2. బుద్ధవరపు కామేశ్వరరావు
అంశం: మొదలు మేమిస్తా ముగింపు మీరివ్వండి; శీర్షిక: మాటే మంత్రము (మినీ కథ)
బస్సు కిటికీ లోంచి చూస్తూ గత స్మృతులలో మునిగిపోయిన ఆరణికి పెద్ద శబ్దం వినబడింది.
అది తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ శబ్దం. ఉలిక్కిపడి డోర్ వైపు చూసిన ఆమెకు ఇద్దరు అగంతకులు రివాల్వర్లు పట్టుకుని లోపలికి రావడం కనిపించింది.
ఆ ఇద్దరిలో పొడుగ్గా ఉన్న ఒక దొంగ అందరినీ ఉద్దేశించి "ఎవ్వరూ కేకలేయకండి, గట్టిగా అరవకండి. ఏమాత్రం గొడవ చేసినా పుచ్చె పగిలి పోద్ది" అన్నాడు సీరియస్ గా. తర్వాత అసిస్టెంట్ వైపు తిరిగి "ఒరేయ్ వీళ్ళందరి దగ్గరికి వెళ్లి వీళ్ళ వద్ద ఉన్న నగదు, నగలు ఆ సంచీలో వేసి తీసుకురా" అంటూ డ్రైవర్ వైపు కదిలాడు. డ్రైవర్ ను ఉద్దేశించి "బస్సు ఆపకు నెమ్మదిగా పోనీ, లోపల లైట్లు ఆపేయ్ లేకపోతే పుచ్చె పగిలి పోద్ది" అన్నాడు గట్టిగా.
ఆ పుచ్చె పగిలి పోద్ది అన్న మాట విన్న ఆరణికి అది ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఈ లోగా ఆ పొడుగు దొంగ ఒక ముసలావిడి దగ్గరికి వచ్చి "నీ మెడలో నగలు ఇందులో వేసేయ్, లేకపోతే పుచ్చె పగిలి పోద్ది" అన్నాడు ఆమె కణతకు రివాల్వరు గురి పెడుతూ. ఆమె భయపడుతూ తన ఒంటి మీద నగలను తీసి ఆ సంచిలో వేసింది.
మళ్లీ ఆ మాట విన్న ఆరణి "ఈ డైలాగు నాదే" అనుకుంటూ ఓ సారి గతాన్ని గుర్తు చేసుకుంది. ఈ లోగా ఆ పొడుగు దొంగ ఇంకొక ముసలాయన దగ్గరకు వచ్చి "ఏయ్ ముసలీ! జేబులో ఉన్న పర్సు, చేతికి ఉన్న ఆ ఉంగరాలు ఈ సంచిలో వేసేయ్. లేకపోతే పుచ్చె పగిలి పోద్ది" అంటూ భయపెట్టడం మొదలు పెట్టాడు. మళ్లీ ఆ డైలాగ్ విన్న ఆరణికి అర్థం అయిపోయింది.
"అనుమానం లేదు వీడు వాడే! ఇన్నాళ్ల తర్వాత వీడిని ఇలా చూస్తాను అనుకోలేదు" అనుకుంటూ ఆ పొడుగు దొంగ వైపు చూడడం మొదలు పెట్టింది. అందర్నీ దోచుకున్న తరువాత ఆ తోడుదొంగలు ఆరణి వద్దకు వచ్చారు. అందులో ఉన్న పొట్టి దొంగ,
"ఏయ్, ముసలీ! నీకు మళ్ళీ చెప్పాలా ఆ ముక్కు పుడక, చెవి దుద్దులు నీ చేతులో ఉన్న ఆ పర్సు ఈ సంచిలో పడేయ్" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
దానికి ఆమె "ఒరేయ్! ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. నా మాట వినకపోతే నీ పుచ్చె పగిలిపోద్ది" అంది సీరియస్ గా.
అది విన్న ఆ పొడుగు దొంగ ఒక్కసారి ఉలిక్కిపడి,
"ఒరేయ్ ఆవిడను ఏమీ చేయకు. నువ్వు వెనక్కి వచ్చాయి" అన్నాడు భయం భయంగా.
"ఆలా ఎందుకు గురూ!" అన్నాడు పిల్ల దొంగ.
"నిన్ను తగలెయ్యా! ముందు నేను చెప్పింది విను. ముందు ఆ సంచి ఆ గుమ్మం దగ్గర. లేకపోతే నీ పుచ్చె పగిలిపోద్ది" అన్నాడు సీరియస్ గా. అది విన్న ఆ పిల్ల దొంగ ఆ సంచిని డోర్ వద్ద పడేసి కిందకు దిగి వెళ్ళిపోయాడు.
వెంటనే బస్సులో అందరూ ఆరణి వద్దకు వచ్చి
"మేడం ఇంతకీ ఆ పొడుగు దొంగ ఎవరు? మీ అబ్బాయా? మీ స్నేహితుడా? మీ మేనల్లుడా? మీ తమ్ముడా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు ఆరణి నవ్వుతూ
"వాడెవడో నాకు తెలియదు. కేవలం నేను వాడి డైలాగ్ నే వాడికి అప్పచెప్పాను. భయపడి పోయాడు దొంగ వెధవ" అంది నవ్వుతూ అసలు విషయం చెప్పడం ఇష్టం లేక. అంతే అందరూ ఆ సంచి వద్దకు వెళ్లి ఎవరి వస్తువులు వాళ్ళు తీసేసుకున్నారు.
***
బస్సు దిగిన తర్వాత ముభావంగా నడుస్తున్న పొడుగు, "ఏంటి గురూ, అలా చేసావ్? ఇంతకీ ఆవిడ ఎవరు? నువ్వు ఎందుకు భయపడిపోయావ్?" అడిగాడు పిల్ల దొంగ.
"ఒరేయ్ సన్నాసి! ఆవిడ ఐదో తరగతి వరకు మా క్లాస్ టీచర్. మేము ఎప్పుడైనా ఆవిడ మాట వినకపోతే ఆవిడ 'నా మాట వినకపోతే పుచ్చె పగిలిపోద్ది' అని భయపెట్టేవారు. నాకు ఆ మాట బాగా గుర్తుండిపోయి అదే మంత్రంగా వాడుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఆవిడ మా ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోవడంతో నాకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన గురువుల వద్ద నాకు చదువు అబ్బలేదు. ఇదిగో ఇలా దొంగగా మారాను..." చెబుతున్న పొడుగు దొంగ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు పిల్ల దొంగ.