Menu Close
Shyama Sundara Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

దిగంబర కవిత్వం - కవులు

digambara-kavulu

దిగంబర కవిత్వం - కవులు అనే మాట తెలుగు సాహిత్యంలో 1960 లో మొదలై కొద్దికాలం మాత్రమే మనుగడ సాగించిన ఒక విప్లవాత్మక అతివాద కవితా ఉద్యమం. దిగంబరం అంటే దిక్కులే అంబరాలుగా అంటే నగ్నంగా, ఏమి కప్పుకోకుండా ఉండటం అని సాధారణ వాడుక భాషలో అర్ధం. అంటే ఈ దిగంబర కవులు తమ కవిత్వాన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు, రాజకీయాలు, సామాజిక అన్యాయాలు అనే తెరలను తొలగించి సత్యాన్ని అంటే యదార్థాన్ని నిర్భయంగా ఆవిష్కరిస్తామని చెప్పారు. అందుచేత దిగంబర కవిత్వం తెలుగు సాహిత్యములో వివాదాస్పదమైన ఉద్యమముగా ప్రచారంలోకి వచ్చింది.

వీరి ఉద్దేశం అప్పటి సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలు, అవినీతి, దోపిడీ, కపటత్వం, మధ్యతరగతి విలువల పతనం వంటి వాటిని తీవ్రంగా, నిస్సిగ్గుగా విమర్శించడం. ఇందుకు వీరు ఎంచుకొన్న శైలి అత్యంత తీవ్రమైన భాష, అశ్లీల మనిపించే పదజాలం, ఆగ్రహం, తిరుగుబాటు వంటి అంశాలతో నిండి ఉండేది. సమాజాన్ని మేల్కొలపడానికి, షాక్‌కు గురిచేయడానికి ఈ తీవ్రతను పాటించారు. దిగంబర కవులు మొత్తం ఆరుగురు. వీరు తమ అసలు పేర్లకు బదులుగా, వ్యక్తిత్వాన్ని కాదని, సామాజిక దృక్పథానికి ప్రాధాన్యతనిస్తూ తమ పేర్లు మార్చుకున్నారు. వీరి అసలు పేరు మరియు మార్చుకున్న పేర్లు 1. మానేపల్లి హృషీకేశవరావు - నగ్నముని, 2. తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు- మహాస్వప్న, 3. కుంభం యాదవరెడ్డి - నిఖిలేశ్వర్, 4. బద్దం భాస్కర రెడ్డి – చెరబండరాజు, 5. వీరవెల్లి రాఘవాచార్య – జ్వాలాముఖి మరియు 6. మన్ మోహన్ సహాయ్ – భైరవయ్య. వీరి అసలు పేర్లు తెలియనంతగా కలం పేర్లతో పాపులర్ అయినారు. ఈ ఆరుగురు కవుల్లో నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. వీరి కవితా సంకలనం ఏ మాత్రం ప్రచారం లేకుండా ఎవరూ ఊహించని సమయాల్లో రైల్వే స్టేషన్లు లేదా ముఖ్య కూడళ్లలో ఉన్నట్టుండి విడుదల చేయడం అనే ఒక ప్రత్యేక పద్ధతి పాటించారు.

వీరి మొదటి కవితా సంకలనం: 1965 లో వెలువడింది. ఆ తర్వాత మొదటి ఆరు సంకలనాలు: 1965, 1966, 1967 సంవత్సరాలలో విడుదలయ్యాయి. మొదటి సంపుటిని 1965 మే 6వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌లో నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికునితో ఆవిష్కరింపచేశారు. రెండో సంపుటిని 1966 డిసెంబర్ 8న విజయవాడలో జంగాల చిట్టి అనే హోటల్ కార్మికునితో ఆవిష్కరింపచేశారు. మూడో సంపుటిని 1968 సెప్టెంబర్ 14న అర్ధరాత్రి 12 గంటలకు విశాఖపట్టణంలో ఎడమనూరి యశోద అనే బిచ్చగత్తెతో ఆవిష్కరింపచేశారు.

దిగంబర కవిత్వం ముందుగా చెప్పినట్లుగా స్వల్ప కాలములో అంతమై పోయింది. దీనికి ప్రధాన కారణం కేవలం తిరుగుబాటు కోసమే పుట్టిన ఉద్యమము అవడం. ఈ కవిత్వములో తీవ్రమైన, పరుషమైన కొన్ని సార్లు అశ్లీలమనిపించే పదాలను వాడటం చేత సాధారణ పాఠకులకు, విమర్శకులకు దూరమయింది. నిరంతరమూ ఆ స్థాయిలో కవిత్వం రాయడం కూడా ఆ దిగంబర కవులకు కష్టమైంది. తర్వాతి కాలంలో వచ్చిన విరసం (విప్లవ రచయితల సంఘం) పాపులర్ అవడం కూడా ఒక కారణం అయింది. ఎందుకంటే దిగంబర కవులలో కొంతమంది విరసం లో చేరారు. వీరు సమాజంలో ఒక షాక్ థెరపీని సృష్టించి సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేసారు. అందువల్ల ఆ మూడు సంవత్సరాలను తెలుగు సాహిత్యములో "దిగంబర కవుల యుగం" గా పేర్కొనేవారు.

1970 లో ఈ ఉద్యమము ఆగినందువల్ల వీరిలో నలుగురు విరసం లోను, మిగిలిన ఇద్దరు అరసం లోను చేరిపోయినారు. 1971 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీరిలో నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖిని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద అరెస్టుచేసి ముషీరాబాద్‌ జైలుకు పంపింది. వివిధ నేరారోపణలతో చార్జిషీట్లు తయారు చేశారు. దీనిపై కవితా లోకంలో నిరసన పెల్లుబికింది. తమ సాహిత్య రాజకీయ విశ్వాసాలను వివరిస్తూ వీరు నిర్బంధాన్ని కోర్టులో సవాల్‌ చేశారు. 1971 సెప్టెంబరు 20న హైకోర్టు బెంచ్ విచారణ జరిపి ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం లేదని కేసు కొట్టి వేస్తున్నట్టు చెబుతూ ముగ్గురూ స్వేచ్ఛా జీవులుగా కోర్టు నుంచి వెళ్లవచ్చని తీర్పు ఇచ్చింది. వీరు ప్రభుత్వ కార్యాలయాలలో చిరుద్యోగులుగా ఉండి నౌకరీ నుండి తొలగింపబడ్డారు. ఒక ఆయన సత్య సాయిబాబా భక్తుడిగా మారి కవిత్వం వదిలివేశాడు. మరొక ఆయన కవిత్వం రాస్తూనే జిల్లెళ్ళమూడి అమ్మని ఆశ్రయించాడు. ఆ విధంగా వారి ప్రస్థానం ముగిసింది.

Posted in July 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *