మిఠాయి వాసన వస్తే చీమలు ఊరుకుంటాయా? చిన్న చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు, కండ చీమలు, పులి చీమలు, పెద్ద బుర్ర చీమలు ఇలా ఎన్నో చీమలు దండులు దండులుగా వచ్చి మిఠాయిలు తినడం ప్రారంభించాయి. తింటున్న చీమలు ఊరుకోక సుబ్బు కాళ్ళని కూడా కుట్టసాగాయి. సుబ్బు విదిలించాడు. అయినా మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉన్నాయి. రెండు కాళ్ళని జాడించి విదిలించాడు. ‘బేర్’ మని ఏడుపు వినిపించింది. గబుక్కున లేచాడు. సీత కాళ్ళ దగ్గర పడి ఏడుస్తోంది. మిఠాయిలూ లేవు ఇల్లూ లేదు.
కళ్ళు నులుముకుని చూసాడు. అది తన ఇల్లే. దుర్గమ్మ కసవూడుస్తోంది. నీళ్లు అన్నిటి నిండా రాత్రే పోసేసాడు. సీతని చంకనేసుకుని బయటకు వచ్చాడు.
“పిన్నీ, బుజ్జి, శీను, మహేశు వచ్చారా?” అని అడిగాడు.
“తెల్లారిందా? బారెడు పొద్దెక్కితే కానీ లేవలేదు, అప్పుడే తిరుగుళ్లకు నేస్తాలు కావాల్సి వచ్చారా? పుల్లలు తేవాలి. బడికి ఎల్లొచ్చి పుల్లలికి ఎల్తావో, ఇప్పుడే ఎల్తావో నీ ఇష్టం.” చెప్పింది దుర్గమ్మ.
“ఛ… అయితే బుజ్జి, శీను, మహేశు, లష్మి రావడం, పెద్ద సావుకారు ఇంట్లో దొంగలు పడటం, తామంతా నెలికి అమ్మోరి గుళ్ళో నగల సంచులు, డబ్బుల సంచులు తీసుకురావడం, మిఠాయిలు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం అన్నీ కలేనా… అయ్యో నిజమే అయి ఉంటే ఎంత బాగుండేది?” నోట్లో వేపపుల్ల పెట్టుకొని అంతా తలచుకున్నాడు సుబ్బు.
“ఎంతసేపా పలుదోవడం. అరిగిపోగలవు. రా బేగి” కేకేసింది దుర్గమ్మ.
గబగబా ముఖం కడుక్కుని, దుర్గమ్మ ఇచ్చిన టీ తాగి, సీతకు తాగించాడు. దుర్గమ్మకి చెప్పి సీతతో సహా బడికి బయలుదేరాడు సుబ్బు. నిద్ర లేచింది మొదలు సుబ్బుగాడికి చాలా అసంతృప్తి గా ఉంది. జరిగినది అంతా కల అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నెన్ని మిఠాయిలు… పోగులు పోగులు, రాశులు రాశులుగా కొన్నాడు. ఎంత చక్కటి ఇల్లు కట్టాడు… ఎన్ని నగలు, ఎన్ని డబ్బులు… మేకపిల్లని చంపి, కాల్చి తిన్నారు… ఎంత దూరం నడిచారు… ఏటో మనసు అస్సలు ఉగ్గబట్టడం లేదు. ఆలోచనలో పడి పంతులుగోరి బడి దాటి ఎల్లిపోతున్నాడు సుబ్బు. సీత సుబ్బు చొక్కా పట్టుకులాగింది. బుజ్జి ‘సుబ్బూ ఏడకి పోతన్నావురా!” అని కేకేసాడు. సుబ్బు వినిపించుకోలేదు. శీను పరుగెత్తుకు వచ్చి సుబ్బు భుజం పట్టి ఆపాడు. సుబ్బు శీను వైపు నిర్వికారంగా చూసాడు.
“సుబ్బూ… ఒరే సుబ్బూ…” గట్టిగా భుజం ఊపి పిలిచాడు శీను.
అప్పుడు ఈలోకం లోకి వచ్చాడు సుబ్బు. “అప్పుడే పంతులుగోరి బడి ఒచ్చీసిందా?” అన్నాడు సీతను కిందకి దించుతూ…
“నువ్వు బడి దాటి ఎల్లిపోతూ ఉంటే బుజ్జిగాడు కేకేసినాడు.”
“అవునా… నాకు ఇనబడనే లేదురా”
“నువ్వు ఈలోకంలో ఉంటే కదరా… ఏటయ్యింది నీకు?” సుబ్బు భుజం మీద చెయ్యేసి బడి దగ్గరకు తీసుకొచ్చాడు శీను.
“ఏటయినాదిరా సుబ్బుగా… ఏటలా ఉన్నావు? దురగమ్మ తిట్టినాదేటి?” అడిగాడు బుజ్జి.
“నేదురా”
“మరేటయినాదిరా? ఆ వోలకం ఏటి?” ఆరా తీశాడు మహేశు.
“ఏటి నేదన్నానా! పంతులుగోరు ఇంకా రానేదా?” అడిగాడు బుజ్జి.
“వొచ్చేత్తారు” అని లష్మి అంటూ ఉండగానే పంతులుగోరు వచ్చేసారు.
“నిన్న చెప్పిన పద్యాలు, శ్లోకాలు ఎవరైనా కంఠతా చేసారా? తిరిగి అప్పజెప్తారా?” అడిగారు పంతులుగారు.
“నాను సెప్తాను పంతులుగోరూ” అన్నాడు సుబ్బు లేచి.
“చెప్పరా” అన్నారు పంతులుగారు.
సేత ఎన్న ముద్ద సెంగలువ పూదండ
బంగారు మొలతాడు పట్టుబట్టి
సందిట తాయిలాలును చెరో మువ్వ గుంజీలు
సిన్ని కిట్న నిన్ను సేరి కొలుతు!!
వాడిదైన భాషలో చెప్పాడు సుబ్బు. గురువు గారు వాడి ఏకసంధాగ్రాహిత్వానికి మురిసిపోయారు.
“మిగతావి కూడా చెప్తావా?” అని అడిగారు.
“కరాగ్రే… నోరు తిరగలేదు పంతులు గోరూ… నిద్ర లేవగానే సేతులు చూసుకోవడం తెలిసింది.
దండమయా ఇస్వం బారా
దండమయా పుండనీక దాలి నెత్తి హరీ
దండమయా కరునానిది
దండమయా నీకెప్పుడు కిట్నా
చెప్పాడు సుబ్బు.
“ఇలా రారా…” పిలిచారు గురువుగారు. దగ్గరగా వెళ్ళాడు సుబ్బు.
“వీడు బడికి వచ్చిందే నిన్న. చెప్పిన రెండు పద్యాలు పట్టేసాడు. తప్పులు చాలా ఉన్నాయి. అయినా సరే ఒకసారి విన్న, అన్న పద్యం మరచిపోకుండా చెప్పాడు. అందరూ వీడిని అభినందించండి” చెప్పారు గురువుగారు.
అందరూ చప్పట్లు కొట్టారు. “నువ్వు రోజూ చదువుతూ ఉంటే నీ మాటలో ఉండే దోషాలు పోతాయి. తప్పులు చెప్పవు. రోజు బడికి వచ్చి చదువుకో” చెప్పారు పంతులుగారు.
పంతులు గారి భార్య వచ్చి అందరికి తలో బూరి ఇచ్చారు. పిల్లలకు పెట్టమని పెద్ద షావుకారు గారు పంపేరట. పిల్లలంతా లొట్టలేసుకుని తిన్నారు. సీతకు తినడం రాక సగం నేలమీద పడేసుకుంది. లష్మి కొంచెం కొంచెంగా సీతకు తినిపించింది.
ఆరోజు ఆ రెండు పద్యాలు మళ్ళీ అందరి చేత వల్లెవేయించారు పంతులుగారు. అంకెలు, నెలల పేర్లు, తిధులు, వారాల పేర్లు చెప్పించారు. పంచతంత్రం కథలు చెప్పారు. అందరికి మజ్జిగ ఇచ్చింది పంతులుగారి భార్య. మజ్జిగ తాగేసి గోలెం దగ్గర అందరూ గ్లాసులు కడిగి ఇచ్చారు. సుబ్బుకు ఇంకో గ్లాసు మజ్జిగ తాగాలనిపించింది. గ్లాసును అలాగే పట్టుకుని కూర్చున్నాడు.
“ఏరా ఇంకా మజ్జిగ తాగుతావా?” అన్నారు పంతులుగారు.
సుబ్బు తలాడించేడు. లోపలికి కేకేసారు పంతులుగారు. పంతులుగారి భార్య మళ్ళీ మజ్జిగ తెచ్చి సుబ్బు గ్లాసులో పోసింది.
“మీ నాన్న దయ వలన మాకు పాలు, మజ్జిగలకు లోటు లేదురా సుబ్బు.” అన్నారు పంతులుగారు.
సుబ్బుకి అర్ధం కాలేదు. “మా నాన్న దయ ఏటి పంతులుగారు” అన్నాడు సుబ్బు.
“మీ నాన్న నువ్వు పుట్టకముందు నాకు ఒక ఆవుని ఇచ్చాడురా… అది కన్న పిల్లలతో ఇప్పటికి నా దగ్గర ఒక చిన్న ఆవులమంద తయారయ్యింది. అందరికి తలా కాస్త పాలు, మజ్జిగ ఇవ్వగలుగుతున్నాను” చెప్పారు పంతులుగారు.
****
అడవికి సమీపంలోని గ్రామాలు, నగరాలపై దోపిడీ దొంగల బీభత్సం ఎక్కువైంది. ఊళ్ళు దోచుకోవడం లేదు కానీ ధనవంతుల ఇళ్లపై దాడి చేసి నగలు, నగదు దోచుకుంటున్నారు. ఎప్పుడు వస్తారో తెలీదు, ఎలా వస్తారో తెలీదు. చిత్ర విచిత్రమైన ఆయుధాలతో నిశ్శబ్దంగా వస్తారు. నలుగురైదుగురు మాత్రమే వస్తారు. కిటికీలో నుండో, పొగ పోవడానికి పెట్టిన చిమ్ని నుండో ఇంట్లోకి దిగుతారు. శబ్దం లేకుండా వీధి తలుపు తెరుస్తారు. మిగిలిన దొంగలు లోపలికి చొరబడతారు. అలికిడి కాకుండా ధనం ఉన్నచోటికి వెళ్లి, మొత్తం మూటలు కట్టేసి, అంతే నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోతారు. ఒకవేళ అలికిడికి ఎవరైనా లేచినా, ధనం ఉండే స్థలం తెలియకపోయినా, ఇంట్లో అందరినీ కట్టేసి, బెదిరించి, తమకు కావలసినవి పట్టుకుపోతారు. కాసేపటి తర్వాత ఆ ఇంటివారి గగ్గోలు విని గ్రామస్తులు లేచి, వెతికినా దొంగల జాడ తెలిసేది కాదు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో అనే భయంతో వ్యాపారస్తులకు, ధనవంతులకు కంటిపై కునుకుండేది కాదు.
సీతానగరంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. నలుగురు వ్యాపారస్తుల ఇళ్లపై ఒకేసారి దొంగలు విరుచుకుపడ్డారు. బియ్యం, పప్పులు, నూనె, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరపకాయలతో సహా వంట దినుసులు అన్ని తీసుకుపోయారు.
అయితే ప్రతీ దోపిడీ లోనూ అందరూ వెంటనే గమనించని విషయం ఒకటి జరిగేది. ఆ ఊరిలో అనాధగా బతికే పిల్లలు ఎవరైనా ఉంటే ఒకరిద్దరిని పట్టుకొని, వారికి మత్తు పెట్టి తమవెంట తీసుకుపోయేవారు. పోయిన సొమ్ము గురించే అందరూ మాట్లాడుకునేవారు. పిల్లల ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో, వారు మాయమైన విషయం చాలా ఆలస్యంగా తెలిసేది. ఒకవేళ ఆ పిల్లలు కనబడకపోయిన విషయం గుర్తించినా, దొంగలు తీసుకెళ్ళేరు అని ఎవరూ ఊహించేవారు కాదు.
****
“కాలా, నీ ఆలోచన అద్భుతం, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోంది సొమ్ము. చెప్పు ఈ సొమ్ముతో ఏం చేద్దాం? ఎక్కడ దాచి పెడదాం?” సంతోషంతో పొంగిపోతూ అడిగాడు నీల.
“సంపాదించిన దాంట్లో సగం మనకు పనిచేస్తున్న సైన్యానికి ఇచ్చేస్తున్నాం, మిగతా దాంట్లో సగం మనం నలుగురం పంచుకుంటున్నాం. నాల్గో వంతే ఇంత మిగులుతోంది. ఇది దాచడమే కష్టం అయిపోతోంది.” చెప్పాడు శోణ.
“ఊఁ నిజమే. అమావాస్యకో పున్నానికో ఒక దొంగతనం చేసినా సరిపోతోంది. ఇంత సంపాదిస్తున్నాం. చాలా మందిని పోషిస్తున్నాం. తర్వాత ఏంటి? మనకు ఒక లక్ష్యం ఉండాలి కదా!” అడిగాడు శ్యామా.
దీర్ఘాలోచనలో ఉన్నాడు నీల.
“ఏం ఆలోచిస్తున్నావు నీలా?” అడిగాడు కాలా.
“మన నలుగురిది ఒక రాజ్యం కాదు, ఎలా కలిసామో ఎవరికైనా గుర్తుందా? ధనవంతులుగా బతకడానికి దొంగతనాలు చేసినట్లయితే ఇంతకు ముందు దోచుకున్నదే మనకు పది తరాల ఆస్తి. ఇప్పుడు దోచుకుంటున్నది ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఈ సంపదతో ఏం చేద్దాం?” అడిగాడు నీలా.
మిగతా ముగ్గురూ కూడా ఆలోచనలో పడ్డారు. నిజమే నలుగురూ నాలుగు రాజ్యాల వారు. కాలా తన ఆలోచన చెప్పాడు. ముగ్గురూ ఆమోదించారు. “ప్రస్తుతానికి మనం విడిపోదాం. మళ్ళీ కలుసుకునేటపుడు సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం” చెప్పాడు కాలా. సరేనని నలుగురూ బయలుదేరారు. వెళ్తున్న వారికి తమ గతం గుర్తుకు రాసాగింది.
కాలా అనబడే విక్రముడు అవంతి రాజ్యంలోని వీర యువకుడు. అక్కడి సైన్యాధ్యక్షుడు చేసే అరాచకాలను ఎదిరించాడు. దానివలన సైన్యాధ్యక్షుడు విక్రముని కుట్రదారునిగా రాజు ముందు నిలబెట్టాడు. రాజు మరణశిక్ష విధిస్తే, సైన్యాధ్యక్షుడు, సంకెళ్లు వేసి, అర్ధనగ్నంగా పురవీధుల్లో తిప్పి అవమానించాడు. విక్రముడు తప్పించుకొని అడవుల్లో చేరాడు.
నీల అనబడే శూరసేనుడు భోజ రాజ్యానికి చెందిన ఆయుధాల తయారీ నిపుణుడు. ఆ రాజ్యానికి సంబంధించిన ఆయుధాలు శూరసేనుడి ఆయుధాగారం లోనే తయారయ్యేవి. కానీ అవినీతిపరుడైన మంత్రి ఆయుధాల తయారీకి రెండింతలు ఎక్కువ సొమ్ము ఖర్చు చూపించి ఇద్దరికి చెరిసగం అన్నాడు. శూరసేనుడు ఒప్పుకోలేదు. అక్రమంగా పొరుగుదేశాలకు ఆయుధాలు అమ్ముతున్నారనే నేరం మోపి, రాజ్యబహిష్కరణ చేయించాడు. శూరసేనుని ఆయుధాగారాన్ని వశపరచుకున్నాడు. శూరసేనుడు కట్టుబట్టలతో, ఇల్లు, కుటుంబం బంధువులు అందరిని విడిచి రావాల్సివచ్చింది.
శ్యామా అనబడే వీరసింహుడు నిజానికి కార్ముఖ యువరాజు. కానీ వీరసింహుని తండ్రి వద్ద సైన్యాధికారిగా పనిచేస్తున్న ఫాలాక్షుడు, రాజును చంపి, ప్రమాదంగా చిత్రించి, చిన్నవాడైన వీరసింహుని బదులు తాను పరిపాలన చేస్తానని, యువరాజుకు తగిన వయసు వచ్చి, సకల విద్యలలో ప్రవీణుడైతే అప్పుడు రాజ్య పట్టాభిషేకం చేసి మళ్ళీ సైన్యాధికారిగా పనిచేస్తానని అందరిని నమ్మ బలికాడు. అందరూ నిజమేననుకున్నారు. కానీ వీరసింహుని మీద కూడా హత్యాయత్నం జరిగేసరికి, వీరసింహుడు కోటలో నుంచి పారిపోయాడు. పల్లెల్లో పెరిగి, స్వతంత్రంగా యుద్ధవిద్యలు నేర్చుకొని, తిరిగి ఫాలక్షుని దగ్గరే సైన్యాధికారిగా చేరాడు. ఎప్పటికైనా తన రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని వీరసింహుని కోరిక.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.