శోణా అనబడే సంగ్రాముడు కుండిన రాజ్యంలో సైన్యంలో పనిచేస్తున్నాడు. శిక్షణలో భాగంగా అనేక రకాల ఆయుధాలను ఉపయోగించినా, సైనికుడిగా చేరాక కేవలం కత్తికే పరిమితం అయ్యాడు. చిత్ర విచిత్రమైన ఆయుధాలు సేకరించడం, వాటిని ప్రయోగించడం అభ్యాసం చేయడం అలవాటుగా మారింది సంగ్రామునికి. కానీ తన నైపుణ్యం ప్రదర్శించే అవకాశం ఎప్పుడూ రాలేదు. మహారాజు గారి పుట్టినరోజు సందర్భంగా వీరత్వ పరీక్షలు, పోటీలు పెట్టినప్పుడు ముఖానికి గుడ్డ కట్టుకొని, తన దగ్గరున్న విచిత్ర ఆయుధ ప్రదర్శన, అభ్యాస ప్రదర్శన చేసాడు. మహారాజు గారు మెచ్చుకొని అలాంటి ఆయుధాలు తయారు చేయిస్తానని, తన సైన్యానికి కూడా శిక్షణ నివ్వమని కోరారు. కానీ సైన్యాధ్యక్షునికి ఇదంతా రుచించలేదు. “ఈ వీరుడు ఏ దేశ గూఢచారో, బహుమతులు ఇచ్చి పంపండి చాలు, ఉద్యోగం వద్దు” అని రాజుగారి చెవిలో ఊదాడు. దానితో అనుమానించిన రాజుగారు అప్పటికి బహుమతులు ఇచ్చి సత్కరించి, సంగ్రాముడు వెళ్ళేటప్పుడు అనుసరించమని తన వేగులకు చెప్పాడు. సంగ్రాముడు వారిని గమనించాడు. ఎన్నో తిప్పలు పడి వారిని వదిలించుకొని ఇంటికి చేరాడు. తన ఆయుధాలన్నీ జాగ్రత్తగా దాచాడు. మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా సైన్యంలో తన స్థానంలోకి చేరిపోయాడు. అసంతృప్తి మాత్రం కొనసాగుతోంది. ఓసారి వేటకు వెళ్లినపుడు సింహం దాడి చేయడంతో అందరూ కకావికలమై పోయారు. అప్పుడు సంగ్రామునికి ఆశ్రయం ఇచ్చాడు విక్రముడు. రెండు రోజులు విక్రముని దగ్గర విశ్రాంతి తీసుకుని తర్వాత తన రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత తరచుగా విక్రముని కలుస్తూనే ఉన్నాడు. తన ఆయుధాలన్నీ ఇప్పుడు దొంగల సైన్యానికి ఉపయోగిస్తున్నాడు. తన ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చిందని మురిసిపోయాడు.
సంగ్రాముడు, విక్రముడు కలిసి ఉన్నప్పుడు శూరసేనుడు రావడం కంటబడింది. ఆకలిదప్పులతో శోషించి ఉన్నాడతను. విక్రముడు అతనిని ఆదరించి, అన్న పానీయాలిచ్చి సేదతీర్చాడు. కాసేపటికి తెప్పరిల్లిన శూరసేనుడు తన కథంతా చెప్పాడు.
విని చాలా బాధపడ్డారు విక్రముడు, సంగ్రాముడు. తమ వివరాలు కూడా చెప్పారు ఇద్దరూ. విక్రముడు కూడా తనలాగే వంచితుడు అని తెలిసి బాధపడ్డాడు శూరసేనుడు.
ముగ్గురూ కలిసి దొంగతనాలు, దోపిడీలు చేయడానికి నిశ్చయించుకున్నారు. అయితే “డబ్బున్నవారిని మాత్రమే దోచుకోవాలి, నెలకు ఒక్కసారే దోపిడీ చేయాలి. మారుపేర్లు పెట్టుకోవాలి. ముసుగులు ధరించాలి. సంపాదించిన సొమ్మును రెండు భాగాలు చేసి, ఒక భాగం దాచి పెట్టాలి, మిగతాది సమానంగా పంచుకోవాలి” అని నిర్ణయం చేసుకున్నారు. మూడు నెలలు తమ మూడు రాజ్యాలలో ధనవంతులైనవారి ఇళ్లను ఎంచుకొని దోచుకున్నారు.
