ఉగాది పండుగ శుభదినాన 'శ్రీ క్రియేషన్స్' వారి ఆవిర్భావ సభలో సీతమ్మ, శాంత, పరమేశ్వరీల గాన కచేరీ ఆ నాటి కార్యక్రమానికే హైలైట్ గా నిలచింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల గాయనీమణులచే ఒకే వేదికపై కచేరి చేయించిన శ్రీనివాస్ మూర్తి గారు ప్రశంసలను అందుకున్నారు.
ఇంగ్లాండ్ పర్యటన విషయంగా శాంతా, పరమేశ్వరీలకి అభినందనలు తెలిపి, సభాముఖంగా సత్కరించారు శ్రీనివాస్ దంపతులు.
***
ఆ సాయంత్రం రామనాధం గారింట ఉగాది పండుగ వేడుకకి బంధుమిత్రులు హాజరయ్యారు. తమ కార్యాలయంలో పండుగ సంబరాలు నిర్వహిస్తున్నందువల్ల శ్రీనివాస్ దంపతులు రాలేకపోయారు.
గులాబీల అలంకరణతో ఇల్లు అందంగా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పసందైన అల్పాహారాలు, పానీయాలు సేవిస్తున్నారు అతిధులు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా మధ్య హాలంతా రంగురంగుల వెలుగులతో నిండిపోయింది. శ్రావ్యమైన సంగీతం వినవచ్చింది. పారూ చేయందుకుని హాలు మధ్యకి ఆ వెలుగుల్లోకి నడిచాడు కిరణ్.
ఏమి జరుగుతుందోనని అందరూ చూస్తుండగా... పారూ ఎదుట మోకరిల్లాడు. తన జేబు నుండి ... డైమండ్ ఉంగరం తీసి పారూ వేలికి తొడిగాడు. "విల్ యు మేరి మి? నన్ను పెళ్లాడతావా పారూ?" అని అడిగాడు కిరణ్.
అప్పటివరకు ఆశ్చర్యంలో మునిగిఉన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ తమ హర్షాన్ని వెలిబుచ్చారు.
అవాక్కయిన పారూ కొద్ధిక్షణాల పాటు సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలింది. తేరుకుని ఆగని కన్నీటితో పైకి లేవమని కిరణ్ కి చేయందించింది.
కిరణ్ కి దగ్గరగా వచ్చి కళ్ళు తుడుచుకుంటూ "అంతకన్నానా బావా? మన పెద్దవాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు కనుక వారందరి ఆశీర్వాదాలతో..." అంటూ భావోద్వేగానికి గురయ్యింది.
దూరం నుండి చూస్తున్న మాలిని వడిగా పారూ వద్దకి వచ్చి "ఇక ఏడుపు చాలించు పారూ!" అంటూ భుజంపై తట్టింది.
అక్కడి నుండి కదిలి, రామనాధం గారికి, సీతమ్మగారికి, తల్లితండ్రులకి పాదనమస్కారం చేసి, మిగతా పెద్దల నుండి కూడా ఆశీర్వాదాలను అందుకున్నారు కిరణ్, పారూలు.
"బావా! నీవెప్పుడో మా హీరో కదా!" అంటూ అభినందించారు జననీ, పునీత్ లు.
ఈ తరహా పెళ్లి ప్రతిపాదనతో తల్లితండ్రుల్ని, కాబోయే అత్తమామల్ని కూడా ఆశ్చర్యంలో ముంచేశాడు కిరణ్. క్షణాల్లో తేరుకుని యువజంటకి ప్రేమగా తమ దీవెనలు అందించారు. ఆ తరువాత మిత్రులందరూ యువ జంటని అభినందించి ఆశీర్వదించారు.
***
మీనాక్షి ఎన్నుకున్న బాట...
కొన్నాళ్ళ క్రితం తల్లితండ్రులని, కిరణ్ ని కలిసినప్పుడు నిర్మొహమాటంగా తన మనసులోని మాట తెలియజేసి.. బయటికి నడిచిన మీనాక్షి, దగ్గరలోనే ఖరీదైన అపార్ట్మెంట్ లో అద్దెకి ఉంటూ స్నేహితులతోనూ, బ్యూటీ పార్లర్ లోనూ కాలక్షేపం చేస్తుంది.
త్వరలో పరమేశ్వరి ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళనుందని ‘కల్చరల్ రౌండ్-అప్’ న్యూస్ ద్వారా తెలుసుకుని కిరణ్ కి ఫోన్ చేసింది మీనాక్షి. జవాబు లేకపోడంతో ఆలోచనలో పడింది. ఒక్కసారి కలవమని, ముఖ్యమైన విషయం చెప్పాలని సందేశం పంపింది.
తండ్రి ఆఫీస్ మేనేజర్ ద్వారా పారూ వెళుతున్న ఫ్లైట్ సమాచారం రాబట్టి... ఆ మరునాడు ఫ్లైట్ సమయానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. పారూ కనబడగానే పరుగున వెళ్లి పూలబొకే అందించి అభినందనలు తెలిపింది. పారూ, కిరణ్ పరివారమంతా ఆమె చేష్టకి అచ్చెరువొందారు. ఎయిర్పోర్ట్ కి వచ్చిన శ్రీనివాస్, విమల కూడా కూతురిని చూసి నిర్ఘాంతపోయారు.
ధన్యవాదాలు తెలిపి ముందుకి కదిలింది పారూ. అందరూ అనుసరించారు.
గబగబా కిరణ్ వద్దకి వెళ్లి, అతనితో నడవ సాగింది మీనాక్షి. "బావా.. ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా నీ నుండి జవాబు లేదే? నీతో మాట్లాడాలి." అంది. సమయం ఉన్నప్పుడు చేస్తానని చెప్పి ఆమెని దాటి ముందుకు వెళ్ళాడు కిరణ్.
***
ఏ దేశమేగినా ఎందు కాలిడినా!..
లండన్ చేరిన గాయనీమణులు శాంతా, పరమేశ్వరీలకి ఆహ్వానం పలికారు మేరీ, విశ్వాలతో పాటు 'ఆసియన్ ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ లండన్' సభ్యులు.
వారింటనే అతిధులుగా ఉన్న తల్లీకూతుళ్లు మరునాడు నుండే ‘ఆర్ట్స్ కౌన్సిల్' వారి షెడ్యూల్ ని అనుసరించసాగారు. సంగీత శిక్షణకి సిలబస్ ప్రకారంగా క్లాసులని నిర్వహించడం మొదలుపెట్టారు. మొదటి రెండు వారాలూ స్థానికంగా ఉన్న సంగీత ఔత్సాహికులు ఇరవై మందితో మొదలయిన శిష్య బృంద సంఖ్య నెలలోగా యాభైకి పెరిగింది.
పరమేశ్వరి, శాంతా వేరు వేరు తరగతుల్లో సాయంత్రాలు ఓ నాలుగు గంటలపాటు, వారాంతాల్లో ఎనిమిది గంటల పాటు శిష్యులకి తర్ఫీదునిస్తూ వాద్యబృందం తోనూ సాధన చేయడంలో నిమగ్నమయ్యారు.
***
మీనాక్షికి కిరణ్ ఆహ్వానం
పదే పదే ముఖ్యమైన విషయం చెప్పాలంటూ సందేశం పంపుతున్న మీనాక్షిని తమ ఇంట కలవమని తిరిగి కిరణ్ మెసేజ్ పెట్టగానే అరగంటలో రామనాధం గారింటికి వచ్చిందామె. పేరుపేరునా అందర్నీ నవ్వుతూ పలకరించింది. తాను బి.ఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాశానని, తప్పక పాసవుతానని నమ్మకంగా చెప్పింది.
అందరితో కూర్చుని భోజనం చేసింది. తాను వీణ వాయించడం నేర్చుకుంటున్నానని, ఆర్ట్ క్లాసు తీసుకుంటున్నానని కిరణ్ కి చెప్పింది. వేసిన ఆర్ట్ ఫోటోలని తన ఫోన్ మీద చూపింది.
అంతసేపూ కిరణ్ ముక్తసరిగా జవాబులు చెబుతూ గడపడంతో చిన్నబుచ్చుకున్న మీనాక్షి కంటతడి పెట్టుకుంది. కిరణ్ తో సహా అందరూ చలించారు.
"అయ్యో! ఎందుకేడుస్తున్నావమ్మా!" అంటూ వకుళ ఓదార్చబోయింది.
'నచ్చని సంబంధం తెచ్చి, ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న తల్లితండ్రుల్ని దారిలో పెట్టేందుకు తాను తీసుకున్న ఓ నిర్ణయానికి తనని ద్వేషించవద్దని చేతులు జోడించి మరీ కిరణ్ కుటుంబాన్ని కోరింది మీనాక్షి. కిరణ్ తో పాటు రామనాథం తాతయ్య కూడా తనతో మునుపటిలా ఉండాలని వేడుకుంది.
మరి కాసేపటికి వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
మీనాక్షి వచ్చి వెళ్లిన విషయాన్ని రామనాధం గారు ఆమె తల్లితండ్రులకి చెప్పినప్పుడు... ఎంతగానో సంతోషించారు ఆ దంపతులు. మీనాని ఆదిరించమని కోరారు. మెల్లగా దారికి తెచ్చుకోవచ్చని ఆశపడ్డారు. స్నేహపూరితంగా అప్పుడప్పుడైనా మాట్లాడి తమ కూతుర్ని తిరిగి ఇంటికి వచ్చేలా ప్రయత్నించమని కిరణ్ణి అడిగారు.
ఆ పరిస్థితిలో వారి మాటలకి చలించిపోయిన కిరణ్, కుటుంబ సభ్యులు సుముఖంగా స్పందించారు. తాను తప్పక ప్రయత్నిస్తానని కిరణ్ కూడా మాటిచ్చాడు.
మరునాడు తన పుట్టినరోజు సందర్బంగా కిరణ్ కుటుంబాన్ని మీనాక్షి లంచ్ కి పిలవడం, కానుకలు తీసుకుని మరీ మీనాక్షి అపార్ట్మెంట్ కి వెళ్లి, ఆమె ఆతిధ్యం స్వీకరించవలసి రావడం తప్పలేదు వారికి.
ఆమె ఇల్లు కళాత్మకంగా అలంకరించి ఉంది. దేవుని మందిరం ప్రత్యేకంగా దీప కాంతులతో అందంగా ఉంది. స్టూడియో రూములో తాను చేస్తున్న పెయింటింగ్స్ చూపించింది. తంజాపూర్ నుండి తెప్పించిన వీణ గురించి కూడా చెప్పింది. ఆమె మాటల్లో, చేతల్లో మునుపు లేని సరళత్వం, ఆప్యాయత వారిని ఆశ్చర్యపరిచాయి. భోంచేసి, ఆశీస్సులందించి సెలవు తీసుకున్నారు కిరణ్ వాళ్ళు.
***
మాంచెస్టర్ నగరంలో సరిగమల సందడులు..
లండన్ నుండి వెళ్లి మాంచెస్టర్ లో పరమేశ్వరి, శాంతలు సంగీత పాఠాలు నిర్వహిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా నుండి నేథన్, లహరీలు తమని కలిసేందుకు రావడం వారిని ఆశ్చర్య పరిచింది.
"మేము ప్రతి ఏడూ పరిపాటిగా పాల్గొనే కౌన్సిల్ వారి మొదటి ‘లండన్ ఫాల్ ఫెస్టివల్' కాన్సర్ట్ చూసుకుని నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతాము. మీరు తిరిగి ఇండియా వెళ్ళే లోగా మీతో కలిసి ఇంకొన్ని ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాము. అందుకోసం మళ్ళీ వస్తాము కూడా! ఇక్కడిలా కలవడం ఎంతో బాగుంది పరమేశ్వరి." గలగలా ఎన్నో విషయాలు మాట్లాడేసింది లహరి.
***
ఈ లోగా మీనాక్షి మనోగతం....
పరమేశ్వరి విదేశీ పర్యటనలో ఉన్న సమయాన్ని తనకి ప్రయోజనకరంగా మలుచుకొనే ప్రయత్నంలోనే ఉంది మీనాక్షి. తాతగారి ఇంట కలవడం తప్ప తానాశించినట్టుగా బావతో తన స్నేహాన్ని పునర్జీవింపజేయగల అవకాశం లేకపోవడం నచ్చలేదు ఆమెకి. కిరణ్ తో ఒకప్పటి చనువు, ఆప్యాయత కోరుకుంటున్న ఆమెకి నిరాశే ఎదురయింది. మేధోమధనం చేసింది. పునరాలోచించుకుంది. ఓ గొప్ప ఆలోచనని అమలుచేసింది..
'తనకి తల్లితండ్రుల్ని చూడాలని ఉందని, వారిపై బెంగగా కూడా ఉందని కిరణ్ కి ఓ సందేశం పంపింది.
దాంతో మళ్ళీ వారం హైదరాబాదు వచ్చినప్పుడు, పొద్దుటే మీనాక్షిని తీసుకుని శ్రీనివాస్ గారిల్లు చేరాడు కిరణ్. హాల్లోనే కూర్చుని తల్లితండ్రుల యోగక్షేమాలు కనుక్కుని, తాను బి.ఏ పాస్ అయిన విషయం తెలియజేసింది.
తల్లితండ్రులిరువురూ పదే పదే కళ్ళు తుడుచుకోడం గమనించి ... తన గురించి ఆదుర్దా అక్కరలేదని చెప్పి వారి వద్ద సెలవు తీసుకుంది. దారిలో కాఫీ-హౌజ్ వద్ద ఆపి.. శాండ్విచ్ తిని, కాఫీ తాగింది. తనని ఇంటి వద్ద డ్రాప్ చేసినప్పుడు.. కిరణ్ చేయందుకుని తడయిన కళ్ళతో ధన్యవాదాలు తెలిపింది మీనాక్షి.
***
ఘనంగా లండన్ 'ఫాల్ ఫెస్టివల్' ....
ఆర్ట్స్ కౌన్సిల్ వారి 'ఫాల్ ఫెస్టివల్' కి రెండు రోజుల ప్రోగ్రాములు ఏర్పాటయ్యాయి. మొదటి రోజు జరిగిన పరమేశ్వరి, శాంతల కచేరీకి అత్యంత ఆదరణ లభించింది. వారి గానాన్ని గురించిన అద్భుతమైన సమీక్షలు ఆసియన్ ప్రముఖ వార్తా పత్రికల్లో ప్రధానాంశంగా ప్రకటించబడ్డాయి.
శాంత, పరమేశ్వరీల సంప్రదాయ గానానికి 'స్టేట్ కల్చరల్ విభాగం' వారి ప్రత్యేక గౌరవ ఆహ్వానం అందింది.
ఆ మరునాడు లహరి, నేథన్, పరమేశ్వరి కలిసి పాల్గొన్న ప్రోగ్రాంకి కూడా గొప్ప స్పందన లభించింది. 'సింగింగ్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ అన్న శీర్షికన ఆ ముగ్గురిని ఆకాశానికి ఎత్తేసింది స్థానిక మీడియా.
లండన్ నగరం వేదికగా శాంతా, పరమేశ్వరీల కార్యక్రమాలని రామ్‌కుమార్ ప్రెస్ నోట్ గా అందించడంతో విస్తృతంగా ప్రచురించబడిన ఆ విశేషాలకి బంధువర్గం, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
***
ఆశలు - అడియాశలు... మీనాక్షి వైనాలు...
వాకర్ సహాయమే లేకుండా నడవగలుగుతున్నందుకు, మీనాక్షి తమని చూసి వెళ్లినందుకు కూడా శ్రీనివాస్ దంపతులు విమల ఆనందంగా ఉన్నారు. స్వగృహంలో బంధువులతో, ముఖ్య స్నేహితులతో శ్రీనివాసు గారి యాభైఅయిదవ పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నారు.
తమ బంధువర్గాన్ని, మిత్రులని ఆహ్వానించారు. అన్నదానం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనమని మీనాక్షిని కిరణ్ చేత అడిగించడం, మీనాక్షి ఒప్పుకోడంతో వారి ఆనందం రెట్టింపయ్యింది.
మళ్ళీ వారానికి శ్రీనివాస్ గారి పుట్టినరోజు కార్యక్రమం ఆహ్లాదంగా మొదలయింది. పట్టుచీరలో అందంగా అలంకరించుకుని, అంతా తానే అయి పనులు చేస్తూ అందరి దృష్టి ఆకట్టుకుంది మీనాక్షి.
భోజనాల సమయంలో అందరినీ ఆశ్చర్య పరుస్తూ... పెద్దాయన రామనాధం గారు మైక్ అందుకున్నారు. ముందుగా, విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపారు.
"అందరికి నమస్సులు. శ్రీనివాస్, విమల దంపతులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా శ్రీనివాసు మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని భగవంతుని కోరుతున్నాను. ఇక బిజినెస్ లో బీ.ఏ పాసయినందుకు బంగారు తల్లి మీనాక్షికి శుభాశీస్సులు.
హైద్రాబాదులోని ప్రముఖ విద్యాలయాల్లో చదువులు మొదలు పెడుతున్న మా పునీత్, జననీలకి అభినందనలు. మా అమ్మాయి శాంతా, ఆమె కూతురు పరమేశ్వరితో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో...సీతమ్మ గారికి, కుటుంబానికి చేయూతగా ఉన్న మాలిని, జోసెఫ్ గార్లకి ధన్యవాదాలు.
ఇక అతిముఖ్యమైన విషయం. మా వదినగారు సీతామహాలక్ష్మీ, నేను కలిసి మా కుటుంబాల సమ్మతితో వారి మనమరాలు పరమేశ్వరికి, నా మనవడు కిరణ్ తో వివాహం చేయాలని నిశ్చయించుకున్నాము. పరమేశ్వరి ఇంగ్లాండ్ నుండి వచ్చాక నిశ్చితార్ధం జరిపించాలని నిర్ణయించాము. మీ అందరి ప్రేమాభిమానాలు ఆశీస్సులు కోరుతున్నాము. అదీ సంగతి!" అంటూ ప్రకటించారు.
***
కిరణ్, పారూల నిశ్చితార్ధం జరగనుందన్న రామనాధం గారి ప్రకటనకు అవమానభారంతో, కోపంతో అక్కడినుండి కిమ్మనకుండా వెళ్లిపోయిన మీనాక్షి కొన్నాళ్ళు మౌనంగా ఉండిపోయింది.
తన ప్రేమ విఫలమయినందుకు భరించలేని అసహనంతో రగిలిపోయింది ఆమె మనసు. స్నేహితులతో మళ్ళీ పబ్బులకి, క్లబ్బులకి వెళ్లడం, వారి ప్రోద్బలంతో బీర్, వైన్ తరుచుగా సేవించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో... మళ్ళీ రాణీ, రంజిత్ లతో స్నేహంగా మసులుకోసాగింది.
కిరణ్ పట్ల తన ఆశలు అడియాశలవ్వడంతో మానసికంగా బలహీనపడిపోయింది మీనాక్షి. అటువంటి సమయంలో మీనాక్షి పట్ల ఆసక్తి కనబరచి, తన ప్రేమని ప్రకటించినంతనే... రంజిత్ ప్రేమని అంగీకరించి అతనితో... సహజీవనం చేయసాగింది.
***
మిగిలింది నిరాశేనా?
తమ ఇంట పుట్టినరోజు వేడుక జరిగి మూడు నెలలైనా మీనాక్షి నుండి మళ్ళీ ఉలుకు పలుకు లేకపోవడంతో కూతురు ఇంటికి తిరిగివస్తుందన్న ఆశల మీద నీరు చల్లినట్టే అయిందని తల్లడిల్లిపోయారు ఆమె తల్లితండ్రులు. క్షేమసమాచారాలైనా తెలుసుకోమనడంతో కిరణ్ వాకబు చేసి, మీనాక్షి వివరాలు తెలుసుకుని బాధపడ్డాడు. అయినాగానీ నింపాదిగా మామయ్యా, అత్తయ్యలకి ఉన్న విషయాన్ని తెలియజేశాడు. విని తీవ్ర మనస్తాపానికి గురైన వారికి ధైర్యం చెప్పాడు.
***
ఆంగ్లేయులని సైతం ఆకట్టుకున్న మధుర గానం .....
లండన్ నెహ్రు సెంటర్ లోని కార్యక్రమంతో మొదలుకుని మాంచెస్టర్, బర్మింగ్ హామ్, లివర్‌పూల్, బ్రిస్టల్ నగరాల్లో శాంత, పరమేశ్వరీల 'ఫాల్ ఫెస్టివల్ - స్వర మాధురి' కార్యక్రమాలకి అద్భుతమైన స్పందన లభించింది.
కర్ణాటక, లలిత సంగీత, జానపద, హిందుస్తానీ రీతుల్లో ఇద్దరూ వీనులవిందుగా గానం చేస్తే... తానొక్కతే కొన్ని హిందీ, కొన్ని ఆంగ్ల పాటలని చక్కగా పాడి ప్రేక్షకులని అలరించింది పరమేశ్వరి. ఆంగ్లేయులు, ఇతర దేశీయులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
యేడాదిలో ఆరు నెలలు గడిచాయి. మరో ఆరునెలలే అంటూ కుటుంబ సభ్యులందరికీ మెసేజీలు పంపింది పారూ.
***
ఆ ఇంట ఇక సమరమే ...
మళ్ళీ ఓ మారు తల్లితండ్రులపై యుద్ధం ప్రకటిస్తూ ఆస్థుల్లో తన వాటా కోసం లీగల్-నోటీసు పంపి సివిల్ కేసు నమోదు చేసింది మీనాక్షి. కూతురిలో గూడుకట్టుకున్న కోపం, కక్ష సాధింపు, అలసత్వం, అకారణ ఏహ్యం తప్ప ఇతర కారణమే లేదని నిర్ధారించుకున్నారు వారు. దీర్ఘాలోచన చేశాక న్యాయ పోరాటం సాగించి, మీనాక్షికి కనువిప్పు కలిగించాలని గట్టి నిర్ణయమే తీసుకున్నారు మీనాక్షి తల్లితండ్రులు.
***
మెచ్చుకోలు... కర్టసీ కాల్...
మరునాడు శ్రీనివాస్ గారు బర్మింగ్‌హామ్ లో ఉన్న పరమేశ్వరికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కున్నారు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న వారి పర్యటనల గురించి మనసారా మెచ్చుకున్నారు. ఎంతగానో సంతోషించింది పారూ. పదే పదే ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసింది. విమల గారు తోనూ కాసేపు ముచ్చటించింది. టచ్ లో ఉంటానని చెప్పి ఫోన్ పెట్టింది.
***
కొనసాగుతున్న కళాతృష్ణ ...
ఇంగ్లాండ్ లో పారూ, శాంతల జీవనం రాగ సరాగాలుగా కొనసాగింది. రెండువారాల పాటు వారి సంగీత బోధనలో విశ్రాంతి ప్రకటించి, మేరీ, విశ్వాలు స్వయంగా వారిని... సందర్శించవలసిన కొన్ని ప్రదేశాలకి తీసుకుని వెళ్లారు. సరదాగా, ఆహ్లాదంగా గడిచింది శాంతా పారూలకి.
***
విహార యాత్ర నుండి తిరిగి వచ్చాక, ఐదు నగరాల్లో తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందిన వారి చేత... కచేరీల్లో పాడించారు. దాంతో పర్యటనలోని ఒక ముఖ్య ఘట్టం విజయవంతంగా ముగిసిందని శాంతా, పరమేశ్వరీలని 'ఆర్ట్స్ కౌన్సిల్' వారు సత్కరించారు.
తమ పర్యటన ముగియడానికి మరో నెల మాత్రమే ఉన్నందుకు... ఆనందంగా ఉంది తల్లీ కూతుళ్ళకి. జరగనున్న కార్యక్రమాలకి వాద్యబృందంతో సాధన సాగించారు. కాన్సర్ట్స్ నిమిత్తం నేథన్, లహరి కూడా త్వరలోనే రానున్నారని తెలిసింది.
***
సామరస్యంగా ...
మీనాక్షి కోర్టులో వేసిన సివిల్ కేస్ విషయంలో కోర్టు ఇచ్చిన తేదీ లోగానే శ్రీనివాస్ గారు, మేలైన రీతిలో ఆస్థి పంపకం జరుగాలంటే 'అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్' చేసుకోమని ఆమెకి లాయర్ ద్వారా పరోక్షంగా సూచించారు. సివిల్ లిటిగేషన్ యేళ్ళ తరబడీ సాగేకన్నా త్వరగా సెటిల్ చేసుకోమని లాయర్ కూడా ప్రస్తావించడంతో ఆలోచనలో పడింది మీనాక్షి.
పూర్వుల ఆస్థులకన్నా లాభదాయకమైన వందల కోట్ల వ్యాపారాలన్నీ తండ్రి స్వార్జితాలేనని తెలిసిన మీనాక్షి 'అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్' కి ఒప్పుకుంది.
సెటిల్మెంట్ వివరాలు, తేదీ తెలియాల్సి ఉంది. తన సొంత కొడుకులా భావించిన కిరణ్ కి కూడా తమ ఎస్టేట్ లో భాగముంటుందని చెల్లెలు వకుళ కుటుంబానికి తెలియజేసాడు శ్రీనివాస్ మూర్తి.
డిసెంబర్ ఆఖరులో మీనాక్షికి తాము పంపిణీ చేయదలచిన ఆస్థుల జాబితాని పంపారు శ్రీనివాస్ దంపతులు.
***
గాన లాహిరిలో ...
తిరిగి లండన్ లో .. శాంతా-పరమేశ్వరీలు, నేతన్ లాహిరీల మ్యూజిక్ ప్రోగ్రాముల విషయానికి వస్తే, తల్లీ కూతుళ్ల గాన కచేరీలు సంగీతప్రియులని రంజింపజేస్తే, నేథన్-పరమేశ్వరి-లహరీల మ్యూజికల్స్ కి యువత మైమరచి పోయారు.
గాయనీ గాయకుల పట్ల అసంఖ్యాక ప్రేక్షకుల అభిమానం వెల్లువై పొంగింది. యార్క్, ఆక్స్ఫర్డ్, లీడ్స్, లివర్‌పూల్, బ్రిస్టల్, కవెంట్రీ వంటి... మునుపు సందర్శించని మహానగరాల్లో జరిగిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
ఆనందోత్సాహాలతో సంగీతకారులు, గాయకులు - నేథన్, లహరీలు ఆస్ట్రేలియాకి... శాంతా, పరమేశ్వరీలు భారతావనికి ఉగాది పండుగకి ఓ రోజు ముందే బయలుదేరి పోయారు.
నేథన్ వెళుతూ "పరమేశ్వరీ! నేనిక ఫిలిం ప్రొడక్షన్ లో బిజీ అవుతాను. నీవే మా గాయని. తప్పదు. అలాగే, శాంతా ఆంటీ, అమ్మమ్మ గారు, నీవు కలిసి ఓ చక్కని క్లాసికల్ పాడాలి. అదీ తప్పదు." అని వారి అంగీకారం పొందాడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్