అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శ్రీరాముఁడు
మ.కో. ఆత్మఘోషము(1)నైనఁ జూచితివయ్య నీ కృపతోడ నీ
ఆత్మఘోష(2) వినంగరావె దయాంబుధీ! బుధసన్నుతా!
ఆత్మవంతునిఁ(3) జేయుమా తుద కాత్మసిద్ధి(4) లభించఁగా
ఆత్మజుండను గానె నీకు? ధరాత్మజాహృదయేశ్వరా! 66
(1) కాకి (2) ఆత్మ పెట్టు ఘోష (3) చిత్తవికారము పొందనివాని
(4) మోక్షము
కం. రామా! రా మారామా(1)?
రామా? భద్రాద్రిధామ! రయముగ దరికిన్
రామా! రా మారామా! (2)
రామామారాభిరామ! రఘుకులసోమా! 67
(1) మారామటయ్యా (2) మా వాఁడవైన రామా
శా. ముక్తాలంకృతదివ్యభాసురధరాపుత్రీసుమిత్రాత్మభూ
యుక్తశ్రీకరశంఖచక్రశరచాపోద్దండసమ్మోహన
వ్యక్తానన్యసుదర్శనం బొసఁగి నీ యౌదార్యమున్ జూప నీ
భక్తున్ భద్రనగంబుఁ జేర్చితె? నమోవాకంబు సీతాపతీ! 68
(సోమవారము సాయంసమయమున ముత్యాలతో నలంకరిం పఁబడిన
భద్రాద్రిరామదర్శనము గురించి)
కం. ఆపదలే ‘పద పోవుద
మా పదములఁ దాళఁ జాల మ’ని పరుగిడవే
మీ పదముల శరణమ్మన
శాపదరభ్రంశహరణచరణా! రామా! 69
పంచప్రాసోత్పలమాల
నీ చరణంబులే మదిని నిల్పి భజించెడివాఁడఁ గాని యే
నీచరణంబు లే నెఱుఁగ; నేర్పెఁగదా చిననాఁడె మాత తా
నాచరణంబు లోన సుజనావన! నీ పయి భక్తి; నేఁటికిన్
ఆ చరణంబులన్ దలఁచి యంజలి సేసెదఁ గావ రావయా! 70
ఉ. ఇంతటి వేఁడి నెట్టులు సహింపఁగ నేర్చితొ రామభద్ర? నీ
చెంత దయామృతంబు కడుచిక్కఁగఁ జక్కఁగ జాలువాఱి యొు
క్కింతయు వేఁడి నీ దరికి నెవ్విధిఁ జేరక చూచుటన్ జుమీ
ఎంతటివాఁడఁ? జిల్కు కరుణించి దయామృతబిందు వొక్కటిన్ 71
(భద్రాద్రి రాములవారి నుద్దేశించి)
సీ. తొలిసూర్యకిరణాలు గిలిగింతలను బెట్టఁ
దెలవారినప్పడు గలిగినట్టి
దివ్యానుభూతి వాగ్దేవికైనను గూడ
వర్ణింప నగునె? నా భాగ్యమదియె
తొలిజన్మలందు నే తలిదండ్రులకుఁ బుణ్య
ఫలముగా జన్మించి పరమపురుషు
శ్రీరామచంద్రుని సేవించి తరియించి
మఱల సేవింపఁగ మహిని బుట్టి
తే.గీ. భద్రగిరిధాము మోసి సువర్ణపుష్ప
పూజ నలరింపఁజేసిన పుణ్యఫలమొ?
బాలరామాయణాష్టకపఠనఫలమొ?
నేఁటి దర్శన భాగ్యంబు; సాటి గలదె? 72
త్రిప్రాసకందము
మీ యుభయుల దీవెనలే
మా యుభయుల రక్షగాదె? మాయు భయంబుల్
మా యుభయమ్ములు(1)సుఖమయ
మౌ యభయము మీ రొసంగ నవనిసుతేశా! 73
(1) ఇహపరములు
శా. ముక్తాయుక్తము లక్షతల్ త్రిభువనప్రోత్సాహకంబుల్ మదిన్
భక్తిన్ దాల్చినఁ జాలుఁ దా శిరముపైఁ బ్రాపించు సౌభాగ్యముల్
వ్యక్తంబౌ ధరణీసుతేశకరుణాఽపాంగేక్షణావాప్తికిన్
భుక్తిన్ రక్తిని ముక్తి నిచ్చు భవితే మోదావహంబై సదా 74
(శ్రీభద్రాద్రిసీతారామకల్యాణాక్షతల గురించి)