"ఊరక రారు మహానుభావులు"- సాధారణంగా అంత తరచుగా మన ఇంటికి వేంచెయ్యని ప్రముఖులను కొంచం సరదాగా సంబోధించే పలకరింపు అని చెప్పుకోవచ్చు. అయ్యా ఏ పని మీద ఇటువైపు వచ్చారు - అని ముఖంమీద అడక్కుండా పరోక్షంగా కొంచం హాస్య ధోరణిలో చేసే పలకరింపు అనుకోవచ్చు. అయితే ఆధునిక కాలంలో "ఊరక రారు మహానుభావులు" అంటే మనతో వారికి పని ఉంది కాబట్టే మన దగ్గరకు వచ్చారు అనే పరమార్ధాన్ని ఊహించే వారు కూడా మనకు తారసపడతారు. "ఊరక రారు మహాత్ములు" మంచి ఉద్దేశ్యం తో చెప్పిన భాగవత పద్యం. అంటే గొప్ప వాళ్ళు వచ్చి శుభమును చేకూరుస్తారు అని అర్థము.
ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!
(శ్రీమదాంధ్రమహాభాగవతము -10-284)
ఈ భూమి మీదకు అలా వచ్చిన మహాత్ముడు, మహానుభావుడు తెలుగు తేజం "పీవీ నరసింహారావు" గారు. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని 2020 సంవత్సరంలో భారత్, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నివాళులు అర్పించి "పీవీ" ని స్మరించుకోవడం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట రాజధాని నగరమైన శాక్రమెంటో లో కుడా ప్రవాస తెలుగు వారు స్థానిక శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆగస్టు 8, 2020 న ఉదయం 10గం కు వర్చువల్ మీటింగ్‌లో సమావేశమై పీవీకి ఘనంగా నివాళులు అర్పించారు.
“భారత దేశంపై పీవీ ముద్ర”, ఇది రచ్చబండ పై అర్హమైన, అర్ధవంతమైన, మరియు అనివార్యమైన చర్చ. అదెందుకో క్రింద వివరిస్తాను. ఉత్తరభారత నేపధ్య నాయకులకు ‘రావు‘ గా, దక్షిణాది నాయకులకు పి.వి గా ఆయన సుపరిచితుడు. దేశానికి దిశా నిర్దేశం చేసిన భారత ప్రధానుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నేతగా ప్రధమ ప్రధాని పండిత నెహ్రూ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. జైకిసాన్ నినాదంతో ద్వితీయ ప్రధానిగా లాల్ బహాదుర్ శాస్త్రి గుర్తుండిపోయారు. బ్యాంకుల జాతీయికరణ, రాజభరణాల రద్దు, గరీబీ హఠావో నినాదాలతో తృతీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల మనస్సులో చిరస్ధానం సాధించారు. శాస్త్రపరిజ్ఞాన్ని కొత్తపుంతలు తొక్కించిన నేతగా రాజీవ్ గాంధీ ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే వీరందరి శైలికి భిన్నంగా సరళీకృత ఆర్ధిక, పారిశ్రామిక విధానాల పితామహుడిగా పాములపర్తి వెంకట నరసింహరావు, ఒక్కసారిగా దేశ గమనాన్ని మార్చి చరిత్ర సృష్టించారు. దేశానికి ఆర్ధిక, రక్షణ స్వావలంబన కలిగించిన మహానేత పీవీ అని చరిత్రకారులు బల్ల గుద్ది చెబుతున్నారు.
ఈ సందర్భంగా మరో తెలుగు తేజం ఎన్టీఆర్ తో కలసి పనిచేసిన మాజీ డీజీపి హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం నుంచి ఆసక్తికరమైన కొన్ని విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోనున్నాను. దొర రాసిన పుస్తకం ఎన్టీఆర్ పై అయినప్పటికీ పీవీ - ఎన్టీఆర్ మధ్య చోటు చేసుకున్న రెండు ఆసక్తికర విషయాలు ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు. రాజకీయంగా ఒకవైపు.. సాహిత్య పరంగా మరోవైపు..మరో తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావు చేస్తున్న కృషిని గమనించిన అన్నగారు.. 1992లో పీవీ కి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని తెలిసి సంతోషించారు. అంతేకాదు.. ఫోన్‌లోనే పీవీ ని ఆయన అభినందించారు. నంద్యాల నుంచి ఎంపీగా పీవీ పోటీ చేసిన సమయంలో తమకు పట్టు ఉన్నప్పటికీ.. అన్నగారు అక్కడ ఎవరినీ పోటీకి నిలపకుండా.. పీవీ విజయం సాధించేందుకు కృషి చేశారు. ఒక తెలుగు సాహిత్య పిపాసి గా పీవీ ప్రధాని పీఠంపై కూర్చుంటే.. దేశ సంస్కృతి సంప్రదాయాలకు, తెలుగు వారికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని.. అందుకే తాము పోటీ పెట్టలేదని ఎన్టీఆర్ వివరించారు, ప్రజలను ఒప్పించారు. అనంతరం పీవీ నరసింహారావు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు మునుపు ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులు అదే పనిగా హైదరాబాదుకు వచ్చి ఎన్టీఆర్ మీద విమర్శలు చేసే వారని, అయితే మరో తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావు మాత్రం ఎన్టీఆర్ పై కువిమర్సలకు దిగేవారు కాదని, తద్వారా ఎన్టీఆర్ ని పీవీ నరసింహారావు గౌరవించారని హెచ్.జె.దొర తన పుస్తకంలో చెప్పారు. వేరు పార్టీలలో ఉన్నప్పటికీ విశాల హృదయంతో ఎన్టీఆర్ - పీవీ నరసింహారావు ఒకరినొకరు గౌరవించుకున్న తీరు నేటి రాజకీయ నేతలకు ఆదర్శనీయం.
దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసి అభివృద్ధి వైపు భారత్‌ను నడిపించిన ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ. రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశంలో రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. ఆ సమయంలో అంటే 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు పరుగులు పెట్టాయి. 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా అయిదేళ్ళు పీవీ ప్రధానమంత్రి గా ఉన్నారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు ఏండ్లు పీవీ నడపడం నిజంగా సాహసం. అంతకుముందు చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం తాకట్టుపెట్టినప్పుడు, భారత్ ఆర్ధికంగా చాల ఇబ్బందుల్లో ఉండేది. బంగారం తాకట్టుపెట్టి భారత్ పరువు తీసాడని పలువురు కోవిదులు అప్పుడు పత్రికల సాక్షిగా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ను నిందించారు. అయితే ఆ తరువాత 1992 లో వచ్చిన పీవీ - ప్రధానిగా, మన్మొహన్ సింగ్ - ఆర్ధిక మంత్రిగా వచ్చిన కాంబినేషన్ నేపథ్యంలో భారత్ బాగా పుంజుకుంది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది విదేశాలలో కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి తెప్పించి దేశ ప్రతిష్టను కాపాడడమే కాక అప్పుడు కాంగ్రెస్ పార్టీని పీవీ బతికించారు. పీవీ హయాంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని 1993 అక్టోబరు 12న ఏర్పాటు చేశారు. 1992లో జాతీయ మైనారిటీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. 1992 జనవరి 31న జాతీయ మహిళ కమిషన్ ను ఏర్పాటు1995లో దివ్యాంగుల కోసం చట్టం తీసుకు వచ్చారు. 1996 ఫిబ్రవరి 7వ తేదీన ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఫలితంగా వికలాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 3 శాతం రిజర్వేషన్ లభించింది. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నేషనల్ బ్యాక్ వర్డ్ ఫైనాన్స్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను 1992 జనవరిలో పీవీ నరసింహారావు ఏర్పాటు చేశారు. 1992 లో ఏ యెస్ ఎల్ వీ, పీ యెస్ ఎల్ వీ రాకెట్ల తయారీ కి ప్రోత్సాహంతో పాటు, తరువాత 1994 లో పృథ్వి క్షిపణి ప్రయోగంలో పీవీ ప్రోత్సాహం ఎంతో ఉంది.
పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివేసి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని పీవీ ఏర్పాటుచేశారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నియంత్రించారు. అమెరికాతో సంబంధాలను ఆయన బలోపేతం చేశారు. 1977లో జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయకముందు, 1971 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ పనిచేశారు. ఆధునిక ప్రవాసాంధ్రులు అనేక మందికి ఈ విషయం తెలియదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలోనే తొలిసారి పీవీ భూసంస్కరణలు అమలు చేశారు. ఆ రోజుల్లో ఆ చర్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 1980 -84 లలో కాంగ్రెస్ నాయకుల్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాతి స్థానం పీవీదే. పాములపర్తి - పీవీ నరసింహ రావు "తెలుగు ముద్దు బిడ్డ", దక్షిణాదికి చెందిన తొలి ప్రధానిగా, నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి గా ఉండి అయిదేళ్ళ పదవీకాలాన్ని పూర్తిచేసిన నేతగా చరిత్రను పీవీ నరసింహారావు సృష్టించారు. ఇది తెలుగువారికి గర్వ కారణం. స్వతంత్రానికి పూర్వం ధైర్యంగా వందేమాతరం గీతాన్ని ఆలపించి కళాశాల నుంచి పీవీ బహిష్కరణకు గురైనవాడు. ఆ తర్వాతకాలంలో రహస్య జీవితంలోకి వెళ్లి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడం, తోటి యువకులకు తుపాకి కాల్చడంలో శిక్షణనీయడం వంటి కార్యకలాపాల్లో పీవీ పాల్గొన్నాడు. తెలుగు గడ్డ, మన మట్టిలో పుట్టిన మాణిక్యం పీవీ. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి పీవీ తన స్వీయ ప్రతిభతో ఎదుగుతూ, 1957లో మొదటిసారి మంథని నియోజకవర్గం నుండి ఎంఎల్‌ఏగా ఎన్నికైనారు. పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు. 16 భాషలు అనర్గళంగా మాట్లాడగల అపరమేధావి. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ నవలను హిందీలోకి ‘సహస్ర ఫణ్' పేరుతో పీవీ అనువదించారు. పీవీ రాసిన కథలు, నవలలు, పీఠికా సాహిత్యాలను, ప్రసంగాలు, లేఖా సాహిత్యం, శాసనసభ, లోక్‌సభలో చేసిన ప్రసంగాల్ని వెలుగులోకి తేవాల్సిన అవసరముంది. ఇప్పటికే ముద్రితమైన రచనల్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా పునర్ముద్రించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ విదేశాంగమంత్రిగా పనిచేసినప్పుడు, ఇతర దేశాల నేతలతో, అధ్యక్షులతో సత్సబంధాలు కలిగి ఉండేవారు. తెలంగాణా ప్రభుత్వం పీవీ నరసింహారావు విగ్రహాలను, యూఎస్, యూకే, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో ప్రతిష్ఠించాలని భావిస్తోంది అని వార్త ఆమధ్య వచ్చింది, ఇది నిజంగా ఒక శుభవార్త. త్వరలో అమెరికాలో పీవీ విగ్రహం ను చూస్తామని ఆశిద్దాం. ప్రచారానికి దూరంగా ఉండే స్వభావం గల పీవీ నరసింహారావు తన గురించి పత్రికల్లో, మీడియాలో నలగాలనే విషయం ఆనాడు అస్సలు పట్టించుకోలేదు. పనిచేయడమే తన విధి అని ఆయన భావించే వారు. నేటి తరానికి, నాటి తరానికి అదే తేడా.
రాజస్ధాన్ లోని పోఖ్రాన్ లో అణుపరీక్షలకు తన హయాంలో పీవీ ప్రయత్నాలు ప్రారంభించారు. 1996 లో పీవీ ఒకవేళ గెలిచి ఉంటే ఆయన ఆధ్వర్యంలోనే అణుపరీక్షలు జరిగి ఉండేవని నాటి పరీక్షలకు నేతృత్వం వహించిన అబ్దుల్ కలాం ఆ తరువాత పేర్కొన్నారు. కాబట్టి తదనంతరం 1998 లో జరిగిన ‘ప్రోఖ్రాన్-2’ అణు పరీక్షల వెనక మొదటి ప్రయత్నం పీవీదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 1995లోనే అణు పరీక్షలకు పీవీ సర్వం సిద్ధం చేసారు, అయితే అమెరికా ఈ విషయం పసిగట్టి, జపాన్ మధ్యవర్తిత్వంతో భారత్ ను నిగ్రహించింది. ఈ విషయం అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో డిసెంబర్ 15, 1995 న ఒక వార్తా కధనంగా వచ్చింది. వాజ్ పేయి ప్రధాని అయ్యాక జరిగిన మొట్టమొదటి సమావేశంలో పీవీ ఒక చీటిమీద "అణు పరీక్షలకు అంతా సిద్ధం, కాబట్టి ముందుకు వెళ్ళమని" వాజ్ పేయి కి సూచించారు. పిదప 1998 మే లో పొఖ్రాన్-2 అణు పరీక్షలు జరగడం, భారత్ న్యూక్లియర్ క్లబ్ లో గౌరవనీయమైన స్థానం పొందడం మనకు తెలుసు. 1992 లో ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ పీవీ నరసింహారావు తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం. పీవీ హయాంలోనే ఢిల్లీ లో ఇజ్రాయెల్ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. 2019 లో పుల్వామా సంఘటన తరువాత పాక్ పై జరిపిన భారత్ వైమానిక దాడుల్లో ఇజ్రాయిల్ తయారీ స్పైస్ క్షిపణులను మన యుద్ధ విమానాలనుండి పాక్ లో ఉన్నబాలాకోట్ ఉగ్రవాదుల స్థావరాలపైకి ప్రయోగించాం. అంతేకాదు జూలై 2020 లో మాజీమంత్రి సుబ్రమణ్య స్వామి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు 'భారత్ కు ప్రపంచం మొత్తం మీద నిజమైన మిత్రుడు ఇజ్రాయిల్ దేశమే’ నని. అందుకు పునాదివేసింది ఖచ్చితంగా పీవీనే. 2019 లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన 'ఒక చరిత్రాత్మక పర్యటన' అని జూన్ 25, 2019 న మంత్రివర్గ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. అందుకు కారణం ఇజ్రాయెల్ ఆవిర్భవించిన 70 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ కు రావడం అదే మొదటిసారి. అందుకే ఆ సమయంలో జాతిని ఉద్దేశించి చేసే ప్రతి ప్రకటనలోనూ మోదీని నెతన్యాహు 'హేవర్' అని అక్కడ సంబోధించారు. హీబ్రూ భాషలో హేవర్ అంటే కేవలం మిత్రుడనే కాదు, 'అత్యవసర పరిస్థితిలో అండగా నిలిచే నమ్మకస్తుడైన ఆప్తమిత్రుడని' అని అర్థం. ఇది కేవలం మోదీ ని మాత్రమే ఉద్దేశించి అనలేదు, యావత్ భారతీయులకు అది వర్తిస్తుంది అని చరిత్రకారుల నిశ్చితాభిప్రాయం.
అంతకు మునుపు 1992 లో ఇజ్రాయిల్ తో సత్సబంధాలకు పీవీ వేసిన ముందడుగు కు కొనసాగింపుగా 1999 లో కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి మోర్టార్ మరియు మందుగుండు సామగ్రితో సహాయం చేసింది మరియు భారతదేశానికి నేరుగా సహాయం చేసిన కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఇజ్రాయెల్ భారతదేశానికి తన యుద్ధ విమానాలు మరియు నిఘా డ్రోన్‌ల కోసం లేజర్-గైడెడ్ క్షిపణులను కూడా అందించింది. తద్వారా 1999 ఆపరేషన్ విజయ్ (కార్గిల్ యుద్ధం పేరు) విజయవంతం అవడానికి తనవంతు సాయం అందజేసింది.
పీవీ మంచితనానికి, నిరాడంబరత కు ఒక ఉదాహరణ ... ఎం.ఆర్.ఆనంద్ అనే పేరుగల ఒక తమిళ యువకుడు ఢిల్లీలో ఒక సంస్థలో ఇంటర్వ్యూ నిమిత్తం బస కోసం ఎవరిని సంప్రదించాలి తెలియక చివరికి పీవీ నరసింహారావు చిరునామా పట్టుకుని ఓ లేఖ రాసాడట. అయ్యా నేను తమిళనాడు నుండి వస్తున్నాను, నాకు ఒక రోజు ఢిల్లీ లో ఎక్కడైనా బస కల్పిస్తారా?అని... 'తప్పకుండా రండి, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండవచ్చు’ అని పీవీ నుండి వచ్చిన తిరుగు లేఖతో ఆ యువకుడికి నోట మాట రాలేదట. కేవలం లేఖా పరిచయంతో, ఇచ్చిన మాట ప్రకారం ఆ యువకుడికి పీవీ ఢిల్లీ లో తన ఇంట్లో ఆతిధ్యం కల్పించి, వేడి వేడి ఇడ్లీలతో కూడిన అల్పాహారం, భోజనం అందించి, తిరుగు ప్రయాణం రైలు టిక్కెట్టు కూడా ఆయనే సమకూర్చి చివరికి తన ప్రీమియర్ పద్మినీ కారు ను … తనే డ్రైవ్ చేసుకుంటూ ఆ యువకుడిని రైల్వే స్టేషన్ లో దించిన పీవీ ఉదారతకు… “మహానుభావుడు” సరైన పదం, కాదంటారా? ఈ కథనం పూర్తి పాఠం 18 జూన్ 2018న న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమైనది.
"ఊరక రారు మహానుభావులు", "ఊరక రారు మహాత్ములు" సామెతలతో ఈ నెల రచ్చబండ చర్చా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ముచ్చటగా మూడో సామెత "ఎందరో మహానుభావులు అందరీకి వందనములు" తో ఈ నెల చర్చా కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాను. "ఎందరో మహానుభావులు" ప్రాచుర్యం పొందిన త్యాగరాజ కీర్తన, అయితే ఒక సామెత లేదా లోకోక్తి గా కూడా ఇది విరివిగా వాడకంలో ఉంది. ఈ కీర్తనను కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ స్వామి రచించిన వేలాది కీర్తనలలో మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న 750 కీర్తనల్లో పంచరత్న కృతులులో ఐదవదిగా పేరొందినది. మనస్సులో శ్రీరామచంద్రుని రూపమును నిత్యధ్యానము వల్ల స్ఫురణకు తెచ్చుకుని, ఆ విధంగా బ్రహ్మానందమును అనుభవించు వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు అందరూ మహానుభావులు వారికి నా వందనములు అని... త్యాగరాజస్వామి వారు ఈ కీర్తన లో చెప్పారు. ఆయన వందనములు అర్పించిన మహానుభావుల జాబితాలో పీవీ ని నిస్సందేహంగా చేర్చవచ్చు. ఎందుకంటే, 1992 లో అయోధ్య లో రామ జన్మ భూమిలో కరసేవకు అనుమతినిచ్చింది పీవీ నే కాబట్టి. తరువాత జరిగిన పరిణామాలు అయోధ్యలో అంతిమంగా రామ మందిర నిర్మాణానికి దారి తీశాయి.
తెలుగు నేల పుట్టిన పీవీ కి నిజానికి ప్రాంతాలు, పరిధులు లేవు అని చెప్పాలి. పీవీని స్మరించుకుంటూ, ఆయన పేరిట రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు జిల్లాలకు పీవీ పేరు పెడితే ఆయన స్పూర్తి మన తెలుగు వారి అందరిలోనూ కలకాలం ఉంటుంది కదా? విజ్ఞులు ఈ విషయం ఆలోచించాలి. అలాగే కేవలం తనకు లభించిన ఐదు ఏండ్లలోనే దేశంను పలు రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన మన తెలుగు ఠీవి "పీవీ" కి భారత రత్న అవార్డు ఏదో ఒకరోజు వస్తుందని కోరుకుందాం! ఈ నెల జూన్ 28, 2023 న పీవీ 102వ జన్మదినం. ఈ సందర్భంగా.. సిరిమల్లె పాఠకులు ఆయనను స్మరించుకుంటారని ఆశిస్తూ... యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
తనకు లభించిన ఐదు ఏండ్లలోనే ప్రధానమంత్రిగా దేశంను పలు రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన మన తెలుగు ఠీవి “పీవీ” కి భారత రత్న అవార్డు వరించడం ముదావహం. ఈ అవార్దుకే వన్నె తెచ్చిన ఘనతలు సాధించిన మహోన్నత వ్యక్తి ఆయన. పి.వి. నరసింహారావుకు ఫిబ్రవరి 9, 2024 న కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భం ఘనత వహించిన తెలుగు జాతి చరిత్రలో ఒక ఒక సువర్ణ ఘట్టం. ఢిల్లీ పీఠాన్ని అయిదు ఏండ్లు ఏలిన తెలుగు బిడ్డ నిర్యాణం చెందినప్పుడు ఆరడుగుల జాగాకు అనుమతి నిరాకరించి ఆయన పార్ధవ దేహాన్ని ఆంధ్రప్రదేశ్ కు పంపిన వారిని “పీవీ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి”, కదా!
పీవీ స్మరణ అంటే నవ భారత్ ను స్మరించుకోవడమే, ఆయన జ్ఞాపకార్ధం ఢిల్లీలో ఒక ఘాట్ ను నిర్మిస్తే సముచితంగా ఉంటుంది.
పరదేశంలో ఉన్నా, తెలుగు కోసం మీలో ఉన్న తపనకు జేజేలు!
ఎన్నో మంచి విషయాలతో చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
ఇబ్బంది కాక పోతే మీ ఫోన్ సంఖ్య ను తెలపండి.