Menu Close
ఆర్. శర్మ దంతుర్తి
తెలుగు పద్య రత్నాలు 60
ఆర్. శర్మ దంతుర్తి

భాగవతం శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్తూన్నట్టు పోతన రాసాడు. అసలీ సంగతి ఎందుకంటే, పరీక్షిత్తు వేటకి వెళ్ళి ఒక తపస్సు చేసుకునే మహర్షిని తాగడానికి నీరు ఇమ్మని అడిగినపుడు ఆయన ధ్యానంలో ఉండి వినిపించుకోలేదు. ఈ రాజు గారికి కోపం వచ్చి ఒక చచ్చిన పాముని ఆయన మెడలో వేసి వెళ్ళాడు అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. కాసేపటికి ఈ తపస్సు చేసుకునే ముని కొడుకు వచ్చి చూసాడు. కోపం వచ్చి శపించాడు – ‘ఈ వెధవ పనిచేసిన వాడు ఏడు రోజుల్లో హరిహరాదులు అడ్డం వచ్చినా సరే తక్షకుడి కాటుకి ఛస్తాడు’ అని. ఈ శాపం ఇచ్చే సమయానికి ముని కళ్ళు తెరిచిచూశాడు. ‘అయ్యో ఇలా రాజుకి శాపం ఇవ్వకూడదు, కానీ నేను కళ్ళు తెరిచేసరికి ఇదంతా జరిగిపోయింది కనక వెళ్ళి రాజుగారితో చెప్పు, ఆయన ఏం చేయాలో చూసుకుంటాడు’ అంటాడు. రాజుగారికి ఈ విషయం తెల్సి బెంగ పట్టుకుంది ఒక్క వారంలో చచ్చిపోతాడని. ఈ లోపున శుకమహర్షి వచ్చాడు. ‘ఫర్వాలేదులే ఇంకా వారం ఉంది కదా ఈ లోపున భాగవతం విని కృతార్ధుడవి అయితే అన్నీ సరిగ్గానే ఉంటాయి అని చెప్పి భాగవతం కధ చెప్పడం మొదలు పెట్టాడు. ఈ భాగవతం కధలన్నీ భగవద్విభూతి గురించి చెప్పేవే. పన్నెండు స్కంధాలలో ఈ కధలన్నీ అయ్యాక చివరకి ఇది అంతా విన్న పరీక్షిత్తుతో శుకమహర్షి ఏమి అంటున్నాడో చెప్పేదే ఈ నెల పద్యం.

ఉ.
ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌ
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్. [పోతన భాగవతం 12-25]

నేను (ఏను) చచ్చిపోతాను అని భయం మన్సులోంచి తీసేయి. ఎందుకంటే మానవకోటికి చావు అనేది ప్రతి నిత్యం (చావు నిత్యమౌ) జరిగేది. శ్రీహరిని గురించి తల్చుకుంటూ ఉండు. అలా చేస్తే మరో జన్మే కలగదు ఈ భూమి మీద (ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై). వైకుంఠానికి వెళ్ళి సుఖంగా ఉంటావు అంటున్నాడు. ఇదే మనం భగవద్గీతలో చూడవచ్చు.

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || (అక్షర పరబ్రహ్మ యోగం. 5)

ఇంత చేసినా మృత్యువు తప్పదు కనక ఆ సలహా ఇచ్చాడన్నమాట. ఎందుకు మృత్యువు తప్పదు అంటే శాపం ఇచ్చేటప్పుడు చెప్పాడు కదా మునీశ్వరుడి కొడుకు, హరిహరాదులడ్డమైనన్ అంటూ? అయితే శుక మహర్షి చెప్పిన ఈ భాగవతం అంతా విన్నాక కూడా ఈ రాబోయే మృత్యువుని తప్పించుకోవడానికి పరీక్షిత్తు ఒంటి స్థంభం మీద భవనం కట్టించి అందులో ఉంటాడు అయినా సరే ఒక పండు లో చిన్న పురుగులా మారి తక్షకుడు అందులోకి చేర్చబడతాడు. ఆ పండు పరీక్షిత్ విరవగానే అందులోంచి వచ్చి కాటు వేస్తాడు. అలా ఆయన అధ్యాయం ముగుస్తుంది. అందువల్ల ఎలా తప్పించుకుందామన్నా సమవర్తి (యముడు) గారు ఎవరినీ విడవడం అనేది లేదు. ఆయన సమవర్తి కనక వీరు నావారు, ఫలానావారు నావారు కాదు అనే విచక్షణ లేదు. ఎవరికి సమయం ఆసన్నమైతే వాళ్ళు వెంఠనే వెళ్ళడమే.

పద్యం గురించి మరికొంత ఆలోచిద్దాం. చావు అనేది ప్రతి ఒక్కరికీ కలిగేదే. అయితే అది ఎవరికి ఎప్పుదొస్తుందనేది మాత్రం చెప్పలేము. ఏ మతం లో అయినా మాత్రం చెప్పేది ఒకటే, చివరిలో ప్రాణం పోయేటపుడు – అంటే కనీసం అప్పుడైనా - భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోండి. అయితే రోజూవారీ అనేకానేక పనులతో సతమతం అయ్యే మనకి భగవంతుడు రోజూ గుర్తు వస్తాడా? ఎప్పుడైనా వచ్చినా రోజూ గుర్తు తెచ్చుకునే అలవాటు లేకపోతే చివర్లో పోయేటపుడు మాత్రం ఎందుకు గుర్తు వస్తాడు? అలా రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనం దాశరధీ శతకంలో ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చినవేళ (దాశరధీ శతకం, పద్య రత్నాలు – 2) చదివినట్టూ, చివర్లో మన చుట్టూ బంధువులు మూగి ఉండొచ్చు, రోగం వచ్చి నోటమ్మట మాట పడిపోవచ్చు, అప్పుడు భగవంతుడు గుర్తు వస్తాడా? రోజూ భగవన్నామం గుర్తు రావడానికి ఏమీ చేయని మనకి చివర్లో మాత్రం ఎలా గుర్తుకొస్తాడు? అందుకే జీవితంలో ప్రతీ క్షణం భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు ఏ మతంలో చూసినా.

అయితే కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల చివర్లో భగవంతుడు గుర్తు వచ్చే అవకాశం ఉంది. దీనిక్కూడా అజామీళోపాఖ్యానం అంటూ శుకమహర్షి చెప్పాడు కదా భాగవతంలో కధ. అయితే అక్కడ అజామీళుడికి ‘నారాయణ’ అని తాను పేరు పెట్టుకున్న కొడుకు కనిపించాడు అదృష్టం కొద్దీ చివర్లో. ఆ అదృష్టం ఎంతమందికి ఉండొచ్చు? అందుకే ప్రతీ క్షణం భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోవడం ముందు నుంచీ అలవాటు చేసుకుంటే చివరిలో ఆయన పేరు మనసులో కానీ నోట్లో కానీ మెదిలే అవకాశం ఉంది. దానికోసమే ఈ భాగవతం వినడం, భగవంతుడి పేరు ఉఛ్ఛరించడం అనేవన్నీ. అయితే ఇవన్నీ జవసత్వాలు ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. బుద్ధుడు సన్యాసం తీసుకున్నప్పుడు కూడా, జవసత్వాలు ఉన్నప్పుడే కానీ, ఎప్పుడో ముసలితనం వచ్చాక కాదు. ఎప్పుడో యముడి పిలుపు వినిపించినప్పుడు మనం ఎక్కడ ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో? ఆ సమయానికి అసలు మన మనసులో ఏముంటుందో ఎవరికెరుక. అందుకే ఇప్పటినుంచే – అంటే గుర్తు వచ్చినప్పటినుండి, జవసత్వాలు ఉన్నప్పటినుండే భగవంతుణ్ణి స్మరించాలి.

********

Posted in June 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *