స్రవంతి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
గ్రీష్మతాపము కం. శీతాంశుఁడు తల నెలకొన శీతాచలపుత్రి సగము చేకొన మేనన్ సీతాపతినామంబే చేతమునన్ నిలువఁ దపన శివుఁ డెట్లెఱుఁగున్? కవనబాల ఉ. బాలికయే కవిత్వ మగుఁ; బద్యమె యూయెల గాఁగ; భావముల్ డోలనలౌఁ గదా; యెడఁద లోతుల స్పందన జోలపాటయౌ; కేళికి బొమ్మలౌ యతులు; కేళుల పూసలె ప్రాస; లూపు హ స్తాలగు ఛందముల్; జనని శారద; నవ్వులె వేల కానుకల్ ధ్వజస్తంభము సీ. ఆలయమందిరవ్యత్యాసమునుఁ దెల్పు ముఖ్యసేవకుఁడయి ముందు నిలుచు వినువీధి విహరించు వివిధగణంబుల కితఁడె చూపును దేవు నిరవు భువిని బ్రహ్మోత్సవాలకు బహుదేవతలఁ బిల్వ నాలంబన మితండె యాలయముల దేవతామూర్తిముద్రితలోహకవచాలు పలుతావులను దాల్చి వన్నె కెక్కుఁ తే.గీ. దొలుత భక్తుల వందనమ్ములను దీప హారతులఁ గొంచు ఘంటిక లమర నెండ వాన లెన్నక దీక్షమై బయట నిలుచు దీర్ఘకాయుని సేవలు దివ్యములగు ఆధ్యాత్మికయానము ఉ. నీ కరుణాసముద్రమున నీ పదభక్తియె నావ గాఁగ, లో కైకశరణ్య! నీ స్మరణలే తెరచాపలు గాఁగ, నా కృతుల్(1) ప్రాకటమైన తెడ్లగుచుఁ బత్నియె పీలిగఁ(2) జూప సద్గతిన్, నీ కనుచూపె నావికుఁడు, నిష్ఠయె శక్తిగఁ జేర్చు నీ దరిన్ (1) రచనలు (2) చుక్కానిగా
11