ్మా.” అని కూతురు అభిప్రాయానికి లావణ్య పచ్చజెండా ఊపింది.

కాలచక్రం తిరిగింది. సుహాసినికి ఐఐటీ ముంబయిలో సీటు దొరికింది. లావణ్యకు అంతులేని సంతోషం కలిగింది. అంత సంతోషానికి ఒక ప్రత్యేక కారణం ఉందండి. తన అన్నయ్య రెండో కొడుకు కూడా ఐఐటీ ముంబయిలోనే ఇంజనీరింగు చేసేడు. అందుచేత అమ్మాయికి అమెరికాలో తప్పక ఉద్యోగం దొరుకుతుందని సంబరపడ్డాది. కాలచక్రం ఇంకా ముందుకు తిరిగింది. సుహాసిని ఇంజనీరింగ్ పూర్తయి బెంగళూరులో గూగుల్ కంపెనీలో ఉద్యోగం పొందింది. లావణ్య సంతోషానికి ఆకాశమే హద్దు. కారణం; తన అన్నయ్య పెద్దకొడుకు ఇంజనీరింగు చేసేక బెంగళూరులో అదే కంపెనీలో చేరేడు. అందుచేత కూతురు అమెరికా వెళ్లడం తథ్యం అనుకొంది. సుహాసిని తలమీద, బుగ్గలమీద ముద్దుల వర్షం కురిపించింది. దగ్గరలోనే ఉన్న లాయరుగారు, తోసుకు వస్తున్న చిరునవ్వును పళ్లమధ్య పట్టి ఆపుతూ గమనిస్తున్నారు. దాని అర్థం ఏమిటో ఆ పరమాత్మకే తెలియాలి. తల్లిపెట్టిన ముహూర్తానికి సుహాసిని ఉద్యోగపర్వం ప్రారంభించింది.

మా ఊళ్లో సిద్ధంతిగారివద్ద పెళ్ళికొడుకులు, పెళ్లికూతుళ్ల లేటెస్ట్ లిస్టు ఉంటుందండి. వాటి ఆధారంగా ఆయన సంబంధాలు కుదురుస్తూ ఉంటారు. ఆయన శుభకార్యాలు కూడా చేయిస్తారు. మన లాయరుగారి ఇంట ప్రతిసంవత్సరం వినాయకపూజ, వరలక్ష్మీవ్రతం ఆయనే చేయిస్తారు. ఓ ఆదివారంనాడు ఆయన లాయరుగారికి ఫోన్ చేసి, “సార్, మీ అమ్మాయికి ఒక ఫస్టుక్లాసయిన సంబంధముందండి. అబ్బాయి IAS పాసయ్యేడండి. ప్రస్తుతం ట్రైనింగులో ఉన్నాడు. తండ్రి పంజాబ్ నేషనల్ బ్యాంకులో జనరల్ మేనేజరు చేస్తున్నారండి.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే, తనపై గత రెండు దశాబ్దాలనుండి నడుస్తున్న క్రిమినల్ కేసు దశ తెలుసుకోడానికి ఓ MP గారినుండి లాయరుగారికి ఫోను వచ్చింది. వెంటనే లాయరు గారు, “సిద్ధాంతిగారూ, నాకో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది; మరేమీ అనుకోకండి. వివరాలన్నీ మా ఆవిడతో మాట్లాడండి.” అని చెప్పి సిద్ధాంతిగారి కాల్ కట్ చేసి, వస్తున్న MP గారి కాల్ రిసీవ్ చేసుకున్నారు. సిద్ధాంతిగారు లావణ్యకు ఫోను చేసి పెళ్ళికొడుకు వివరాలు చెప్పేరు. అవి విన్నాక, “సిద్ధంతిగారూ, మా అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇంజనీరు వరుడుకోసమే చూస్తున్నామండి. అటువంటి సంబంధం ఉంటే చెప్పండి.” అని వినయంగా తన అభిప్రాయం చెప్పింది. “అమ్మా, ఒక అమెరికా సంబంధం కూడా నిన్ననే వచ్చిందండి. కాని ఈ పెళ్ళికొడుకు కలక్టరు పరీక్ష పాసయ్యాడు, తండ్రి కూడా పెద్ద పదవిలో ఉన్నారు, అన్నివిధాలా మీ స్టేటస్ కు సరిపోతుందని ఈ సంబంధం చెప్పేను.” అని స్పందించగానే, “ఆ అమెరికా సంబంధం వివరాలు ఏమిటండి.” అని లావణ్య కుతూహలంగా అడిగింది. “అమ్మా, ఆ అబ్బాయి రెండేళ్లయి అమెరికాలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తండ్రి విజయవాడలో స్వంతంగా ఇన్కమ్ టేక్స్ ప్రాక్టీసు చేస్తున్నారు. తల్లి ఆ ఊళ్లోనే లాయరు. వాళ్ళకి ఆ అబ్బాయి ఒక్కడే సంతానం. మీకు నచ్చితే వారితో మాట్లాడతాను.” అన్నారు సిద్ధాంతిగారు. “ఈ సంబంధం బాగుందండి. వెంటనే మాట్లాడండి.” అని లావణ్య సంతోషంతో స్పందించింది. “ఇప్పుడే మాట్లాడతాను. మీ అమ్మాయి బయోడేటా, మీ కుటుంబ వివరాలు నా ఐడి కి పంపండి.” అని సిద్ధాంతిగారు సలహా ఇచ్చేరు. మరుక్షణం ఆయనకవి చేరేయి. MP తో సంభాషణ ముగిసేక, భార్యామణి సిద్ధాంతిగారితో ఏమిటి మాట్లాడిందో లాయరుగారు తెలుసుకోగోరేరు. ఆవిడ ఆ వివరాలు చెప్పింది. ఆయన ఆ IAS సంబంధం బాగున్నట్టే ఉందని అభిప్రాయపడ్డారు. “ఆ సంబంధం అయితే చెప్పుకోడానికి అల్లుడు కలెక్టరంటే బాగుంటుంది. కాని ఐఐటీ లో ఇంజనీరింగ్ చేసి అంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి, మొగుడుకి మూడేళ్ళకోసారి ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి అతని వెంటా వెళ్ళాలి. ఎల్లకాలం దాన్ని కలెక్టరుగారి పెళ్ళాం అనే అంటారుగాని దానికో పేరు, ప్రతిష్ట ఉండవు. దాని చదువు ఉద్యోగం గంగపాలే కదా.” అని లావణ్య నొక్కి చెప్పడంతో లాయరుగారు కిమ్ అనకుండా అంగీకరించేరు. లావణ్య ఏదయిన ఇంజనీరు సంబంధం చూడమని చెప్పేనని, సిద్ధాంతిగారు చెప్పిన ఇంజనీరు సంబంధం వివరాలు చెప్పింది. IAS సంబంధం విషయంలో తల్లి నిర్ణయాన్ని సుహాసిని కూడా సమర్ధించింది.

ఆ మరునాడు సిద్ధాంతిగారినుండి లావణ్యకు ఫోను వచ్చింది. అమెరికా పెళ్లికొడుకు, శేఖర్ ఆ వచ్చే ఆదివారంనాడు విశాఖపట్నంలో ఉంటాడని, ఆ రోజు పెళ్ళిచూపులకు ఏర్పాటు చెయ్యమని పెళ్ళివారు కోరేరని ఆయన తెలియజేసేరు. వారి కాంటాక్ట్ నంబరుకూడా ఇచ్చేరు. లాయరుగారు, లావణ్య, సుహాసినితో బాటు శనివారం సాయంత్రం కారులో విశాఖపట్నం చేరుకొని తాజ్ హోటల్లో బసచేసేరు. ఆదివారం తాజ్ హోటల్లో పెళ్ళిచూపులు జరిగేయి. పెళ్ళికొడుకు, సుహాసిని ఏకాంతంగా గంటకు పైగా మాట్లాడుకున్నారు. పెద్దలు కూడా వారి వారి కుటుంబ వివరాలు పంచుకొన్నారు.

సోమవారం ఉదయాన్న పదిగంటలకు లాయరుగారి కుటుంబం తమ ఊరు చేరుకున్నారు. సుహాసిని ఆ రోజుకు శలవు తీసుకుంది. పదకొండు గంటల ప్రాంతంలో లాయరుగారు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూంటే పెళ్లివారినుండి ఫోను వచ్చింది. తమకు సంబంధం నచ్చిందని, వీలయినంత తొందరలో శుభకార్యం జరిపించమని, పెళ్ళికొడుకు తండ్రి తెలియజేసేరు. లాయరుగారు ధన్యవాదాలు సమర్పించుకొని వివాహానికి సుముహూర్తం సిద్ధాంతిగారిచేత పెట్టించి తెలియబరుస్తానన్నారు. ఉత్సాహంతో వడివడిగా అడుగులు వేసుకొని వెళ్లి, వచ్చిన శుభవార్త, పెరట్లో పువ్వులు కోస్తున్న తల్లీ కూతుళ్లకు లాయరుగారు సంతోషంతో వినిపించేరు. అది వినగానే చేతిలోని పువ్వులసజ్జ తల్లిచేతికిచ్చి సుహాసిని సిగ్గుతో తనగదిలోనికి తుర్రున పారిపోయింది. లావణ్యకు తాను విన్నది నిజమా కాదా అనిపించిందేమో, “ఏమండీ, మీరు సరిగ్గా విన్నారా.” అని, రూఢి చేసుకోడానికి భర్తనడిగింది. లాయరుగారు బల్లగుద్దినట్లు ధ్రువీకరించేరు. సంభ్రమాశ్చర్యాలు లావణ్యను ముంచేసేయి. చిన్న చిరుజల్లు ప్రారంభించింది. లాయరుగారు తొందరగా కోర్టుకు బయలుదేరుతూ అమ్మాయిని అభినందించి వెళ్ళేరు. చీర పైటకొంగును, ముందుకున్న కుచ్చిళ్ళతో కలిపి, ఎడమచేత ఎత్తిపట్టుకొని, కుడిచేతిన పూలసజ్జ పట్టుకొని, లావణ్య గబగబా పూజాగృహం చేరుకొంది. పూజామందిరం ముందు సాష్టాంగపడి మందిరంలోని ప్రతి దేమునికి, దేవికి, విడివిడిగా ధన్యవాదాలు సమర్పించుకొంది. కూతురు గదిలోనికి వెళ్లి, సుహాసినిని తనివితీరా గుండెలకు హత్తుకొని తలపై ముద్దుల జల్లు వెదజల్లింది. “తల్లీ, నువ్వు అదృష్టవంతురాలివి. అమెరికాలో నువ్వూ ఉద్యోగం చేస్తే, ఇద్దరూ కలసి బోలెడు ఆర్జిస్తారు. దర్జాగా బతకొచ్చు.” అని ఇంకా ఏవేవో చెప్పబోతుంటే సుహాసినికి ఫోను రావడంతో లావణ్య అక్కడనుండి తన గది చేరి వాలుకుర్చీమీద వాలింది. తన కలలు పండేయని ఉబ్బితబ్బిబయిపోతోంది. కూతురు, అల్లుడూ, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే చేరో కారు కొనుక్కుంటారని, ఇంట్లో లేటెస్ట్ సదుపాయాలన్నీ చేసుకొంటారని, వాళ్ళు సెట్లయ్యేక భర్తతోబాటు తనూ వెళ్లి వాళ్ళదగ్గర రెండు మూడు నెలలు సరదాగా గడపొచ్చని, అమెరికాలో చూడవలసినవన్నీ చూస్తానని, స్వదేశం వచ్చేక నలుగురితో, ముఖ్యంగా వదినతో తన అనుభవాలు వివరంగా చెప్పొచ్చని, ఇంకా ఏవేవో తలచుకొంటూ ఊహాలోకంలో విహరింపసాగింది. ఈ వార్త వీలయినంత తొందరగా అందరికీ తెలియజేయాలని కుతూహలపడుతోంది. వెంటనే వదినకు ఫోన్ చేసి చెప్పదలచింది. అన్నయ్యకే ముందు చెప్పడం మర్యాదగా ఉంటుందని అంతరాత్మ చెప్పింది. అది శ్రీవారు వచ్చేక ఇద్దరూ అన్నయ్యకు వదినకు చెప్పడం ఉచితమనుకొంది. తన తరఫున, భర్త తరఫున ఉన్న బంధువులందరి లిస్టు తయారుచేసింది. ఊళ్ళో తనకు తెలిసిన ఆడవాళ్లందరికీ ఎలా తెలియజేయడానికి ఆలోచించింది. ప్రతి ఒక్కరికి ఫోను చేసి చెప్పడం కష్టమనుకుంది. పార్టీ పెట్టి, వచ్చిన అందరికీ చెప్పాలనుకుంది. అది మరీ బెట్టుగా ఉంటుందనుకుంది. చివరకు ఇంట్లో సత్యనారాయణవ్రతం చేసి అందరినీ మెసేజుల ద్వారా ఆహ్వానిస్తే తను కోరిందీ అవుతుంది; పుణ్యం కూడా వస్తుందని నిర్ధారించుకొంది. భర్త వచ్చేక ఆయనతో సంప్రదించి వ్రతం ఏరోజు చెయ్యడమో నిర్ణయించి సిద్ధాంతిగారితో మాట్లాడవచ్చనుకొంది.

లాయరుగారు సాయంత్రం వేగరంగానే ఇల్లు చేరుకున్నారు. డ్రాయింగురూము సోఫాలో నల్లకోటు పడేసి ఆసీనులయ్యేరు. ఆయనకు చల్లటి మంచినీళ్ల గ్లాసు అందించి, లావణ్య భర్త ప్రక్కనే కూర్చుంది. “మీరు రిఫ్రెష్ అయ్యేక బంధువులకి ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మాయి పెళ్లి కుదిరిందని చెప్పాలండి. నేను బంధువుల లిస్ట్ తయారుచేసేను.” అని భర్తకు సలహా ఇచ్చింది. సత్యనారాయణవ్రతానికి ఆయనకు ఏ రోజు వీలవుతుందో కూడా అడిగింది. భార్య ముఖంలోనికి చూస్తూ లాయరుగారు. “లావణ్యా, శాంతంగా విను. లాయరు ప్రకాశరావుగారు నీకు తెలుసు కదూ.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, “ తెలుసండీ, వాళ్ల అబ్బాయి పెళ్ళికి మనం తుని వెళ్ళేం కదండి. ఆ అబ్బాయి కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు కదూ.” అని అనగానే, “ చేసే..వాడు.” అని సరిదిద్దేరు, లాయరుగారు. “అదేమిటండి. మీరేమిటంటున్నారో నాకు బోధపడడంలేదు.” అని గురువుగారి చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పలేని విద్యార్థినిలా ముఖం పెట్టి అడిగింది, లావణ్య. “ఇవాళ ప్రకాశరావుగారు చెప్పేరు. వాళ్ల అబ్బాయి అమెరికాలో ఉద్యోగం మానేసి పెర్మనెంటుగా ఇండియా వచ్చేసాడట.” లాయరుగారు ఉవాచ. “ఏమిటయింది.” ఎదురు ప్రశ్న. “ఆ అబ్బాయి గ్రీన్ కార్డుకు రెండేళ్ల క్రితం ఎప్లై చేసేట్ట. ఇప్పటిదాకా రాలేదట. వచ్చే ఆశలు కూడా లేవట. కనీసం గ్రీన్ కార్డేనా ఉంటేగాని ఆ దేశంలో మనవాళ్లకు ఉద్యోగాలు నిలబెట్టుకోడం కష్టంట. అది ఆలోచించి ఆ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చూసుకొని ఇండియా వచ్చేసాడట. అమెరికాలో గ్రీన్ కార్డులు లేనివాళ్లు అనేకమంది అదే పని చేస్తున్నారట.” అని లాయరుగారు వివరంగా చెప్పేరు. “అయ్యో, అలాగా. మన పెళ్ళికొడుక్కి ఆ గ్రీన్ కార్డ్ ఉండే ఉంటుంది. లేకపోతే పెళ్ళిచూపుల టైములో అమ్మాయికి చెప్పేవాడు.” అని లావణ్య బయటకు చెప్పినా మనసులో ఆందోళన ప్రారంభమయింది. “శేఖర్ రెండేళ్లబట్టే అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అందుచేత నాకనుమానమే. అయినా అమ్మాయి వచ్చేక అతణ్ణి అడిగి తెలుసుకోమందాం.” అని లాయరుగారు భార్య ఆశలపై చన్నీళ్లు జల్లేరు. అంతలో సుహాసిని వచ్చింది. డ్రాయింగు రూము ప్రవేశిస్తూ, విసురుగా హ్యాండ్ బేగ్ సెంటర్ టేబుల్ పై పడేసి సోఫాలో వాలింది. లావణ్య, “ఏమమ్మా, ఏమిటయింది. అలా ఉన్నావ్.” అని ఆందోళనతో అడిగింది. లాయరుగారు కూడా కంగారుపడ్డారు.

“అమ్మా, వాడో cheat.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే, లాయరుగారు, “ఎవరమ్మా.” అని అడిగేరు.

“మరెవరు నాన్నా. ఆ శేఖర్.” అని నొక్కి చెప్పింది. “ఏమిటయింది” అని తల్లి ఆతృతతో అడిగింది.

“ఇవాళ పవన్ కుమార్ అనే ఒకాయన మా ప్రోడక్ట్ డెవలప్మెంట్ డివిజన్ లో జాయినయ్యేడు. ఆయన అమెరికాలో మూడేళ్ళబట్టి చేస్తున్న ఉద్యోగం మానేసి ఇండియా వచ్చి ఉద్యోగాలు వెతుక్కున్నాడట. అతను చెప్పేడు; అక్కడ ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందని. గ్రీన్ కార్డ్ లేనివాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలీదట. అందుచేత ఆ అనిశ్చిత భవిష్యత్తుతో కొనసాగించడం ఎందుకని, చాలామంది ఆ ఉద్యోగాలు వదలుకొని స్వదేశంలో ఉద్యోగానికి మొగ్గు చూపుతున్నారట. అతనికి గ్రీన్ కార్డు లేదుట. వచ్చే ఆశలు కూడా లేవట. అందుచేత ఇక్కడికి వచ్చేసాడట. ఆయన మా డివిజన్ లో ఒక్కొక్కరితో పరిచయం చేసుకొంటూ నా పరిచయం అవగానే, “excuse me. మీరు గానీ శేఖర్ వుడ్ బీ యా.” అని కుతూహలంగా అడిగేడు. “yes. Very much. మీకు శేఖర్ని ఎలా తెలుసు.” అని నేను ఆశ్చర్యంతో అడగ్గానే, “అయ్యో, వాడు నా కొలీగండి. కాలేజీలో కూడా నా జూనియర్. నాలుగు రోజుల క్రిందటే వాడితో మాట్లాడేను. నా ఉద్యోగాల వేట ఎక్కడదాకా వచ్చిందని అడిగేడు. అప్పటికి ఇది దొరకలేదు. రాళ్ళు విసురుతున్నాను. ఏది తగులుతుందో తెలీదన్నాను. వాడూ రిజైన్ చేసేనన్నాడు. ఫ్లైట్ కన్ఫర్మ్ అవ్వగానే బయల్దేరతానన్నాడు.” అని చెప్పి మరొకరిని కలియడానికి వెళ్ళేడు. అది వినగానే ఆ శేఖర్ గాడి సంగతేదో తేల్చుకోవాలని క్యాంటీన్ కి వెళ్లి వాడికి ఫోన్ చేసేను. వాడు ఫోన్ ఎత్తుకొని, హాల్లో సుహాసిని, ఏమిటయింది; ఈ టైములో ఫోన్ చేసేవ్, అని అడిగేడు. నీ ఇండియా ఫ్లైట్ కన్ఫర్మ్ అయిందో లేదో కనుక్కుందామని చేసేనని నేను ప్రతిముక్కా నొక్కి నొక్కి అనడంతో షాక్ తిన్నాడేమో, కొద్ది క్షణాలు ఆగి, నీకెవరు చెప్పేరని అడిగేడు. నీ కొలీగ్ పవన్ కుమార్ ఇవాళ మా కంపెనీలో జాయినయ్యేడు. అతను చెప్పేడని నేను గట్టిగా చెప్పగానే, ఆ పవన్ కుమార్ గాడు చెప్పింది నిజమనుకొంటున్నావా. వాడితో జోక్ చేసేను, అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ‘stop it. Don’t waste my time. I called off the marriage.’ అని ఖచ్చితంగా చెప్పి, ఫోన్ పెట్టేసాను. తరువాత వాడు ఎన్ని కాల్స్ చేసినా రిసీవ్ చేసుకోలేదు. వాడు అమెరికానుండి వచ్చేస్తున్నాడని కాదు; అంత ముఖ్యమయిన విషయం నాకు చెప్పకుండా దాచేడని నా ఒళ్లు మండింది. నాదే తప్పు. పెళ్ళిచూపుల టైములో ఆ విషయం నేనడగలేదు. అది అడగాలని కూడా నాకు తట్టలేదు.” అని దిగాలుగా నిట్టూర్చింది. “అమ్మా, నువ్వు మంచిపని చేసేవ్. ముందుగానే తెములుకున్నావ్. నేనిప్పుడే శేఖర్ తండ్రికి ఫోన్ చేసి వారి సంబంధం వదులుకున్నామని చెప్తాను.” అని లాయరుగారు కూతుర్ని కొనియాడేరు. “మంచిపని చేసేవమ్మా. వాడంత మోసగాడనుకోలేదు. ఫరవాలేదు. అంతకు మించిన సంబంధం వస్తుంది.” అని కూతురుకు ధైర్యం చెప్పింది, లావణ్య. “అమెరికా సంబంధం మాత్రం చూడకు.” అని లాయరుగారు మందహాసంతో అనడంతో ముగ్గురి ముఖాన్న చిరునవ్వులు అలరించేయి.

చూసేరండి; అమెరికాలో ప్రభుత్వం మారగానే మనదేశంలో పెళ్ళికొడుకుల విలువలు ఎలా మారేయో.

***సమాప్తం***

Posted in July 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *