Menu Close
Ghali Lalita Pravallika
మొదలు నేనిస్తా... ముగింపులు మీరివ్వండి
రచన-సేకరణ: ఘాలి లలిత ప్రవల్లిక

రకరకాల ఆలోచనలతో అరణి చాలా సేపు మేలుకొనే ఉంది. ఆమెకు అది కొత్త కాదు. బాల్యపు నీలి నీడలు ఎప్పుడూ ఆమెను తరుముతూనే ఉంటాయి. అవి తలపులోకి వచ్చినప్పుడల్లా వాటి నుంచి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటుంది. బుక్స్ చదవటం, మెడిటేషన్ చేయటం, ప్రకృతి దృశ్యాలను చూడటం ఇలా...

ప్రస్తుతం ఆమె బస్సులో ప్రయాణిస్తోంది. బస్సు కిటికీ లోంచి బయటకు చూసింది. కటిక చీకటి కావడంతో కంటికి ఏమీ కనిపించలేదు. హెడ్ ఫోన్ ద్వారా ఫోన్లో... పాటలు పెట్టుకుని వింటూ కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర లోకి జారుకుందో తెలియదు. బస్సుకు సడెన్ బ్రేక్ పడేసరికి కళ్ళు తెరిచింది. బస్సుకి ఏదో అడ్డం వచ్చినట్టుంది. అందుకే సడన్ బ్రేక్ వేశాడు. రోడ్డు క్లియర్ అయ్యాక బస్సు మళ్లీ స్టార్ట్ అయింది. ఇంక అరణి కి నిద్రపట్టలేదు. కిటికీలోంచి చూస్తూ కూర్చుంది.

ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇక కొనసాగించండి....

1 . అవేరా

శీర్షిక: ఆ నీడ ఎవరిది?

రకరకాల ఆలోచనలతో అరణి చాలా సేపు మేలుకొనే ఉంది. ఆమెకు అది కొత్త కాదు. బాల్యపు నీలి నీడలు ఎప్పుడూ ఆమెను తరుముతూనే ఉంటాయి. అవి తలపులోకి వచ్చినప్పుడల్లా వాటి నుంచి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటుంది. బుక్స్ చదవటం, మెడిటేషన్ చేయటం, ప్రకృతి దృశ్యాలను చూడటం ఇలా...

ప్రస్తుతం ఆమె బస్సులో ప్రయాణిస్తోంది. బస్సు కిటికీ లోంచి బయటకు చూసింది. కటిక చీకటి కావడంతో కంటికి ఏమీ కనిపించలేదు. హెడ్ ఫోన్ ద్వారా ఫోన్లో... పాటలు పెట్టుకుని వింటూ కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర లోకి జారుకుందో తెలియదు. బస్సుకు సడెన్ బ్రేక్ పడేసరికి కళ్ళు తెరిచింది. బస్సుకి ఏదో అడ్డం వచ్చినట్టుంది. అందుకే సడెన్ బ్రేక్ వేశాడు. రోడ్డు క్లియర్ అయ్యాక బస్సు మళ్లీ స్టార్ట్ అయింది. ఇంక అరణి కి నిద్రపట్టలేదు. కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థం కాలేదు.

***

మొదలు నేనిస్తా... ముగింపులు మీరివ్వండి, కొనసాగింపు, ముగింపు.

***

ఆ పెద్ద శబ్దం వినిపించగానే బస్సులో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిద్రలో ఉన్న వాళ్ళుకూడా లేచి, కళ్ళు తెరిచి, భయంగా చూస్తూ, క్షణం తర్వాత కుదురుకున్నారు. కొందరు కాకుల్లా అరవడం మొదలుపెట్టారు. డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపేశాడు. అరణి గుండె గట్టిగా కొట్టుకుంటోంది. కాసేపటి క్రితం నిద్రలోనుంచి లేచిన ఆమెకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

“ఏమైంది?” అంటూ పక్క సీట్లో ఉన్న మహిళ అడిగింది.

"ఏమో..." అని కిటికీలోంచి బయటకు చూసింది అరణి, చీకట్లో విరిసిన కలువల్లా, రోడ్డు పక్కనే మసకగా సమాధులు కనిపిస్తున్నాయి.

ఎవరికీ స్పష్టంగా ఇంకా ఏమీ కనిపించట్లేదు. ఏమి జరిగిందో తెలియలేదు. కాని బస్సు ముందు భాగంలోని విండ్ షీల్డ్ గాజు, కొద్దిగా వెంట్రుక మందం పగిలి ఉంది. డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ దిగిపోయి బయట ఏమైందో చూసేందుకు వెళ్లారు.

అరణి కూడా కిటికీలోంచి బయట చూడటానికి ప్రయత్నించింది. బయట చీకటి, ప్రకృతి కళ్ళకు అలంకరించుకున్న చిక్కని కాటుకలా ఉంది. రోడ్డు పక్కన వెన్నెల లేకున్నా, విరిసిన కలువల్లా ఉన్నాయి కొన్ని సమాధులు.

కానీ...

దూరంలో ఎదురుగా వస్తున్న ఒక వాహనం హెడ్‌లైట్లు మాత్రం కాంతిని విరజిమ్ముతున్నాయి.

కొద్దిసేపటికి డ్రైవర్ తిరిగి బస్సు లోపలికి వచ్చాడు.

“ఏమీలేదు… ఒక జంతువు రోడ్డుపైకి వచ్చి తగిలింది” అన్నాడు.

కానీ అతని స్వరం కొంచెం కంపించటం అరణి గమనించింది. అతడు ఏదో దాస్తున్నట్టు అనిపించింది.

బస్సు మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. అయితే ఆ ఘటన తర్వాత బస్సులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. అరణి మాత్రం మరింత అప్రమత్తంగా మారింది. అనకొండలా ఆమె మదినీ, కళ్ళనూ, అల్లుకుందామనుంటున్న నిద్ర కోరలు పీకే పనిలో ఉంది.

ఆమె చెవుల్లో పాటలు ఇంకా వినిపిస్తున్నాయి, కానీ మనసు మాత్రం పూర్తిగా బయట జరుగుతున్న వాటిపై ఉంది.

కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు ఒక విచిత్రమైన విషయం కనిపించింది.

బస్సు వెనుక సీట్ల దగ్గర, చివరి వరుసలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ముందు ఆమె నిద్రపోయే వరకు అతను అక్కడ ఉన్నట్టు గుర్తు లేదు. అతను తలదించుకుని కూర్చున్నాడు. అతని ముఖం కనిపించలేదు.

అరణి గమనించసాగింది.

ఆ వ్యక్తి కదలడం లేదు… శ్వాస తీసుకుంటున్నట్టూ కనిపించలేదు.

'ఇతను ఎప్పుడు ఎక్కాడు?' అనుకుంది.

ఆమె పక్క సీట్లో ఉన్న మహిళను నెమ్మదిగా అడిగింది, “అక్కా, వెనుక కూర్చున్న వాళ్లలో ఆ వ్యక్తి ముందే ఉన్నాడా?”

ఆమె వెనక్కి చూసి,

“ఎవరు?” అంది.

“అక్కడ… బ్లాక్ జాకెట్ వేసుకున్నాడు…”

మహిళ మరోసారి చూసింది.

“అక్కడ ఎవ్వరూ లేరు కదా…” అంది ఆశ్చర్యంగా.

అరణి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది.

“ఎలా? నేను స్పష్టంగా చూస్తున్నాను కదా…”

అరణి మళ్లీ చూసింది.

ఈసారి… ఆ సీటు ఖాళీగా ఉంది.

ఆ క్షణం, చల్లని చెమట ఆమె నుదుటిపై మెరుస్తోంది.

'నేను కలగంటున్నానా?' అనుకుంది.

ఆమె కనురెప్పల తలుపులు బిగించి మూసుకుని మళ్లీ తెరిచింది. ఆ సీట్లో ఎవరూ కనిపించలేదు.

కానీ ఆమె మనసులో అసహజమైన భయం పెరుగుతోంది. ఆలోచనలు కట్టలు తెగిన గోదారి వరద పొంగులా మనసును ముంచేస్తున్నాయి.

అప్పుడే… బస్సు మళ్లీ ఒక్కసారిగా జర్క్ అయింది.

డ్రైవర్ ఈసారి బస్సును పూర్తిగా ఆపేశాడు.

“ఎందుకు మళ్లీ ఆపారు?” అని ప్రయాణికులు అడగసాగారు.

డ్రైవర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను అద్దంలో వెనక్కి చూస్తున్నాడు.

అరణి కూడా అద్దంలో చూసింది. ఆమె గుండె ఆగిపోయేంత భయం వేసింది.

అద్దంలో… అదే వ్యక్తి కనిపిస్తున్నాడు.

బ్లాక్ జాకెట్… తలదించుకుని…

కానీ ఈసారి అతను నెమ్మదిగా తలను పైకి ఎత్తుతున్నాడు.

అరణి కళ్ల ముందు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

అతని ముఖం…

గాయాలతో నిండిపోయింది.

కళ్లలో విచిత్రమైన వెలుగు. అరణికి ఆ దృశ్యం ఎప్పుడో, ఎక్కడో చూసినట్లునిపించింది.

గతంలోని జ్ఞాపకాలు మసగ్గా మదిలో మెదిలాయి, కానీ స్పష్టత లేదు. భయంతో తల పక్కకు తిప్పుకుంది.

ఒక్క క్షణం ఆగి, ఆమె ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగింది.

ఈసారి… అతను నిజంగానే అక్కడ కూర్చున్నాడు.

అతనిని ఎవరూ గమనించలేదు. అందరూ తమ తమ ఆలోచనల్లో, మొబైల్ ఫోనుల్లో బిజీగా ఉన్నారు.

అరణి నెమ్మదిగా లేచి కండక్టర్ దగ్గరకు వెళ్లింది.

“అన్నా… వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు… అతను దెబ్బలు తగిలి ఉన్నాడు, పరిస్థితి బాగోలేదు…” అంది.

కండక్టర్ చిరునవ్వు నవ్వాడు, “అక్కడ ఎవరూ లేరు అక్కా... బస్సు ఫుల్ కాలేదు. మీరు కూర్చోండి.”

“లేదు! నిజంగా ఉన్నాడు!” అరణి స్వరం భయంతో కంపించింది.

“ఆమె చూసింది… నిజమే.” డ్రైవర్ అన్నాడు.

అందరూ ఒక్కసారిగా క్షణం సేపు షాక్ అయ్యి, భయంగా బస్సు వెనక్కి చూసారు.

కండక్టర్ గందరగోళంగా డ్రైవర్ ని అడిగాడు,
“ఏమంటున్నారు సార్?”

డ్రైవర్ నెమ్మదిగా అన్నాడు,
“మనం కొద్దిసేపటి క్రితం ఢీకొట్టింది… జంతువు కాదు.”

ఆ మాటలు విన్న అరణి గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“మరి…?” అని ఎవరో అడిగారు.

“ఒక మనిషి... తాగి బైక్ నడుపుతున్నాడు. ప్రమాదమేమీ లేదు, బాగానే ఉన్నాడు.”

"మరి బస్సులో, వెనక సీట్లో, మీకు ఎవరు కనిపించారు? మాకు కనిపించట్లేదు?" అడిగాడు కండక్టర్.

"ఆ అమ్మాయి భ్రమలో ఉంది... అలాంటి పరిస్థితిలో... అందరూ నో చెప్పకూడదు... అందుకే..." నెమ్మదిగా కండక్టర్ కి మాత్రమే వినిపించేలా చెప్పాడు డ్రైవర్.

తల పంకించాడు కండక్టర్.

బస్సు మళ్ళీ స్టార్ట్ అయ్యి, ముందుకు కదిలింది.

బస్సులో ప్రయాణీకులు, రిలాక్స్ డ్ గా ఊపిరి తీసుకున్నారు. అరణి అనుమానంగా, మళ్ళీ వెనక్కి చూసింది.

ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు లేచి నిలబడ్డాడు. అతను నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు.

అతను వేసే ప్రతి అడుగుతో… బస్సులోని లైట్లు మసకబారుతూ, మళ్ళీ వెలుగుతున్నాయి.

సీట్లలోంచి ఎవరూ కదలట్లేదు.

భయం అరణి అవయవాలను స్థంబింపజేసింది. సీట్ లోంచి లేచి, పారిపోవాలనుకున్నా, కదలలేక పోతోంది. క్షణంసేపు ఊపిరి ఆగిపోయినట్లనిపించింది.

అతను అరణి దగ్గరకు వచ్చాడు. ఆమె శరీరం భయంతో వణుకుతోంది.

ఆమె వైపు చూసి…

“నువ్వు మాత్రమే నన్ను చూసావు” అన్నాడు.

ఆ స్వరం… ఆమె గుండెల్లోకి శూలంలా గుచ్చుకుంది.

“ఎందుకలా ?” అరణి వణికే స్వరంతో కష్టంగా అంది.

“ఎందుకంటే… నువ్వు ఇంకా గతం నుంచి బయటపడలేదు.”

ఆ మాటలు వినగానే అరణి కళ్ల ముందు బాల్యపు, చేదు జ్ఞాపకాలు మెరుస్తున్నాయి.

ఆమె తప్పించుకోవాలని ప్రయత్నించిన నీడలు…

ఆమె మర్చిపోవాలని ప్రయత్నించిన సంఘటనలు…

అన్నీ ఒక్కసారిగా తిరిగి ఆమె స్మృతిలోకి వచ్చాయి.

“నేను… నేను ఏం చేయాలి?” ఆమె అడిగింది.

అతను చిరునవ్వు నవ్వాడు,
“నిజాన్ని అంగీకరించు.”

అతను చేయి ముందుకు చాపాడు.

అరణి కళ్లను భయంతో గట్టిగా మూసుకుంది.

ఒక్క క్షణం…... నిశ్శబ్దం...

ఆమె కళ్లను మెల్లగా తెరిచింది.

బస్సు సాధారణంగా ప్రయాణిస్తోంది. లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయి. ప్రయాణికులు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. ఏమీ జరగనట్టే ఉంది.

ఆమె వెనక్కి చూసింది. చివరి సీటు ఖాళీగా ఉంది.

డ్రైవర్ అద్దంలో చూసి ఆమెకళ్లతో కళ్ళు కలిపాడు.

ఈసారి అతని ముఖంలో భయం లేదు… కానీ ఒక అర్థం కాని ప్రశాంతత ఉంది.

అరణి లోపల ఏదో అలజడి. ఆమె ఫోన్ తీసుకుని పాటలు ఆపేసింది. కిటికీలోంచి బయటకు చూసింది.

ఇప్పుడు చీకటి అంత భయంకరంగా అనిపించలేదు. ఆమె లోపల ఉన్న చీకటి కొంత కరిగిపోయింది.

కానీ… ఒక ప్రశ్న మాత్రం మిగిలింది—

'తను చూసింది నిజమేనా?

అది నిజంగా జరిగిందా? లేక మనసులోని భ్రమా?'

అంతలో… బస్సు వెనుక నుంచి మెల్లగా ఒక స్వరం వినిపించింది.

“నువ్వు మర్చిపోవద్దు…”

అరణి కళ్లలో మళ్లీ భయం మెరుస్తోంది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది… ఆమె కళ్ళముందు ఒక అస్పష్టమైన ఆకారం క్షణం సేపు కనిపించి మాయమైంది.

"ఏమిటి రవి, బస్సు ఎక్కినప్పటి నుంచీ, అదోలా ఉన్నావు?" డ్రైవర్ ని అడిగాడు కండక్టర్.

"నా కొడుకు బాబ్జీ అమ్మాయి ప్రేమలో ఓడిపోయి, ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ రోజే...

సరిగ్గా ఏడాది గడిచి పోయింది. అందుకే... మనసు బాగోలేదు. హైస్కూల్ లోని ప్రేమ అక్కడే మరచిపోరా అంటే వినలేదు, కాలేజీ వరకూ కొనసాగించాడు. హు!... ఒన్ సైడ్ లవ్ విషమే కదా... నా కొడుకును బలి తీసుకుంది" నిర్లిప్తంగా అన్నాడు డ్రైవర్.

'బాబ్జీ'... ఆ పేరు విన్న అరణి గుండె ఆగినంత పనైంది.

★★★ సశేషం ★★★

Posted in June 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *