తెలతెలవేగున కిలకిలలాడు మా గువ్వల సవ్వడులు
ద్వికము కాకా అరుపులు పికము కూకూ స్వరములు
మైనాచిలక పలకరింపులు రామచిలుక రవళింపులు
కపోతముల స్వనములు ఊరపిచ్చుకల కిచకిచలు!
మేమొద్దికగా కట్టుకున్న ముచ్చటైన పుల్లగూడులు
పుడకటింటి నడుమ మా పిట్టలెట్టిన అండములు
పొదిగిన అండము ఫలముగ వచ్చు గూటి పిల్లలు
పిల్లల నోటికి పురుగుపుట్రందించు మా తల్లి పక్షులు!
పక్షములొచ్చిన మా పక్షిపిల్లల పలాయనములు
ఆ పలాయనములతో బోసిపోవు కులాయములు
మా పక్షి జీవనానికి పట్టుకొమ్మలీ కొమ్మరెమ్మలు
గగనచరములకు ఆదరువులు ఈ భూపదములు!
పిట్ట గిట్టువరకు చెట్టుచేమలే దాని ఆస్తులంతస్తులు
ఓ మనిషీ, చెట్టు నీకూ ఇచ్చునుగ అలరులు ఫలములు
హాయిగొలుపు సంధ్యాకాలపు మారుతములు
నిరంతర ప్రాణవాయువు మరియు చల్లని ఛాయలు!
నీ గట్టి గొడ్డలిదెబ్బ మన మనుగడకే గొడ్డలిపెట్టు
కావున తరువుతల్లిని నేలకూల్చుట కట్టిపెట్టు
మానును మట్టుబెట్టుట మానుకొనెదవా మానవా
చచ్చి నీ కడుపున పుట్టెద ఈ పాటి మొర వినవా!