కాలంతో పాటు మారిన ‘శుభం’... మన సంస్కృతిలో దాని స్థానం!
అమెరికా-ఇరాన్ డీల్: ట్రంప్ ‘శుభం కార్డు’కు నెతన్యాహు ‘ట్విస్ట్’!
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందంటూ జూన్ 2026 లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనంగా ప్రకటించారు. దీంతో 5 దశాబ్దాల నాటి నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలకు, ఫిబ్రవరి 28, 2026 నుండి జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధ వాతావరణానికి ‘శుభం కార్డు' పడిందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో... ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యంత కఠినమైన, స్పష్టమైన వ్యాఖ్యలతో బాంబు పేల్చారు." ఆయన సందేశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే: “ఒప్పందాలు ఉన్నా లేకపోయినా... ఇరాన్ చేతికి అణ్వస్త్రం చిక్కడం ఎప్పటికీ అసాధ్యం!” అంతటితో ఆగని నెతన్యాహు, మరికొన్ని సంచలన విషయాలను కూడా స్పష్టం చేశారు. “ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయలేదు. మా దేశ భద్రత కోసం అవసరమైతే ఒంటరిగానైనా సరే, స్వతంత్రంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడం” అని తేల్చిచెప్పారు. అంటే, అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి డీల్స్ కుదిరినా, ఇజ్రాయెల్ మాత్రం తన వ్యూహాత్మక దారినే నడుస్తుందని అర్థమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య నడిచిన సుదీర్ఘ యుద్ధ నేపథ్యాన్ని గత రెండు నెలల పాటు మన ‘రచ్చబండ’ వేదికగా సుదీర్ఘంగా చర్చించుకున్నాం. గత నెలలోనే ఆ చర్చకు ‘శుభం కార్డు’ వేసేశాం కూడా! ఇప్పుడు తాజాగా ట్రంప్ ఫైనల్‌గా యుద్ధానికి ‘శుభం కార్డు’ వేసినప్పటికీ... ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైపు నుంచి మాత్రం ఇప్పట్లో అలాంటి కార్డు పడే సూచనలు అస్సలు కనిపించడం లేదు. యుద్ధంలో ఎవరి ప్రయోజనాలు వారివి, ఎవరి కార్డులు వారివి, కదా మరి!
అయితే, గత నెల ముగించిన చర్చకు కొనసాగింపుగా ‘యుద్ధం పార్ట్-3’ని తెరపైకి తెచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. కానీ, అసలు ఈ ‘శుభం’ అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న అసలు చారిత్రాత్మక నేపథ్యం, కథాకమామీషు ఏంటో చర్చిస్తే సరదాగా ఉంటుంది అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం... నేరుగా ఆ ఆసక్తికరమైన చర్చలోకి వెళ్దామా!
శుభం - ముగింపులోని మంగళార్థం, ప్రారంభంలోని ఆశావాదం:
“శుభం”... ఒక చిన్న పదంలో దాగిన పెద్ద తత్త్వం ఇది. తెలుగు సంస్కృతిలో “శుభం” అనే పదానికి ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంది. సాహిత్యం, కళలు, ఆచారాలు, నిత్యజీవనం - ఏ రంగాన్ని పరిశీలించినా ఈ పదం ఒక మంగళప్రదమైన ముగింపును సూచిస్తూ కనిపిస్తుంది. అయితే, అది కేవలం ఒక ముగింపు గుర్తు మాత్రమే కాదు. మరి ‘శుభం’ అంటే...మనసుకు శాంతిని అందించే ఒక ఆశీర్వాదం, జీవితాన్ని ముందుకు నడిపించే ఒక ధైర్యం, ప్రతి అధ్యాయాన్ని మంగళకరంగా మార్చే ఒక దివ్య సంకేతం.
సాహిత్య సంప్రదాయంలో శుభం - పుటల చివరలోని మంగళం:
తెలుగు గ్రంథాలలో చివరి పుటలో “శుభం” అని ముద్రించడం శతాబ్దాలుగా వస్తున్న ఒక చక్కని సంప్రదాయం. దీనికి మూడు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. మొదటిది-ఈ గ్రంథం సంపూర్ణంగా పూర్తయింది. రెండవది-దీనిని చదివిన పాఠకునికి మంగళం కలగాలి, మూడవది- రచయిత వినయాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిన్న పదం రచయితను, పాఠకుడిని, గ్రంథాన్ని - ఈ మూడింటినీ ఒకే బంధంతో కట్టిపడేస్తుంది. పురాణాలు, శతకాలు, కావ్యాలు చివర్లో “శుభాంతం”, “మంగళం”, “ఇతి కథా సమాప్తం - శుభం” వంటి పదాలతో ముగుస్తాయి - ఇవి “శుభం” భావానికి సమానమైనవి. “శుభం భూయాత్” అనేది తెలుగు సాహిత్యంలో శాస్త్రోక్త ముగింపును సూచించే మంగళార్థ పదబంధం. ఇది పాఠకునికి శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించే సంప్రదాయ ముగింపు శైలి, ముఖ్యంగా పురాణాలు, వ్రత కథలు, భక్తి గ్రంథాల్లో విస్తృతంగా కనిపిస్తుంది. “ఇతి కథా సమాప్తం - శుభం భూయాత్”, “మంగళం భవతు - శుభం భూయాత్” ఇవి రెండూ పాఠకునికి/శ్రోతకు మంగళం కలగాలని సూచించే ఆశీర్వాద ముగింపు. అన్నమయ్య కీర్తనల్లో “శుభం” అనే పదం లేకపోయినా, మంగళం, శాంతి వంటి భావాలు బలంగా ఉంటాయి. భద్రాచల రామదాసు రచించిన అనేక కీర్తనలు చివర్లో మంగళార్థం కలిగిన శ్లోకాలతో ముగుస్తాయి. వేమన పద్యాలు చాలా వరకు మానవత, నీతి, శాంతి, అంతర్ముఖతతో కూడిన “శుభం” భావాన్ని సూచిస్తాయి. పిల్లల కథల పుస్తకాల చివరలో “శుభం” అనేది చాలా సాధారణం.
తెరపై శుభం - తెలుగు సినిమాల యుగచిహ్నం:
ఒకప్పుడు ప్రతి తెలుగు సినిమా చివర్లో తెరపై తాటికాయంత అక్షరాలతో కనిపించే “శుభం” కార్డు ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కథలోని సంఘర్షణలు, భావోద్వేగాలు, కన్నీళ్లు, సంవాదనలు, పోరాటాలు అన్నీ ముగిసిన తర్వాత... ఆ ఒక్క పదం ప్రేక్షకుడికి ఒక తెలియని ప్రశాంతతను అందించేది. పాత సినిమాలలో హీరో, హీరోయిన్ మెడలో తాళి కట్టడం, ఆ తర్వాత అక్షింతల తంతు ముగియడంతోనే ఈ ‘శుభం’ కార్డు పడేది. అది కేవలం సినిమా కథ ముగిసిందని మాత్రమే కాదు; “కథానాయక-నాయికల కష్టాలు తీరాయి, ప్రతినాయకుడు మట్టి కరిచాడు, ఇక ముందున్నదంతా మంగళమే!” అనే ఒక గొప్ప ఆశాభావాన్ని, ఆశీస్సును కూడా సూచించేది. ఆ ఒక్క మాటతో ప్రేక్షకుల హృదయంలో అంతులేని ఊరట లభించేది. ముగింపు ముచ్చట మంచిదై ఉంటే “అమ్మయ్యా... కథ సుఖాంతమైంది, ఇక ప్రశాంతంగా మన జీవితాల్లోకి మనం వెళ్లొచ్చు” అనే ఒక మానసిక తృప్తితో ప్రేక్షకులు ఇంటికి వెళ్తారు.
కానీ, ఇప్పటి ఓటీటీ యుగంలో ఆ పదం నేరుగా ఎక్కడా కనిపించడం లేదు. కథ చివర్లో ఒకరిద్దరు పిల్లలు ఉన్నట్లు చూపించడమో, లేదా సినిమా షూటింగ్ తాలూకు తెరవెనుక దృశ్యాలతో సింపుల్‌గా ముగించేయడమో జరుగుతోంది... అంతే తేడా! నేటి సినిమాల్లో ‘శుభం’ అనే ఫుల్ స్టాప్‌కు బదులు, తదుపరి సీజన్ కోసం కేవలం ‘కామా’ (కంటిన్యూటీ) మాత్రమే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ, మన సంస్కృతిలో ఆ పదం తాలూకు మాధుర్యం, మన హృదయాల్లో దాని స్థానం ఇంకా చెదరలేదు.
శుభం - ముగింపులోని మానసిక శాంతి:
మన జీవితంలో ఎన్నో ముగింపులు వస్తుంటాయి. ఉదాహరణకు... ఒక ఉద్యోగం ముగుస్తుంది (అమెరికాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవారికి ఇది సర్వసాధారణం). ఒక బంధం దూరమవుతుంది. ఒక స్నేహం మసకబారుతుంది (అయితే మసకబారిన స్నేహాలను పునరుద్ధరించడంలో సోషల్ మీడియా పాత్రను మాత్రం ఇక్కడ ప్రశంసించాల్సిందే!). లేదా ఒక కల చెదిరిపోతుంది. ఈ ముగింపులన్నింటినీ మనసులో ఒక ‘శుభం’ అనే ఆశాభావంతో మనం ఆమోదించగలిగితే, ఆ ముగింపు మనపై భారంగా కాకుండా, మన ఎదుగుదలకు ఒక కొత్త మార్గదర్శకంగా మారుతుంది. కావున శుభం అనేది-“ఈ అధ్యాయం పూర్తయింది. ఇది నాకు ఏదో ఒక మంచి పాఠం నేర్పింది. ఇక ముందు నేను మరింత స్పష్టతతో సాగుతాను” అనే అంతర్ముఖ స్వీకారంగా భావించాలి.
శుభం - విడిచిపెట్టే కళ:
నేటి వేగవంతమైన ప్రపంచంలో మనసుకు విశ్రాంతి దొరకడం చాలా అరుదైపోయింది. సోషల్ మీడియా, పనిభారం, పోటీ ప్రపంచం, ఆందోళనలు... ఇవన్నీ మన ఆలోచనలను నిరంతరం పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ సందర్భంలో ‘శుభం’ అనే భావన మన ఆత్మకు ఒకింత విశ్రాంతిని అందిస్తుంది. రోజు ముగింపులో “శుభం” అనుకుంటే ఆ రోజు ఒత్తిడి ఒక్కసారిగా తగ్గుతుంది. ఏదైనా విభేదాలు, మనస్తాపాలు వచ్చిన తర్వాత... “జరిగింది ఏదో జరిగింది, శుభం, ఇక వదిలేద్దాం” అనడం వల్ల సంబంధాలు మరింత క్షీణించకుండా మనం కాపాడుకోవచ్చు. ఏదైనా తప్పిదం జరిగిన తర్వాత “శుభం, దీని మూలంగా నేను ఒక పాఠం నేర్చుకున్నాను” అనుకుంటే మనసు తేలికపడుతుంది. బిజినెస్ భాషలో చెప్పాలంటే, ‘శుభం’ అనేది మనకు ‘లెట్ ఇట్ గో’ అనే అద్భుతమైన కళను నేర్పుతుంది, కదా!
శుభం - ప్రతి ముగింపులో ఒక కొత్త ప్రారంభం:
ఘనత వహించిన మన తెలుగు సంప్రదాయంలో ప్రతి ముగింపు, ఒక కొత్త ప్రారంభానికి ద్వారం లాంటిది. పూజ ముగింపులో శుభం, వివాహ వేడుకలో పసుపు దంచే కార్యక్రమం నుండి ముగింపు వరకు శుభం, గ్రంథం ముగింపులో శుభం... ఏతావాతా ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తాయి: “ముగింపు అనేది అంతిమం కాదు; అది కొత్త ప్రారంభానికి ఇచ్చే మంగళం.”. మంచి మాట మంగళం తెస్తుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది.
ఉపసంహారం - ఒక పదం, ఒక తత్త్వం:
“శుభం” అనేది కేవలం ఒక పదం కాదు, అది మన సంస్కృతిలోని మాధుర్యాన్ని, మనసులోని ప్రశాంతతను, జీవితంలోని మార్పులను స్వీకరించే మనోభావాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప తత్త్వం. ప్రతి రోజు ముగింపులో, ప్రతి అధ్యాయం ముగింపులో, ప్రతి చిన్న సంఘటన ముగింపులో మనమే మనకు “శుభం” అని చెప్పుకోవాలి. ఇది ముగిసింది, ఇది మంగళమే, ఇక ముందున్నది మరింత శ్రేయస్కరం అనే భావనను ఇది మనలో కలిగిస్తుంది! సినిమా చివర్లో తెరపై కనిపించే ఆ తెల్ల అక్షరాలు, పుస్తకం చివరి పేజీలో ముద్రించే ఆ చిన్న పదం, పూజ చివర్లో బ్రాహ్మణుడు పలికే ఆ మంగళ శబ్దం... ఈ ఒక్క మాటలో ఎంత లోతు ఉందో, ఎంత తత్త్వం దాగి ఉందో మనం చాలాసార్లు గమనించం. ఈ రోజు వేగంగా పరిగెత్తే ప్రపంచంలో, శుభం అనేది కేవలం ఒక ముగింపు కాదు. అది మనసుకు ఇచ్చే ఒక శాంతి, జీవితానికి ఇచ్చే ఒక ఆశీర్వాదం, మరుసటి అడుగుకు ఇచ్చే ఒక ధైర్యం.
ఈరోజు ప్రపంచానికి ‘శుభం’ ఎందుకు అవసరం?
ఒక్కసారి 40 ఏళ్ల క్రితం నాటి ప్రపంచాన్ని - ఇప్పటి మన జీవన విధానంతో పోలిస్తే... ఈ రోజు మనం ఎంత వేగంగా పరిగెత్తుతున్నామో అర్థమవుతుంది. సోషల్ మీడియా, విపరీతమైన పోటీ, పనిభారం, మానసిక ఒత్తిడి - ఇవన్నీ మన జీవితాన్ని ఒక ముగింపు లేని ప్రయాణంగా మార్చేశాయి. ఏ పనీ పూర్తిగా ముగిసినట్టు అనిపించదు, మనసు ఎప్పుడూ ఏదో ఒక పరుగులోనే ఉంటుంది. ఆలోచనలకు విరామం ఇవ్వడం మనం పూర్తిగా మర్చిపోయాం. ఒక పని పూర్తయ్యేలోపే తదుపరి పనిలోకి దూకుతున్నాం తప్ప, మనసుకు విశ్రాంతిని ఇవ్వడం దాదాపుగా మానేశాం. అందుకే, ఈ డిజిటల్ రోజుల్లో మనకు ‘శుభం’ అనే భావన చాలా అవసరం! ఇది మనకు ఒక మానసిక ‘రీసెట్ బటన్’లా పనిచేస్తుంది. అది మనల్ని కాసేపు ఆపి ఇలా చెబుతుంది: “ఆగు మిత్రమా… ఈ అధ్యాయం పూర్తయింది. కాస్త విశ్రాంతి తీసుకుని, ఆపై కొత్తదానికి సిద్ధమవ్వు.” నిజానికి, ‘శుభం’ అనేది మనసు ప్రయాణానికి ఒక చక్కని మజిలీ... ఆలోచనల అలజడికి ఒక చిన్న విరామం... జీవితానికి ఒక కొత్త పునఃప్రారంభం! సరళంగా చెప్పాలంటే, నిరంతరం అలసిపోయే మనసుకు ‘శుభం’ అనేది మనం ఇచ్చుకునే ఒక చిన్నపాటి సెలవు లాంటిది. ఆ మాటకొస్తే, ఎంతటి భీకర ధైర్యవంతులకైనా సెలవు దినాలు లేని క్యాలెండర్ ను చూస్తే గుండె జారిపోవడం ఖాయం కదా!
ముగింపు:
మన జీవితంలోని ప్రతి అధ్యాయానికి, ప్రతి రోజుకు, ప్రతి చిన్న సంఘటనకు మనమే మనకు చెప్పుకోవాలి-“ఈ రోజుకు ఇది ముగిసింది. ఇది మంచిదే. ఇక ముందుకు సాగుదాం.” శుభం పలికే మనసు ఎప్పుడూ ముందుకు సాగుతుంది. ఈ నెల చర్చ ముగింపు అధ్యాయంలో ఒక చిన్న కవిత జతచేస్తే బాగుంటుంది అనిపించింది, కావున మీకోసం ఈ చిన్న కవిత:
అధ్యాయం ముగిసిన వేళ
మనసు నిశ్శబ్దంగా నిలిచిన వేళ
గతం తన పాఠాలు చెప్పిన వేళ
భవిష్యత్తు తలుపు తట్టిన వేళ
నెమ్మదిగా పలికే ఒక మాట- శుభం.
అది ముగింపు కాదు,
మళ్లీ మొదలయ్యే వెలుగు.
అది విడిచిపెట్టే శ్వాస,
ముందుకు నడిపించే ఆశ.
అది మనసుకు ఇచ్చే మంగళం,
జీవితానికి వెలుగునిచ్చే చిరుదీపం.
కన్నీటి చివర నవ్వు పుడితే- శుభం
చీకటి తర్వాత వెలుగు వికసిస్తే - శుభం
తప్పిదం తర్వాత జ్ఞానం పొందితే - శుభం
ముగింపు తర్వాత ధైర్యం నిలిచితే- శుభం.
ప్రతి రోజు చివర
ప్రతి మాట చివర
ప్రతి ప్రయాణం చివర
మనమే మనకు చెప్పుకోవాలి-
“శుభం… ఇక ముందున్నది మరింత శ్రేయస్కరం”
ఇరాన్ యుద్ధానికి ట్రంప్ వేసిన శుభం కార్డు, మన రచ్చబండ చర్చకు పనికివచ్చింది అన్న మాట - మిత్రులారా - గత రచ్చబండ చర్చల్లో మనవి చేసాను "కాదేది చర్చకు అనర్హం" అని! చివరగా, ఈ నెల రచ్చబండ చర్చకు మంగళప్రదంగా ‘శుభం’ పలుకుతూ... ‘సిరిమల్లె’ పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల రచ్చబండ అంశంపై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో పంచుకోండి. వచ్చే నెల మరో ఆసక్తికరమైన చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!
నమస్కారములతో, మీ వెంకట్ నాగం.