నాల్గవ నెలలో కార్ముఖ రాజ్యంలో ధనవంతుడైన కుమార శ్రేష్టి ఇల్లు కొల్లగొట్టి వచ్చేటప్పుడు, గస్తీ కాస్తున్న వీరసింహుని చూపులకు చిక్కుకున్నారు. వీరసింహునికి దొరక్కుండా తప్పించుకున్నా, వీరసింహుడు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేశాడు. వీరసింహుని చూసి మిత్రత్రయం ఆశ్చర్య పోయారు. ముసుగులో విక్రముని పోల్చలేకపోయినా, కొండగుహలో పోల్చుకున్నాడు. ఒక పల్లెలో ఇద్దరూ ఒకే గురువు దగ్గర ఆయుధ శిక్షణ పొందారు. తర్వాత ఎవరికివారు వారి గ్రామాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు విక్రముని చూసి “ఏమిటిదంతా?” అని ప్రశ్నించాడు వీరసింహుడు.
విక్రముడు జరిగినదంతా చెప్పాడు. వీరసింహుడు కూడా తన గురించి చెప్పాడు. అంతేకాదు, తమ రాజ్యంలో ఫాలాక్షునికి ధన సహాయం చేసేది కుమార శ్రేష్టేనని, అతనిని దోచుకోవడం తనకు ఆనందం కలిగించిందని కూడా చెప్పాడు. తాను కూడ వీరితో కలుస్తానని చెప్పాడు వీరసింహుడు. దానితో వీరసింహుని కూడా తమ బృందంలో చేర్చుకున్నారు. రెండేళ్లు దొంగతనాలు జరిగేక, నలుగురూ కొత్త ఆలోచన చేశారు. దాని ఫలితమే దొంగల సైన్యం. కానీ దానికి వారు ‘వీరసేన’ అని నామకరణం చేశారు. నెలంతా వీరసేన తమ తమ ఊళ్లలో గ్రామరక్షక దళంగా కాపలా విధులు నిర్వహిస్తూ ఉంటారు. పనిమీద తిరుగుతున్నట్లు నటిస్తూ, అక్రమంగా సంపాదించే ధనవంతుల వివరాలు, ఇంటి గుట్టుమట్లు సేకరిస్తారు. అనుకున్న రోజున ఏదో ఒక ఇంటిని ఎన్నుకొని, దోపిడీ చేసి వెళ్ళిపోతారు. వారికి తగిన ఫలితం లభిస్తున్నందున ఆనందంగా వెళ్తారు. తాము చేసే పని తప్పు కాదని, ఆయా ధనవంతులందరూ అక్రమార్జన చేస్తున్నారని, రాజు లేదా అధికారులు వారికి కొమ్ము కాస్తుండటం వలన తామే బుద్ధి చెప్తున్నామన్నది వీరసేన భావన.
వీరసేన అందరికి విక్రముడు, సంగ్రాముడు, శూరసేనుడు, వీరసింహుడు, కాలా, శోణా, నీలా, శ్యామా గానే తెలుసు. వారెప్పుడూ వీరసేనకు ముసుగుల్లోనే కనిపిస్తారు. ఒకనాడు నలుగురూ వీరసేనను సమావేశపరిచారు. శ్యామా ముందుకి వచ్చి, “మిత్రులారా! ఈరోజు మీకు నా స్నేహితుని కథ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు ఏమైనా సూచనలు చేయవచ్చు” అని చెప్పాడు. తర్వాత వీరసింహుని కథను చెప్పాడు.
“ఇప్పుడు చెప్పండి మిత్రులారా! వీరసింహునికి మనం ఏ విధంగా సహాయపడగలం?” అడిగాడు శ్యామా.
కొంచెం సేపు అందరూ మౌనంగా ఉన్నారు. తర్వాత శంభుడు లేచాడు. “దొరా! మహారాజు బిడ్డడై ఉండి కూడా, తన ఉనికి తెలియనీయకుండా, అస్తిత్వానికై పోరాడటం బాగుంది. మేమంతా, కాదు కాదు మనమంతా సహాయం చేద్దాం. మీరు చెప్పిన కథ మా వీరసింహునిదే. ఇన్నాళ్లు మా మధ్యనే ఉంటున్నది మా యువరాజే అని తెలియలేదు. ఇంక తెలిసాక ఉపేక్షించేది లేదు. మాగ్రామ రక్షక దళాలన్నీ ఇకపై వీరసేనలే అవుతాయి. మరికొంతమంది సైన్యాన్ని కూడా సమకూరుస్తాం. అవసరమైతే మాలో మేమే తర్ఫీదు నిచ్చుకుంటాం” ఆవేశంగా చెప్పాడు. మిగతావారంతా కూడా సయ్యన్నారు.
“మీకు ఇచ్చిన సొమ్ము కాకుండా మరింత సొమ్ము కూడా ఉంది. అవసరమైన ఆయుధాలు, సమకూర్చుకోండి. అవకాశం చూసుకొని తిరుగుబాటు చేద్దాం” చెప్పాడు కాలా.
“మాదేశంలో ఇలాంటి అన్యాయం ఒకరికి జరిగింది దొరా. మా సైన్యాధ్యక్షుడు చేసే అక్రమాలు చూడలేక, మావూరి యువకుడు ఒకడు ప్రశ్నించాడు. ఎదుర్కొన్నాడు. అతడిని బంధించి, కుట్రదారుడనే నేరం మోపి, అర్ధనగ్నంగా ఊరేగించి, మరణశిక్ష అమలుపరిచారు. అంతే కాకుండా మేమంతా ఎక్కడ తిరుగుబాటు చేస్తామో అనే భయంతో శవాన్ని దాచేసి, నేరస్తుడు తప్పించుకొని పారిపోయాడని ప్రచారం చేశారు” ఒక యువకుడు లేచి చెప్పాడు.
శోణా లేచి “ఆ యువకుని పేరు?” అని అడిగాడు.
“విక్రముడు” చెప్పాడా యువకుడు. “ఏ రాజ్యం?” అడిగాడు కాలా.
“అవంతి” చెప్పాడు.
“సరే, చంపబడ్డాడో, తప్పించుకుని పారిపోయాడో తెలియని వ్యక్తి కోసం ఏం చేయగలం?” అడిగాడు కాలా. “కాబట్టి ముందు మన మిత్రుడు చెప్పిన విషయం గురించి ఆలోచించండి. ప్రతీ దోపిడీ లోనూ ఒక పిల్లవాడిని తీసుకువస్తున్నాం. వారి విషయం ఏమిటి?” అడిగాడు కాలా.
“ఆ పిల్లలందరికీ ఆటవిక గూడెంలో శిక్షణ ఇప్పిస్తున్నాం దొర. ఆటవిక పద్ధతులు, నాగరిక పద్ధతులు రెండింటి లోనూ శిక్షణ పొందుతున్నారు.” చెప్పాడు రుద్రుడు.
“సరే ఇక సమావేశం ముగిద్దాం. ఈ నెల నుంచి మూడు మాసాలు దోపిడీలు రద్దు. నిశ్శబ్దంగా ఎవరి గ్రామాలలో వారు వీరసింహునికి అనుకూల సైన్యాన్ని తయారుచేసి నిర్వహించండి. బయలుదేరండి” ఆదేశించాడు శ్యామా.
వీరసేన సభ్యులు అందరూ వెళ్లిపోయారు. అలికిడి సద్దుమణిగేవరకు అందరూ ఓపిక పట్టారు. కాలా, నీల, శ్యామా, శోణ ఒకరినొకరు కౌగలించుకొన్నారు. “శ్యామా నీ సమస్యకు పరిష్కారం దొరికింది” అని శోణ అంటే, “నిన్ను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు మిత్రమా” అని కాలాను పొగిడారు ముగ్గురూ. నలుగురూ వీడ్కోలు చెప్పుకొని బయలుదేరారు.
తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. వీరసేన బయలుదేరిన కాసేపటికే ఆకాశం దట్టంగా మబ్బుపట్టింది. ఎన్నడూ చూడనంత కుంభవృష్టి కురిసింది. ఏనుగు తొండాలతో పోస్తున్నట్లు వర్షధారలు పడసాగాయి. వీటికి తోడు నేలను నింగిని కలుపుతున్నట్లు పెద్ద పెద్ద మెరుపులు, వాటికి తగ్గ ఉరుములు, పిడుగులు. వీరసేన మొత్తం ఆ వర్షం ధాటికి కకావికలమైపోయింది. చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోయారు. సుమారు ఘడియన్నరపాటు ఆ వర్ష బీభత్సం కొనసాగింది. ఎక్కడివారక్కడ చెట్ల మాటున, కొమ్మల మధ్యన నక్కి కూర్చున్నారు. కొన్ని చెట్లు అమాంతం పడిపోయాయి. వర్షపు ఉధృతి తగ్గిన తర్వాత ఒకరినొకరు పిలుచుకుంటూ, తమ వారిని వెతుక్కుంటూ కలయతిరిగారు. వారికి ఒక విరిగిపడిన చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద మనుషులు ఉన్నట్టుగా తోచింది. కష్టపడి చెట్టు కొమ్మలు నరికి ఆ వ్యక్తిని బయటకు తీశారు. నల్లని ముసుగు ధరించిన ఆ వ్యక్తి అప్పటికే మరణించాడు. “కాలా” అన్నాడు రుద్రుడు. ముసుగు తొలగించి చూసారు. “అరెరే… మన విక్రముడు” అన్నాడు ఇంతకుముందు విక్రముని గురించి చెప్పిన యువకుడు.
విక్రముని మృతదేహాన్ని ఒక పక్కగా ఉంచి, మిగతావారిని వెతకసాగారు. శంభుడు, మరో ఇద్దరు కూడా విగతజీవులై కనిపించారు. వారిని కూడా కాలా దగ్గరకు చేర్చారు. చుట్టుపక్కల అంతా గాలించగా ఒకచెట్టును ఆనుకొని, పచ్చ ముసుగు వ్యక్తి, మరో ముగ్గురు వీరసేన సభ్యులు నిల్చున్నట్లు కనిపించింది. గబగబా దగ్గరకువెళ్లారు. తీరా చూస్తే వారందరూ ఆ చెట్టుపై పడిన పిడుగుపాటుకు మరణించారు. “శ్యామా” అంటూ పచ్చముసుగు తొలిగించి చూసారు. యువరాజు వీరసింహుడు. అందరూ నిశ్చేష్టులైపోయారు. ఏ ఇద్దరి గురించి సమావేశంలో మాట్లాడుకున్నారో ఆ ఇద్దరూ అంతలోనే విగతజీవులు కావడం వీరసేన తట్టుకోలేకపోతున్నారు. “జాగ్రత్తగా వెతకండి. శోణా, నీలల ఆచూకీ కూడా లభించవచ్చు. భగవంతుని దయవలన వారిద్దరూ క్షేమంగా ఉండాలని ప్రార్ధిద్దాం” అంటూ మృతదేహాల్ని కొందరు ఒక చోట చేర్చి, కాపలా ఉండగా, మిగతావారు వెతకడానికి బయలుదేరారు.
మరికొందరు వీరసేన సభ్యుల మృతదేహాలు లభించాయి. దాదాపు పదిమంది ఈ భయంకర వర్షానికి బలిఅయ్యారు. నలుగురు ఆచూకీ తెలియలేదు. విషణ్ణవదనాలతో అందరి కళేబరాలను మోసుకుంటూ, తమతమ గ్రామాలకు చేర్చారు. నీల, శోణల ఆచూకీ లభించలేదు. అందరికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు. రెండు రోజుల తర్వాత అడవిలోని వాగులో శోణ మృతదేహం కొట్టుకువచ్చింది. పీలికలైపోయిన ఎరుపురంగు ముసుగు, దుస్తుల ఆధారంగా శోణాగా పోల్చుకున్నారు. “అతని పేరు సంగ్రాముడని, సైన్యంలో పనిచేసేవాడని, చిత్ర విచిత్రమైన ఆయుధాలు ప్రయోగించడంలో నేర్పరి” అని కొందరు చెప్పారు. నీటిలో బాగా నానిపోవడం వలన శోణా మృతదేహం పాడయ్యింది. అక్కడిక్కడే అంత్యక్రియలు జరిపించారు. నీలా ఏమయ్యాడో ఆచూకీ ఎన్నాళ్ళకి తెలియరాలేదు. గ్రామ రక్షక దళాలు పేరుకు మాత్రమే మిగిలాయి. జరిగిన భీభత్సం నుంచి సుమారు పదిరోజుల పాటు ఎవ్వరూ తేరుకోలేకపోయారు. సంఘటన జరిగిన నెలరోజుల తర్వాత వీరసేన రహస్యంగా అడవిలో అదే ప్రదేశంలో సమావేశమయ్యారు. మరణించిన తమ నాయకులకు, సహచరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆరోజును తలచుకొనే సరికి ఒళ్ళు గగుర్పొడిచింది. అందరూ తమవారి గురించి మాట్లాడటం అయిపోయాక రుద్రుడు సమావేశం ముగించాడు. వీరసేన సభ్యుడొకడు రుద్రుని దగ్గరకు వచ్చి, “రుద్రా! మనకి ఇచ్చిన సొమ్ము కాకుండా మిగిలిన దోపిడీ సొమ్ము మన నాయకులు ఎక్కడ జాగ్రత్త పరిచారో నీకు ఏమైనా తెలుసా?” అని అడిగాడు.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.