వల్లభాచార్యులు వ్రాసిన మధురాష్టకం నాకు విదేశాగమనం తరువాతే సుపరిచయమైంది. ఒక భారతీయుల సాంస్కృతిక కార్యక్రమానికి (అప్పట్లో తెలుగు, తమిళ ప్రాంతీయ సంఘాలు అన్నీ నగరాలలో ఏర్పడ లేదు; దీపావళి, దసరా పండుగల వార్షికోత్సవాలు సామూహికంగా భారతీయులు అందరూ కలిసే చేసుకొనే వారు) వెళ్ళినప్పుడు, పిల్లల భరతనాట్య కౌశల్యాన్ని ప్రదర్శించడానికి మధురాష్టకం ఎన్నుకున్నారు. నాట్యంలో భావప్రకటనకు ఈ మధురాష్టకం చక్కగా నప్పింది. అటు తరువాత ఒక గుడి కమిటీ లో చేరినప్పుడు, వాలంటీర్ గా తరచూ గుడికి పోవలసి వస్తుండేది. అప్పుడు ఈ మధురాష్టకం తరచూ వినడం జరిగింది. విన్నప్పుడల్లా ఒక ట్రాన్స్ లోకి పోయిన అనుభూతి.
కొన్ని రచనలు వాటి పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసుకునేలా ప్రభావితం చేస్తాయి. అప్పుడే మధురాష్టకం అర్థం గురించి, వ్రాసిన వల్లభాచార్యుల గురించి చదవడం జరిగింది. అది చదివిన తరువాత ఆ అష్టకం మరింత మధురమైంది. 16 వ శతాబ్ది లో నివసించిన వల్లభాచార్యులు తెలుగు వారు. గోదావరి తట ప్రాంతం వారి పూర్వీకులది. కానీ ఆయన కూడా ఎక్కువగా పడమట గుజరాత్ ప్రాంతంలోనూ, ఉత్తరాన కాశీ, ప్రయాగ ప్రాంతంలోనూ జీవితం గడిపాడు. అమెరికా దేశం వలస వచ్చిన తెలుగు వారి జీవితమే ఆయనది కూడా. ఇల్లు వదలి లోకసంచారులు అయిన వారికి ప్రతీది మధురం గానే అనిపించాలి. అలా అనుకున్న వాళ్ళే కొత్త ప్రదేశాలలో, కొత్త సంస్కృతులలో ఇట్టే ఇమిడిపోగలరు. అలానే మానవ జీవితాలను మరింత మెరుగుపరిచే మార్పులు తేగలరు.
ఇక ఈ అష్టకం వ్రాసిన ఎత్తుగడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న, చిన్న పదాలతో, సంగీతానికి అనువైన పునరుక్తి పంక్తులతో ఎంతో అర్ధవంతంగా, ముఖ కవళికల వర్ణనతో మొదలుపెట్టి, సృష్టి, విధ్వంసం లతో ముగించడం, అవి కూడా మధురం అనడం, పాఠకులను, శ్రోతలను ఒక ట్రాన్స్ లో తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ భావనలే ఈ కథను నడిపించాయి.
2009 నాటికి నేను అమెరికాలో ఉంటూ దశాబ్దం దాటినా, మూడే కథలు వ్రాసాను. ఆ మూడు కథలు వంగూరి ఫౌండేషన్ ఉగాది కథల పోటీలలో నెగ్గడం వల్ల అప్పుడప్పుడే అమెరికా సాహిత్యవేత్తలకు, ప్రియులకు నేను కథా రచయితగా పరిచయమవుతున్న రోజులు. అకస్మాత్తుగా నాకు న్యూ జెర్సీలో ఉన్న భావరాజు మూర్తి గారి నుంచి, తాము తెలుగు కళా సమితి రజతోత్సవాలకు విడుదల చేస్తున్న ‘ప్రగతి’ ప్రత్యేక సంచికకు ఒక కథ పంపించమన్నారు. ఆ సంచిక కోసం వ్రాసిన కథ ఇది. ఆ ప్రత్యేక సంచిక ఇప్పుడు మళ్లీ చూస్తుంటే, ఆ సంపాదక వర్గంలో ఉన్న కాశీనాథుని రాధ, వైదేహి శశిధర్, శ్యామల దశిక గార్ల పేర్లు కనిపించి సంతోషం వేసింది. అలానే ఆ సంచికలో కథలు వ్రాసిన రచయితలు, రచయిత్రులను నేను తరువాత వ్యక్తిగతంగా కలవడం, తెలుసుకోవడం కొందరికి మంచి మిత్రులు అవ్వడం జరిగింది. ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కథలు వ్రాసినదానికి, ఇంతకంటే ఏమి కావాలి?
