Menu Close
డా. వల్లూరుపల్లి శివాజీరావు
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi

Image by WikiImages from Pixabay

దక్షిణ ఆఫ్రికా - నాటాల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా గాంధీజీ

సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది

నాటాల్ సుప్రీమ్ కోర్ట్ కు గాంధీజీ సమర్పించిన తన న్యాయవాది దరఖాస్తును మొదట నాటాల్ న్యాయ సంఘం (Law Society of Natal) పరిశీలించి వ్యతిరేకిస్తూ లేఖ పంపించింది. దీనికి అంతర్లీనంగా ఉన్న ముఖ్య కారణం వర్ణ, జాతి వివక్షత. ఆ తరువాత జరిగిన విషయాలను గాంధీజీ ఇలా వివరించారు.

“నా దరఖాస్తును వ్యతిరేకిస్తూ వాదించటానికి Law Society of Natal ఒక ప్రముఖ న్యాయవాదిని నియమించింది. ఆయనకు దాదా అబ్దుల్లా కంపెనీతో సంబంధం ఉంది. ఈయన అబ్దుల్లా ద్వారా తనను కలవమని కబురు పంపించాడు. ఆయన నిష్కపటంతో, నిస్పక్షపాతంగా మాట్లాడుతూ నా పూర్వ చరిత్ర గురించి అడిగాడు. నేను అన్నీ చెప్పిన తరువాత ఆయన ఇలా అన్నాడు:

‘నాకు నీమీద ఎలాంటి వ్యతిరేక భావం లేదు. నీవు వలస రాజ్యంలో జన్మించిన సాహసికుడవు కాబట్టే భయపడుచున్నాను. నీవు నీ Original సర్టిఫికేట్ ను దరఖాస్తు తో జతపరచకపోవటం అనుమానానికి దారి తీసింది. ఇదివరకు తమకు చెందని, ఉపయోగపడని సర్టిఫికేట్లను జతపరచినప్పుడు వారి దరఖాస్తులను నిరాకరించటం జరిగింది. నీ ప్రవర్తన, నడవడిక గురించి యూరోపియన్ వర్తకులు ఇచ్చిన సర్టిఫికేట్లకు విలువలేదు. అసలు వారికి నీ గురించి ఏమి తెలుసు? వారితో నీకు ఎంత పరిచయం ఉందని నీవు సర్టిఫికేట్లను సేకరించావు. అసలు వారు నీకు ఎలా, ఏ ఆధారాన్ని బట్టి, ఇచ్చారు?’

దానికి నేను ‘నాకు ఇక్కడ అందరూ కొత్తవారే. చివరకు సేథ్ అబ్దుల్లా నేను ఇక్కడకు వచ్చేవరకు తెలియదు’ అని జవాబు ఇచ్చాను.

వెంటనే ఆయన ‘కాని అబ్దుల్లా భారతదేశంలో నీవు నివసించే ఊరునుంచే వచ్చాడని చెప్పావు. నీ తండ్రి అక్కడ ప్రధానమంత్రి కాబట్టి అబ్దుల్లాకు నీకుటుంబం గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఆయన వ్రాసి ఇచ్చిన ప్రమాణపత్రం (affidavit) నీవు ఇస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు. అప్పుడు నీ దరఖాస్తును వ్యతిరేకించలేనని Law Society of Natal కి తెలియజేస్తాను’ అని నాకు సూటిగా చెప్పాడు.

ఈ సంభాషణ నాకు కోపం తెప్పించింది. ‘నాకు సేథ్ అబ్దుల్లా ఇచ్చిన సర్టిఫికేట్ ను జతపరచినా నా దరఖాస్తును నిరాకరించటం జరుగుతుంది. అప్పుడు యూరోపియనులు ఇచ్చిన సర్టిఫికెట్లు కావాలనేవారు. అసలు నా పూర్వచరిత ఎలా ఉపయోగపడుతుంది ప్రమాణపత్రం ఇవ్వటానికి’ ఈ నా కోపాన్ని, ఆలోచనలను అదిమిపెట్టి ఆయనతో ఇలా అన్నాను.

‘యదార్ధానికి లా సొసైటీకి ఇటువంటి వివరాలు సేకరించటానికి తగిన అధికారం లేకపోయినా సేథ్ అబ్దుల్లా ప్రమాణ పత్రాన్ని మీకు ఇస్తాను.’

నేను వెంటనే అబ్దుల్లా ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని Law Society న్యాయవాదికి సమర్పించాను. తాను సంతృప్తి చెందానని నాతో చెప్పినా, తరువాత Law Society నా దరఖాస్తును వ్యతిరేకించినట్లు నాటాల్ సుప్రీం కోర్టుకు తెలియచేశాడు. కాని సుప్రీంకోర్టు ఉన్నత ధర్మస్థానం Law Society అభ్యంతరాన్ని అంగీకరించలేదు.

ప్రధాన న్యాయమూర్తి కోర్టు తీర్పును ఇలా ఇచ్చారు. ‘ఈ దరఖాస్తుదారుడు original సర్టిఫికెట్ ను జతపరచలేదనే వాదనలో బలం లేదు. తప్పుడు ప్రమాణపత్రం సమర్పించివుంటే అతను శిక్షార్హుడు అవుతాడు. ఇది గనక నిర్ధారించబడితే న్యాయవాదుల జాబితానుంచి ఇతని పేరు తొలగించవచ్చు. తెల్లవారు, రంగు (colored) ప్రజలు అనే బేధం న్యాయం చూపించదు. అందువల్ల Mr. Gandhi న్యాయ వాదుల జాబితాలో చోటుచేసుకోవటాన్ని నిరోధించలేదు. ఇతని దరఖాస్తును అంగీకరిస్తున్నాము. ఇతను ఇప్పుడే ప్రమాణం చేయవచ్చు.’

నేను వెంటనే కోర్టు రిజిస్ట్రార్ ఎదుట ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యాను. అంతలో ప్రధాన న్యాయమూర్తి నా వైపు చూసి ఇలా అన్నాడు: ‘ఇప్పుడు నీవు నీ తలపాగా తీసివేయాలి. నీవు కోర్టు నియమాలకు లోబడి ఇతర బారిష్టర్లు ఉపయోగించే (ధరించే) ఆహార్యం ధరించాలి’.

అప్పుడు నాకున్న హద్దులు, పరిమితులు గురించి ఆలోచించాను. ఇదివరకు ఒకసారి District Magistrate Court లో నా తలపాగా తీసివేయటానికి వ్యతిరేకించినా సుప్రీం కోర్టు ఆజ్ఞతో తీసివేశాను. అప్పుడు ఈ ఆజ్ఞను వ్యతిరేకించటం సరిఅయిన చర్యేనని సమర్ధించుకోలేను. ఇప్పుడు దీనికి అంగీకరిస్తే భవిష్యత్తులో జరగబోయే పెద్ద పోరాటాలకు కావలసిన సామర్ధ్యం పెంచుకోటానికి వీలవుతుంది. నా తలపాగా తీసివేయనని ఇప్పుడు మొండికేసి నాలో ఉన్న పోరాటపఠిమను నిర్వీర్యం చేసుకోలేను. భవిష్యత్తులో చేయబోయే మంచిపనులకు ఈ రోజున కొంచెం తలవంచక తప్పదు. ఈ దూరదృష్టితోనే నా తలపాగా తీసి టేబుల్ మీద పెట్టి ప్రమాణ స్వీకారం చేసి న్యాయవాదిని అయ్యాను.

కానీ, అబ్దుల్లా, ఇతర స్నేహితులు ఈ నా చర్యను సమర్ధించలేదు. ఇది నా బలహీనత అని భావించాను. నా హక్కు కాపాడుకోటానికి తలపాగా ధరించే న్యాయవాదిగా ఉంటేనే మంచిదని వారి అభిప్రాయం. వారికి నచ్చజెప్పే ప్రయత్నంలో ఒక ముఖ్య ధర్మాన్ని గుర్తు చేశాను. అది ‘రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ప్రవర్తించు’ అని అంటూ ‘నేను భారత్ లో ఉన్నప్పుడు ఒక అధికారి గాని, న్యాయమూర్తి గాని ఆదేశిస్తే దానిని తిరస్కరించటం సబబే. కాని పరదేశంలో నాటాల్ రాష్ట్ర అధికారి ఇచ్చిన ఇటువంటి ఆదేశాన్ని వ్యతిరేకిస్తే అది సమర్ధనీయం అనిపించదు.’

ఇటువంటి వాదనలతో, వివరణలతో నా మిత్రులను శాంతిపజేశాను. కాని వారు పూర్తిగా నమ్మినట్లు లేదు. నేను ఈ విషయాన్ని వేరే కోణంలో ఆలోచించాను. జీవితంలో సాగిన సత్యసాధన సమరంలో రాజీ మార్గంలో ఉన్న విశిష్టత పూర్తిగా అర్ధం చేసుకున్నాను. ఈ శక్తే నా జీవితంలో జరిగిన సత్యాగ్రహాలకు ఒక ప్రధాన పాత్ర వహించింది. ఈ మార్గం నాకు ప్రాణాంతకంగా మారవచ్చు. నా స్నేహితుల అయిష్టత మూటకట్టుకోవచ్చు. కాని సత్యం ఎంత కఠినతరమైన విషయమో అది పుష్పానికి ఉన్నంత మృదుత్వం కలది కూడా.

Law Society of Natal’ నా న్యాయవాది దరఖాస్తును వ్యతిరేకించటం నాకు ఆయాచితంగా లభించిన ప్రచారం ఒక వరం. చాలా పత్రికలు Law Society ను తప్పు పడుతూ, ఇది కేవలం అసూయా-ద్వేషం వల్లనే అని, దీనికి మూల కారణం అంతర్లీనంగా ఉన్న జాతి, వర్ణ వివక్షతయేనని స్పష్టంగా వ్రాశాయి. ఈ ప్రచారం నేను న్యాయవాదిగా మారే తంతును సులభతరం చేసింది.”

***సశేషం***

వచ్చే సంచికలో నాటల్-ఇండియన్ కాంగ్రెస్ స్థాపన గురించి తెలుసుకుందాము.

Posted in June 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *