Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

కల్తీలేని కవిత్వం..!
- పోలయ్య కూకట్లపల్లి -

తమస్సు గర్భాన
తారకలు పుట్టినట్లు...
కర్దమపు కొలనులో
కమలం విరిసినట్లు..
హాలాహల మధనాన
అమృతం ఉద్భవించినట్లు...

కన్నీటి చెలమ నుండి
కమనీయ కవిత్వం పుడుతుంది
విషాద విస్ఫోటనం నుండి
విప్లవం ఉదయిస్తుందిరా..!
ఓ మానవా...ఇది నిత్య సత్యంరా..!

కలత చెందిన పేదల
కన్నీటి సంద్రాన
కరుణతో నువ్వు నిర్మించే
సాహిత్య వారధి...
అజ్ఞానాంధకారంలో మగ్గే
అనాథల పాలిట
నువ్వు పంచే జ్ఞాన ప్రదీప్తం..!
నిన్ను మృత్యువు
ఒడిలోనూ చిరంజీవిని చేస్తాయిరా..!
ఓ మానవా...ఇది అక్షర సత్యంరా..!

నీ కీర్తి కాలగర్భంలో
ఆరని చిరుదివ్వె అవుతుంది...
నీ కలం శ్రమజీవుల
స్వేదబిందువును తాకాలి
కల్తీలేని కరుణరస
కవిత్వం పలకాలి!
కాయకష్టం చేసేవారి గుండెల్లో
దాగి ఉండదురా 'దానవత్వం'..!
పరిమళించే మంచిగంధమే
వారి యందలి... 'మానవత్వం'రా..!
ఓ మానవా...ఇది నిత్య సత్యంరా..!

అశక్తుల బాహువుల్లో
అనంత శక్తిని నింపాలన్నా...
అవివేకపు చీకట్లను
పటాపంచలు చేయాలన్నా...
నీ కలానికే ఉందిరా...
వజ్రాయుధమంత పదును..!
ఓ మానవా...ఇది అక్షర సత్యంరా..!

Posted in June 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *