Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

మంచి స్నేహం

వేసవి సెలవలు అయిపోయి బళ్ళు తెరుచుకున్నాయి. కృష్ణానంద చదువుతున్న తరగతిలో త్రిభువన్ అని ఒక పిల్లవాడు కొత్తగా చేరాడు. త్రిభువన్ తండ్రి వెంకటాచలానికి బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. చూడటానికి తెల్లగా, అందంగా, చురుగ్గా ఉండే త్రిభువన్, తన మాటలతో అందరినీ ఆకర్షిస్తూ ఉండేవాడు. వచ్చిన సమస్యల్లా త్రిభువన్ కి చదువు పట్ల బొత్తిగా శ్రద్ధ లేదు! ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ అందరి చిరాకుకూ కారణమవుతూ ఉండేవాడు త్రిభువన్. చిన్నప్పుడు కష్టపడి చదువుకుంటే తప్ప త్రిభువన్ కి పెద్దవాడయ్యాక మంచి భవిష్యత్తు ఉండదని భావించిన వెంకటాచలం, తనకు తెలిసినవారి సలహా మేరకు కృష్ణానంద వెడుతున్న బడిలో త్రిభువన్ ను చేర్పించాడు. బడిలో చేరిన వారంలోపే, త్రిభువన్ తన తరగతిలో ఉన్న సగం మంది పిల్లలను తన స్నేహితులుగా చేసేసుకున్నాడు. అలా చేసుకున్నవాళ్ళల్లో కృష్ణానంద కూడా ఉన్నాడు!

ఒకరోజు బడినుండీ ఇంటికి వెడుతున్న కృష్ణానందను త్రిభువన్ ఆపి, "కృష్ణా! అరగంట తర్వాత మా ఇంటికి రారా. ఆడుకుందాం!", అన్నాడు.

"సరే!", అని మొహమాటంగా సమాధానం చెప్పి, గబగబా ఇంటికి వెళ్ళి, త్రిభువన్ విషయం మీనాక్షికి చెప్పాడు కృష్ణానంద.

"ఆ త్రిభువన్ వాళ్ళ ఇల్లు రాజభవనంలా ఉంటుందిట! వెళ్లి కాసేపు ఆడుకుని రా. అటువంటి గొప్పవారితో స్నేహం మంచిదే!", అని చెప్పి, కృష్ణానందకు త్రిభువన్ ఇంటికి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది మీనాక్షి.

కృష్ణానంద త్రిభువన్ వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు ఆడుకుని వచ్చాడు. మర్నాడు కూడా బడి అవుతూనే ఇంటికి రమ్మని బలవంతం చేసి, కృష్ణానందను తమ ఇంటికి పట్టుకెళ్ళాడు త్రిభువన్. అలా ప్రతిరోజూ బడి అవ్వగానే ఆటల పేరుతో త్రిభువన్ ఇంటికి వెళ్ళటం అలవాటైపోయింది కృష్ణానందకు. మెల్లిగా వారాంతాలు కూడా త్రిభువన్ ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాడు కృష్ణానంద. అంతలో పరీక్షలొచ్చాయి. త్రిభువన్ తో కలిసి ఆటలాడుతూ చదువును అశ్రద్ధ చెయ్యడంతో కృష్ణానందకు పరీక్షల్లో మార్కులు బాగా తగ్గిపోయాయి. అది చూసి కృష్ణానందను మందలించబోయింది మీనాక్షి.

అప్పుడు కృష్ణానంద, "అమ్మా! ఆ రోజు నేను వెళ్లి త్రిభువన్ తో ఆడుకుంటానంటే అందుకు నువ్వు ఒప్పుకున్నావు కదా?! ఇప్పుడు ఆ విషయంలో నువ్వే నన్ను కోప్పడతావేమిటీ?", అని మీనాక్షిని కసిరినట్లుగా అన్నాడు.

మీనాక్షికి ఏం సమాధానమివ్వాలో అర్ధం కాలేదు.

అక్కడేఉండి జరిగినదంతా గమనిస్తున్న ప్రసూనాంబ, "అమ్మా మీనాక్షీ! వాడితో నేను మాట్లాడతానులే! నువ్వేమీ బాధ పడకు!", అని కృష్ణానందను పిలిచి తన పక్కన కూర్చోమని సైగ చేసింది. కృష్ణానంద వచ్చి ప్రసూనాంబ పక్కన కూర్చున్నాడు.

ప్రసూనాంబ కృష్ణానంద భుజంపై ఆప్యాయంగా చెయ్యి వేసి,"నాయనా ఆనందూ! చదువుకుంటే బాగుపడతావురా! అందుకే అమ్మ నిన్ను మందలించింది. ఇంతకీ నీకు జారుడు బండ అంటే ఇష్టం కదా?", అని అడిగింది.

"ఓ! చాలా ఇష్టం బామ్మా!", ఠక్కున బదులిచ్చాడు కృష్ణానంద.

ప్రసూనాంబ చిన్నగా నవ్వి,"జారుడు బండ ఎక్కడం కష్టమా? జారడం కష్టమా?", అని అడిగింది.

"ఎక్కడమే కష్టం బామ్మా! జారడం చాలా తేలిక. ఎందుకంటే మెట్లు ఎక్కడానికి శక్తి కావాలి. జారేందుకు మన ప్రయత్నం కొంచెం కూడా అక్కర్లేదు!", కళ్ళు పెద్దవి చేసి మరీ చెప్పాడు కృష్ణానంద.

"కృష్ణా! సరిగ్గా చెప్పావు. జీవితంలో కూడా పైకి ఎదిగి ఉన్నతంగా స్థిర పడాలంటే కష్టపడాలిరా! అదే కిందకి జారి పడిపోవడంకోసం ఏమాత్రం కృషి చెయ్యక్కర్లేదు. అలాగే నీకు చదువులో మంచి మార్కులు రావాలంటే నువ్వు చదువు పై శ్రద్ధ పెట్టాలి. చదువుంటేనే మంచి భవిష్యత్తు పై కలలు కనే అధికారం ఉంటుంది! మనం స్నేహం చేసేటప్పుడు గొప్పగుణం ఉన్నవారిని ఎంచుకోవాలి. అప్పుడు వారికున్న మంచి గుణం మనక్కూడా కాస్తోకూస్తో అలవడుతుంది. అంతేగానీ బాగా ఆస్తి ఉన్నవారంతా గొప్పవాళ్ళని అనుకుని స్నేహం పేరుతో విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు!", అంది ప్రసూనాంబ.

ప్రసూనాంబ చెప్పిన విషయం అక్షరాలా నిజమని తోచింది కృష్ణానందకు. కానీ త్రిభువన్ ఆటలకు రమ్మన్నప్పుడు కాదనలేకపోతూ ఉండేవాడు కృష్ణానంద.

ఒకరోజు ప్రసూనాంబ కృష్ణానందను పిలిచి, "కృష్ణా! నువ్వు సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలుగుతావు. మన ఊళ్ళో ఉన్న ప్రభాకరంగారు గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటావా?", అని అడిగింది.

కృష్ణానందకు పాటలంటే సహజంగా ఇష్టం కనుక ప్రసూనాంబ అడిగినదానికి వెంటనే ఒప్పుకుని సంగీతంలో చేరిపోయాడు.

నెలరోజులు గడిచాక ప్రభాకరం మీనాక్షితో, "మీ అబ్బాయికి సంగీతం చాలా చక్కగా వస్తోంది. ప్రస్తుతం వారానికి రెండుసార్లే నా దగ్గరకు వస్తున్నాడు. మీకు సమ్మతమైతే ప్రతిరోజూ నా దగ్గరకు సంగీత సాధనకోసం కృష్ణానందను పంపించండి. త్వరలో మన ఊళ్లోని గుడిలో కృష్ణానంద చేత సంగీత కచ్చేరీ ఇప్పిస్తాను!", అన్నాడు. సరేనంది మీనాక్షి.

ఒకరోజు త్రిభువన్ కృష్ణానందతో,"కృష్ణా! నువ్వు బడి తర్వాత ఎక్కడికెడుతున్నావ్? నాతో ఆడుకునేందుకు ఎవ్వరూ లేకపోవడంతో నాకు ఆ సమయంలో ఏమీ తోచట్లేదు!", అని అన్నాడు.

"నేను సంగీతం నేర్చుకుంటున్నానురా. రేపటినుంచీ నువ్వు కూడా నాతోరా! ఇద్దరం కలిసి సంగీతం నేర్చుకోవచ్చు!", అన్నాడు కృష్ణానంద.

ఆ ఆలోచన త్రిభువన్ కు నచ్చింది. ఆ పేరుతో కృష్ణానందతో కాసేపు సరదాగా గడపచ్చని అనుకున్న త్రిభువన్ ప్రభాకరం వద్ద సంగీతంలో చేరిపోయాడు. సంగీత పాఠాలు త్రిభువన్ కు బాగా నచ్చాయి. ఇష్టంతో సాధన చేసి తక్కువ సమయంలోనే సంగీతంలో కృష్ణానంద స్థాయికి చేరుకున్నాడు త్రిభువన్. నిరంతర సంగీత సాధనవల్ల త్రిభువన్ కి ఏకాగ్రత కూడా పెరిగింది. ఆ ప్రభావం చదువుపై కనపడటం ప్రారంభించింది. ప్రభాకరం కృష్ణానంద, త్రిభువన్ ల సంగీత కచ్చేరీని గుడిలో ఏర్పాటు చేశాడు. కచ్చేరీకి వచ్చిన వారంతా కృష్ణానంద, త్రిభువన్ ల ప్రతిభను పొగిడారు. ఆ ఏడాది పరీక్షల్లో కృష్ణానంద తమ బడిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ శుభవార్త కృష్ణానంద ఇంటికెళ్లి అందరితో పంచుకుంటూ ఉండగా త్రిభువన్ మిఠాయిలు తీసుకుని వెంకటాచలంతో కలిసి కృష్ణానంద ఇంటికి వచ్చాడు. మీనాక్షి, ప్రసూనాంబలు వెంకటాచలాన్ని తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.

"నమస్కారం. నా పేరు వెంకటాచలం. నేనొక వ్యాపారిని. ఎన్ని ఆస్తులు సంపాదించినా ఒక తండ్రిగా నా మనసు ఎప్పుడూ నా బిడ్డ త్రిభువన్ గురించి ఆరాటపడుతూ ఉంటుంది. వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే నేను పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. మీవాడితో స్నేహం మా వాడిని మంచి దారిలో పెట్టింది. మా త్రిభువన్ మాటలనుబట్టి మీ పిల్లవాడిలో ఎన్నో మంచి గుణాలున్నాయని తెలుసుకున్నాను. వాటిల్లో అరవయ్యోవంతు మా త్రిభువన్ కు వచ్చినా నేను ఎంతగానో సంతోషపడతాను. పరోక్షంగా మీరు చేస్తున్న ఈ సహాయానికి మీ అందరికీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు! త్రిభువన్ ఇప్పుడు చక్కగా సంగీతం నేర్చుకుంటూ ఉండటమేకాక, బాగా చదివి పరీక్షల్లో వాళ్ళ బడిలో రెండో స్థానంలో నిలిచాడు! ఈ మిఠాయిలను తీసుకోండి!", అంటూ మిఠాయి పొట్లాన్ని ప్రసూనాంబకు ఇచ్చాడు వెంకటాచలం.

"మా కృష్ణానందవల్ల మీ అబ్బాయి సరైన మార్గంలోకి వచ్చాడంటే మాకూ సంతోషమే!", అంది ప్రసూనాంబ.

ఆ తర్వాత వెంకటాచలం సుందరంతో కాసేపు కబుర్లు చెప్పి త్రిభువన్ ను తీసుకుని వెళ్ళిపోయాడు. వెంకటాచలం ఇచ్చిన మిఠాయి పొట్లాన్ని ఆత్రంగా తెరిచి చూశాడు కృష్ణానంద. అందులో జీడిపప్పు పాకం ఉంది!

“నాకు జీడిపప్పు పాకం అంటే ఇష్టమని త్రిభువన్ కు ఎలా తెలుసు?", అని ప్రసూనాంబను అడిగాడు కృష్ణానంద ఆశ్చర్యపోతూ.

"ఆ త్రిభువన్ మంచి తెలివైన వాడురా! అందుకే నీలాంటి బంగారు కొండతో స్నేహం చేసి బాగుపడ్డాడు. వాడు నీ ఇష్టాలు ఎప్పుడో కనిపెట్టేసి ఉంటాడు! వాడితో స్నేహం చేస్తూ నలుగురితో తెలివిగా ఎలా మసలాలో నువ్వు కూడా నేర్చుకో. అప్పుడు మీ ఇద్దరిదీ మంచి స్నేహం అవుతుంది!", అంది ప్రసూనాంబ.

"అలాగే బామ్మా!", అన్నాడు కృష్ణానంద ఉత్సాహంగా.

****సశేషం****

Posted in June 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!