వెన్నెల
- రాధిక నోరి
తెల్లనిదట చల్లనిదట
కలలిచ్చేదట కల్లలెరుగనిదట
కల వరమనిపించేదట కలవరంలో ముంచేదట
కలైనా వరమైనా మళ్ళి మళ్ళి కావాలనిపించేదట
సాహచర్యం చలువలరాజుతోనట
సాంగత్యం రగిలించే కోపతాపాలతోనట
మొయిలురాజు నవ్వు పువ్వులట
మొగలిరేకుల పరిమళం దవ్వులలో రువ్వునట
వలరాజు వలలో బంధమట
కలువలరాజు కలలో అనుబంధమట
జిలిబిలి జాబిలి వెలుగువట
అల్లిబిల్లి అలకల జిలుగువట
గగనంలో తుంటరి సవ్వడి చేస్తావట
ప్రేమికుల హృదయాలలో అలజడి తెస్తావట
రేయి రేయి వింత వెలుగులట
పోయి పోయి పున్నమి అమావాసలతో ఆటలట
ఎంతున్నా జంటలకు కొంచెమైనా చాలనిదట
వింత సుమా, వారికి ఎన్నడూ చాలని అనిపించదట
చిత్రం, చందన శీతలంలో వేడి సెగలట
విచిత్రం, మెత్తటి సుమాలలో పుప్పొడి గుచ్చునట
మెత్తనివారినైనా మత్తులో దించేనట
ఎంతటివారినైనా గమ్మత్తులో ముంచేనట
ఎవరు? ఎవరు? ఎవరు? ఇంతకీ ఇవన్నీ చేసేదెవరట?
ఇంకెవరు? ఆ నెలరాజు చెలియ, ఆ వలపులరాజు నిలయ, ఆ వెన్నెలమ్మ అట!