ప్రత్యేక సంచికలో కథ పడితే, రచయితగా ఒక వెలితే మిగులుతుంది. ఆ సంచిక ఆ నగరంలోనే పంచడం వల్ల ఎక్కువ మంది పాఠకులకు ఆ కథ చేరదు. కథకు పెద్ద ప్రాచుర్యం ఉండదు. ఈ కథ నా మొదటి కథా సంకలనం ‘సైబీరియన్ కేన్స్’ లో చోటు చేసుకున్నది. ఆ సంకలనం చదివిన చాలమంది నుండి ఈ కథకు మంచి స్పందన వచ్చింది. కథను వ్రాసిన దానికి అంతకంటే ఏమి కావాలి?
అఖిలం మధురం
‘మధురాధిపతే అఖిలం మధురం’ అంటూ ఎమ్ఎస్ గొంతులో నా ఫోన్ మ్రోగగానే వులిక్కిపడ్డాను.
ఆ రింగ్ టోన్ నన్ను పేజ్ చేయటానికని పెట్టాను. అమ్మ, నాన్నలను పేజ్ చేస్తే అర్థముంది. నాన్న కార్డియాలజిస్టు, అమ్మ ఓబిజివైఎన్. చిన్నప్పటినుంచి వారి పేజర్లు మ్రోగడం, వారు ఆగమేఘాలలో వున్నట్టుండి మాయమవ్వడం నాకు పరిచితమే. ఈ పేజర్ల చప్పుళ్ళలో సృష్టించబడిన పూర్తికాని సంభాషణలు, ఆగిపోయిన పుట్టినరోజు పార్టీలు, గెలుపు ఓటములు తేల్చుకోలేని ఆటలు, ఒంటరి భోజనాలు నాకు మదిలో మిగిలిన చేదు గుర్తులే. ఫోన్ తీసి నంబరు చూసి ఫోన్ చేసాను.
‘‘దిసీజ్ క్రిష్, నన్ను పిలిచావా?’’
‘‘హై క్రిష్, గ్లాడ్ యూ రిటర్న్డ్ ద కాల్. మిస్టర్ రాండెల్ మా హాస్పిటల్లో వున్నారు. నిన్ను చూడాలని అడిగారు.’’
బాబ్ రాండెల్ ఓ సంవత్పరమైంది చూసి. నేను మెడికల్ కాలేజీ చేరకముందు తరచుగానే కలిసేవాణ్ణి. కానీ ఓ మూడు సంవత్సరాల క్రితం ఇంట్లో పెద్ద గొడవైంది. అండర్ గ్రాడ్‌లో మేజర్ ఇంకా ఎన్నుకోనందుకు. కెరీర్ ఇంకా నిర్ణయించుకోలేదని అమ్మ నాన్నలకు కోపం. అప్పట్లో రోజూ యింట్లో ఓ గొడవే, గ్రేడ్స్ ఎమ్క్యాట్ స్కోర్లతో మాత్రమే మెడికల్ సీట్ రాదని, బలవంతంగా నన్నూ ఓ వాలంటీర్ ప్రోగ్రాంలో చేరమని పోరు. ఇక ఇంట్లో వుండలేక అమెరికన్ కేన్సర్ సొసైటీలో వాలంటీర్‌గా చేరాను. వాళ్ళు పేజ్ / ఫోన్ చేసినప్పుడల్లా కారు తీసుకొని పేషెంట్ వున్న అపార్ట్మెంటుకు వెళ్ళడం, అక్కడినుంచి వారిని తీసుకొని హాస్పిటల్‌కు వెళ్ళడం, వాళ్ళ కీమో, రేడియేషన్ ట్రీట్మెంట్ అయ్యాక వారిని తిరిగి పికప్ చేసుకొని వాళ్ళింటి దగ్గర దిగపెట్టడం ఇదీపని. మొదట బలవంతంగానే ఈ పని మొదలుపెట్టినా, నాకు ఈ పని మీద ఆసక్తి పెరిగింది. రాబర్డ్ రాండెల్ని కలిసిన మొదటిసారి ‘‘బాబ్’’ అని పిలవమని నవ్వుతూ చెప్పాడు. ఎందుకో ఎమ్ ఎస్ ‘‘హసితం మధురం’’ అని మధురాష్టకం పాడాలనిపిస్తుంది బాబ్ నవ్వు చూస్తే. అతనింటి నుంచి హాస్పిటల్ ఓ గంట ప్రయాణం. అలా బాబ్ను తీసుకొని పనిపడినప్పుడల్లా రెండు గంటలు ఆయనతోమాట్లాడగలిగే అవకాశం దొరికేది. నాకిద్దరు తాతలు ఇండియాలో వున్నారు. బాబ్‌కు కూడా ఆ వయస్సే వుండచ్చు. దాదాపు తొంభై ఏళ్లు వుంటాయనుకుంటా. మొదటిసారి చూసినప్పుడు బాగా నెరిసిపోయినా బాబ్ తలపైన జుట్టు వత్తుగానే ఏ మాత్రం బట్టతల ఛాయలు లేకుండా వుండేవి. కీమో మొదలెట్టాక అతను పూర్తిగా వెంట్రుకలు పోగొట్టుకోవడం, బాగ వీక్ కావడం నా కళ్ళ ఎదుటే చూడటం జరిగింది. నేను వాలంటీరుగ పనిచేసిన రెండేళ్ళు చాలామంది పేషంట్లను చూసినా బాబ్ లాంటి అతను తటస్థపడలేదు. ఎలాంటి వారినైనా సేదతీర్చేలాంటి అతని నవ్వు నేను మరెక్కడా చూడలేదు. అలాగే అతన్ని చూసి అతనితో మాట్లాడుతూ వుంటే మన సుఖ దు:ఖాలను పంచుకోవాలనిపించడం నాకు కొత్త అనుభవమే. డాక్టర్ అవ్వాలా లేదా అన్న మీమాంస, ఇంట్లో ఆ విషయం పైన గొడవ పడటం కూడా అంతా శాంతంగా విని మెడికల్ ప్రొఫెషన్ గొప్పతనం గురించి, తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పుకాదని, మెల్లగా నా మనస్సు మెడికల్ వైపు మళ్ళడానికి దోహదపడ్డాడు.
సెల్‌ఫోన్ తో బాటు పక్కనే వున్న ఐ పాడ్ కూడా తీసుకున్నాను. పైజామా నుంచి జీన్స్‌లోకి మారి క్రింద ఫ్లోర్‌కు వెళ్ళాను. డ్రాయింగ్ రూములో అమ్మ ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తున్నది. పక్కనే తన పేజర్ కూడా వుంది. నాన్న అప్పటికే ఏదో ‘కాల్’ వస్తే వెళ్ళి పోయినట్టున్నారు.
‘‘అమ్మా కేన్సర్ సొసైటీ వాళ్ళు పిలిచారు వెళ్తున్నాను’’
‘మెడికల్ కాలేజి చేరిన తర్వాత నీకసలు తీరికే లేదు కదరా’ అంది అమ్మ.
‘‘బాబ్ గురించి చెప్పాను కద. చూడాలని కబురంపాడు వెళ్ళి చూసివస్తాను’’
కారులో ఐపాడ్ కనెక్ట్ చేసి వెంటనే ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి పాడిన ‘మధురాష్టకం’ వెదికి ప్లే నొక్కాను. కారు రేడియోనుంచి ఎమ్ ఎస్ శ్రావ్యంగా పాడటం మొదలు పెట్టింది. చిన్న పిల్లలకు వ్రాసినట్లు మితమైన పదాలు ఎన్నుకుని ఇంత ఉదాత్తమైన భావాన్ని ‘‘మధురాష్టకం’’లో వల్లభాచార్యులు 15వ శతాబ్దంలోనే ఎలా వ్రాయగలిగాడు. గూగుల్‌లో వెదికా, అతడు ఓ ప్రవాసాంధ్రుడే, తెలుగు మాతృభాషగా వున్నవాడే, తెలుగులోని తియ్యదనాన్ని సంస్కృతంలో పొందుపరచినట్లు వుంది ఈ మధురాష్టకం. చలికాలం బయట ‘స్నో’ వల్ల భూమి అంతా తెల్లగా వుంది. ఆకులు రాల్చిన చెట్లు మంచును పులుముకొని కొత్త అందాలు సంతరించుకొన్నట్లు వున్నాయి. ఆకాశంలో ఒక్క మేఘం లేదు. మూడొంతులు నిండుగా వున్న చంద్రుడు వెచ్చగా వెన్నెల కాస్తున్నాడు అంత నిశ్శబ్దంగా వున్న లోకంలో నాకెదురుగా రోడ్డుకడ్డంగా జింకలు పరుగెత్తి అటువైపుచెట్ల గుంపుల పైకి పోయాయి. ‘‘చలితం మధురం’’ అని అప్పుడే వినడం ఆ క్షణ అందాన్ని ద్విగుణీకరించినట్లు అనిపించింది.
హాస్పిటల్ రావడంతో కారు ఆపి బాబ్ వున్న యూనిట్ వైపు నడిచాను. నర్సింగ్ స్టేషన్లో వున్న ఆవిడకు నన్ను పరిచయం చేసుకోగానే బాబ్ రూముకు తీసికెళ్ళింది. బాబ్ పడుకునే వున్నాడు. ‘కీమో’ ఆపేశాక మళ్ళీ జుట్టు పెరిగినట్లుంది తలంతా ముగ్గుబుట్టలాగ వుంది. ఆక్సిజన్ మాస్క్ ముఖమ్మీద పెట్టారు.
‘బాబ్!’ అని పిలిచాను. వులుకు పలుకు లేదు. నర్సు, బాబ్ చివరిదశలో వున్నాడని నన్ను చూడాలని చెప్పాడని చెప్పి సెలవు తీసుకొంది. మంచం పక్కన అటువైపు గోడకు పెద్దకిటికీ వుంది. ఆ కిటికి అద్దంలో నుంచి బయట వింటర్ సీనరి ఏదో క్యాలెండర్ పిక్చర్ లా అనిపిస్తున్నది. మనస్సులో మళ్ళీ ఎమ్ఎస్ పాడినట్లు అనిపించింది.
‘‘... సఖ్యం మధురం......’’ బాబ్‌తో కలవడం ఓ మధురమైన అనుభవమేకదా అనిపించింది. అంతా నెగటివ్మైండ్తో వున్న నన్ను దగ్గర తీసి నవ్వుతూ జోకులు చెప్తూ దగ్గరలేని తాతలాగా బుజ్జగించి, జీవిత పాఠాలను అరటిపండు ఒలిచి తినిపించినట్లుగా చెప్పాడనిపించింది. కాని నేను తనకు థాంక్స్ చెప్పినప్పుడల్లా తను నాకంటే ఋణపడి వున్నానని పెద్దగా నవ్వేవాడు.
మెడికల్ కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తరువాత ఆ విషయం మొదట నేను చెప్పడం బాబ్ కే. బాబ్ సంతోషం పట్టలేము. కంగ్రాట్స్ చెప్పి తన ఒంటరితనం గురించి మాట్లాడాడు. అతనికి పిల్లలు వున్నా వారి పనులలోపడి బాబ్‌తో కలవడానికి వాళ్ళకి తీరిక లేదు. బాబ్ కావాలంటే తనే డ్రైవ్ చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళగలడు. కాని తను తోడు కోసమే సొసైటీ సహాయం కోరాడు. దానితో నేను బాబ్‌ని కలవడం జరిగింది. మా ఇద్దరికి వయస్సునుంచి ఏ విధంగా చూసినా పొత్తు కుదరదు. కాని మా ఇద్దర్నీ బాధిస్తున్న ఒంటరితనాన్ని ఇద్దరం కల్సి జయించగలిగామని అనిపిస్తుంది.
బాబ్ రూముకు వచ్చి దాదాపు ఓ గంటైంది. బాబ్‌తో కల్సివున్నప్పుడు ఇద్దరం పుస్తకాలు చదవటం, చర్చించడం జరుగుతూ వుండేది. అక్కడవున్న ‘న్యూస్ వీక్’ మ్యాగజైన్ తీసుకుని ‘‘మైటర్న్’’ వ్యాసాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టాను. నా గొంతు విన్న కొద్ది నిముషాలలోనే బాబ్ కళ్ళు తెరిచి నావైపు చూసాడు. ఆక్సిజన్ మాస్క్, ఆ నవ్వును దాచినా ఆ కళ్ళు దాచలేక పోయాయి. బాబ్ చేతిని అప్రయత్నంగా పట్టుకున్నాను. ‘బాబ్’ నాచేతిని ఒక్కసారి ఒత్తి కళ్ళు మూసుకున్నాడు. ముఖం నవ్వుతున్నట్లే వుంది.
ఎందుకో మళ్ళీ మధురాష్టకం వినాలనిపించింది. వల్లభాచార్యులు ‘‘గాడ్ ఈజ్ లవ్’’ అన్నట్లుగా దేవుడి ప్రతి అణువు, చర్య ప్రేమ మయం మధురం అని వ్రాయడం ఎంతటి గొప్ప ఆలోచనో అని అనుకున్నాను. కాని ఆక్షణంలో బాబ్లో వల్లభాచార్యుడు కనిపించాడు. జీవితాన్ని ప్రేమించడం అంత సులభం కాదు. ఇంటికి వెళ్లడానికి కారు స్టార్ట్ చేసాను. రిపీట్ లో పెట్టాను కాబట్టి ఎమ్ ఎస్ మధురాష్టకం పాడుతూనే వుంది.
‘కరణం మధురం తరణం మధురం’
హరణం మధురం…
జీవితాన్ని పూర్తిగా అనుభవించి, తృప్తిగా మరో లోకానికి కొత్త అనుభూతుల కోసం బాబ్ వినూత్న ఉత్సాహంతో వెళ్ళిపోయాడనిపించింది. నేను పాడుతున్నది తప్పు అని తెలుసు. అప్రయత్నంగా నేను ఎమ్ఎస్ తో గొంతు కలిపి పాడసాగాను.
...మరణం మధురం
మధురాధిపతే అఖిలం మధురం...
****
ప్రగతి రజతోత్సవ ప్రత్యేక సంచిక, న్యూజెర్సీ(2009)