Menu Close
ఆర్. శర్మ దంతుర్తి
తెలుగు పద్య రత్నాలు 61
ఆర్. శర్మ దంతుర్తి

తెలుగులో పద్యాలు రాయాలంటే వృత్తం అనేది తెలిసి ఉండడం ముఖ్యం. ఈ వృత్తాలకి నేర్పే మొట్ట మొదటి అడుగు ‘య-మా-తా-రా-జ-భా-న-స’ అని రాసుకుని గురువు (U) లఘువు (|) అనేవి ఎలా వేయాలి, ఫలనా వృత్తానికి యతి ఎక్కడ ఉంచాలి అనేవి. ఉదాహరణకి ఉత్పలమాల అనే వృత్తానికి పదో అక్షరం యతి. యతి అంటే సమానమైన అక్షరం అనుకోవచ్చు. దాశరధీ శతకంలో చాలా పద్యాలు ఉత్పలమాల వృత్తంలోనివే.  వృత్తాలు కాక జాతులు, ఉపజాతులనేవి (కందం, ఆటవెలది) ఉన్నాయి. పద్యంలో నాలుగు లేక ఐదు పాదాలు ఉన్నప్పుడు అన్ని పాదాలలో యతి ఉండి తీరాలి. కిందన ఇచ్చిన పద్యం చూడండి. యతి కి కిందన గీత పెట్టి చూపించాను.

ఉ. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవా
.....చార జవమ్ముగాగ విర జానది గౌతమిగా వికుంఠ ము
.....న్నారయభద్ర శైలశిఖ రాగ్రముగాగ వసించు చేతనో
.....ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ!

అయితే అన్ని పద్యాలూ ఒకే వృత్తంలో రాయాలి అనే నిబంధన ఏదీ లేదు. కవి తన ఇష్టం వచ్చిన వృత్తంలో పద్యం రాసుకోవచ్చు. లేదా కొత్త వృత్తాలు కనిపెట్టుకోవచ్చు. మనకి తెల్సిన వృత్తాలు అనేకం – చంపకమాల, ఉత్పలమాల, మత్తకోకిల, మత్తేభం, శార్దూలం, తరళము, స్రగ్ధర, మహాస్రగ్ధర, భుజంగ ప్రయాతము వగైరా. విశ్వనాధ సత్యన్నారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో అనేకానేక వృత్తాలు వందలకొద్దీ కనిపిస్తాయి. వీటిని ఎలా కూర్చాలి అనే విద్యనే మనం ఛందస్సు అంటున్నాం. అమెరికా వచ్చిన అనేకమంది తెలుగు భాషమీద మమకారం వల్ల దీనిమీద పెద్ద విశ్లేషణ చేసి ఆ విద్యని సజీవంగా ఉంచుతున్నారు. వీరిలో అతిరధ మహారధులుగా చెప్పబడే సైంటిస్ట్ గా పనిచేసి విరామం తీసుకున్న జె.కె. మోహనరావుగారు ఫేస్ బుక్కులో, ఈమాట అనే పత్రికలో, మరోచోటా (తె.లు.సా అనే ఒక పాత తెలుగు సాహిత్య సంఘం; ప్రస్తుతం లేదు) వీటి మీద కొత్త పద్యాలూ, ఛందస్సూ అనేవాటి మీద విశ్లేషణలు రాస్తూ ఉంటారు. ఆయన రాసిన అనేక వందల పద్యాల్లో ఒకటి ఈ నెల చూద్దాం.  ఈ పద్యం మొదటగా రాసినది మత్త కోకిల వృత్తంలో. దీనికి ఉండాల్సిన గణాల వరస - ర/స/జ/జ/భ/ర (UIUIIX UIUIIX UIUIIX UIU). యతి 11వ అక్షరం.

మత్తకోకిల. వాన వచ్చెను ప్రాణమిచ్చెను వంద రైతుల మోదమే
..............చేను పండును క్రొత్త ధాన్యము చింత యెందుకు మిత్రమా
..............ధేనురాశులు పచ్చగడ్డిని తీయతీయఁగ మేయునే
..............వేణునాదము మ్రోఁగు వేగము విశ్వమోహన రాగమే

పద్యంలో పెద్దగా వివరించడానికేమీ లేదు; సులభంగా అర్ధం అవుతుంది. వాన వచ్చింది, ప్రాణం ఇచ్చింది రైతులు ఇష్టపడేలాగున. పంటలు (చేను) పండుతాయి. కొత్త ధ్యాన్యం వస్తుంది. చింత అక్కర్లేదు. ఆవులకీ ఎడ్లకీ పచ్చగడ్డి దొరికి తీయగా మేస్తాయి. వీటి కూడా కృష్ణుడు ఉంటాడనే మన హిందువుల నమ్మిక కనక ఆయన వాయించే వేణునాదం విశ్వమోహంగా ఉంటుంది కదా? ఈ పద్యం అతి సులభంగా అర్ధమయ్యే ద్రాక్షాపాకం. అయితే ఈ పద్యంలో కొన్ని అక్షరాలు అటూ ఇటూ మార్చి అర్ధం మారకుండా మరో వృత్తం రాయవచ్చు. అదీ ఈ నెల పద్యంలో గమనించే రత్నం.

సురనర్తకీ. వాన వచ్చె నిల ప్రాణమిచ్చె నిట వంద రైతులకు మోదమే
...............చేను పండు నహ క్రొత్త ధాన్యములు చింత యెందులకు మిత్రమా
...............ధేనురాశులవి పచ్చగడ్డి నిఁక తీయతీయఁగను మేయునే
...............వేణునాదములు మ్రోఁగు వేగముగ విశ్వమోహన సరాగమే

పై పద్యం లో వృత్తం మారింది (ర/న/ర/న/ర/న/ర UIUIII UIUIII UIUIII UIU). అయితే పద్యం చదివి చూస్తే అర్ధం మాత్రం ఏమీ మారలేదు కదా? ఉదాహరణకి చివరి నాలుగో పాదం చూడండి. మార్పు ఏమిటంటే “వేణునాదము(లు), వేగము(గ) (స)రాగమే” అనేవి మాత్రమే. అదే విధంగా మిగతా పదాలలో కూడా చిన్న చిన్న మార్పులతో కొత్త వృత్తంలో పద్యం రాసారు కదా? ఇదే మన భారతీయ భాషల్లో ఉండే అద్భుతం.

తెలుగులో ఇటువంటివి అనేకంగా ఉన్నాయి. భాషాప్రవీణ అనే తెలుగు పరీక్షకి వెళ్ళే వారికి ఇవన్నీ నేర్పుతారు. మరి కొన్ని విశేషాలు చూద్దాం. ఉత్పలమాలలో (భ-ర-న-భ-భ-ర-వ) మొదటి గురువుని రెండు లఘువులుగా మారిస్తే అది చంపకమాల అవుతుంది (న-జ-భ-జ-జ-జ-ర). ఉదాహరణకి ఒక పాదం చూద్దాం.

ఉ. అంచు నతండు రాముచరణాంబుజమున్ మనమందు నిల్పుచున్
చ. నుచు నతండు రాముచరణాంబుజమున్ మనమందు నిల్పుచున్

అలాగే శార్దూలంలో (మ-స-జ-స-త-త-గ) మొదటి గురువుని రెండు లఘువులుగా చేస్తే అది మత్తేభం (స-భ-ర-న-మ-య-వ)  అవుతుంది  దీనికో ఉదాహరణ.

శా. అంచున్ రాముడు పల్క మారుతి మహత్మా నీదు పాదపద్మముల్
మ. నుచున్ రాముడు పల్క మారుతి మహత్మా నీదు పాదపద్మముల్

********

Posted in July 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *