Menu Close
Kadambam Page Title
కోడి కూత లోపే నీకు దిష్టి తీస్తాను
సుభాషిణి వడ్డెబోయిన

కళ్ళ లోగిలిన చూపుపడకేసి
కలల ధూపమేసి
తలపు తలుపు తెరచుకున్నా
కాలం కరుగుతున్నా
కానరాననుకోని
కాదంటానని కలత పడ్డావేమో!

సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు
చిలిపి మాటలతో చెప్పుకున్న ముచ్చట్లు
మనం అనే వనంలో పండు వెన్నెలలో
పడి పడి కోసుకున్న పూలనడుగు
నా మనసు సువాసనలు చెబుతాయి

మన చెలిమి వెలుగు కునుకుతో
చీకటికి కునుకాగి
జాబిలి జంట కోరికతో సిగ్గుపడి
మబ్బు ఒడిలో మునిగింది

చలికే వణుకు పుట్టి
వేడి కోసం వెతుక్కుంటూ
మదిన మత్తును కోరగా
మన పక్కలో ఒరిగి,

తొంగి చూసే జాము వెక్కిరించేలోపే
గుట్టుగా నా గుండెల్లో దూరిపో
కోడి కూత లోపే నీకు దిష్టి తీస్తాను...
కోరిన తీపి కోరికను
మూట కట్టి నీ ముందు ఉంచుతాను...

Posted in March 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *