సాంఘికమాధ్యమాలు
ఈ సంవత్సరం మార్చ్ నెల 21, 22 తారీఖులలో మనందరం ప్రపంచ కథాకధన దినోత్సవం, అంటే world story-telling day జరుపుకున్నాం. ఆ ఉత్సవంలో చదవటానికి ‘చీకటిలో వెలుగు' అనే శీర్షిక ఆధారంగా నేను కొన్ని కథలు రాసాను. అందులో ఒకటి సాంఘికమాధ్యమాల ఆధారంగా రాసిన 'మీడియా జ్యోతి' అనే కథ. సమయ నియమాన్ని పాటించడం కోసం సాంఘికమాధ్యమాల గురించి చాలా విషయాలు ఆ కధలో అప్పుడు నేను చెప్పలేకపోయాను కానీ అవన్నీ చర్చించడానికి తప్పకుండా ఒక వ్యాసం రాయాలి అని మాత్రం అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నాను.
సాంఘికమాధ్యమాల గురించి చర్చించుకునే ముందు అసలు అవేమిటో తెలుసుకోవటం చాలా అవసరం. అంతర్జాలంలో, అంటే internet లో తమ వ్యక్తిగత అభిప్రాయాలను, కాంతిచిత్రాలను, అంటే photo లను, దృశ్యచిత్రాలను, అంటే video లను, సందేశాలలాంటి అనేక ఇతర విషయాలను అంతర్జాల సమూహాలతో పంచుకోవటానికి వాడే electronic మాధ్యమాన్ని సాంఘికమాధ్యమం, అంటే social media అంటారు. దీన్ని digital media అని కూడా మనం అనచ్చు. ఎందుకంటే ఇదంతా సాంకేతికతతో కూడిన ఆధునిక సమాచార సాధనం. అంటే ఈ సాంఘికమాధ్యమాలని అంతర్జాలంలో వాడవచ్చునన్నమాట. అయితే నేను ఈ నిర్వచనం ఇప్పటి రోజులని బట్టి చెప్పాను. అంటే ఈ రోజుల్లో అంతా అంతర్జాలమయమే కాబట్టి సాంఘికమాధ్యమాలు అంతర్జాలంలో వుంటాయి అని చెప్పాను. కానీ ఈ అంతర్జాలం పుట్టకమునుపు కూడా ఇవి వేరే రూపంలో ఇదివరకు రోజుల్లో మనకు వుండేవి. వార్తాపత్రికలు, రేడియోలు, టివిలు, ఇవన్నీ మనకు వున్న ఒకప్పటి సాంఘికమాద్యమాలు. అయితే అప్పుడు, ఇప్పుడు కూడా వీటి వుద్దేశం ఒకటే, సమాచారాన్ని అందరితో, పంచుకోవటం, పెంచుకోవటం. కాకపోతే ఈ రోజుల్లోని సాంఘికమాద్యమాలకి వేగం చాలా ఎక్కువ. అలాగే వాటి వలన వచ్చే లాభాలతో పాటు, నష్టాలు కూడా చాలా ఎక్కువే! సరే, ఇంక సాంఘిక అన్నాము కాబట్టి ఇదేదో నలుగురికీ సంబంధించినది అని ఎవ్వరూ చెప్పకుండానే తెలిసిపోతోంది. అవునా?
ఈ రోజుల్లో మనకి రకరకాలైన సాంఘికమాద్యమాలు వున్నాయి. వాటిని వేరువేరు ప్రయోజనాల కోసం మనం వాడతాం. ఉదాహరణకి సామాజిక సమాచార వ్యవస్థ, అంటే social networking కొరకు (Facebook లాంటివి), కాంతిచిత్రాలు (ఫోటోలు), దృశ్యచిత్రాలు (వీడియోలు) అందరితో పంచుకోవటం కొరకు (Instagram TikTok లాంటివన్నమాట), చర్చావేదికలు (Reddit లాంటివి), సందేశాలు పంపడం కోసం (WhatsApp), వృత్తిపరమైన సమాచారవ్యవస్థలు, అంటే Professional networking (LinkedIn లాంటివి) ఇలా రకరకాలైన మాధ్యమాలు ఈనాడు మనకు వున్నాయి. ‘LinkedIn మనకు పరిచయమున్నవారి కోసం, Facebook మనకు ఇదివరకు పరిచయమున్నవారి కోసం, Twitter మనం పరిచయం చేసుకోవాలని కోరుకున్నవారి కోసం’ అని Jay Baer అనే Oregon లోని ఒక లాయరు, వక్త అన్న మాటలు ఇప్పుడు నాకు గుర్తు వస్తున్నాయి. అయితే B.S. Stoltz అనే ఒక New Media consultant 'Twitter ఒక మద్యపానీయంలాంటిది, అంటే ఒక bar లాంటిది. Facebook మన living room లాంటిది, LinkedIn మన స్థానిక వాణిజ్య సంస్థలాంటిది’ అని అన్నారు. అయితే వీటిల్లో ఏది ఎక్కువ జనాదరణ పొందింది అని ఆలోచిస్తే సమాధానం అంత తేలికగా దొరకదు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఎక్కువగా, ఇంచుమించు కొంచెం అటూ ఇటూగా అన్నీ సమానంగా ప్రజాదరణ పొందినవే! అయితే వారి వారి అవసరాలు, ఇష్టాలని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాథ్యమం ప్రత్యేకమైనదిగా, ఎక్కువ ఇష్టంగా అనిపించటం మాత్రం సహజం. మొత్తంమీద ఇవి లేనిదే బతకలేని పరిస్థితి వచ్చింది అని ఎవరైనా అంటే మాత్రం అది ఏమాత్రమూ అతిశయోక్తి కాదనుకుంటాను.
సాంఘికమాధ్యమాలలో వార్తలు అతివేగంగా వ్యాపిస్తాయి. చెడువార్తలైతే ఇంకొంచెం ఎక్కువ వేగంగా వ్యాపిస్తాయి. అందుకే ‘సమాచారం నిప్పులాంటిది, కానీ సాంఘికమాధ్యమాలు పెట్రోలులాంటివి’ అని Jay Baer అనే Oregon లోని ఒక లాయరు, వక్త అన్నారు. అందుకని మనం ఏదన్నా సాంఘికమాధ్యమంలో చదివినా లేక పెట్టినా చాలా జాగ్రత్తగా వుండాలి. కొంతమంది అందరి దృష్టిని తమ వైపు లాక్కోవటానికి వుత్తగా ఏవో కొత్త కొత్త పుకార్లు సాంఘికమాధ్యమాలలో మొదలుపెడుతూ వుంటారు. ఇంకేముంది? అవి దావానలంలా చకచకా అంతటా వ్యాపించేస్తాయి. అందుకే ఈ smoking gun ల లాంటి సాంఘికమాధ్యమాల వలన మన గోప్యత, అంటే privacy అంతా చచ్చిపోతోందని, అయితే అందరి దగ్గర నుండి దొరికే ఇలాంటి శ్రద్ధ మాత్రం పెద్ద ధనంతో సమానమని Pete Cashmore అనే ఒక సాంస్కృతిక సంస్థ మాజీ CEO అన్నారు.
అలాగే ఇంకొంతమంది కేవలం ఇతరులను ఆకర్షించడం కోసం, అంటే attract చేయటం కోసం, ఏవేవో విషయాలు, అతిశయోక్తులు, అసత్యాలైనా సరే, వెనక ముందు చూడకుండా సాంఘికమాధ్యమాలలో పెట్టేస్తారు. అందుకే ‘సాంఘికమాధ్యమాల ద్వారా మనుషులు వాళ్ళ గురించి వాళ్ళే అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు’ అని L. G. Davis అనే ఒక అపరాధ పరిశోధనా రచయిత అన్నారు. అసలు ఇతరులని ఆకర్షించాలి అన్న ఈ తాపత్రయం మానేయాలి. ‘సాంఘికమాధ్యమాలను ఎదుటివారిని ఆకర్షించటం కోసం కాదు, వారిని మంచి వైపు ప్రభావితం చెయ్యటం కోసం వాడండి’ అని Dave Willis అనే అమెరికాకు చెందిన ఒక గళకళాకారుడు అన్నారు. ఎంత బాగా చెప్పారు కదా! అర్థం, పరమార్ధం రెండూ దాగివున్నాయి ఆ మాటల్లో. అవునా?
సరే, ప్రతిచోటా వున్నట్లుగానే ఈ సాంఘికమాద్యమాలలో కూడా మంచి చెడు రెండూ వుంటాయి. అయితే ఏదన్నా మాధ్యమం చెడులోంచి మంచికి మారాలంటే మాత్రం నాలుగు సూత్రాలను తప్పకుండా పాటించాలి. ఒకటి, ఏమాధ్యమం అయినా సరే, దానిలోంచి మనకు నేర్చుకోవటానికి ఏదన్నా మంచి విషయం దొరకాలి. ఆతర్వాత ఆ మాధ్యమం ఎంత ఆసక్తికరంగా వుండాలంటే మనకి అసలు దాన్ని వదిలి కదలాలనిపించకూడదు. అలాగే మనకి దాంట్లోంచి మంచి విషయాలు నేర్చుకోవటానికి, మంచి పనులు చేయటానికి మంచి ప్రేరణ లభించాలి. చివరగా మంచి మాధ్యమం ఎప్పుడూ మనకి మంచి స్థాయిలో వున్న వినోదాన్ని అందివ్వాలి. వీటిలో ఏది తక్కువైనా ఆ సాంఘికమాధ్యమం స్థాయి అంత వున్నతంగా వుండదు. అలాగే ఎవరిమీదైనా సరే, వాటి ప్రభావం ఎక్కువగా వుండాలంటే ముందుగా వాటిల్లో నిలకడ, స్థిరత్వం, అంటే consistency వుండాలి. అలాగే సంక్షిప్తత, అంటే conciseness మరియు అనుసంధానత, అంటే connectivity కూడా వుండాలి. అప్పుడే సాంఘికమాధ్యమాల ప్రభావం, ఎవరిమీదైనా సరే, శక్తివంతంగా వుంటుంది.
ఇదే విషయాన్ని కొంతమంది ఇంకో పద్ధతిలో కూడా చెపుతారు. వాళ్ళు దీన్ని 80/20 సూత్రం అంటారు. అంటే చిన్న చిన్న విషయాల ప్రభావం కూడా పెద్దగా వుండవచ్చు. అంటే 20% ప్రయత్నం కూడా ఒకొక్కసారి 80% ఫలితాలను ఇవ్వచ్చు. అందుకే అంతర్జాలంలో సాంఘికమాధ్యమాలలో వ్యాపార నిర్వహణ చేస్తున్నప్పుడు 80% సమాచారం ఆ వస్తువు విషయాలని, విలువలని జనాలకి అందజేయాలి. కేవలం 20% మాత్రమే promotion కొరకు వాడాలి. అప్పుడు ఆ చిన్న శాతమే పెద్ద ఫలితాలను ఇస్తుంది. ఇలా కొంతమంది నమ్ముతారు.
సరే, ఇందాక చెప్పుకున్న ఆ మంచి చెడు గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పుకోవాలంటే, ముందుగా మంచి, అంటే సాంఘికమాధ్యమాల వచ్చే లాభాల గురించి చెప్పుకుందాం. మొదటగా నాకు చెప్పాలని అనిపిస్తోంది ఏమిటంటే, వీటి వలన ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా మొత్తం ప్రపంచం అంతా చుట్టి రావచ్చు. అక్కడి విశేషాలన్నీ తెలుసుకోవచ్చు. పరాయి దేశాల్లో వున్నవారితో కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా అనుసంధానం, అంటే connectivity సాధించవచ్చు. దూరాన వున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధబాంధవ్యాలను చక్కగా కొనసాగించుకోవచ్చు. ముఖ్యంగా COVID సమయంలో మనందరం ఈ లాభాన్ని పూర్తిగా అనుభవించాం, ఆనందించాం. అవునా? సాంఘిక నిర్మాణం, వ్యాపారాభివృద్ధి, వృత్తిపరంగా కూడా అభివృద్ధి, సమాజమార్పు, స్వీయ వ్యక్తీకరణ, అంటే self-expression ఇవన్నీ కూడా సాంఘికమాధ్యమాల ద్వారా చాలా సులభం. ఈరోజుల్లో అంతర్జాలంలో దొరకని విషయం అంటూ లేదు. అలా మనం కొత్త కొత్త విద్యలన్నీ నేర్చుకోవచ్చు. మన నేర్పరితనాన్ని పెంచుకోవచ్చును. బయటకి ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని YouTube లో ఎన్నో విద్యలు నేర్చుకున్నవారు వున్నారు. అంతేకాకుండా సాంఘికమాధ్యమంలో వున్న వ్యక్తి తనని ఒక జట్టు సభ్యుడిగా పరిగణించటం వలన ఏ కష్టం వచ్చినా తనకి తన జట్టులోనివారందరూ తోడు వున్నారు అన్నట్లుగా భావించటం, దానివలన ఒంటరితనం, అది తీసుకొచ్చే భయాలు, అదనపు బాధలు, depression వీటన్నిటి నుండి విముక్తి పొంది ఎంతో వూరటను అనుభవించటం చాలా తరచుగా, తేలికగా సాధ్యమయ్యే విషయం. COVID సమయంలో స్థాపించుకున్న మా అంతర్జాల జట్టు వలన మా జట్టు సభ్యులందరం ఇలాంటి లాభాలనే పొందాము. ఇంక వ్యాపారాభివృద్ధికి కూడా ఈ మాధ్యమాలు ఎంతగా వుపయోగపడతాయో నేను విడిగా చెప్పక్కరలేదు. అలాగే వ్యాపారాల ప్రచారం కోసం కూడా వీటిల్ని బాగా వాడుకోవచ్చు. నిముషంలో మన వ్యాపారం సంగతి దూరదూరాల్లో వున్న అందరికి అతివేగంగా వ్యాపిస్తుంది. అంతర్జాలం తెరిస్తే ఈ వ్యాపార ప్రకటనలు ప్రతి నిముషం మనం అనేకం చూస్తూనేవుంటాము. ఇలాగే వాటి brand విలువ కూడా పెరుగుతుంది. పర్యాటక సంస్థవారు తమ రాష్ట్రాన్ని, లేక తమ దేశాన్ని గురించి తమ దగ్గర వున్న ప్రత్యేకమైన ఆకర్షణలను ఈ మాధ్యమాల ద్వారా చాలా బాగా ప్రచారం చేస్తారు. దీని వలన వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం వుంది. అంతేకాదు, సామాజికంగా ఏదన్నా మార్పు తీసుకురావాలంటే కూడా ఈ సాంఘికమాధ్యమాలు మంచి సాధనాలు. ముఖపుస్తకం, అంటే Facebook లో పరిచయమైన అపరిచితులు బాగా దగ్గరవటం, అలాగే దూరమైన స్నేహితులు మళ్ళీ దగ్గరవడం మనం అప్పుడప్పుడు చూస్తూనేవుంటాము. అంతేకాదు, Facebook లాంటి మాధ్యమాలలో మన పాతజ్ఞాపకాలని మళ్ళీ పునరావృతం చేసుకోవచ్చు. నేను కూడా అప్పుడు-ఇప్పుడు అంటూ నా స్నేహితులతో అప్పటి, ఇప్పటి ఫోటోలు అక్కడ అందరితోనూ పంచుకున్నాను. అవి చూసినప్పుడల్లా మనసంతా ఎంత ఆనందంతో నిండిపోతుందో నేను వర్ణించి చెప్పలేను. కనుక పాతజ్ఞాపకాల పునదోద్ధరణ, కొత్త అనుభవాల జననోద్భవం, ఈ రెండు సాంఘికామాధ్యమాల ద్వారా సాధ్యం అని చెప్పచ్చు. ఇంక వ్యక్తిగతమైన విషయానికొస్తే అంతర్జాలం తెరిస్తే చాలు, అనేక వినోద సాధనాలు కనబడతాయి. మనం బయటికి వెళ్ళనవసరం లేకుండానే, ఇంట్లో కూర్చునే, కొంచెం కూడా ఖర్చు లేకుండా టీవీలలో, అంతర్జాలంలో అనేక కార్యక్రమాలు చూడచ్చు. అనేక చలనచిత్రాలు కూడా చూడచ్చు. ఇదంతా కేవలం సాంఘికమాధ్యమాల వలనే సాధ్యం.
ఈ సాంఘికమాధ్యమాలు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా ప్రభుత్వ స్థాయిలో కూడా చాలా వుపయోగపడతాయి. నాగరికులకు ఏదన్నా హెచ్చరిక చెయ్యాలన్నా, ఏ కారణం చేతనన్నా ఏ విషయంలోనైనా వాళ్ళని అప్రమత్తం చెయ్యాలన్నా ఈ సాంఘికమాధ్యమాలు చాలా బాగా వుపయోగపడతాయి. అందుకే శాంతిభద్రతల పరిరక్షణ చేసే పోలీసుశాఖవారు ఈ మాధ్యమాలని ఎక్కువగా వాడతారు. ఇటీవల కాలంలో ఎవరైనా అమెరికా visiting visa మీద రావాలనుకుంటే అంతర్జాలంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిశీలించి, రాజకీయపరంగా అవి ఏమీ అభ్యంతకరంగా లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారికి వీసాలు ఇస్తున్నారని ఈమధ్యనే నాకు తెలిసింది. అంటే ఈ అంతర్జాల అభిప్రాయ ప్రకటనలలో మనం చాలా జాగ్రత్తగా వుండాలన్నమాట. అంతేకదూ!
మరి సాంఘికమాధ్యమాల వలన ఇన్ని లాభాలు వుంటే వీటిల్ని అందరూ ఎందుకు అంత విసుక్కుంటారు? వాటి పేరు చెపితేనే చాలు, ఎందుకు అంత చికాకుపడతారు? మంచి ప్రశ్న కదూ? దీనికి చాలా సమాధానాలు వున్నాయి. పళ్ళు కోసుకునే చాకుతో గొంతులు కూడా కోసుకోవచ్చు అన్నట్లుగా ఈ సాంఘికమాధ్యమాలని మంచి తో పాటుగా చెడుకి కూడా పుష్కలంగా వాడచ్చు. అసలు అతిగా వుంటే మంచి కూడా చెడుగా మారుతుంది కదా! సాంఘికమాధ్యమాలలో దొరికిన స్నేహితులు ఎంత వేగంగా దగ్గరవుతారో, అంతకంటే వేగంగా దూరం అయ్యే ప్రమాదం కూడా వుంది, ఎందుకంటే అసలు వారెలాంటివారో మనకు పూర్తిగా తెలీదు కదా! అందుకే 'ఈ సాంఘికమాధ్యమాల యుగంలో స్నేహితులు మంచుతునకలలాంటివారు, వేలల్లో దిగుతారు పైనుండి, కానీ సెకన్లలో మాయమవుతారు' అని Mouloud Benzadi అనే ఒక Anglo-Algerian రచయిత అన్నారు. అలాగే అస్తమాను అంతర్జాలం ముందు కూర్చుని ఇంక వేరే పని పాట ఏదీ లేకుండా సమయం గడుపుతూవుంటే మరి అది మంచి అలవాటు ఎలా అవుతుంది? ప్రాణమున్న మనుషులతో పరస్పర సంభాషణలు, చర్చలు, చర్యలు లేకుండా నోరు మూసుకుని, కళ్ళు విప్పార్చుకుని, అస్తమానూ ఆ కంప్యూటర్ ముందో, లేక చరవాణి ముందో కూర్చుని పిల్లలు సమయం గడుపుతూవుంటే అది వారికి ఎంత చెడుపు చేస్తుందో మనం తేలికగానే వూహించగలము. చక్కగా ఆరుబయట తోటిపిల్లలతో ఆడుకొనే వాళ్ళ ఆటల సమయం తగ్గిపోవటం ఇంకో పెద్ద నష్టం. అస్తమానూ ఆ సాంఘికమాధ్యమాల వలయాలలో చిక్కుబడి పెనుగులాడేకంటే చక్కగా బయటికి వెళ్ళి పదిమంది పిల్లలతో ఆడుకుంటే ఎంత బాగుంటుంది! ఇంకో విషయం. అసలు అంతంతసేపు పిల్లలు అంతర్జాలం ముందు వుంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏదీ తెలీదు మనకు. అందుకే ఆ అలవాటు చాలా అపాయకరమైనది. పైగా వాళ్ళ వయసుకు తగ్గవి చూస్తున్నారు అన్న గేరంటీ కూడా ఏదీ లేదు. అందుకే వాళ్ళని ఒకకంటితో కాదు, వేయి కళ్ళతో చూసుకుంటూ వుండాలి. ఎందుకంటే అంతర్జాలంలో అన్నీ దొరుకుతాయి. ఎవరు ఏది వుపయోగిస్తున్నారో జాడ తెలుసుకుంటూవుండాలి. ఇది తల్లితండ్రులకి చాలా పెద్ద బాధ్యత. అంతేకాదు, ఇది అలవాటుగా మారితే అది కూడా ప్రమాదమే! సాంఘికమాధ్యమాలు మనుషులను బాగా ఆకర్షించి, బాగా మాలిమి చేసి తమ వలయాలలోకి లాగేస్తాయి. వాటిల్లో మునిగిపోకుండా వుండాలంటే వాటికి బానిసలు కాకుండా, వాటిని మన నియంత్రణలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ అలవాట్లే ముందు వేలంవెర్రిగా మారి ఆతర్వాత ప్రాణాంతకమౌతాయి. నిద్రలు తగ్గిపోతాయి. కొంతమంది, అంతర్జాలంలో చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు, వారి చెడు బెదిరింపులకు కూడా లోనవుతారు. అవి లేనిపోని ఆందోళనలను కలుగజేస్తాయి. అదుపు దాటితే అవి అనేక మానసిక రుగ్మతలను కూడా ఇస్తాయి. ఏదన్నా వివాదాత్మకమైన విషయాల గురించి ఇష్టమొచ్చినట్లు అభ్యంతకరమైన అభిప్రాయాలు వెల్లడించడం, వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ రహస్యాలని సాంఘికమాధ్యమాలలో వెల్లడి చేయటం, ఇవన్నీ మన వృత్తిపరమైన మరియు వ్యక్తిగతమైన జీవితాభివృద్ధికి అడ్డుగోడలే కాకుండా అపాయాలని కూడా తీసుకొస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే అంతర్జాలంలో కనిపించినదంతా నిజం కాదు. అప్పుడప్పుడు చాలా అసత్యమైన సమాచారాలు కూడా వుంటాయి అక్కడ. ఈ సత్యాసత్యాల గజిబిజిలో చిక్కుకుపోతాం మనం. అందుకే అక్కడ చదివినదంతా నిజమని అనుకోకూడదు. ముఖ్యంగా వైద్య సంబంధమైన విషయాల గురించి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. ఈ సమాచారాన్ని నమ్ముకుని వైద్యుడిని సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఒకొక్కసారి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీని అయోమయ పరిస్థితి కూడా వస్తుంది. చాలా వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దురలవాట్లని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు ఈ సాంఘికమాధ్యమాలంటే చాలు, ఒకటే చికాకు పడతారు. కానీ వారు కూడా LinkedIn అనే వృత్తిపరమైన సమాచారవ్యవస్థ చాలా తక్కువ హానికరమైనదని ఒప్పుకుంటారు.
అంతమాత్రం చేత వాటి వలన వచ్చే లాభాలను మనం మర్చిపోకూడదు. కానీ వీటి మీద, వీటి వుపయోగం మీద, ఆ వుపయోగ సమయం మీద నియంత్రణ మాత్రం ఖచ్చితంగా చాలా అవసరం. ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఎక్కువగా సాంఘికమాధ్యమాలను వాడేది కెన్యా దేశంట. అక్కడ ప్రజలు సగటున రోజుకి నాలుగు గంటల పదమూడు నిముషాల సమయం ఈ సాంఘికమాధ్యమాల మీద గడుపుతారట. ఇంక అన్నిటికంటే అతి తక్కువ సమయం గడిపేది జపాన్ అట. అక్కడ జనాలు సగటున రోజుకి కేవలం 46 నిముషాల సమయం మాత్రమే సాంఘికమాధ్యమాల మీద గడుపుతారట. ఇంక సాంఘికమాధ్యమాల లెక్క సంగతికి వస్తే జనాలు సగటున రోజుకి 2 గంటల 24 నిముషాల చొప్పున ఒక నెలలో సగటున 6.6 వేరేవేరే సాంఘికమాధ్యమాలని వాడతారుట. వీటి గణితం చేస్తే అందరితో కూడుకుని ఈ ప్రపంచం మొత్తంలోవున్న సాంఘికమాధ్యమాలన్నింటి మీద ప్రతిరోజూ 11.5 బిలియను గంటల సమయం గడుపుతుందిట. ఉదాహరణగా ఈ మాధ్యమాలన్నింటిలోను చాలా జనాదరణ పొందిన TikTok సంగతే తీసుకుంటే రోజుకి 186 నిముషాలు 18, 24 ఏళ్ళ మధ్య వయసువారు, 140 నిముషాలు 25, 34 ఏళ్ళ మధ్య వయసువారు, 102 నిముషాలు 65 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్నవారు సమయం గడుపుతారట. చూసారా, ఊఁ, సరే, ఈ సమయం అంతా దండగ అని నేను అనను కానీ ఎంతమంది, ఎంతవరకు నిజమైన అవసరానికి, ఎంత ఫలవంతంగా వీటిమీద సమయం గడుపుతున్నారు అన్నది మాత్రం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం సుమా!
సాంఘికమాధ్యమాలు వాడుతున్నప్పుడు మనందరం చాలా గాఢంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఇంకొకటి వుంది. అది ఏమిటంటే, ఎట్టి పరిస్థితిలోనూ మనం మన స్వగుర్తులను బట్టబయలు చేయరాదు. అంటే ఏ విషయాలు మనం ఎవరమో, ఎక్కడ వుంటామో. మన కుటుంబవివారాలు ఏమిటో ఇవన్నీ బట్టబయలు చేస్తాయో ఆ విషయాలు మనం గుట్టుగా వుంచాలి. ఏ సాంఘికమాధ్యమంలో అవి బయటకొచ్చినా సమాచార చోరులు, అంటే data hackers, మోసకారులు వాటిని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటారు. మన గుర్తింపును దొంగిలించి, మన అస్థిత్వాన్ని రూపుమాపి, మన ధనాన్ని దొంగిలింటానికి లేక మన పేరు మీద ఇంకేవైనా అవినీతి చర్యలు చేయటానికి ప్రయత్నిస్తారు. ఈమధ్య శంకరనేత్రాలయ సంస్థతో నాకున్న బాంధవ్యాన్ని ఆధారంగా తీసుకుని ఎవరిదో గుర్తింపు దొంగిలించి Whatsapp మాధ్యమం ద్వారా నన్ను మోసం చేయటానికి ప్రయత్నం జరిగింది. నేను జాగ్రత్తగా వుండటం వలన వారి ఆటలు సాగలేదు. మోసానికి ఎప్పుడూ బలం ఎక్కువ. ఈ ప్రయత్నాలు ఎంత నమ్మశక్యంగా వుంటాయంటే ఒక్క సెకనుపాటు కూడా మనకి సందేహం కలగదు. అక్కడే మన ఆలోచన, తెలివి మనకు అక్కరకు వస్తాయి. అలాగే మనం మాత్రమే కాదు, మన పిల్లల గుర్తింపును కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారి పేరు, వారి విద్యాలయం పేరు, ఇత్యాది వివరాలు మనం అందరిముందు వెల్లడి చేస్తే మోసగాళ్ళకు, నేరస్థులకు స్వహస్తాలతో ఇంధనం ఇచ్చినట్లవుతుంది. పిల్లల అపహరణలకు సందు ఇచ్చినట్లవుతుంది.
ఈ సాంఘికమాధ్యమాల చరిత్రను పరిశీలిస్తే Facebook, Instagram ఇంతవరకు ఎక్కువగా hack కాబడ్డ మాధ్యమాలు. దానికి కారణం, చాలా ఎక్కువగా వున్న వాటి వినియోగదారులు కావచ్చు. వారి బలహీనమైన password లు కావచ్చు. ఆ కంపెనీల పటుత్వం లేని సమాచార రక్షణవిధానాలు కావచ్చు. లేక వేరే ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ ఈ సమాచార చోరత్వం గురించి, అవి తీసుకొచ్చే అపాయాల గురించి మనం ఎప్పుడూ వార్తలలో వింటూనేవుంటాము. కాంబోడియా దేశం ఈ అంతర్జాల సమాచార మోసాలలో అగ్రగణ్యమైనదని, ఆతర్వాత స్థానం మయామార్, అంటే బర్మా అని చెబుతారు.
ఈనాడు సాంఘికమాధ్యమాలు లేని ప్రపంచాన్ని మనం అసలు వూహించలేము. అందుకే ఒంటరిగా వున్నప్పుడు ఎవరైనా తమలో తామే నవ్వుకుంటే పిచ్చివారని అనేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఈ smartphone లు, సాంఘికమాధ్యమాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది అని Mokokoma Mokhonoana అనే ఒక South Africa కు చెందిన ఒక రచయిత అన్నారు. సాంఘికమాధ్యమాలు రెండు వైపులా పదును వున్న కత్తిలాంటివి. పాలు, నీళ్ళని విడదీసే హంసలాగా మనం కూడా ఈ రెండిటిని చాలా జాగ్రత్తగా విడదీసి వాటిని కేవలం మంచికి మాత్రమే వాడుకోవాలి. అప్పుడే వాటి వలన మానవాభివృద్ధి సాధ్యం అవుతుంది. తాము ప్రచారం చేసే చాలా విషయాలు యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయని Meta మరియు YouTube కంపెనీ అధికారులను అమెరికాలో ఈ ఏడాది మార్చ్ నెలలో కోర్టులో నేరస్థులుగా పరిగణించి తీర్పు ఇచ్చారు. దీన్నిబట్టి సాంఘికమాధ్యమాలకి ఎంత శక్తి వుందో, అవి ఎంత బాధ్యతగా వుండాలో మనందరికీ తెలుస్తోంది కదా! దానితోపాటు మన బాధ్యత కూడా వుంది. మంచి, చెడు తేడాలు తెలుసుకుని మసలటం, ఎంత మంచి అనుకున్నా కూడా అతిగా వాడకపోవడం, చెడు విషయాల వైపు అసలు వెళ్ళకపోవడం, ఇవన్నీ మన బాధ్యతలు. ఎవరో తీవ్రవాదులు ఏదో Whatsapp group ని మొదలుపెట్టారని, దాని వివరాలు పూర్తిగా తెలీక, వారి ఆహ్వానాన్ని మన్నించి, పొరపాటుగానైనా సరే, దానిలో కనక చేరితే ఇంక బయటికి రాలేమని ఆమధ్య Whatsapp లో ఒక వార్త viral అయి, అందరి మధ్యా వ్యాపించింది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం మనందరం చాలా జాగ్రత్తగా వుండాలి. మన బంగారు బిడ్డలని ఈ సుడిగుండాలలో చిక్కుకుపోకుండా వెయ్యి కళ్ళతో, వెయ్యి చేతులతో, అపారమైన గట్టి మనోబలంతో కాపాడుకోవాలి. మరి మనందరం ఈ బాధ్యతలన్నిటిని చాలా నిజాయితీగా నిర్వహిస్తామని గట్టి నిర్ణయం తీసుకుందామా? అంతేకాదు, మన పిల్లల విషయంలో కూడా ఈ జాగ్రత్తలన్నీ ఎంతో శ్రద్ధగా వహిస్తామని కూడా మనం ఒక కంకణం కట్టుకుందాం.
సరే, మరి ఇప్పటికి ఇంతటితో అపి మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు తీసుకోనా?