Menu Close
Balluri Umadevi
దాతృత్వం (పద్యకవిత)
డా. బల్లూరి ఉమాదేవి
ఆ.వె: పరుల యాకలి గని పరితపించుచు చేయు 
        సాయ మొసగు మదికి శాంతి నిజము
        నున్న దాని లోన నొరుల కింత యిడిన 
        దానమదియె యౌను ధరణి యందు.
ఆ.వె: ఆక లెరిగి పెట్ట నన్నమే పరమాన్న
        మనుచు నార్త జనము లారగించి
        తృప్తి తోడ నొసగు దీవెనే రక్షయై
        కాచు చుండ మనల కడవరకును.
ఆ.వె: ఎండి కమిలి నట్టి పండుటాకుల వంటి 
        వారి కడుపు నింప వాసి గాను 
        నింతకన్న మంచి యీవియు కనరాద
        టంచు పల్కుమాట లాదరించు.
ఆ.వె: కష్టకాలమందు కరమెత్తి పెట్టెడు
        పిడికెడన్న మదియె పెన్నిధౌను
        లేమి లోన కూడ లేదన కుండగ
        పరుల కిడిన చాలు హరియు మెచ్చు

రచయిత పరిచయం

Balluri Umadevi

నా పేరు డా. బల్లూరి ఉమాదేవి. కర్నూల్ జిల్లా లోని ఆదిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా (తెలుగు) పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాను. వివాహానంతరం బి ఏ, యం ఏ పూర్తి చేశాను. 2005 లో (నా 52 వ ఏట) తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీల పాటలు పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాను. మా తాతగారు, తండ్రిగారు, పెదనాన్నలు తెలుగు పండితులే కావడం వల్ల తెలుగు భాష పట్ల చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువగా వుండేది. అప్పుడప్పుడు పద్యాలు కవితలు రాసే నేను, పదవి విరమణ తర్వాత శంకరాభరణం గ్రూప్ వారి 'సమస్యా పూరణల'తో మరలా రచనకు శ్రీకారం చుట్టాను.

నా ముద్రిత గ్రంథములు (13)

1.శ్రీరామదూత శతకము 2.అక్షర వనం 3. మనో గీతికలు 4.తెలుగు బిడ్డ శతకము 5.శ్రీనివాస శతకం 6.దేవి శతకము 7.శ్రీ రామచంద్ర శతకం 8.శివపురాణ మహత్యము 9.శారదాంబ శతకం 10.హనుమత్ శతకము 11.హనుమోదాహరణము 12.కనకదుర్గ శతకము 13.శ్రీమద్భాగవతము- ఆణిముత్యాలు.

అముద్రిత గ్రంథములు: 1. హిమపవనాలు 2. ఖండకావ్య సమాహారం 3. 'ఆసరా' ఐదు ఆశ్వాసంలో సామాజిక పద్య ప్రబంధము 4. 'జీవన స్రవంతి' ఐదు అంకముల (పద్య నాటకం) 5. విష్ణు దేవ శతకము.

వాల్మీకి రామాయణంలోని అన్ని కాండలలోని కొన్నిసర్గలకు తేటగీతి ఛందస్సు 500 వరకు పద్యాలు రచించాను. వివిధ అంశములపై (సమస్యా పూరణాలు, దత్తపదులు) 5000 పద్యాలు రచించాను.

2000 వరకు కవితలను, 300 పాటలను రచించాను. కొత్త ఛందస్సులలో 100 పద్యములు రచించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు పొందాను. జాతీయ సదస్సులలోను ప్రముఖ పత్రికలలో నా వ్యాసములు ప్రచురితమైనవి. కర్నూలు రేడియో కేంద్రంలో వివిధ అంశములపై ప్రసంగములు చేశాను.

పొందిన బిరుదులు:

సహస్ర కవిరత్న, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి చక్రవర్తిని, సహస్రపద్యశ్రీ, (10500 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారిని చేతుల మీదుగా సహస్రపద్యశ్రీ బిరుదము అందుకున్నాను) కవితా భూషణ, కవిత విభూషణ, మహతి సాహితీ చక్రవర్తి ,కవివరా మొదలగు బిరుదులతో పాటు నారీ శక్తి పురస్కారం, కీర్తిరత్న పురస్కారం అందుకున్నాను.

అనేక అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పలుమార్లు నిషిద్ధాక్షరికి పృచ్ఛకునిగా పాల్గొన్నాను.

Posted in June 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *