Menu Close
నిర్మలాదిత్య
కథ వెనుక కథ
నిర్మలాదిత్య

ఫ్లోరిడా లో ఉండటం వల్ల క్రూజ్ ప్రయాణాలు బాగా పరిచయమే. సముద్రంమీద తేలుతున్న ఈ నగరాలలో జీవనోపాధికి పని చేసే జనం సంఖ్య ప్రయాణికుల సంఖ్యకు ఏ మాత్రం తీసిపోదు. అలా పనిచేస్తున్న జనంలో భారతీయులు, అందులోనూ యువతలో ఉన్నవారు తరచూ తటస్థ పడుతుంటారు. నిర్మలా కలుపుగోలుతనం వల్ల వీళ్ల ఆసక్తి కరమైన జీవితాలు కూడా పరిచయం అవ్వడం ఈ ప్రయాణాలలో దొరికిన బోనస్. ఒకో జీవితం ఒకో కథ .

ఉద్యోగం చేరిన కొత్తలో, నా స్నేహితుడు తనకు పిల్లవాడు పుట్టినప్పుడు ‘I am blessed’ అని వ్రాశాడు  ‘పెళ్లి అయ్యింది. సంతానం కన్నాడు. ఇందులో బ్లెస్సింగ్స్ ప్రసక్తి ఏముంది?'’ అని నాలో నేను నవ్వుకున్నాను. దానికి సమాధానం తరువాత సంతానం లేక అల్లాడిపోతున్న వారిని చూసిన తరువాత దొరికింది. కానీ అలా అల్లాడిపోతున్న వారికి కొన్ని సార్లు మిగిలేది సమాధానం లేని ప్రశ్నే.

చదువు, జీవన ప్రయాణం - వివిధ మతాలను పరిచయ చేశాయి. మతాలలో భేదాలు ఉన్నా, వీటన్నిటిలో బోధించే సామాజిక కట్టుబాట్లలో నాకు పెద్ద తేడా కనిపించలేదు. కానీ మతం బట్టి ఈ భగవంతుడి రూపు రేఖలు, సందేశాలు మారిపోవడం నాకు ఒక కొరుకుబడని ప్రశ్నే. అసలు మనిషికి మతం అవసరమా? అవసరమయితే ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి.

కానీ ఈ కథ ఆ సమాధానాల గురించి కాదు. సమాధానం లేని ప్రశ్నలతో మనిషి ఎలా జీవిస్తాడో అన్న దాని గురించి. చదివిన తరువాత మరిన్ని ప్రశ్నలు ఉదయిస్తే ఆశ్చర్యపడను.

అజ్ఞేయవాది?

అజ్ఞేయవాది?

"నేను ఓ గుడి కట్టాల్సి వచ్చింది!" అంది కిరణ్మయి.

"కిరణ్మయి. డాక్టర్ కిరణ్మయి! నువ్వేంటి, గుడి కట్టడం ఏమిటి? నువ్వో అజ్ఞేయవాదివి కదా? దేవుడంటే ఉన్నాడో లేడో ఖచ్చితంగా చెప్పలేని దానవు," అన్నాను నేను, నా గొంతులోని వెటకారం ఏమాత్రం దాచకుండా.

"నేనో అగ్నోస్టిక్ అంటున్నావా? నేను గుడి కట్టింది నిజమే, నన్ను నమ్ము. జాహ్నవి, పిల్లలు కనడానికి, నువ్వు పంపావని వచ్చింది. నేను నాకు తెలిసిన విద్యలన్నీ ప్రయోగించి ప్రయత్నించాను. విఫలమయ్యాను. అందుకే గుడి కట్టడమే శరణ్యమనుకున్నాను. థట్ ఈజ్ ది బాటమ్ లైన్."

కిరణ్మయి, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. కాదంటే కిరణ్ మెడికల్ కాలేజీ లో చదివి డాక్టర్ గా స్థిర పడింది. నేను ఇంజినీరింగ్ చేసి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరాను. ఆ యూనివర్సిటీలో తరువాత టెన్యూర్ దొరకడంతో నా లైఫ్ సెటిల్ అయ్యి పోయింది.

కిరణ్ హాస్పిటల్ సెట్టింగ్లో ఇమడ లేక పోయి, సొంతగా క్లినిక్ పెట్టడం, వచ్చిన డబ్బుతో ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలు పెట్టడం, అటు తరువాత మరిన్ని బిజినెస్ లు మొదలు పెట్టడంతో చాలా డబ్బులు సంపాదించేసింది. ఇక్కడ తను కట్టించిన మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఇండియా లోనూ ఓ మెడికల్ కాలేజి, హాస్పిటల్ మొదలెట్టింది. రెండు దేశాల నుంచి మంచి సంపాదన. ఏమి చేయాలో తెలియని పరిస్థితి లో బీచ్ పక్కన్న ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ కట్టి అందులోనూ డబ్బులు విరగ పూయిస్తున్నది.

ఇప్పుడు మేమిద్దరం ఆ రిసార్ట్ లోనే టెర్రెస్ పైన కూర్చుని అప్పెటైజర్లు, డ్రింక్స్ సేవిస్తున్నాము. ఇదో అలవాటు. ప్రతీ శుక్రవారం సాయంత్రం ఐదుకల్లా మేమిద్దరం ఎన్ని పనులు ఉన్నా, అవి ప్రక్కన బెట్టి ఎక్కడో ఓ బార్ లో కలిసి ఓ డ్రింక్ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటాము. కిరణ్మయి కొత్త రిసార్ట్ కట్టిన తరువాత ఇద్దరమూ ఇక్కడే కలుస్తున్నాము. మాకో టేబిల్ ప్రత్యేకంగా కిరణ్మయి కేటాయించింది.

బాల్య సఖి తో మాట్లాడుతూ, మిచెలిన్ రేటెడ్ రెస్టారెంట్లో సూషి తింటూ, మాకంటూ ప్రత్యేకంగా చేసిన కాక్టెయిల్ త్రాగుతూ, సూర్యడస్తమించడం చూడడం ఎంత ఆనందంగా ఉంటుందో నేను చెప్పలేను. ఎదురుగా ఆకాశం ఇంకా నీలంగానే ఉంది. ఆకాశం బుగ్గలకు బ్లషర్, పెదాలకు లిప్స్టిక్ రాసి సూర్యున్ని పార్టీకి పిలవడానికి ఇంకా సమయం ఉంది. సముద్రం ఇంకా నీలంగా ఉంది. సముద్రం చూస్తూనే, మళ్లీ జాహ్నవి గుర్తుకు వచ్చింది.

***

సముద్ర తీరంలో ఉండడంలో ఆనందం అది అనుభవించిన వారికే తెలుస్తుంది. జీవితంలో నేను నివసించిన నగరాలన్నీ సముద్రం పక్కన ఉండడం నా అదృష్టం. అందమైన ప్రకృతి, ఫ్రెష్ సీ ఫుడ్ తో బాటు సముద్ర విహారానికి ఈనగరాలలో క్రూయిజ్ ఓడలు ఉంటాయి. మామూలు మనం ఓ హోటల్ కు పెట్టే ఖర్చులోనే విందు భోజనాలు, వినోదం, విహార యాత్రలు, వింత దేశాల సందర్శన అన్నీ దొరకడం అరుదే. అది క్రూయిజ్ వల్ల సాధ్యం. అందుకే అడపాదడపా నేను క్రూయిజ్ లో ప్రయాణం చేయడానికి మగ్గు చూపుతాను.

నా మొదటి క్రూయిజ్ కేప్ కార్నివాల్ నుండి బహమా ద్వీపాలకు. ప్రతి క్రూయిజ్ ఓడ ఓ నగరమే. ఓ రెండు వేల చిలుకు ప్రయాణికులుంటే అంతకంటే ఎక్కువే పని వారుంటారు. ఆ పని వారిలో ఎక్కువ మంది మన ఆసియా వాసులే. చాలామంది భారత దేశీయులు కూడా కనబడుతుంటారు.

నాకు కొత్త వారితో పరిచయం చేసుకోవడం, మాట్లాడడం ఇష్టం కాబట్టి అక్కడి పని వారితో తరచు కబుర్లు వేసుకొనే దాన్ని. మన వారితో మాట్లాడేటప్పుడు ఈ సంభాషణలు మరింత సమయం తీసుకొన్నా, నాకు, వారికి, ఆ పరిచయాలు ఆనందం కలిగించేవి. ప్రయాణం చేసి నన్ని రోజులు వారిని పేరుతో పిలవడం, ఆప్యాయంగా మాట్లాడడంతో, వాళ్ళు నన్ను కొంత ప్రత్యేకంగా చూసే వారు.

పూల్ పక్కన్నున్న బార్లో కేరళ నుంచి వచ్చిన సందీప్, ఫోటో బూత్ లో, పడవ దిగేటప్పుడు ఎస్ ఎల్ ఆర్ కెమెరాతో నవ్వుతూ ఎదురుపడే హైదరాబాద్ నివాసి షరీఫ్, డ్యూటీ ఫ్రీ షాప్ లో పనిచేసే బిహారీ రాజ్ అందరూ బాగా ఫ్రెండ్స్ అయ్యిపోయారు. ఎక్కువ మంది మగవారే. సాయంత్రం ఫార్మల్ డైనింగ్ కని రెస్టారంట్ కి పోతే అక్కడ తటస్థ పడింది, జాహ్నవి. వచ్చిన అతిథుల పేర్లు కనుక్కొని, వారికి కేటాయించిన టేబిల్ నంబర్ దగ్గరికి వారిని తీసుకెళ్ళి వారిని కూర్చో పెట్టడం తన పని. మన దేశం నుంచి అబ్బాయిలనే చూసిన నాకు జాహ్నవి కనపడటం ఆనందంగా ఉంది. పేరడిగి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

"నా పేరు జాహ్నవి. నేను కాకినాడ నుంచి వచ్చాను," అంది జాహ్నవి తన షర్టు మీద ఉన్న నేమ్ టాగ్ చూపెడుతూ.

"కాకినాడ నుంచి నాకు చాలా మంది స్నేహితులున్నారు. ఈ ఓడలో, మన దేశం నుంచి వచ్చిన వాళ్ళలో, అమ్మాయివి నువ్వు ఒక్కతే ఉన్నట్లు ఉన్నావు. భయం లేదా నీకు?" అన్నాను నేను.

"దేనికి భయం? పడవ ప్రయాణం అనా? నేను కాకినాడ లో పెరిగాను. పడవ ప్రయాణం, సముద్రం రెండూ నాకు ఇష్టమే. ఇక ఇక్కడి పని చేసే వారందరూ మంచి వారే," నవ్వుతూ అంది జాహ్నవి.

మరుసటి రోజు పొద్దున్నే ఐదున్నర కంతా పూల్ పక్కన ఉన్న, కాఫీ స్టేషన్ లో ఓ వేడి వేడి కాఫీ ఓ కప్పులో పోసుకొని, పై అంతస్తులో ఉన్న డెక్ కి వెళ్ళాను. నా భుజం మీద తగిలించిన కెమెరా బ్యాగ్ అక్కడే ఉన్న ఓ లౌంజ్ చైర్ పైన పెట్టి, నా ఎస్ ఎల్ ఆర్ కెమెరా తీసి టెలీ ఫోటో లెన్స్ అమర్చాను. సూర్యోదయానికి ఇంకా సమయం ఉంది. అక్కడే చైర్ లో కూలబడి కప్పులో నుంచి కాఫీ తాగుతూ, రంగులు మారుతున్న తూర్పు ఆకాశాన్ని ఫోటోలు తీయడం మొదలెట్టాను.

"ఎంత అందంగా రంగులు మారుతున్నాయి కదూ," పరిచయమున్న కంఠం వినబడింది. తల తిప్పి చూస్తే జాహ్నవి.

"అవును. అప్పుడే లేచేసావా జాహ్నవి," ఆనందంతో పలకరించాను నేను.

"అవునండీ. తెల్లవారే లేస్తాను. సూర్యోదయం చూడడానికే. సముద్రం మీద నుంచి సూర్యోదయం చూడడం ఎంత అందంగా ఉంటుంది. ఇంత అరుదైన అవకాశం ఉన్నా, దాదాపు ఐదు వేల పై చిలుకున్న ప్రయాణికులలో, ఓ పది మంది కూడా ఈ డెక్ పైన కనపడరు," నవ్వుతూ అంది జాహ్నవి.

తరువాత అర గంట జాహ్నవి తో కబుర్లు చెబుతూ, సూర్యోదయం ఫోటోలు తీస్తూ ఇట్టే గడిపేసాను.

టెలిఫోటో లెన్స్ తో తీయటం వల్ల సూర్యోదయం ఫోటోలు చాలా అందంగా వచ్చాయి. ప్రతీ ఫోటో పోస్టర్ గా కొట్టి అమ్మివేయ వచ్చునేమో. అంత అందంగా వచ్చాయి ఫోటోలు. జాహ్నవికి కూడా ఫోటోగ్రఫీ ఇష్టం అవ్వడంతో నేను తీసిన ఫోటోలు తను చూసి, తన అభిప్రాయాలు పంచుకొనేది.

జాహ్నవి వల్ల తెలిసిన విషయం వారి కాంట్రాక్ట్ సామాన్యంగా 8 నెలలుంటుందని. ఈ సమయం మొత్తం ఓడలోనే గడుపుతారు. తరువాత ఆ చిన్న వెకేషన్ తీసుకొని, ఇండియాకి వెళ్లి, తిరిగి ఓడకే వచ్చి పనిలో చేరిపోతారు. అప్పుడప్పుడు పోర్టులో దిగి ప్రదేశాలు చూడగలిగిన, ఓడలో పని విపరీతంగా ఊపిరి సలపనంత గా ఉంటుంది. 'ఇంటికి డబ్బు పంప గలుగుతున్నాము, నా వారంతా దాని వల్ల ఆనందంగా ఉన్నారు' అన్న ఒక ఆలోచన వారికి శ్రమ బడలిక నుండి సేద తీరుస్తుంది.

మాటల్లో జాహ్నవి తన పెళ్లి నిశ్చయమైనట్లు, పెళ్లి కొడుకు మర్చంట్ నేవీలో పని చేస్తున్నట్లు చెప్పింది. నేను తనకు బెస్ట్ విషెస్ చెప్పి అక్కడే షిప్ లో ఓ చిన్న బ్రేస్లెట్ కొని ఇచ్చాను.

"అబ్బే ఇదేంటి?" అని తత్తర పడిపోయింది జాహ్నవి.

"చా ఆ కన్నీలేంటి. కళ్ళు తుడుచుకో," అన్నాను నేను.

"ఇంత మంది ప్రయాణికులు ఉన్నా, ఆప్యాయంగా పలకరించే వారు తక్కువ. చాలా మటుకు మేము కనిపించము. మీరు ఇలా పలకరించడం, తెలుగులో మాట్లాడటం నాకెంతో సంతోషమని పిస్తున్నది. చాలా థాంక్స్," కళ్ళు తుడుచుకుంది జాహ్నవి.

ఆఖరి రోజు రెస్టారెంట్ లో భోజనం చేసిన తరువాత, డెసెర్ట్ తినేటప్పుడు జాహ్నవి మా టేబిల్ దగ్గరికి వచ్చి వీడ్కోలు తీసుకుంది. మరుసటి రోజు పొద్దున్నే ఓడ దిగి, పార్కింగ్ లో ఉన్న కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను.

మళ్లీ జాహ్నవిని చూడడం ఓ పదేళ్ల తరువాతే వీలు పడింది. కోవిడ్ రాకముందు సంవత్సరం టాంప నుంచి మెక్సికో లో ఉన్న కాసుమెల్ కు క్రూయిజ్ ఉందంటే, ఓ ఐదు రోజులు వెకేషన్ తీసుకొని, టికెట్ బుక్ చేసాను. ఇది మరో ఓడ. కొత్తది కాబట్టి మార్పులు చేర్పులు బాగానే చేశారు. ఆరంతస్తుల ఎత్తు ఉన్న అట్రియం నాకు తెగ నచ్చింది. అక్కడ తిరుగుతూ ఉంటే మూడో అంతస్తు లోని కారిడార్ లో ఉన్న ఫోటో స్టూడియో నన్నాకర్షించింది. అటు వైపు నడుస్తుంటే ఎదురుగా జాహ్నవి. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకొని ఆగిపోయాం. జాహ్నవి లో బాగా మార్పు వచ్చింది. స్కర్ట్ కోట్ వేసుకొని ఓ మేనేజర్ లాగా ఉంది. కొద్దిగా వళ్ళు చేసినా ఆకర్షణీయంగానే ఉంది.

"జాహ్నవి? వాట్ ఎ సర్ప్రైజ్? ఏంటి రూట్ మార్చావు. టాంపకు, ఈ కొత్త రూట్కు ఎప్పుడు మరావు? యు లుక్ గుడ్," నేనే జాహ్నవి ని ముందు పలకరించాను.

"నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేనే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ తీసుకొని ఇలా మారాను. నాకు మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. నా ఓడ, రూటు రెండూ మారిపోయాయి," నవ్వుతూ అంది జాహ్నవి.

ఫోటో సెషన్ అంటూ జనం వేచి ఉండడంతో, తరువాత కలుద్దాం అని పెద్దగా మాట్లాడకుండా వీడ్కోలు తీసుకున్నాను.

మరుసటి రోజు సూర్యోదయానికి నా కెమెరా, కప్ నిండా కాఫీ తో డెక్ కి వెళ్ళాను. నేను అనుకున్నట్లు అప్పటికే జాహ్నవి అక్కడుంది.

సూర్యున్ని ఎదురు చూద్దాం అని వెళ్లిన నాకు పున్నమి చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. పిచ్చిగా వెన్నెల కాస్తున్నది. వెలిగి పోతున్న చంద్రుడు, అలా షికార్ కెళ్తున్న పిల్ల మేఘాలు, చంద్రుని కాంతి వలన సముద్రం మీద వేసిన వెండి బాట పైన దోబూచులాట ఆడుతుంటే, అది చూసిన ఆకాశం బుగ్గలు మెల్లగా సిగ్గుతో ఎర్రబడి పోతున్నాయి.

ఇద్దరం మాట్లాడలేదు. నేను అప్పుడప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాను.

"ఎంత సర్రియలిస్ట్ గా, అందంగా ఉంది కదా. నీవు తీయలేదా ఫోటోలు. నీవు ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కదా," అన్నాను నేను నిట్టూర్పు విడుస్తూ.

"అవును అందంగా ఉంది. గత ఐదు ఏళ్లు కార్తీక పున్నమి రాత్రుల, శరద్ రాత్రుల, మరిన్ని పున్నమి రాత్రుల ఫోటోలు తీసాను. ఆ కనిపిస్తున్న వెండి మార్గం మీద, కొన్ని వందల సంవత్సరాలకు ముందు, పెళ్లి అయ్యిన యువతులు పడవల మీద, ప్రయాణం చేసేవారని, మీకు తెలుసా. వారంతా కాసుమెల్ ద్వీపానికి పోయే వారు," అంది జాహ్నవి.

"జాహ్నవి, అయితే నీ ఫోటో కలెక్షన్ చూడాల్సిందే. ఈ యువతుల కథ ఏమిటి?," కాఫీ తాగుతూ అడిగాను నేను.

"మీరు మొదటి సారి కాసుమెల్ ద్వీపానికి వస్తున్నట్లున్నారు. ద్వీపంలో మాయన్ గుడి ఒకటి ఉంది. ఆ గుడి 'ఈ షెల్' దేవతకోసం కట్టారు. గుడి నిర్మాణం నాలుగు ప్రాకారాలు, మండపాలు, బలి పీఠం, గర్భగుడి లతో మన హిందువులు ఆగమ శాస్త్రాలకనుగుణంగా కట్టిన గుడి లాగే ఉంటుంది. ద్వీపం ఒడ్డున నుండి, ద్వీపం లోపల కట్టిన గుడి వరకు వేసిన శ్వేత గవ్వల బాట, గవ్వల మెరుపుతో, ఈ సముద్రం మీదున్న వెండి బాట కు జత అయ్యిపోయి ఒకటే దారి లాగా అనిపిస్తుంది," ఆనందంగా ఆ గుడి అందాలు వర్ణించడం మొదలెట్టింది.

"అవును, ఇలాంటివి విన్నప్పుడు మన మానవులందరూ ఒకే సంస్కృతి తో మొదలెట్టి క్రమంగా దూరభారం వల్ల విడి పోయామని పిస్తోంది. అయినా నువ్వు నా సమాధానానికి జవాబు చెప్పలేదు," అన్నాను నేను.

"దానికే వస్తున్నా. ఈ ద్వీపంలో ఉన్న దేవత సంతానోత్పత్తికి మూల విరాట్టు. అందుకే కెరీబియన్ ద్వీపాల నుండి, దక్షిణ అమెరికా పలు దేశాల నుండి, యువతులు పెళ్లి అయ్యిన వెంటనే, పిల్లలు కావాలని ఈ గుడికి తీర్థ యాత్రలు చేస్తుంటారు," అంది జాహ్నవి. తన కంఠం లో జీర, బాధ. వెంటనే కళ్ళు తిప్పి జాహ్నవిని చూసాను. తన కంట్లో నీరు.

వెంటనే తనను దగ్గరకు తీసుకొని, "పిచ్చి పిల్ల. ఎందుకు కన్నీళ్లు? ఇండియాలో మీ వాళ్ళు గుర్తుకు వచ్చారా?" జాహ్నవిని సేద తీర్చ ప్రయత్నించాను.

"పెళ్లి అయ్యి 8 ఏండ్లు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. ఈ కాసుమెల్ రూటు దొరికితే, అదో అదృష్టం, ఈ-షెల్ దేవత దయతో నాకు పిల్లలు పుడతారని అనుకున్నాను. ఆ ఆశ తీరలేదు," అంది, ఇంకా ఏడుస్తూనే.

"పిల్లలు పుట్టాలంటే, మీ వారితో ఉండాలి కదా. నీవు ఈ పడవ మీద, మీ ఆయన మర్చంట్ నేవిలో ఉంటే, అదెలా సాధ్యం," అన్నాను కొంత కవ్వింపుగా. అలానైన, జాహ్నవి నవ్వుతుందేమో అని.

"అది సమస్య కాదు. మేము సంవత్సరం లో 4 నెలల దాకా సెలవు తీసుకొని ఇండియాలో కలిసే ఉంటున్నాము. ఈ పాటికి మాకు పిల్లలు పుట్టి ఉండవలసిందే," అంది జాహ్నవి.

"పిల్లలు పుట్టడం ఓ బ్లెస్సింగ్ జాహ్నవి. పిల్లలు లేని వారికి కానీ దాని విలువ తెలీదు. నాకు తెలిసిన డాక్టర్ US లో ఇలాంటి సమస్యల తీర్చడంలో దిట్ట. తను ఈ మధ్యే ఓ హాస్పిటల్, హైదరాబాద్ లో కట్టింది. ఫెర్టిలిటీ నుంచి, ఇన్ విట్రో, ఫీటల్ మెడిసిన్, నియో నేటల్, కాంప్లెక్స్ ప్రెగ్నెన్సీ లంటూ అన్నిటికీ ఓ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది. నేను తనతో మాట్లాడుతాను. ఆ సారి నువ్వు వెళ్ళి కలువు," అని సముదాయించాను.

జాహ్నవి ముఖంలో కొత్త ఆశ చిగురించడం, విషాద ఛాయలు మాయమవ్వడం నాకు ఆనందం కలిగించింది. ఇది జరిగి రెండు ఏళ్ళు అయ్యింది.

అదే జాహ్నవి, ఫేస్ బుక్ లో పాప బొమ్మ పెట్టి తనకూ ఓ వారసురాలు జన్మించిందని పోస్ట్ పెడితే తెగ సంతోషం వేసింది. వెంటనే కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్ అని రాసాను. కిరణ్మయి చేస్తున్న సేవ, ఇంత మందికి ఊరట, సంతోషం కలిగిస్తున్నందుకు మనస్సులోనే నా జోహార్లు అప్పగించుకొన్నాను.

ఈ సారి కిరణ్మయి ని కలిసినప్పుడు నేరుగా థాంక్స్ చెప్పాలి అనుకున్నాను.

***

"కిరణ్మయి, జాహ్నవి నీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంది కదా. నీ ట్రీట్మెంట్ వల్లే తనకు పాప పుట్టిందనుకున్నాను. మరి ఆవిడకి పాప పుట్టడం నీ వల్ల కాదంటావు ఏమిటి?," అన్నాను నేను.

"అవును హైదరాబాద్ లోని డాక్టర్లు నేను చెప్పిన ప్రకారమే జాహ్నవి తో పనిచేశారు. మేము వారం, వారం జూమ్ కాల్స్ లలో తన కేసు కూడా తప్పక చర్చించే వాళ్ళం. అందరికీ నా ఫ్రెండ్ నువ్వు రిఫర్ చేసిన కేస్ అని చెప్పేసాను. నాలుగు సార్లు ఇన్ విట్రో చేసి టెస్ట్ ట్యూబ్ బేబి కోసం ప్రయత్నించాం. అన్నీ ఫెయిల్ అయ్యాయి. మళ్లీ రెండు మూడు ఇతర ట్రీట్మెంట్ లు కూడా ప్రయత్నించాం. అన్నీ ఫెయిల్ అయ్యాయి. నీకు తెలుసా, ఇన్ విట్రో చేసినా, దాదాపు నలభై శాతం వారికి పిల్లలు పుట్టరు. అక్కడ మనకు తెలిసిన సైన్స్ నుండి సమాధానాలు లేవు. అందుకే జాహ్నవి కి ఇక లాభం లేదని చెప్పి పంపివేసాము. ఆశ్చర్యంగా అది జరిగిన మూడు నెలల్లోనే జాహ్నవి నెల తప్పింది. కొన్ని విషయాలు సైన్స్ కి అంతుబట్టవు," అంది కిరణ్మయి.

"అది సరే, మరి నువ్వు గుడి కట్టే ప్రసక్తి ఎలా వచ్చింది? దేవుడిని నువ్వు నమ్మవు కదా," అడిగాను నేను.

"దేవుడిని నమ్మని వారు నాస్తికులు, అతీస్ట్స్. నేనో అగ్నోస్టిక్ ని, అదే నువ్వంటున్న అజ్ఞేయవాది. దేవుడు ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఇక గుడి అంటావా, నేను పుట్టిన పల్లెటూరు నీకు తెలిసిందే కదా. నేను చిన్నప్పుడు ఊరికి వెళ్తే, ఊరి చివరన గ్రామ దేవతలకు కొన్ని గుళ్ళు ఉండేవి. అందులో నాకు బాగా గుర్తుండిపోయింది, ముత్యాలమ్మ గుడి. మశూచి వచ్చిన వాళ్ళు ఈ దేవతకు పొంగలి పెట్టి మొక్కుతారు. చిన్నప్పుడు కళ కళ లాడుతున్న ఈ గుడి ఇప్పుడు పూర్తిగా శిధిలమైపోయింది," అంది కిరణ్మయి.

"ఎందుకంటావు. బహుశా ఊరి జనం ఊరు వదలి పట్టణాల్లో స్థిర పడ్డరేమో?" అన్నాను నేను.

"అలా అయితే ఊరిలో ఉన్న గుళ్ళు అన్నీ పాడి పడి ఉండాలి. పడలేదే. రాముల వారి గుడి, గణపతి, ఆంజనేయ స్వామి గుళ్ళు నిత్య పూజలతో, భక్తుల రాక పోకలతో బాగా నడుస్తున్నాయి," అంది కిరణ్మయి.

"మరి ఆ పరిస్థితికి నీ కారణాలేమిటి," కొంచెం అసహనంగా నే అన్నాను నేను.

"నీకు గోవర్ధన గిరి కథ తెలుసు కదా. ప్రకృతి వల్ల వాటిల్లే ప్రమాదాలకు ఇంద్రాది దిక్పాలకుల కు సంబంధం లేదని కృష్ణుడు ఋజువు చేసిన వెంటనే ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా కొలవడం మానేసారు. అలానే, మశూచి నిర్మూలన తరువాత ముత్యాలమ్మ అవసరం తీరిపోయింది. ఆ గుడికి పూజలు చేయడం మానేసారు. గుడి పాడైపోయింది. నా అభిప్రాయం సైన్స్ ఎప్పుడు నిజం, తగిన ఋజువుల తో పాటు పంచుకుంటుంది. తరచూ ఆ ఋజువు మన మతంలో చెప్పిన విషయాన్ని లేక మనం అంత వరకు నమ్మిన అంశం ను తప్పుగా నిరూపిస్తుంది," అంది కిరణ్మయి.

"అంటే మతం, దేవుడు అవసరం లేదంటావా?" అన్నాను నేను.

"అలా అంటే నేను అగ్నోస్టిక్ ఎలా అవుతాను? సైన్స్ కు అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అర్థం కాకపోయినా, స్మిమితంగా ఉండడానికి మతం, దేవుడు అవసరమే. ఇదిగో నువ్వు పంపించిన జాహ్నవి కేసు అంతే. ఎంత ప్రయత్నించినా, మా ప్రయత్నాలకి పిల్లలు పుట్టలేదు, అటు తరువాత మేము ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వాళ్ళకి పిల్ల పుట్టింది. దానికి కారణాలు మాకు ఇంకా అంతు బట్టలేదు. అందుకే మా హాస్పిటల్ ఆవరణలో, వచ్చే జనాల కోసం 'సంతాన లక్ష్మి' గుడి కట్టాము. "

"అవును అప్పోల్లో హాస్పిటల్ వాళ్ళు మొదట చెన్నై లో హాస్పిటల్ కట్టినప్పుడు గణపతి బొమ్మ రిసెప్షన్ దగ్గరే నెలకొల్పడం గుర్తుంది. ఆ విగ్రహానికి తెగ మొక్కేవారు. మరి మీ సంతాన లక్ష్మి కి రెస్పాన్స్ ఎలా ఉంది," అడిగాను నేను.

"చెప్తే నమ్మవు. ఆ గుడికి ఏదో మహత్యం ఉందని పేరు వచ్చేసింది. పిల్లలు కావాలని ఆ గుడికి వస్తున్న జనం, మా హాస్పిటల్ కు వచ్చే జనాలకి మించి పోయారు. ఆ గుడి కి వస్తున్న ఆదాయం ఏమి చేయాలో తెలియక, కొత్తగా ఓ ట్రస్ట్ ఆరంభించాం! అజ్ఞేయవాది ఎందుకు గుడి కట్ట వచ్చునో ఇప్పుడైనా అర్థం అయ్యిందా?" అంది కిరణ్మయి నవ్వుతూ.

' అజ్ఞేయవాది, మై ఫుట్…నువ్వో గోడమీద కాపిటలిస్ట్ పిల్లివి!' మనస్సులోనే గొణుకున్నాను.

***
మధురవాణి త్రైమాసిక వెబ్ పత్రిక (2023)

Posted in June 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *