జైనుడి చేతిలో పేను (జాతీయం కథ)
సాయంత్రం వేళ, మురళి ఇంటి వరండాలో కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. అప్పుడే వెంకన్న కంగారుగా అక్కడికి వచ్చాడు.
అతడిని చూడగానే మురళి పుస్తకం పక్కన పెట్టి,
"ఏంట్రా వెంకన్నా! ఎప్పుడూ లేనిది ఇంత కలవరపడుతున్నావు? ఏమైంది?" అని అడిగాడు.
వెంకన్న నిట్టూర్చాడు.
"ఈరోజు నా జీవితంలో ఓ పెద్ద పరీక్ష ఎదురైంది మురళీ! పొలం నుంచి వస్తుండగా దారిలో ఒక సంచి దొరికింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. వాటిని చూసేసరికి అది నన్ను మోసం చేసి, అందరి ముందు అవమానించిన ఓ వ్యాపారిదని తెలిసింది."
"అలాగా! మరి ఏం చేశావు?" అని అడిగాడు మురళి.
"మొదట ఆ డబ్బు చూసి నా మనసు తడబడింది. నా అప్పులు తీర్చుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, నాకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవచ్చని కూడా అనిపించింది.
కానీ మరోవైపు నా మనస్సాక్షి నన్ను నిలదీసింది. 'ఇది నీది కాదు' అని హెచ్చరించింది. ఒకవైపు అవసరం, మరోవైపు నిజాయితీ. ఏం చేయాలో అర్థంకాక చాలాసేపు ఆలోచించాను. చివరికి పగకన్నా ధర్మమే గొప్పదని నిర్ణయించుకున్నాను. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ సంచిని అప్పగించేశాను," అన్నాడు వెంకన్న.
అది విన్న మురళి సంతోషంగా నవ్వాడు.
"వెంకన్నా! ఆ సమయంలో నీ పరిస్థితి అచ్చం 'జైనుడి చేతిలో పేను' లాగా ఉంది!" అన్నాడు.
అక్కడే ఆడుకుంటున్న జున్నుబాబు ఆసక్తిగా దగ్గరకు వచ్చాడు.
"తాతయ్యా! జైనుడి చేతిలో పేను అంటే ఏమిటి?" అని అడిగాడు.
మురళి చిరునవ్వుతో చెప్పసాగాడు.
"జున్నూ! జైన మతస్థులు అహింసను ఎంతో గౌరవిస్తారు. వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి. వాటిలో ఒక పేను అతని చేతికి చిక్కింది. దాన్ని చంపితే జీవహింస చేసినట్టవుతుంది. వదిలేస్తే అది మళ్లీ ఇబ్బంది పెడుతుంది. అలా చంపాలా, వదిలేయాలా అని అతడు తీవ్ర సందిగ్ధంలో పడ్డాడు.
అప్పటి నుంచి చేతికి చిక్కిన దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు లేదా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడినప్పుడు 'జైనుడి చేతిలో పేను' అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు.
వెంకన్నకు కూడా ఆ డబ్బు దొరికింది. దానితో తన కష్టాలు తీర్చుకోవచ్చు. కానీ నిజాయితీ అనే ధర్మం అడ్డుపడింది. అందుకే అతని పరిస్థితిని 'జైనుడి చేతిలో పేను' అన్నాను."
"తాతయ్యా! ఏదీ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఈ జాతీయం వాడతారని తెలిసింది.” అన్నాడు మనవడు.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.