అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
గురుపూర్ణిమ సీ. ఈఁత నేర్పెను జేఁప, యెగుర నేర్పెను బక్షి, చీమ నేర్పెను గ్రమశిక్షణన్న, నిర్మింప షడ్భుజి నేర్పెను జుంటీగ(1), నేర్పె నృత్యము కేకి(2), నేర్పెఁ బికము(3) సుస్వరమ్మును, నేర్పె శునకమ్మువిశ్వాస మును, కాకి సంఘజీవనము నేర్పె, నెడ్లు నేర్పెనుగదా కృషి యొనర్పఁగ, నేర్పె కులవర్ధనము సేయ గోవు, దూర నిశితదృష్టిని గ్రద్ద నేర్పె, భారము మోయ నేర్పె ఖరము, కాలనియతి నేర్పె నరుణచూడము(4), నేర్పె హరిణమ్ము చలనమ్ము, బంగారుపిచ్చుక స్వగృహరచన నేర్పె, స్థైర్యము కొండ నేర్పె, చె ట్టెదుగుట నేర్పె, సుమమ్ములు నేర్పె మృదుల భావన, లమృతమ్ము పారించి నదులు ద ప్పిని దీర్చి బ్రతుకు పావనముసేయ తే.గీ. నేర్పె, నివి మానవునకును నిత్య గురువు లిట్టి భాగ్యమ్ము నిడిన ప్రకృతికిఁ, బ్రథమ గురువు తల్లికి, జనకాదిగురువరులకుఁ బ్రణతు లీ గురుపూర్ణిమపర్వ మందు (1) తేనెటీగ (2) నెమలి (3) కోయిల (1) అరుణచూడము=కోడి 285 లలితాదేవి కం. లలితాకరకంకణయుగ లలితస్వనదృశ్యభాగ్యలాలితశ్రుతిదృ క్కలితాస్యధన్యతనుకృత కలిమలహరనతిశతంబె కాచుత జగతిన్ భావము- అమ్మవారి రెండు చేతుల కంకణములు చేయు ఇంపైన శబ్దముల, కనబడు దృశ్యముల, వలన అదృష్టము అబ్బిన చెవులు, కన్నులు కల ముఖములతో, ధన్యమైన శరీరములతో భక్తులు చేయు కలిదోషహరములైన బహునమస్కారములు ప్రపంచమును కాపాడుగాక! 286 సీ. అఖిలజీవుల ప్రాణ మాడించు జగదంబ రక్షయౌ జగతికి బ్రతినిమిషము కాలిగజ్జెలమ్రోఁత కలిదోషములఁ ద్రోలి పలుకు శుభాలకు స్వాగతంబు చేతికంకణములు సేయు నిస్వనములే యందఱి కాశీస్సు లందఁజేయు వాత్సల్య మొలికించు పరదేవతాపాంగ వీక్షణంబె నితాంతవిత్ప్రదంబు తే.గీ. జననమరణపునర్జన్మచక్రముక్తి కలుగఁజేసి తదంఘ్రిపంకజపదాన నిలిచి సేవించు భాగ్యమ్ము గలుగఁజేయు త్రివిధశక్తి(1)స్వరూపిణి శ్రీమదంబ (1) ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి287 తల్లీబిడ్డలు సీ. ప్రాసలబాసతో నూసులాడెడు తల్లి యొడిలోనఁ బసికూన యొదిగినట్లు జ్ఞానామృతముఁ(1) బట్టి కడుపు నిండఁగఁ జూచి చిరుబొజ్జపై బట్ట చేర్చినట్లు ప్రాఁబల్కు(2)సారంబు పాడఁగా జోలగా చేయి పట్టుక నిద్రవోయినట్లు పలుదేవతలు వచ్చి పలుకరించినరీతి బోసినవ్వులు విరబూసినట్లు తే.గీ. జన్మజన్మలఁ దఱుఁగని శాశ్వతమగు మాతృపుత్రానుబంధమై మమతఁ బంచ నేమి చెప్పెదఁ గేరింత లే ముదమ్ము తెలుపు తల్లిరొ(3) సహజమై నిలిచి యెపుడు (1) జ్ఞాన మనెడు పాలు (2) వేదముల (2) తెలియ జేయును తల్లీ!/ తెల్లనితల్లీ! (సరస్వతీ!) 288 సీ. అజ్ఞానవారిధి నవలీల దాఁటించు పదబంధనిర్మాణప్రజ్ఞ నొసఁగి మూస వోసినరీతి సీసాలఁ బలికించి కవనవేదిక నాట్యకలన(1) గూర్చి కవిపండితప్రాజ్ఞగణగణనీయమౌ శ్రావ్యసుస్వరగాత్రసంపద నిడి మాలికాపద్యసుమాల హృద్యంబగు కంఠమాలగ నీకుఁ గాన్క నీయ తే.గీ. నింత వాత్సల్య మొలికించి చెంత నుండి చిన్నిపొన్నారి మాటల కిన్ని హంగు లద్ది తిలకించి మురిసిన యమ్మ వీవె ప్రణుతవాగ్దేవి! శారదా! ప్రణతిశతము! (1) కలన=ఎఱుగుట 289 దేవీదర్శనవైవిధ్యము సీ. ఒకపరి నుయ్యాల నూఁగెడు నింకొక్క పరి దరిఁ జేరెడు బాల యగుచు, నొకపరిఁ జిటుకుల(1) నుండు చాముండియై, కనకదుర్గాదేవిగా నొకపరి, జ్ఞానసరస్వతిగా నొక్కపరిఁ, గొల్హ పురలక్ష్మిగా నొక్కపరిని, రామ పత్ని సీతగ నొక్కపరి, నన్నపూర్ణగా నొకపరి, లలితగా నొక్కపరిని, తే.గీ. మాత యాదిపరాశక్తి మమ్ముఁ గాంచి నికటప్రకటితవాత్సల్యసకలశుభద మంగళాయతరూపమ్ము మాకుఁ జూప నంచితసువర్ణసుమము(2) లర్పించువాఁడ (1) చిటుకులగ్రామము, సంగారెడ్డి జిల్లా (2) పొందబడిన మంచి అక్షరపుష్పాలు 290
7