తిమ్మక్క – సుభద్రా పరిణయము
తిమ్మక్క రచన విజయుని వివాహ ఘట్టంలో సమగ్రంగా ఉండడం వల్లనే చేమకూర వెంకట కవి ఆమె రచనను అనుకరించ గలిగాడు. ఈ సందర్భంలో చేమకూర వెంకట కవి రచన చూడండి.
“తల్లియు దండ్రియు తగిన బాంధవులు...” అంటూ తిమ్మక్క సుభద్ర నోట పల్కించినట్లే విజయవిలాసంలో సుభద్ర అర్జునునికి చెప్పమని చిలకతో చెప్పిన మాటలీ క్రిందివి –
“మేరలా యివి మీయంతవారలకును - పెద్దలున్నా రెరిగి వారె పెండ్లి సేయ
గలరు వేగిరపాటింత వలదటంచు విన్నపము సేయరాదెయో చిన్న చిలుక” (విజయ విలాసం 2-187)
దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర, ఇతరులను కరించేటంత రసవత్తరంగా తిమ్మక్క రాసింది గాబట్టే కావ్యానందం పఠితులకు కలుగుతున్నదన్నారు. తిమ్మక్క స్త్రీ కాబట్టి ఇక్కడ స్త్రీలు ఎదుర్కొనే మానసిక, సంసారిక సమస్యలను సుభద్రకు హితబోధ చేసే సందర్భంగా చక్కగా వ్యక్తపరిచింది అని అన్నారు ఆరుద్ర.
తిమ్మక్క సుభద్ర వివాహం గూర్చి చెప్పినది ఏమిటో ఆరుద్ర ఇక్కడ వివరించలేదు. ఆరుద్ర మాటలు, “నన్నయ గారి అర్జునుడు అడగగానే బయటపడి పోయాడు (ఆది 3-137) తిమ్మక్క సుభాద్రార్జునులను ఎంతో ఆడించిగాని బయట పెట్టించలేదు. తాళి కట్టించలేదు. గుట్టుగా పెళ్లి జరిగాక తిమ్మక్క రుక్మిణి చేత అప్పగింతలు పెట్టించింది. ‘ద్రౌపదితో సఖ్యంగా ఉండు’ అని సుభద్రకు హితోపదేశం చేసింది....” అని తిమ్మక్క సుభద్రకు చెప్పిన మాటలలో ఆడువారికి ఎదురయ్యే ముఖ్య సమస్య ‘సవతి పోరు’.
ఆనాడు, ఈనాడు పురుషులలో ఉన్న ఈ బహు భార్యాత్వం, స్త్రీలపై మోజు అన్నవి భార్య స్థానంలో ఉన్న స్త్రీ కి ఎంత వేదన కలిగిస్తుందో తెలుస్తున్నది తిమ్మక్క చేసే హితబోధ వల్ల. తిమ్మక్క కూడా అన్నమయ్య పెద్ద భార్య. చిన్న భార్య రావడం ఆమెకు కొంత బాధాకరం. అందుకే తిమ్మక్క రుక్మిణి నోట ఇలా పలికించింది.
‘పాలతి నమ్మగరాదు పురుషులనెపుడు - పలురీతి గృష్ణ సర్పమ్ములై యుండ్రు
కొంచక కృష్ణకు (ద్రౌపది) కూర్మితో నుండు – వంచన సేయకు వనిత యెప్పుడును’
అని పెద్దలు చెప్పవలసిన మాటలు అవే కదా. అందుకే సుభద్ర వదిన మాటలను పాటించింది.
వివాహానంతరం సుభద్ర రుక్మిణి చెప్పిన విధంగానే ప్రవర్తించినట్లు తిమ్మక్క రచించడం వల్ల ఆనాటి స్త్రీలలో ఎంతటి సహనం ఉందో తెలుస్తున్నది. అలాగే సుభద్రార్జునులు మొదటిరాత్రికి ద్రౌపది స్వయంగా అలంకరించింది. దాన్ని తిమ్మక్క వర్ణించిన విధానం ఈ విధంగా ఉంది.
ఒప్పైన బంగారు టుప్పరిగలోను – కప్పురవాసనల్ గ్రమ్ముకొనంగ
సాంబ్రాణి ధూమముల్ సఖితానువేసి – చిత్రముల్ నిర్మించెచెలియ యంతటను
దిక్కుల మాణిక్యదీపముల్ వెలుగ – నిలువుటద్దముల నెలతచెక్కించె
వెయ్యిదీపమ్ములు వెలుగంగ నందు – గవుసెనల్ దీయించె గాజుకంబముల ......(సుభద్ర పుట 50)
తర్వాత తనే సుభద్రకు పన్నీట స్నానం చేయించి అలంకరించిందట. ఇక సుభద్రను అలంకరించడం అన్నీ ద్రౌపదే. ధర్మరాజు తమ్ముని తయారుచేశాడు. సుభద్ర సిగ్గుపడి గదిలోకి వెళ్ళని సందర్భంలో ద్రౌపది
సజ్జకు జనుమన్న సకియ యప్పుడును -సిగ్గున మురిపెమున చెలియ సుభద్ర
అడుగులోడక యుండి అటుకొంతసేపు – కూరిమి గలవాడు కొమరాల నీకు
మేలిమి గలవాడు మేనత్తకొడుకు – నాల్గునెలలు భిక్షమేల్గగ్ల బెట్టి
యిప్పుడిటువలె సిగ్గు లేటికి సుదతి – అనుచుసుభద్ర్రను అతివ తోడ్కొంచు
విజయుని పాన్పునవేడ్కతో నుంచె – తలుపులు మూసికొని తరుణియేతెంచె (సుభద్ర పుట 50)
యిప్పుడిటువలె సిగ్గు లేటికి సుదతి.. అంటూ సుభద్రను లోపలికి పంపిన ద్రౌపది అవస్థ తిమ్మక్క వివరించిన విధం స్త్రీలకు జీవితంలో ఎదురయ్యే మిక్కిలి హృదయవేదనకు అద్దం పడుతున్నది.
ఏమి వస్తువులైన ఇయ్యంగవచ్చును గానీ ప్రాణేశు నిచ్చి మరి బ్రతుకంగ రాదు. వీటిని గూర్చి చెబుతూ ఆరుద్ర “ఇది ఆడది మాత్రమే వ్రాయగలదు” అన్నారు.
ఈ సందర్భాన్ని చెబుతూ ముద్దు పళని తన రచన రాధికాసాంత్వనములో గూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచిందని చెప్పి దానిని తెల్పారు. అది –
“సొమ్ములియ్యవచ్చు సొమ్మంద మియవచ్చు – నియ్యరాని ప్రాణమియ్యవచ్చు
దనదు విభుని వేరు తరుణి చేతికి నిచ్చి – తాళ వశమె యెట్టిదానికైన (రాధిక -1=116)
అని స్త్రీల రంచనలు కాబట్టే స్త్రీల వ్యధలు, మనసులు స్పష్టమౌతున్నాయి అని ఆరుద్ర తెల్పారు.
తిమ్మక్క గూర్చి రచన మొదలుపెట్టినపుడు ఆరుద్ర ఈ కావ్యరచనా వివాదాన్ని గూర్చి చివర చర్చించుకుందాం అన్నారు. ఆ విషయం గూర్చి తెలుసుకొందాం.
తిమ్మక్క వ్రాసిన సుభద్రాపరిణయం కూడా కర్తత్వ విషయమున వివాదంలో పడింది. ఈ వివాదాన్ని గూర్చి ఆరుద్ర 4,5 పేజీలలో చర్చించారు. దాని సారాంశం –
వేటూరి ప్రభాకర శాస్త్రి, తిమ్మక్క సుభద్రా కల్యాణం వ్రాసినదని ఆ కర్తత్వ విషయాన్ని పరిష్కరించాడు. అపుడు శాస్త్రిగారు తిమ్మక్కను “సంగీత సాహిత్య చతుర” అని చెప్పారు. అంతేగాక సుభద్రా పరిణయాన్ని చేమకూర వెంకట కవి అనుకరించినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తాపీ ధర్మారావు తీవ్రంగా ఖండించారు.
తాపీవారు చేమకూర వారి విజయవిలాసానికి చక్కని వ్యాఖ్యానం వ్రాశారు. అందువల్ల తాపీవారు ఆరుద్ర రాసిన సమగ్ర ఆంద్ర సాహిత్యానికి నాయకరాజుల యుగానికి పీఠిక వ్రాస్తూ ప్రభాకర శాస్త్రి గారి మాటలను ఖండించారు. (ఆ ఖండనను ఆరుద్ర పూర్తిగా ప్రకటించారు.)
ప్రభాకర శాస్త్రి గారి ముద్రణ ప్రథమ ముద్రణ అని అందులో ఆయన చెప్పినదీ సరైనదని అందరూ నమ్మారు. కానీ అది మొదట ముద్రణ కాదని 1910 లో గోదావరి జిల్లాలో ఈ స్త్రీల పాట ముద్రించడం జరిగిందనీ, అప్పటికి తాళ్ళపాక వారిని గూర్చి ఎవరికీ అభిమాన దురభిమానాలు ఏర్పడలేదని అంటూ ఆ 1910 లో ముద్రించిన దాని రచయిత “వరకవి తాళ్ళపాక తిమ్మప్ప చెప్పెను విష్ణుకత” అని చెప్పుకొని యున్నాడు అని ఆరుద్ర తెల్పారు.
తిమ్మక్క రచన అనే దానిలో “అవనిలో తాళ్ళపాకన్నయ్య గారి తరుణి తిమ్మక్క చేప్పే తాను సుభద్ర కళ్యాణమను పాట...” అని ఉందన్నారు ఆరుద్ర. ‘ఇందులో ‘తరుణి’ అనే మాటను పట్టుకొని తిమ్మక్క రాసింది అని చెప్పారని తాపీ ధర్మారావు గారు అన్నారు’ అని సెలవిచ్చారు ఆరుద్ర.
అలాగే, అసలు తాటాకు గ్రంథంలో ఉన్నదేమంటే
“ధరలోను తాళ్లపా కన్నయ్యగారు
ధరను తిమ్మక చెప్పె ధరలోనువెలయ”
అని తెల్పి ఇందులో నిర్ణయించ వలసిన విషయాలు చాలా ఉన్నాయి అని తాపీ వారి మాటలను యధాతధంగా చూపించారు ఆరుద్ర.
ఇందులో అది ముఖ్యమైన విషయాలు;
అన్నమయ్య ఎక్కడా తన భార్య విషయం ఆమె ఈ కావ్యం లేక పాత రాసిన విషయం తెల్పలేదు. అన్నమయ్య కుమారుడు పెద తిరువేంకటనాధుడు అన్నమయ్య కీర్తనలు రాగి రేకులపై చెక్కించాడు. ఆయన కూడా తిమ్మక్క కావ్యం గూర్చి తెల్పలేదు. అన్నమయ్య మనుమడు చిన్నన్న, అన్నమయ్య జీవితాన్ని ద్విపదలో వ్రాశాడు. అందులో కూడా తిమ్మక్క గ్రంథం పేరు గానీ, ఆమె వ్రాసినట్లుగా గానీ లేదు. తిమ్మక్క విద్యావంతురాలో కాదో కూడా తెలియదు.
ఈ విధంగా తిమ్మక్క రచన కూడా చర్చనీయాంశం అయ్యింది. అయినప్పటికీ పెద్దలు తిమ్మక్కనే ప్రథమాంధ్ర కావ్య రచయిత్రిగా ప్రకటించడం జరిగింది. కావ్య రచనలను భద్రపరిచే వీలులేని కాలంలో ఇలాంటివి తప్పవు. మొత్తంమీద తిమ్మక్క చక్కటి కావ్యం రచించిన రచయిత్రిగా పేరుగాంచింది.