Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-124 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-124

వీక్షణం-124వ సమావేశం డిసెంబరు 3, 2022 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా జరిగింది. ఈ సమావేశంలో భారతదేశం నుంచి అతిథులు పాల్గొనడం విశేషం. ముందుగా అధ్యక్షులు శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గార్ని, ముఖ్య అతిథి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారిని, ప్రధాన ప్రసంగ్రీకులు ప్రొ. పలివెల చిరంజీవి రావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ వీక్షణం సంస్థాపకులు డా కె.గీత గారు సభను ప్రారంభించారు. ఇంతవరకు అమెరికాకు పరిమితమైన వీక్షణం ఈ సమావేశం నుంచి విశ్వ వ్యాప్తం కానుందని ప్రకటన చేసారు.

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీ పలివెల చిరంజీవి రావు గారు "అమెరికా తెలుగు కథ - సామాజిక విశ్లేషణ" అనే అంశమ్మీద సోదాహరణంగా ఉపన్యసించారు. తన పీ.హెచ్.డీ పరిశోధనాంశమైన ఈ విషయాన్ని, అప్పటి కాలానికి పరిశీలనకు తీసుకున్న కథలకు మాత్రమే పరిమితం చేస్తూ సాగిన ఉపన్యాసం సభికులను బాగా ఆకట్టుకుంది.

1964లో వాహిని పత్రికలో వచ్చిన పులికండ్ల మల్లిఖార్జున రావు గారిని మొదలుకుని వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి, అపర్ణ గునుపూడి, పూడిపెద్ది శేషశర్మ, తాటిపాముల మృత్యుంజయుడు, ఆరి సీతారామయ్య మొదలైన ఎందరో కథకుల కథల్ని పేర్కొన్నారు. వారి కథల్లో నుంచి మచ్చుకొక కథను వివరించారు. ఈ డయాస్పోరా కథల్లో ప్రవాస జీవితాల్లో తెలుగు వారి కష్ట నష్టాల్ని, సంప్రదాయాల్ని, మాతృభూమి మీద మమకారాన్ని, నిత్య జీవనాన్ని, సమస్యలతో బాటూ పరిష్కారమార్గాల్ని తెలియజేసే విలక్షణమైన కథలు ఉన్నాయని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు.

తరువాత ముఖ్య అతిథి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు చిరంజీవి రావు గారితో తన అనుబంధాన్ని, డయాస్పోరా కథల ప్రాముఖ్యతని గురించి ప్రసంగించారు.

ఆ తరువాత  శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన చర్చలో సభికులు విశేషంగా పాల్గొన్నారు. తరువాత జరిగిన సాహితీ కదంబం కార్యక్రమంలోని కవిసమ్మేళనానికి  శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా కవులతో బాటూ భారత దేశవ్యాప్తంగా కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. శ్రీమతి శాంతి కృష్ణ (నెల్లూరు), శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ (పలమనేరు), శ్రీ పొత్తూరి సీతారామరాజు (కాకినాడ),  శ్రీ బి. వెంకటేశ్వర్లు (మైసూరు), శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ (హైదరాబాద్), శ్రీమతి అన్నపూర్ణ పాతూరి  (నెల్లూరు), శ్రీమతి టి.వి.యెల్. గాయత్రి (పూణే),  డా.కె.గీత  (యుఎస్ఏ), శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా (యుఎస్ఏ), శ్రీ పలివెల చిరంజీవి రావు (శ్రీకాకుళం) మొ.న వారు ఈ కార్యక్రమంలో కవితాగానం చేసారు.

ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ  సమావేశం విజయవంతంగా ముగిసింది.

ఈ సమావేశ వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

Posted in January 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!