ప్రారంభంలో ప్రాసలకోసమే తపన పడ్డ నాకవితలలో
అర్ధాలు తక్కువ, వ్యర్ధాలు ఎక్కువ.
ఆవేశంలో అలరారుతున్న, అజ్ఞానం పొంగిపొరలుతున్న
ఆ యుక్త వయసులో అంతకంటే మిక్కుటమైన
కవితా పరిజ్ఞానం ఆశించినా అందని ద్రాక్షే.
వయసుతో పాటే ఎదిగే నా మనో ఆకాశంలో
కలల కవ్వింపులు, ఊహల ఊరింపులు,
తీయని, మాయని అనుభూతుల ఆక్రమణలు,
ప్రేమతో, ప్రేమపై, ప్రేమకై కలిగే ప్రేరణలలో,
వికారం ఎక్కువ, విశేషం తక్కువ,
ఆ పరిస్థితుల్లో అక్కున చేరిన అదంటేనే మక్కువ.
ప్రేమ విఫలమై, భ్రమలు సఫలమై,
బ్రతుకు విషాదమై, వెలుగు విరోధమై
కన్నీటి వర్షంలో తడిసి, విరక్తిలో ఒదిగి
వలపు వెల్లువలో కొట్టుకుపోతూ నేను రాసిన కవితల్లో,
విచారం ఎక్కువ, వివేకం తక్కువ,
ఆ స్థితిలో నా మనసుకు నేనే లోకువ.
కలలను, ఊహలను కట్టిపెట్టి,
కళ్ళకు కడుతున్న వాస్తవాలతో జతకట్టి,
జరిగే సంఘటనలతో నాలో కలిగే సంఘర్షణలో
నిజాలలో నిమగ్నమై, ఊపిరి ఉద్విగ్నమై
పరిణితి చెందిన మనసుతో నేను రాసిన కవితల్లో,
సరళత్వము, సహజత్వమూ రెండూ ఎక్కువే,
అవంటే ఇప్పటికీ, ఎప్పటికీ నాకు తగని మక్కువే!
ఇలా,
ప్రాసలకు, ప్రేమకు, భ్రమలకు, వాస్తవాలకు,
ఒక్కో స్థితిలో ఒక్కొక్కలా ప్రాధాన్యతనందిస్తే,
ఒక్క ప్రాసలు మాత్రమే
ఆదిలో నా అజ్ఞానానికి
తరువాత నా ప్రేమకూ
పిమ్మట నా భ్రమలకు,
చివరకు నా సహజమైన ఆలోచనలకూ ఊతమిచ్చేయి.
అందుకే ప్రాసలు నా శ్వాసలుగా భావిస్తాను,
వాటితోనే నా కవితలకు ప్రాణం పోస్తాను.