Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
తమలపాకు
సీ. లలితాంబికావక్త్రలాలితంబై మూక
            కవ్యాశుకవితకుఁ గారణ మయి
     పుణ్యజలంబులఁ బ్రోక్షింపఁ దోడ్పడి
            నిశ్చయమును దెల్పు నియతిఁ జాటి
     పావని కతిప్రీతిపాత్రమౌ పత్రమై
            పూజలన్నిట ముఖ్యభూమిక మెయిఁ
     బారితోషికములఁ జేరవేసెడు ప్రౌఢ
            వెదసంజ్ఞఁ బోలు నాకృతి ధరించి
తే.గీ. పరిమళంబుల రుచులను బలువిధముల
       సొంత మొనరించుకొంచును స్వాంతములకు
       మంచి యుత్తేజ మిడు నిన్ను మఱవఁ దరమె
       నాగవల్లీదళంబ! యే నాఁటి కైన? 291

కవిత్వము
సీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద
            సురనదీదిందీరశుభ్రగాత్ర
     సుకుమారసుకుమారశుకవారపికసార
            సుస్వరాక్షరశబ్దశోభ నీయ
     ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ
            పదబంధబంధురబంధువు లయి
     మనసార విని సారమును సారసమరంద
            మిందిందిరము వోలె నందుకొనఁగఁ
తే.గీ. బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ నెందు
       సందియములేక కను భాగ్య మొంది మనుజ
       భవము తరియించు కవితానుభవముఁ బంచి
       మంచి కలిగించ నెంచి ప్రార్థించువాఁడ
       [శర=ఱెల్లు, దిందీర=నురుగు, బంధుర=ప్రియము]
భావము-
       శరత్కాలపు చంద్రుడు, మంచుబిందువుల హారము, మొల్లలు, ఱెల్లు గడ్డి,
       ఆకాశగంగ, నురుగు – వీని వలె తెల్లని శరీరముకల దేవి (సరస్వతి) మంచి
       కుమారుని యొక్క (నా యొక్క) కోమలము, ఎన్నో చిలుకల, శ్రేష్ఠమగు కోయిలల,
       వంటి చక్కని స్వరముకలిగిన శాశ్వతమగు/వర్ణములతోకూడిన శబ్దముల శోభ
       నాకు ప్రసాదించగా, కర్పూరము వలె నిర్మలమై గొప్ప రసము మఱియు లయ
       కలిగిన పదముల అల్లికలకు ప్రియమైన చుట్టాలై, మనసు నిండేలా కవిత్వమును
       ఆలకించి, కమలములలోని మకరందమును ఆస్వాదించే తుమ్మెదలవలె కవితా
       సారమును చదువరులు అందుకొనగా, ఎందులో అయినా విస్సందేహముగా పరమాత్మను
       ఎప్పుడూ దర్శించగల భాగ్యమును పొంది, నరజన్మ సార్థకమయ్యే కవితానుభవమును
       అందరికీ పంచిపెట్టి మంచిని కలిగించే ఆలోచనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. 292

సరస్వతీప్రార్థన
శా. అఃకల్పానన(1) చక్రపక్ష(2)గమ విద్యాదాత్రి వాగ్దేవి తే
     జఃకర్పూరశరత్పటీరసితకంజాతాభ్రకాభాంగి ఛం
     దఃకాసారవిహార ధాతృగృహిణిన్ నాదప్రియన్ భారతిన్
     ఖఃకాకుస్స్థ(3) మదంబఁ గొల్తు సుమనఃకల్హారపాదార్చనన్
            (1) అః=చంద్రబింబము కల్ప=సమ
            (2) హంస (3) ఖః=సత్యముగా+కాకుః=నాలుకపై+స్థ=ఉండునది 293
Posted in July 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *