Menu Close
ఆర్ శర్మ దంతుర్తి
మా పిన్ని గారు
ఆర్ శర్మ దంతుర్తి

నాకు అప్పుడు వయసు మూడో, నాలుగో. అమ్మతో పాటు ఎదురింటికి నడిచి వెళ్ళి ఎవరితోనో మాట్లాడినట్టు గుర్తు. ఒకావిడ గుమ్మానికి అటువైపు నుంచుని అమ్మతో ఆ ఇంటి గురించో మరోటో మాట్లాడారు. ఆ తర్వాత మేము ఇల్లు మారి వాళ్ళ ఇంట్లో ఒక వాటాలో చేరాం. చేరాక దాదాపు పదిహేనేళ్ళు అదే ఇంట్లో ఉన్నాం. ఇంటి ఆవిడ పేరు చాలాకాలం నాకు తెలియనే తెలియదు. అమ్మతో మాట్లాడుతూ ఉంటారు కనక పిన్ని గారు అనడం అలవాటు అయింది. మాదీ, వారిదీ - ఈ కాలంలో ఉన్న ప్రమాణాలతో చెప్పుకోవాలంటే - పెద్ద కుటుంబాలే. వాళ్ళింట్లో పిల్లలు అయిదుగురు అయితే మా ఇంట్లో నలుగురు. అందరికీ పదిహేను, మహా అయితే ఇరవై లోపు అని గుర్తు. ఈ వాటాకీ ఆ వాటాకీ పెద్దగా తలుపులు అంటూ వేరుగా ఉండేవి కాదు. మా వాటాకి కిందన వంట, పడుకోవడానికి పైన ఒక గది ఇచ్చారు. ఇంట్లో ఎదురుగా పెద్ద మామిడి చెట్టు, ఒక నారింజ చెట్టు, ఆ పక్కన ఒక నుయ్యి ఉండేవి. మేడమీద మేము పడుకునే గది కాక ఒక పెద్ద గది ఆ పక్కన ఇంటి వారి మరో గదీ ఉండేవి. ఆ మధ్య గదీ, ఇంటివారి గదీ వాళ్ళవి కనక ఎప్పుడైనా అక్కడకి వెళ్ళినా వచ్చేసేవాళ్ళం కానీ మధ్య గది మాత్రం కొంచెం వాడుకోవడం అలవాటు అయింది. అందులో వేసవిలో మామిడిపళ్ళూ అవీ పెట్టుకోవడం, మా అక్కలకి వీణ నేర్పడానికి వచ్చే మేష్టారు కూర్చోవడం అవీ జరిగేవి.  ఒకచోట కుదురుగా కూర్చోకుండా మా వాటాలోంచి వాళ్ల వాటాలోకి అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారం.

ఈ రెండు వాటాలు కాక అటువైపు మరో చిన్న వాటా ఉండేది. అందులో ఒక రిటైరైపోయిన తాతగారు మామ్మగారు ఉండేవారు. చాలాకాలం వీళ్ళకి పిల్లలు లేరు కాబోలు అనుకునే వాణ్ణి నేను. కొంత జ్ఞానం వచ్చాక నా అజ్ఞానం ఆ అమ్మ దగ్గిర చెప్పుకుంటే ఆవిడ నవ్వేసి అసలు విషయం చెప్పింది. తాతగారికి  పిల్లలు ఇద్దరున్నారు. ఒకాయన వేసవి శెలవులలో వస్తూ ఉంటారు. రెండోది వాళ్ళమ్మాయి. ఆవిడని నేను ఎన్నో సార్లు అప్పటికే చూసాను. ఆవిడ పిల్లలు కూడా వస్తూ ఉంటారుగా? నువ్వు వాళ్ళతో కబుర్లు చెప్పడంలేదా? అలా నాకు జ్ఞానోదయం అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమందరం ఒకే కుటుంబంలాగా బతికాం ఆ ఇంట్లో. ఇదంతా ఆ ఇంట్లో ఉండేవారి సంగతి.

బయట వాళ్ళ సంగతికి వస్తే మా అమ్మగారికి చెల్లుళ్ళూ తమ్ముళ్ళూ ఉండేవారు బోల్డు మంది. వాళ్ళు వేసవిలో, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోతూ ఉండేవారు – పిల్లలతో సహా. ఫోన్లూ అవీ లేవు ఆ రోజుల్లో. అందువల్ల ఫోన్ చేయడం ఉత్తరం రాయడం అవీ ఉండేవి కాదు. బస్సు ఎక్కి వచ్చేయడమే. మా నాన్న గారి తమ్ముళ్ళు కూడా అలాగే వచ్చేవారు. ఉన్న రెండు మూడు గదుల్లోనే హాయిగా గడిపేవారం. మీ ఇల్లు ఇంత చిన్నది, మేము రాము అనే మాట ఎవరి నోటా వినలేదు. పిన్నిగారికి కూడా తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ ఉండేవారు. వాళ్ళు కూడా వచ్చి వెళ్తూ ఉండేవారు. వాళ్లకీ మాకూ కూడా స్నేహమే. పిన్నిగారి ఒక తమ్ముడు ఎప్పుడైనా వస్తే అందరం చుట్టూ మూగేవాళ్ళం. మా ఊళ్ళో తాచుపాము ఇంత పెద్దది, అంత లావుది, పగబడుతుంది అంటూ కధలు చెప్తూ ఉండేవారు ఆయన. భయం భయంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కళ్ళు ఇంత చేసుకుని కూర్చుని వినేవారం ఆ కధలన్నీ. అసలు విషయం చెప్పేది ఏమిటంటే ఇంతమంది వచ్చినా ఏ నాడూ వీళ్ళంతా వచ్చేస్తున్నారు, తినడానికి వండాలి, పడుకోవడానిక్కూడా ఖాళీలేదు అని ఎవరూ ఎప్పుడూ కూడా విసుక్కోలేదు. అసలు అటువంటి ఆలోచనలూ, మాటలే వచ్చేవి కాదు ఎవరికీ. ఎవరైనా వచ్చారంటే సంతోషం, కబుర్లు. వేసవిలో డాబా మీద ఒకరి పక్కన ఒకరు పడుకుని ఆకాశంలో నక్షత్రాలనీ, చంద్రుణ్ణీ చూస్తూ కబుర్లు నిద్ర వచ్చేదాకా.  ఈ వాటాలో ఏదైనా స్పెషల్ వంటకం చేసుకుంటే ఆ వాటాలోకి పంపించేవారు కూడా. పిన్నిగారికి ఆడపడుచు ఒకావిడ వాళ్ళింట్లో ఉండేవారు. అందరూ ఆవిడని అత్తయ్య గారు అనేవారం. ఆవిడ పొద్దున్న లేచినప్పటినుండి రాత్రి తొమ్మిదీ పదీ దాకా అదే పని, వంట ఇంట్లో లేదా మరోచోటో. అది లేనప్పుడు వడియాలో మరోటో పెట్టడం, వత్తులు చేయడం వగైరా. వేసవిలో ఊరగాయల పని ఉండనే ఉంది.  ఏ శివరాత్రో, కార్తీకమాసమో వస్తే మొత్తం వాటాలన్నీ ఉపవాసం – పిల్లల్తో సహా. పిల్లలం ఒకరినొకరు చెప్పుకునేవారం – ఉపవాసం ఎంత కష్టమో, లేదా తాను మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఎలా చేసారో అవన్నీ. రాత్రి తిండి అయ్యాక నిద్ర వచ్చేవరకూ ఇవే కబుర్లు. శివరాత్రికి ఊర్లోని భీమేశ్వరాలయానికీ అక్కడ జరిగే తీర్ధానికి వెళ్ళేవారం.

పిన్నిగారికి కానీ అత్తయ్యగారికి కానీ కోపం రావడం నేను చూడలేదు. ఎప్పుడైనా ఎవరి మీదైనా అరిస్తే అదో తాటాకు మంట. పది నిముషాల్లో చల్లారిపోయేది. కారణం ఏదైనా, ఎవరైనా అన్నం తినకపోతే ఆ రోజు పిన్నిగారూ అత్తయ్యగారూ కూడా తినేవారు కాదు. ఈ లోపున అత్తయ్యగారో పిన్నిగారో కళ్ళనీళ్ళు పెట్టుకుని – వాడికి మేము చేసిన వంట నచ్చలేదు, పిల్లాడు తినకుండా మేము తినడం ఎలా అనుకునేవారు. ఓసారి మా అన్నయ్య మా అమ్మగార్ని మధ్యాహ్నం పడుకున్నప్పుడు అదే పనిగా ఏడిపించుకు తింటూ ఉంటే లేచి వాడికి బడిత పూజ చేయబోయేరు. అత్తయ్యగారు వాణ్ణి వెనకేసుకొచ్చి మా అమ్మని దెబ్బలాడ్డం నాకు ఇంకా గుర్తే – అలా పిల్లల్ని చచ్చేటట్టు కొడతావేం అనేవారు. అలా నన్నూ, మా అన్న, అక్కలనీ కూడా వాళ్ళ పిల్లల కిందే చూసేవారు. నన్ను చిన్నబాబు అనీ అన్నని పెద్దబాబు అనీ అనడం అలవాటు. కొంత పెద్దయ్యాక మా అమ్మగారు మా అన్నయ్యతో ‘ఒరే నీ గర్ల్ ఫ్రెండ్ పిన్నిగారు’ అనేవారు వాణ్ణి ఏడిపించడానికి. అందరం నవ్వుకునేవారం.

పిన్ని గారి రెండో అబ్బాయికీ నాకూ స్పెషల్ స్నేహం. పిన్నిగారి సహనం, కోపం రాకుండా ఉండడం అవన్నీ ఇతనికీ వచ్చాయి. జీవితంలో ఇతను ఎప్పుడూ ఎవరితోనూ దెబ్బలాడ్డం గానీ, గొంతు ఎత్తి అరవడం కానీ నేను వినలేదు, చూడలేదు. ఈ రెండో ఆబ్బాయి ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను అతనితోటే ఉండేవాణ్ణి. తాతగారు పక్కవాటాలో ఉండేవారని చెప్పాను కదా, వాళ్ల అమ్మాయి ఎప్పుడైనా మా ఊరు వస్తే నన్నూ ఈ రెండో అబ్బాయినీ చూసి, ‘ఏమిటి వీళ్ళిద్దరికీ ఇంత స్నేహం, ఆ కుర్రాడూ, వీడూ చేతులు పట్టుకుని వదలరే?’ అని ఆశ్చర్యపోతూ ఉండేవారు(ట). ఈ సంగతి నాకు అనేక సంవత్సరాల తర్వాత తెల్సింది.  ఉత్తరోత్తరా ఈ రెండో అబ్బాయి ఇంజినీరింగ్ చదువుకుని అమెరికా వచ్చి అక్కడనుంచి ఆస్ట్రేలియా, బ్రెజిల్, లండన్, పారిస్ అంటూ అనేక నగరాల్లో, దేశాల్లో  పనిచేసి పెద్దవాడయ్యాడు. ఇతనే నేను అమెరికా రావడానికి సహాయం చేసినది కూడా.

పిన్ని గారి పిల్లలందరితోనూ కూడా నాకు, మా అన్నయ్యకీ బాగా స్నేహమే కానీ రెండో అబ్బాయి అంటే మరింత ఎక్కువ స్నేహం. పిన్ని గారి పెద్దబ్బాయి నన్ను కొన్ని కార్తీకమాసం రోజుల్లో సాయింత్రం ఊర్లో గుడికి ధ్వజ స్థంభం మీద పెట్టే ఆకాశదీపం చూడ్డానికి తీసుకెళ్ళేవాడు సైకిల్ మీద. వాళ్ళింట్లో సైకిల్ మేమూ, మా సైకిల్ వాళ్ళు ఎప్పుడైనా వాడుకునేవాళ్ళం కూడా. మూడు వాటాలకి మధ్య ఉన్న ఖాళీలో బాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ అడేసేవాళ్ళం. వేసవిలో డాబా మీదనుంచి గాలిపటాలు ఎగరేయడం కూడా సరదాగా ఉండేది. ఇంటి ప్రహారీ గోడకి, ఇంటికీ మధ్య కొంచెం ఖాళీ ఉండేది. అక్కడ బొప్పాయి, గోంగూరా అవీ పెంచేవారు. నేను, మా అన్నా ఏదో కర్ర ముక్కలు సంపాదించి ఆ మొక్కలమీద ‘వీడు రావణాసురుడు, వీడు కుంభకర్ణుడు’ అంటూ కొట్టి పాడుచేసేవాళ్ళం. అయినా ఎప్పుడూ మమ్మల్ని కొట్టడం కానీ మా అమ్మగారితో పితూరీ చెప్పడం కానీ జరిగేది కాదు. ‘అలా కొట్టకూడదు తప్పు’ అని చెప్పేవారు. మేము ఓ వెర్రి మొహం నటిస్తూ ‘నేను కొట్టలేదే?’ అని అబద్ధాలు ఆడేసేవాళ్ళం. అది అబద్ధం అని వాళ్ళకీ తెలుసు మాకూ తెలుసు. మా మొహాలు చూసి నవ్వేవారు.

ఈ విషయాలు మానాన్నగారి దగ్గిర కూడా ఎవరూ చెప్పినట్టు నాకు తెలియదు. మా నాన్నగారు సిగరెట్లు కాల్చేవారు కానీ పిల్లల్ని ఎవర్నీ ముట్టుకోనిచ్చేవారు కాదు. ఓ సారి ఈ పిల్లలలో ఒకరు చాపలు అల్లే కాడ తీసి నోట్లో పెట్టుకుని సిగరెట్ లాగా ఊదబోయేడు(ట). మా నాన్నగారు అతన్ని దగ్గిరకి పిలిచి ఓ నిజం సిగరెట్ ఇచ్చి, ‘తీసుకో కాల్చు’ అన్నారుట. అంతే, మళ్ళీ జన్మలో మరెప్పుడూ అటువంటి పనిచేయలేదు. అయితే బడితపూజ చేయాల్సిన చోట బెల్ట్ తీసి మరీ చేసేవారు నాకూ, మా అన్నకీ. మేం ఇద్దరం కొట్టుకుంటూ ఉంటే విడదీసి వేరువేరుగా కూర్చోపెట్టేవారు ఒక గంట. తర్వాత ఒకరి చెంపమీద ఒకరు ముద్దు పెట్టుకుని ఫోండి అనేవారు.

పిన్నిగారి విషయానికి వస్తే మా మీద కానీ వాళ్ళ పిల్లలమీద కానీ వివక్ష అనేది ఎప్పుడూ లేదు. మాకు అవిడ దగ్గిర ఎంత చనువు అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆకలేస్తోంది ఏదైనా పెట్టండి అని అడిగేసే అంత చనువు ఉం[డే]ది. అలా అడిగినందుకు ఎవరూ – పిల్లలూ, పెద్దలూ కూడా – ఏమీ అనుకునేవారు కాదు. ఇంట్లో ఉన్న నారింజ చెట్టుమీదకి ఎక్కేసి కాయలు కోసుకున్నా ఎవరూ ఏమీ అనడం ఎప్పుడూ లేదు. ఇంత మంది ఇంట్లో ఉన్నా ఒక్కసారి కూడా పిన్నిగారికి విసుగూ, కోపం అనేవి ఉండేవి కాదు. ఈ రోజుకి కూడా నేను పిన్నిగారు అని తల్చుకుంటే పెదాల మీద నవ్వు రావడానికి కారణం ఏమిటంటే ఆవిడ మా అందరిమీదా చూపించిన ఆపేక్షే.

మేము కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక ఇల్లు మారాం అదే ఊర్లో. వాళ్ళు కూడా మరో ఇంట్లోకి మారారు. అయినా అదే నమ్మకం, ఆపేక్ష ఉండేది మా మీద. అత్తయ్యగారికీ, పిన్నిగారికీ, మా ఇంట్లో పెద్దలందరికీ మా మీద ఎంత నమ్మకం అంటే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఫలానా  అబ్బాయి ఇలా చేసాడు అంటే ‘కాదు మా అబ్బాయి అలా చేయడు, ఫో’ అనేవారు. అందువల్ల మా స్నేహితుల్లో ఎవరికీ మామీద పితూరీలు చెప్పే సాహసం ఉండేది కాదు. అప్పట్లో నా స్నేహితుల్లో ఓ కుర్రాడు వచ్చి ‘మా నాన్న గారికి నామీద ఇంత నమ్మకం ఉంటే నేను ఎంత బాగుపడేవాణ్ణో?’ అనడం నాకు ఇప్పటికీ గుర్తే.

ఇల్లు మారాక పిన్నిగారింట్లో ఎప్పుడైనా అందరూ శెలవులకి మరో ఊరికి వెళ్తే నన్ను సాయం రమ్మనేవారు వాళ్ళింట్లో పడుకోవడానికి. నేనో పిరికి ఘఠం, ఆవిడ పెద్దావిడ. నేను ఆవిడకి చేసే సాయం ఏమిటో నాకు అర్ధం అయ్యేది కాదు. తెగించి ఒకసారి అడిగేసాను కూడా, “నేను మీకేం సహాయం చేస్తానండి పిన్నిగారూ” అంటూ. ‘ఊరికే రా, నువ్వు నాకు మగ దిక్కు’ అనేవారు సరదాకి. ఇది బాగా జోక్ అయ్యి అందరికీ తెల్సింది – ఆఖరికి మానాన్నగారు కూడా నన్ను ‘ఏవిరోయ్ మగదిక్కూ’ అని వెక్కిరించి పగలబడి నవ్వేవారు.  అయినా సరే నేను వెళ్ళి పడుకునేవాడిని. ఆవిడకి నేను చేసిన సహాయం ఏదీ లేదు కానీ హాయిగా తినేసి గుర్రు పెట్టి పడుకునేవాణ్ణి. మర్నాడు నేను లేచేసరికి ఆవిడ అప్పటికే లేచి పూజలోనో వంట పనిలోనో ఉండేవారు.

ఆ ఇంట్లో ఓ సారి కాకరపాదు పెట్టారు. అది సరిగ్గా కాయలు కాసే సమయానికి నేను తయారు. సగానికి సగం కోసేసుకుని ఇవి నే పట్టుకుపోతున్నా అనేవాణ్ణి. ‘తీసుకో, అడగడం ఎందుకు?’ అనేవారు. ఇవ్వడం లో హాయిగా నవ్వుతూ ఇచ్చేవారు. అలా నేను ఆవిడకి కాకరకాయలు బాకీ ఉండిపోయాను. నేను చదువు కోసం మద్రాస్ (అప్పట్లో) వెళ్ళాక వెనక్కి వచ్చేసరికి పదకొండు నెలలు పట్టింది ఒక ఏడాది. నేను పిన్నిగార్ని చూడ్డానికి వెళ్ళాను అన్నయ్యతో పాటు. ‘ఏడీ, ఏడీ చిన్నబాబు’ అంటూ వంటగదిలోంచి బయటకి వస్తూంటే వాళ్ళ అమ్మాయి, మా అన్నయ్యా నన్ను పక్క గదిలోకీ, అక్కడ్నుంచి వంటగదిలోకి తోసేసి ఆవిడకి నేను కనిపించకుండా పది నిముషాలు సరదాగా ఏడిపించారు. మేమంటే ఎంత ఆపేక్ష ఉన్నా చిన్నబాబు అంటే మరింత ఆపేక్ష – ఎందుకో తెలియదు.  ఈ రోజుకి కూడా పిన్నిగారు అని తలుచుకుంటే ఆవిడ నవ్వు మొహం తప్ప మరేమీ గుర్తు రాదు నాకు.

మాకున్న అరడజను అసలు పిన్నిల (మా అమ్మగారి స్వంత చెల్లెళ్ళు) కంటే ఈ పిన్నిగారంటేనే మాకు ఎక్కువ కలుపుగోలుగా ఉండేది. మా అన్నయ్య కి ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళాక అక్కడ మోటార్ సైకిల్ కొన్నాడు. మరో అసలు పిన్ని కూతురు వాడిని చూడ్డానికి వెళ్ళి వాడి మోటార్ సైకిల్ ఎక్కింది. అది చూసిన ఎవరో మా అమ్మగారికి పితూరీ చెప్పారు – మీ అబ్బాయి ఎవర్నో అమ్మాయిని ఎక్కించుకుని తిరుగున్నాడు అని. మరో అసలు పిన్ని ఈ మాట వినగానే ఓ విసురు విసిరిందిట – ‘పెద్దవాళ్ళయ్యాక మొగాళ్ళందరూ అంతే, ఆడదంటే పడి ఛస్తారు ’ ఇదే విషయం పిన్నిగారికి చేరితే ఆవిడ ఏమన్నారో వినండి – ‘ఛీ, ఛీ పెద్దబాబు అలా చేయడు. ఆ పిల్ల వాళ్ల పిన్ని కూతురు. నీకు తెలియదు నోరుమూసుకో’. ఇదీ వరస పిన్నిగారిది. ఆవిడకి మా మీద ఆపేక్ష, నమ్మకం అటువంటిది. అది ఏనాడూ పోలేదు.

పిన్ని గారి రెండో అబ్బాయి ప్రపంచం లో దాదాపు అన్నిచోట్లా పనిచేసాడు అని చెప్పాను కదా? ఆ అబ్బాయి ఫ్లోరిడా లో ఉన్నప్పుడు పిన్ని గారు అమెరికా వచ్చారు. అప్పటికి నేను టెన్నెస్సీలో స్టూడెంట్ వీసా మీద వచ్చాను, ఈ ఫ్లోరిడా అబ్బాయి స్పాన్సర్ చేసిన కాగితాలతో వచ్చిన వీసా వల్లే. అప్పుడు నాకు పిన్నిగారో ఉత్తరం రాసారు తెలుగులో – నేను ఇక్కడకి వచ్చి ఇన్నాళ్ళు అయింది. మరో నెలలో వెళ్ళిపోతున్నాను వీలుంటే వచ్చి కనిపించు అంటూ.  అప్పట్లో సెల్ ఫోన్లూ, ఈమెయిల్ అంత ప్రాచుర్యంలో లేవు. ఆ ఉత్తరం చూసి నేను ఫ్లోరిడా వెళ్ళాను పిన్నిగార్ని చూడ్డానికి వేసవిలో. అక్కడ వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గిర పిన్ని గారూ వాళ్ల కోడలూ ఆవకాయ పెట్టేసారు. నాకు ‘అత్తగారు, ఆవకాయ’ (అమెరికాలో) అనే భానుమతి కధ గుర్తు వచ్చి నవ్వు ఆగలేదు. ఆ మాట చెప్తే వాళ్ళిద్దరూ హాయిగా నవ్వారు కూడా. వాళ్ళబ్బాయి ఆఫీసుకి శెలవు పెట్టి మరీ నాకు ఫ్లోరిడాలో సముద్రం, బీచ్, ఊరూ చూపించాడు. చిన్నప్పుడు నన్ను కుటుంబంలో ఎలా చూసారో ఫ్లోరిడాలో కూడా అలాగే చూసారు. ఇప్పటికీ అంతే.

వాళ్ల అమ్మాయి పెళ్ళి అయ్యి, పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయ్యాక హైద్రాబాదు వచ్చేసారు పిన్ని గారు. కొన్నేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు చూడ్డానికి వెళ్ళాను అందరితో పాటు. ‘వస్తున్నాను’ అని చెప్తే ఇంకేమీ చెప్పక్కర్లేదు – భోజనానికే అని అర్ధం వచ్చేలా ఉన్నాం అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా. అలా వెళ్ళినప్పుడు అన్నీ టేబిల్ మీద పెట్టారు తినడానికి. నేను అంటూ, మడీ ఆచారం పాటించను కనక ముందే అడుగుతాను – అన్నీ ముట్టేసుకుంటే ఏమనుకోరు కదా? పిన్ని గారు నవ్వేసి ‘ఏమీ అనుకోం, నీ ఇష్టం’ అనడం. అలా టేబిల్ మీద ఉన్న ఊరగాయ వేసుకుని తింటూ – ఈ ఊరగాయ బావుంది ఈ సీసా నేను పట్టుకుపోవచ్చా అని అడిగాను. చెప్పాను కదా, ఆవిడ దగ్గిర ఎప్పుడూ మొహమాటం లేదు నాకు. అలాగే వాళ్ల పిల్లల దగ్గిర కూడా ఏనాడూ మొహమాట పడలేదు. అలా అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారో చూడండి – “ఆ చిన్న సీసా ఎందుకూ, నీకు పెద్ద సీసాలో ఊరగాయ పెట్టి సీల్ చేసి ఇస్తాను వెళ్ళే ముందు.” అదీ ఆవిడ పద్ధతి.  వాళ్ళ అమ్మాయి కూడా అంతే. సరిగ్గా క్రితం ఏడు మేము మా అబ్బాయి ఉపనయనానికి ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం. ఈ సారి పిన్నిగారికి వయసు వచ్చి నీరసంగా ఉన్నారు కానీ మేము చెప్పిన చిన్నప్పటి ‘రావణ కుంభకర్ణుల’ కధ విని నవ్వారు. భోజనం అయ్యాక వాళ్ళ అమ్మాయి నాలుగు సంచీల నిండా ఊరగాయలు ఇచ్చారు. నాకు వాళ్ళ దగ్గిర మొహమాటం, సిగ్గూ, ఎగ్గూ లేవు కనక ముక్తసరిగా ఓ పిచ్చి, వెర్రి నవ్వు నవ్వి అవన్నీ తెచ్చుకున్నాను. ఆఖరికి వాళ్ళ అల్లుడు రాసిన పుస్తకం కూడా అడిగి మరీ ఎత్తుకొచ్చేసాను. పుస్తకం డబ్బులు ఆయన అడగరనే ధైర్యం. అడిగినా ఇచ్చి ఉండేవాణ్ణి కాదు, నిజం.

పిన్నిగారికి మేమంటే ఎంత ఆపేక్ష ఉన్నా నేనంటే కొంచెం ఎక్కువ ఆపేక్ష. ఒక్కోసారి వాళ్ల స్వంత పిల్లలకంటే ఎక్కువ ఆపేక్ష చూపించారు మామీద. మా అక్కలు అన్నా అన్నయ్య అన్నా వాళ్ళ స్వంత పిల్లలలాగానే మేము కూడా. పిన్నిగారు ఈ నెల స్వర్గస్తులయ్యారు అని మెసేజ్ వచ్చింది. నేను ఏదైనా సహాయం చేస్తాను అని వాళ్ళ – అమెరికాలో ఉన్న రెండో అబ్బాయిని అడిగాను. ఏమీ వద్దు అనేసాడు. సరే ఇతన్ని అడిగితే అలాగే అంటాడు అని హైద్రాబాదులో ఉన్న వాణ్ణి అడిగాను. అతనూ ఏమీ వద్దు అనేసాడు. వాళ్ల అమ్మాయి కూడా అలాగే అంది. చూసారా వీళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. అది పిన్నిగారు నేర్పినదే కాబోలు. నేను పిన్నిగారి కోసం మహా మృత్యుంజయ జపం చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాను. మా పిన్నిగారికి ఇవ్వడమే తెలుసు. ఎప్పుడూ నాకు ఇది కావాలి, అది కావాలి అని ఆవిడ ఎవర్నీ (వాళ్ళ కుటుంబంలో వారిని కూడా) అడిగినట్టు నేను వినలేదు, చూడలేదు.  ఆవిడ అత్యంత అల్ప సంతోషి. సంస్కృతంలో చాణుక్యుడు రాసినట్టుగా చెప్పబడే ఒక శ్లోకం ఉంది.

మాతృపుణ్యాత్ సుశీలో హి పితృపుణ్యాత్ తు చతురః ।
కులపుణ్యాత్ వదాన్యః స్యాత్ ఆత్మపుణ్యాత్ తు భాగ్యవాన్ ॥

దీని అర్ధం ఏమిటంటే పిల్లలకి తల్లి చేసుకున్న పుణ్యం వల్ల మంచి శీలం అనేది అలవడుతుంది, తండ్రి చేసుకున్న పుణ్యం వల్ల తెలివితేటలు, నేర్పు కలుగుతాయి. తన వంశీయులు చేసిన పుణ్యం వల్ల దాతృత్వం అనేది అలవడుతుంది. తన స్వంత పుణ్యం వల్ల సంపదలు కలుగుతాయి.  పిన్నిగారి వల్ల ఆవిడ పిల్లలందరికీ ఇవ్వడం, అందరితో మంచిగా ఉండడం అనే అలవాటు వచ్చింది కదా అనిపిస్తూ ఉంటుంది నాకు.

పిన్నిగారు తెలుగు రాయడం చదవడం తప్ప పెద్దగా చదువుకోలేదు. అయితేనేం? ఆవిడ మనస్సు వెన్న. అనేక కోట్లమంది విధ్యాధికులకంటే, దేశాధ్యక్షులకంటే, నోరు విప్పితే అశుద్ధం, అబద్ధం తప్ప బయటకి రాని మనుషుల కంటే మా పిన్ని గారి సంస్కారం అనేక లక్షల కోట్ల రెట్లు అధికం. వాళ్ళ పిల్లకి కూడా అదే సంస్కారం నేర్పించారని నేను ఘంటాపథంగా చెప్పగలను.  జీవితంలో కొంతమంది మనకి ఏదో పూర్వ జన్మ సుకృతం వల్ల తారసపడతారు. ఎందుకో ఏమిటో మనకి ఏనాటికీ తెలియదు. అలా నేను పిన్నిగారికీ వారి కుటుంబానికీ ఋణపడి ఉన్నాను. ఈ ఋణం ఈ జీవితంలో తీరదనేది వాస్తవం. మరో జీవితంలో చర్మం తీసి చెప్పులు కుట్టి ఇవ్వాలి కాబోలు. నాకు ఇప్పటికీ తెలియని, అర్ధం కాని చిక్కుముడి ఏమిటంటే నేను పిన్నిగారికి చుట్టాన్ని కాదు, ఏదో బీరకాయ పీచు సంబంధం ఉందేమో నేను పట్టించుకుని అడగలేదు, చూడలేదు. పిన్నిగారికి నేనంటే ఆపేక్ష సరే, కానీ వాళ్ల పిల్లలకీ కూడానా? పెద్దబ్బాయి నన్ను కార్తీకమాసం గుడికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే, రెండో అబ్బాయి నా జీవితం లో దారి చూపించాడు ప్రతీ విషయంలో. ఇంకోలా చెప్పుకోవాలంటే ఈ రెండో అబ్బాయి సహాయం లేకపోతే నేను లేను. మూడో అబ్బాయి నేనూ మరింత స్నేహితులం. ఎప్పుడైనా ఊరికి వెళ్తే పక్క ఊర్లో ఆడే ఇంగ్లీష్ సినిమాలకి కూడబలుక్కుని వెళ్ళిపోయేవాళ్ళం మేం ఇద్దరం. మా ఊరి గుళ్ళో పూజార్లతో సహా అందరికీ నన్ను పరిచయం చేసి దగ్గిర ఉండి అన్నీ చూపిస్తాడు కూడా ఇప్పటికీ. పిన్ని గారి అమ్మాయికీ మా అక్కలకీ ఎంత స్నేహమో. దాదాపు ప్రతీరోజూ కలుసుకునేవారు. ఏ రోజైనా వాళ్ళ అమ్మాయి మా ఇంటికి రాకపోతే మా అక్కలిద్దరూ ఇవాళ ఎందుకు రాలేదో అని కలవరపడేవారు.  హైద్రాబాదులో ఉన్నప్పుడు కూడా రోజూ ఫోన్ చేస్తారు. ఆఖరి అబ్బాయి నేనూ కూడా మంచి స్నేహితులం; దానికి మించి మరింత క్రికెట్ స్నేహితులం. కనీసం ఇంతమందిలో ఒక్కరికైనా నేనంటే పడకపోవడం లేదు. అందరికీ చిన్నబాబు అంటే చిన్నబాబే. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు. ఈ ఋణం ఎలా తీరుతుందో అసలు తెలియదు.

పిన్నిగారు స్వర్గస్తులయ్యాక పన్నెండో రోజున కర్మ చేసిన వాళ్ళబ్బాయి మా అన్నతో చెప్పాట్ట – పిన్నిగారు చాలా సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోయారు అని. తాను చేసిన త్యాగాలకీ, జీవితంలో అందరికీ హాయిగా నవ్వుతూ ఇచ్చిన అన్నింటికీ, పైగా ఎవరినీ శతృవులుగా చూడకుండా బతికినందుకూ మా ఊరి భీమేశ్వరుడూ, బాలా త్రిపుర సుందరీ ‘రా అమ్మా వెళ్దాం,’ అని చేతులు చాచి పిలిచారనుకుంటా. హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ కనిపిస్తారా మన జీవితంలో లేదా రాబోయే జన్మలో కానీ అని ప్రశ్న వేసుకుంటే ‘అసంభవం’ అనే సమాధానమే తన్నుకు వస్తోంది మనసులోంచి. ఇది రాస్తూంటే ఎన్నిసార్లు కళ్ళు తుడుచుకున్నానో, ఎన్నిసార్లు పిన్నిగార్ని తల్చుకుంటూ నవ్వుకున్నానో దేవుడికెరుక.

ఎవరైనా స్వర్గస్తులైతే వాళ్ళ గురించి ఎప్పుడూ ఏడవకూడదు అంటారు. అలా ఏడిస్తే వాళ్ళ ఆత్మ ముందుకి ప్రయాణించే దారికి మన ఏడుపు అడ్డం వస్తుంది. ఎందుకంటే మన ఏడుపు వల్ల ముందుకి వెళ్ళే బదులు వెనక్కి వచ్చి ఎవరు నాగురించి ఏడుస్తున్నారు అని చూడాల్సి వస్తుందిట. అందువల్ల నేను ఏడవకుండా ఉండడానికి ప్రయత్నం చేసాను ఇన్నిరోజులూ. కానీ ఇది రాస్తూ ఉంటే కష్టం అయింది.  పిన్నిగారు సంతోషంగా ఉండాలనీ, నవ్వుతూ తన ప్రయాణం సాగించాలనీ ఆ మృత్యుంజయుణ్ణి కోరుకుంటూ జపం చేసాను.  పిన్నిగారూ, మీ సహాయానికీ, మీ కాకరకాయలకీ అలా మీరు అనేకానేక మర్చిపోయిన వాటికీ నేను మీకు బాకీ. మీరు వద్దు అన్నా వడ్డీ తో సహా మీ బాకీ తీర్చడానికి మరో సారి కలుస్తాను లెండి. ఈ చిన్నబాబు ఎవర్నీ వదలడు. ఇలా అన్నందుకు నవ్వుతున్నారు కదూ, నవ్వండి. హాయిగా నవ్వుతూనే ఉండండి, ఎప్పటిలాగానే.

********

Posted in June 2026, కథలు

4 Comments

  1. Parvathipadma Pathaneni

    చినబాబు ప్రతి సంఘటనని గుర్తుంచుకుని , అనుభవించి, మళ్ళీ మనందరినీ పాత రోజుల్లోకి, సామర్లకోట అంతా తిప్పి చూపించాడు. ఆనాటి ప్రేమ, అభిమానాలు నిజంగా ఇపుడు లేవు. ఇక రావు. ఇపుడు మంచి స్నేహం కూడా కరువయ్యింది. అది కూడా కలుషితం అయిపోతోంది.

  2. ఇంద్ర ప్రసాద్

    చిన్నబాబు బాగా రాసేడు. పిన్నిగారిని సవ్యంగా, అనాటి కాలాన్ని, ఇప్పటికీ మిగిలిన అనుబంధాల్ని చక్కగా ప్రతిబింబించేడు.
    పిన్నిగారు నాకు, మా అమ్మకి, మా మామయ్య పిల్లలకి, మా అక్క పిల్లలకి , మా పిల్లలకి కూడా పిన్నిగారే.
    థాంక్యూ.

  3. C.R.Annapurna Hyderabad.

    ఇది నిజంగా రచయిత రాసిన కథలా కాదు ఆయన అనుభూతి చెందిన స్వీయానుభవంలోంచి వచ్చిన జ్ఞాపకాల పరంపర లాగే అనిపిస్తోంది! ఎక్కడున్నాయి అప్పటి అనుబంధాలు? కల్మషంలేని, స్వార్థం తెలియని ప్రేమ పూర్వక పలకరింపులు? ఈ సాంకేతికత పెరిగిన ప్రపంచంలోనూ, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన సమాజంలోనూ, స్వార్ధంతో ఒకరికొకరు కంపారిజన్ తో వారికి ఉంది..నాకు లేదనే అంతర్గత భావాలతో పెరిగి తల్లిదండ్రులూ పిల్లలను అలాగే గారాబం చేయటం వల్ల సమాజంలో నిస్వార్ధంతో , ఆత్మీయతతో కూడిన ప్రేమకు తావెక్కడిదీ?! అసలు మారుతుందా? ఇలాగే కొనసాగుతుందో తెలీటం లేదు. “మా పిన్నిగారు” శీర్షికతో వచ్చిన ఈ కథానిక నిజానికి అప్పటి అనుబంధాలకు అద్దం పట్టేటట్లు ఉన్నదనటంలో అతిశయోక్తి లేదు. రచయితకు అభినందనలు ఆయన కాలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆశిస్తూ…

  4. తాడిగడప శ్యామలరావు

    మంచి కథనం.
    ఇది ఒక కల్పన అనిపించటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *