ఇంటినిండా జనం. వీధి వరండా దాటి గేటు వరకు ఉన్నారు. అందరి నోటా ఒకటే మాట.
"పుణ్యాత్ముడు! అనాయాస మరణం. అందరికీ వచ్చేదా? నిన్నటిదాకా తిరుగుతూ నలుగురికి మంచి చెడ్డ చెప్పిన మనిషి. ఇంతలో ఎంత మాయ?"
అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్న మాటలవి.
అప్పుడే ఆటో దిగిన సుభద్రమ్మ గుండెలు బాదుకుంటూ “అయ్యో రామం! నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా?" అంటూ దీర్ఘం తీస్తూ లోపలికి వచ్చింది.
రామారావు దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, అతనితో పనిచేసిన టీచర్లు, అతని కడసారి చూపు కోసం ఆ ఇంటి చుట్టు బారులుతీరారు. ఇంత జరుగుతున్నా రామారావు భార్య సీత మాత్రం నిర్లిప్తంగా, నిస్తేజంగా శూన్యంలోకి చూస్తోంది. ఎవరెవరో వచ్చి ఏవేవో ప్రశ్నలుఅడుగుతున్నారు. అన్నిటికీ ఓ నిర్లిప్తమైన చూపుతోనే సమాధానం చెబుతోంది.
"పాపం షాక్‌లో ఉన్నట్టుంది. భర్త పోతే కనీసం కన్నీటిచుక్క రాల్చడం లేదు. విడ్డూరం కాకపోతేను" అనుకుంటూ బుగ్గలు నొక్కుకుంటూ అన్నారు అక్కడ ఉన్న కొందరు అమ్మలక్కలు.
"పిల్లాపీచూ లేరు. మరి కర్మకాండలు ఎవరు చేస్తారు?" మరి కొందరు ఉత్సుకత చూపిస్తున్నారు. దేనికీ సీత వద్ద సమాధానం లేదు. సీత మేనల్లుడు ఫణి అక్కడ పనులన్నీ చూస్తున్నాడు.
“ఏదో ఒకటి నిర్ణయించుకునే లోపు, బాడీని కనీసం ఐస్‌బాక్స్‌లో పెట్టండి,” ఎవరో సలహా ఇస్తున్నారు.
అంతవరకు స్తబ్దుగా ఉన్న సీత ముఖంలో చలనం!
"వద్దు వద్దు ఆయనలాగే ఉండనివ్వండి" గుడ్లనీరు కుక్కుకుంటూ అంది.
"మరైతే ఏదో ఒకటి నిర్ణయించుకుని కార్యక్రమం మొదలు పెట్టండి" అంటూ ఫణికిసలహా ఇచ్చాడు ఓ పెద్దాయన.
వంటింట్లో కాఫీలు కలుపుతోంది ఫణి భార్య లక్ష్మి. రామారావు, సీత తాలూకు బంధువులంతా ఆ ఊర్లోనే ఉండడంతో దాదాపు అందరూ వచ్చేశారు. కార్యక్రమాలు చేసే బ్రాహ్మడికి కబురంపారు.
"అత్తయ్యా, మావయ్యకి నేను కర్మకాండలు చేస్తాను" అంటూ బట్టలు మార్చుకోబోయాడు ఫణి. ఈలోగా లోపల్నుంచి పరిగెత్తుకొచ్చింది ఫణి తల్లి అమ్మడు.
"అయ్యో, అదెలా కుదురుతుంది? తల్లి, తండ్రి బాగున్న వాళ్ళ పిల్లలు కర్మకాండలు చేయకూడదు. నీకు తెలియదురా ఫణీ, నువ్వు లోపలికి నడు ముందు" అంటూ గబగబా ఫణి చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కుపోయింది.
“పోనీ మీ ఆయన్నే చేయమనవచ్చు కదమ్మా. బావగారు కదా?" అన్నారెవరో.
"ఆయనకి దగ్గూ, ఆయాసం. ఇలాంటివి చెయ్యలేరు," అదేదో అందరికీ అలవాటు ఉన్నట్టు అంది అమ్మడు. ఇదంతా నిస్తేజంగా చూస్తోంది సీతమ్మగా మారిన సీత.
“పోనీ నేనే చేస్తాలే, తప్పుతుందా ఎంతైనా పెదనాన్న కొడుకు కదా!” అంటూ ముందుకు అడుగేసాడు రామారావు బాబయ్య కొడుకు సూరి. ఈ మాటలు విని ఎక్కడుందో పరిగెత్తుకొచ్చింది అతని భార్య కుమారి.
“ఏమిటిది? మీరు మరీను! మన నరేంద్ర భార్య కడుపు తోటి ఉంది కదా! మీరు చేయకూడదు, అరిష్టం,” అంది. అంతే! వేసిన అడుగు వెనక్కి వేశాడు సూర్యం. అందరికీ ఎక్కడలేని అరిష్టాలు ఇప్పుడే గుర్తొచ్చినందుకు నిర్లిప్తంగా నవ్వుకుంది సీత.
ఇదంతా చూస్తున్న వరాలు సీత దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా ఇది, ఏటీవాదులాట? ధర్మపెభువు తలకొరివి పెట్టడానికి నువ్వంటే నువ్వని అంటారేటమ్మా? ఇంతమంది సుట్టాల్లో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రారేటమ్మా? మా అయ్యపోతే మొగోళ్ళు లేని మా అయ్యకి నేనే తలకొరివెట్టా. మాకాడ ఇలా ఉండరమ్మా. పున్నెకారెమని నేనంటే నేనంటూ మా సుట్టాలంతా ముందుకొచ్ఛినారు. సదూకున్నోరు ఇదేటమ్మా? వీధి మొహం ఎరగనోరు మీకు ఎంత కట్టం వచ్చిందమ్మా. మీరు ఊ అనండి, అయ్యగారిని మేళతాళాలతో నీనంపిస్తా” అంటూ గట్టిగా చెప్పి గొల్లుమంది వరాలు.
ఇవేవీ సీత మెదడులోకి చేరడం లేదు ఏదో ఎక్కడో ఆలోచిస్తోంది.
పెద్ద పెద్ద కళ్ళతో రెండు జడలతో అమాయకంగా పక్క వీధిలోకి వెళ్లాలన్నా స్నేహితురాలినో, తోబుట్టువులనో తోడు తీసుకుని గాని గుమ్మం దాటని సీత, తోడు లేరని స్కూల్‌ఫైనల్ మంచి మార్కులతో పాసైనా పక్క ఊర్లో ఉన్న కాలేజీలో చేరలేదు. సీత చనిపోయిన వాళ్ళని చూడాలంటే గజగజలాడి పోయేది. వాళ్ళ బామ్మ పోయినప్పుడు గదిలో కూర్చుని ఏడ్చిందే గాని, ఆవిడ శవాన్ని మాత్రం చూడలేదు.
పాలు పోసే వెంకమ్మ మొగుడు పోతే వారం రోజులపాటు కాఫీ తాగడం మానేసింది. "మా సీత భయస్తురాలండీ. ఈ పిరికి పిల్లని ఎవరు చేసుకుంటారో?” అంటూ గొడవ పెట్టేది సీత తల్లి.
ఇంటికి నాలుగిళ్ళ అవతల ఉన్న రామారావు, సీత ముగ్ధ మోహన రూపాన్ని, అమాయకత్వాన్ని ప్రేమించి ముందుగా సీత తండ్రి తో మాట్లాడి ఒప్పించి మరీ పెళ్ళాడాడు.
ఆనాటి రాత్రి “గదిలోకి నేను ఒక్కర్తినీ వెళ్లాలా?” అన్న సీత అమాయకపు ప్రశ్నకి, "అక్కడికి ఎవరు తోడొస్తారే? ఎవరైనా వింటే నవ్విపోతారు" అంటూ తల కొట్టుకుంది సీత తల్లి.
పెళ్లి తర్వాత, ఇంకెవరి తోడు అవసరం లేకపోయింది సీతకి. కొన్నాళ్ళు పిల్లలు లేరని బాధపడ్డా రామారావు సాహచర్యం ఆమెకి ఆ మాటే మర్చిపోయేలా చేసింది. అనుక్షణం వెంట ఉండి అన్నిటా తానే అయి ఉండే రామారావు, సీతకి భర్తే కాదు స్నేహితుడు, కొడుకు, సహచరుడు ఇంకా ఎన్నో ఎన్నో!
సీత నోటి నుంచి, ‘ఇది కావాలి’ అన్న మాట వస్తే చాలు, కొండ మీద కోతినైనా క్షణాల్లో ముందుంచేవాడు. పెళ్లికైనా, పేరంటానికైనా సరే దింపి వెళ్లి, తీసుకొని వచ్చేవాడు. ఇంట్లోకి కూర, నార, పప్పు, ఉప్పు సమస్తం రామారావే చూసుకునేవాడు. సీత కాలు బయట పెట్టాల్సిన అవసరం రాకుండా. పుట్టింటికి కూడా ఎప్పుడు ఒంటరిగా పంపేవాడు కాదు. ఓసారి సీత స్నేహితురాలి కూతురు సమర్త పేరంటానికి ఒంటరిగా వెళ్లాలని, సీత పేరంటం మానుకుంటానంటే బడికి సెలవు పెట్టి మరీ సీతని తీసుకువెళ్లేడు, చాటుగా నవ్వుకున్న అక్కడి వాళ్ళ నవ్వులను పట్టించుకోకుండా.
ఎంతో మంది అనాథలైన పిల్లలకు చదువుకోవడానికి సాయం చేసేవాడు. వాళ్ళ వీధి చివర ఉండే పన్నెండేళ్ల మంగులు అంటే రామారావుకి ప్రత్యేకమైన అభిమానం. ప్రతి బాలల దినోత్సవానికి వాడికి బట్టలు కుట్టించేవాడు. వాడిచేత చిత్తు కాగితాలు ఏరుకునే పని మానిపించి బడిలో చేర్పించాడు. వాడు తెచ్చే ఆదాయం పోయిందని వాళ్ళ అమ్మ గొడవ పెడితే, ప్రతి నెలా కొంత డబ్బు వాడి కుటుంబ పోషణ కోసం ఇచ్చేవాడు. తను ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే వాడిని సీతకు తోడుగా ఇంట్లో ఉంచేవాడు.
ఈ మధ్యనే కాస్త ఇరుగుపొరుగు వారితో ఏ గుడికో గోపురానికి పెడుతోంది సీత.
“ఏమిటీ? పిరికిసీతకి ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందో?” అంటూ వేళాకోళం చేసేవాడు రామారావు.
సుభద్రమ్మ గొంతు గట్టిగా వినబడడంతో ఇహలోకంలోకి వచ్చింది సీత.
"మేమందరం చచ్చాముటే. పనిమనిషివి, పైగా ఆడదానివి వాడికి నువ్వు తలకొరివి పెడతావా? పిదప కాలం పిదప బుద్ధులూ! ఏవిటో మా వాడికి పున్నామ నరకం తప్పేట్టు లేదు" అంటూ ముక్కు చీదింది.
“ఏందమ్మా మరి? ఇంతమందుండీ మీరెవలూ ముందుకు రాకపోతే మరి ఏంటమ్మా సెయ్యాలి? ఆ అయ్య అందరి మంచి, సెడూ సూడకుండానే ఉన్నారా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఈ మజ్జినేగా మీకు గుండె ఆపరేషన్ అయింది! అప్పుడు రకతం ఎవరిచ్చారమ్మ? ఇక్కడ ఉన్నోళ్ళందరూ సెప్పండి. ఈ అయ్య సాయం పొందనోళ్ళు ఎవరైనా ఉన్నారా? పండక్కి, పబ్బానికి, రోగానికి, రొచ్ఛుకి ఎంత సాయం చేస్తారాయ్యా? మొన్నటికి మొన్న పణిబాబు గారి అమ్మాయి అమెరికా చదువుకోసం వాళ్ళు ఉంటున్న ఇల్లు తనకా పెట్టి మరి అప్పు ఇవ్వలేదూ? అయ్యా ఇయన్నీ నాకు ఎట్టా తెలుసునంటారా? నేను పనిమనిషి అయినా ఆ ఇంటి మనిషిని. ఆరి ఉప్పు, కారం తిన్న మనిషిని. సీతమ్మ నన్ను ఎప్పుడూ పనిమనిషిగా చూడలేదు. తన కూతురులాగే చూసేది.” ఇంకా వరాలు ఏదో మాట్లాడుతోంది.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో మంగులు రామారావు మీద పడి, “అయ్యా, యేటయ్య ఇది?” అంటూ పొగిలి పొగిలి ఏడ్చాడు. వాడిని చూసేసరికి అంతవరకూ ఆపుకున్న సీత దుఃఖానికి ఆనకట్ట వేయడం కష్టమైపోయింది.
అప్పటిదాకా మౌనంగా దుఃఖాన్ని దిగమింగు కుంటున్న సీతమ్మ, వరాలుని ఆగమన్నట్టు సైగ చేసి జీరబోయిన గొంతును సవరించుకుని "పాపపుణ్యాలు, స్వర్గ నరకాలుఉన్నాయో లేదో నాకు తెలియదు. నలభై ఏళ్లు ఆయనతో సహవాసం నన్ను పిల్లలు లేరన్న బాధను కూడా మరిపింపజేసింది. ఎంత చదివినా, ఎంత సంపాదించినా చివరకు చేరాల్సింది అక్కడికే అని అందరికీ తెలుసు. అయినా శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు. అనుకోవాలి కూడా. లేకపోతే బతకడం కష్టం. నేను ఎవరిని విమర్శించడం లేదు. ఎవరి ఇష్టం ఎవరూ కాదనలేనిది. ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్లి ఎరుగను. నా ప్రతి అడుగులోనూ ఆయనే నాకు తోడు. భార్య గుమ్మంవరకు, కొడుకులు కొరివి పెట్టేవరకు వస్తారని అంటారు కానీ ఎప్పుడూ నాకు తోడుండే ఆయనకు తోడుగా ఆయనను సాగనంపడానికి చివరివరకు నేను వెళ్తాను." అంటూ వరాలు అందించిన నిప్పు కుండ చేతబట్టుకుని, మంగులు తోడు రాగా గడప దాటింది గోడ మీది బల్లిని చూసి గజగజలాడే సీత, నాటి పిరికి సీత.