Menu Close
Balluri Umadevi
పురాణ శ్రేష్టం శ్రీమద్భాగవతం (పద్యకవిత)
డా. బల్లూరి ఉమాదేవి
ఆ.వె: కరుణ చూప రమ్ము కరిముఖ గణపతీ
        వ్రాయ బూని తేను భాగవతము 
        వ్రాయు శక్తి నొసగి వ్రాయించు వేగమే
        వేడుచుంటి నయ్య విఘ్నరాజ.
ఆ.వె: విష్ణు కథలు తెలుపు విస్తృత గ్రంథమే 
        భాగవత మనంగ వాసి గాంచె
        విడక దీని చదువ విష్ణు సాయుజ్యమున్ 
        పొందు వచ్చునండ్రు బుధులు భువిని.
ఆ.వె: భాగవతము భాగవతమని పలుమార్లు 
        పలుకు చున్న చాలు వసుధయందు
        బాగవుదుమటంచు వాసిగా బుధజను
        లనెడి మాట లెప్పు డాలకించు.
ఆ.వె: ఏడు దినము లందె యేలిక ముక్తిని
        పొందెననెడి కథను పుడమి యందు
        వినుచు నుందు మెపుడు వీనుల విందుగా
        నదియె భాగవత మటండ్రు బుధులు.
ఆ.వె: భాగవతము వినుచు పరమపదంబైన
        మోక్ష మార్గ మందె ముదముతోడ
        పాండు భూవరుని ప్రపౌత్రుండు తానిల
        మార్గదర్శి యయ్యె మానవులకు.
ఆ.వె: భాగవతము తెలిసి పలుకుట కష్టమౌ
        బ్రహ్మ కైనను మరి భవుని కైన
        తెలియు వచ్చినంత తేటపరతు నంచు
        పోతన యొరిగించె పుడమి యందు.
ఆ.వె: వెన్నుని కథలనిటు విపులముగా దెల్పు
        నట్టి గ్రంథరాజ మరసిచూడ
        భాగవత మనియెడు భక్తి పురాణము
        దప్ప యొండు గలదె ధరణి యందు.
ఆ.వె: వ్రాసిరి కవివరులు భాగవతమ్మును
        తెనుగు భాషలోన తీరు గాను 
        శ్రీశు కరుణతోడ శ్రీహరి చరితము
        వ్రాయ నెంచి తేను భక్తి తోడ.
ఆ.వె: చదువు సంధ్య లొసగు శారద మాతయే
        నాకు దిక్కటంచు నమ్మి మదిని 
        భాగవతము లోని ప్రముఖ ఘట్టములను
        వ్రాయదలచినాను వాసి గాను.
ఆ.వె: స్కందములవి యిందు గలవు పదియురెండు
        ముఖ్యమైన ఘట్ట ములను కూర్చి
        దేవకీ సుతునకు తీరుగా నర్పణ
        చేయ దలచి నాను చిత్త మందు.

రచయిత పరిచయం

Balluri Umadevi

నా పేరు డా. బల్లూరి ఉమాదేవి. కర్నూల్ జిల్లా లోని ఆదిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా (తెలుగు) పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాను. వివాహానంతరం బి ఏ, యం ఏ పూర్తి చేశాను. 2005 లో (నా 52 వ ఏట) తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీల పాటలు పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాను. మా తాతగారు, తండ్రిగారు, పెదనాన్నలు తెలుగు పండితులే కావడం వల్ల తెలుగు భాష పట్ల చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువగా వుండేది. అప్పుడప్పుడు పద్యాలు కవితలు రాసే నేను, పదవి విరమణ తర్వాత శంకరాభరణం గ్రూప్ వారి 'సమస్యా పూరణల'తో మరలా రచనకు శ్రీకారం చుట్టాను.

నా ముద్రిత గ్రంథములు (13)

1.శ్రీరామదూత శతకము 2.అక్షర వనం 3. మనో గీతికలు 4.తెలుగు బిడ్డ శతకము 5.శ్రీనివాస శతకం 6.దేవి శతకము 7.శ్రీ రామచంద్ర శతకం 8.శివపురాణ మహత్యము 9.శారదాంబ శతకం 10.హనుమత్ శతకము 11.హనుమోదాహరణము 12.కనకదుర్గ శతకము 13.శ్రీమద్భాగవతము- ఆణిముత్యాలు.

అముద్రిత గ్రంథములు: 1. హిమపవనాలు 2. ఖండకావ్య సమాహారం 3. 'ఆసరా' ఐదు ఆశ్వాసంలో సామాజిక పద్య ప్రబంధము 4. 'జీవన స్రవంతి' ఐదు అంకముల (పద్య నాటకం) 5. విష్ణు దేవ శతకము.

వాల్మీకి రామాయణంలోని అన్ని కాండలలోని కొన్నిసర్గలకు తేటగీతి ఛందస్సు 500 వరకు పద్యాలు రచించాను. వివిధ అంశములపై (సమస్యా పూరణాలు, దత్తపదులు) 5000 పద్యాలు రచించాను.

2000 వరకు కవితలను, 300 పాటలను రచించాను. కొత్త ఛందస్సులలో 100 పద్యములు రచించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు పొందాను. జాతీయ సదస్సులలోను ప్రముఖ పత్రికలలో నా వ్యాసములు ప్రచురితమైనవి. కర్నూలు రేడియో కేంద్రంలో వివిధ అంశములపై ప్రసంగములు చేశాను.

పొందిన బిరుదులు:

సహస్ర కవిరత్న, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి చక్రవర్తిని, సహస్రపద్యశ్రీ, (10500 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారిని చేతుల మీదుగా సహస్రపద్యశ్రీ బిరుదము అందుకున్నాను) కవితా భూషణ, కవిత విభూషణ, మహతి సాహితీ చక్రవర్తి ,కవివరా మొదలగు బిరుదులతో పాటు నారీ శక్తి పురస్కారం, కీర్తిరత్న పురస్కారం అందుకున్నాను.

అనేక అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పలుమార్లు నిషిద్ధాక్షరికి పృచ్ఛకునిగా పాల్గొన్నాను.

Posted in July 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *