Menu Close

dharmo-rakshathi_katha_jul2019

“హలో ఎవరు మాట్లాడేది” సేవ్ కాని నంబరునుంచి వచ్చిన కాల్ ఆన్సర్ చేస్తూ అడిగాడు చక్రధర్. “మీరు చక్రధర్ గారేనా” అవతలి గొంతు ఆత్రుతగా అడిగింది. “అవును చెప్పండి” అడిగాడు చక్రధర్. “సారీ సర్ ఈ విషయం మీకెలా చెప్పాలో తెలియటంలేదు. మీ అబ్బాయి కాలేజి బిల్డింగ్ పైనుంచి దూకి, ఆత్మహత్య చేసుకున్నాడు. బాడీని నిర్మల హాస్పిటల్ కు శవపరీక్ష గురించి పోలీసులు తీసుకువెళ్ళారు” మెల్లగా చెప్పాడు అవతలి వ్యక్తి. చక్రధర్ కు ఒక్కసారి భూమి కంపించినట్లయింది. తల గిర్రున తిరిగి కింద పడబోయాడు. చుట్టుపక్కల ఉన్న సహోద్యోగులు, చక్రధర్ ని కింద పడకుండా పట్టుకుని, నీళ్ళు తాగించారు. మెల్లగా తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు.

విషయం తెలిసికొని అందరూ నిర్మల హాస్పిటల్ కు వెళ్లారు. హాస్పిటల్ లో నలుగురు పోలీసులు, కాలేజి యాజమాన్యం తరఫున కొందరు, ఉన్నారు. వాళ్ళంతా చక్రధర్ కొడుకు సుశాంత్ గురించే, చర్చించుకొంటున్నారు. “కుర్రవాడు మంచివాడే. బాగా చదువుతాడు కూడా. అయినా ఎందుకు ఇలా జరిగిందో అర్ధంకావటంలేదు.” మెల్లగా అనుకొంటున్నారు. “మా అబ్బాయి ఎక్కడ” డాక్టర్ని అడిగాడు చక్రధర్. “మీరు ఒకసారి హాస్పిటల్ చీఫ్ గారిని కలవండి” అన్నాడు డాక్టర్. చక్రధర్ మరి కొంతమంది సహోద్యోగులు కలసి, చీఫ్ ని కలిసారు. ఆసమయంలో చీఫ్, డిఎస్పీ శ్రీకాంత్ తో మాట్లాడుతున్నాడు. చక్రధర్ ని చూసి “రండి మీరేనా సుశాంత్ తండ్రి” అడిగాడు చీఫ్. “అవును సర్” దీనంగా పలికాడు చక్రధర్. “సారీ చక్రధర్, మీ అబ్బాయి చనిపోయి మూడు గంటలయింది. శవపరీక్ష పూర్తి కావటానికి ఇంకా రెండు గంటలు పడుతుంది. కాగానే బాడీని తీసుకుపోవచ్చు” అన్నాడు చీఫ్. చక్రధర్ మనసునిండా విషాదం. ఏం చేయాలో తెలియటంలేదు. చుట్టూ తోటి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే తను కోలుకోవడానికే చాలా సమయం పట్టేది. “సారీ చక్రధర్. మీ అబ్బాయి విషయంలో, మాకూ చాలా బాధగా ఉంది. కానీ తప్పదు. ఎల్లుండి వచ్చి మీ దగ్గర వాంగ్మూలం తీసుకుంటాను” చెప్పాడు డిఎస్పీ శ్రీకాంత్.

రెండు రోజుల తరువాత డిఎస్పీ శ్రీకాంత్, మరి కొంతమంది పొలిసు అధికారులు, చక్రధర్ వాళ్ళింటికి సాయంత్రం కారులో వచ్చారు. ఇంట్లో బంధువుల ఏడుపులు సన్నగా వినిపిస్తున్నాయి. “చక్రధర్, ఇక్కడ మాట్లాడుకోవటం బాగోదు కాబట్టి, మనం మేడమీదకు వెళ్లి మాట్లాడుకుందాం” అన్నాడు శ్రీకాంత్. అలాగే సర్ అని చక్రధర్ అందరిని, మేడమీదకు తీసుకు వెళ్ళాడు.  “మీ అబ్బాయి గురించి చెప్పండి. ఎందుకు ఇలా జరిగిందో మీకేమైనా అనుమానాలు ఉన్నాయా”. అడిగాడు శ్రీకాంత్.

“లేవు సర్. ప్రస్తుతం మావాడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్చరం చదువుతున్నాడు. బాగా చదువుతాడు కూడా. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. ఏ రకమయిన దురలవాట్లు లేవు. కానీ ఈ మధ్య ఎందుకో బాగా టెన్షన్ పడుతున్నట్టు కనిపించాడు. ఏమయిందని అడిగితే, ఏమి చెప్పలేదు. నేను చదువు విషయంలో అనుకొని ఊరుకొన్నాను. వాళ్ళ అమ్మకూడా, చాల సార్లు అడిగింది. కాని సుశాంత్ ఏమి చెప్పలేదు. తరువాత ఇలా జరిగింది” కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు చక్రధర్. “మీవాడు ఎవరైనా స్నేహితులతో, గొడవపడటం లాంటిది జరిగిందా” అడిగాడు శ్రీకాంత్. “మావాడు చదువు తప్ప ఇంకే విషయాలు పట్టించుకోడు సర్” చెప్పాడు చక్రధర్. శ్రీకాంత్ కి ఏం చేయాలో అర్ధంకాలేదు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి సరైన కారణాలు, చక్రధర్ దగ్గర కనిపించటం లేదు. ఇక కాలేజి కోణంలోనించి విచారణ జరపాలి, అనుకొన్నాడు.

తరవాతిరోజు తన బృందంతో, కాలేజికి వచ్చాడు శ్రీకాంత్. నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్లి, విచారణ ప్రారంభించాడు. “సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీ వాంగ్మూలం కావాలి. మీ అభిప్రాయం చెప్పండి” ప్రిన్సిపల్ ని అడిగాడు శ్రీకాంత్. “సుశాంత్ చాల చురుకైన విద్యార్థి. కష్టపడి చదువుతాడు. ఎవరి జోలికి పోడు. లెక్చరర్స్ తో మర్యాదగా ఉంటాడు. టాప్ టెన్ లో ఒకడు. అలాంటివాడు ఇలా ఎందుకు చేసాడో తెలియటం లేదు” అన్నాడు ప్రిన్సిపాల్. అతను చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడు శ్రీకాంత్. ప్రిన్సిపాల్ చెప్పేదాంట్లో, అతను ఏదో దాస్తున్నాడనిపించింది శ్రీకాంత్ కి. సరే మిగతా లెక్చరర్స్ ని కూడా పిలిపించండి విచారించాలి అడిగాడు శ్రీకాంత్. సుశాంత్ క్లాసుకు సంభందించిన లెక్చరర్స్ అందరిని విచారించి వాంగ్మూలం తీసుకొన్నాడు శ్రీకాంత్. “మీరిచ్చిన వాంగ్మూలం, సరైనది అనుకొంటున్నాను. ఏమైనా తేడా వస్తే, మీమీద చర్య తీసుకోవల్సివుంటుంది.” ప్రిన్సిపాల్ ని లెక్చరర్స్ ని ఉద్దేశించి అన్నాడు శ్రీకాంత్. కేసు ఒక అంగుళం కూడా, ముందుకు నడవటంలేదు. ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్. మెల్లగా కాలేజి బయటకు వచ్చి ప్లే గ్రౌండ్ దగ్గర, కాసేపు ఆలోచిస్తూ నిలబడ్డాడు శ్రీకాంత్. ఇంతలో ఒక విద్యార్థి దూరంగా నిలబడి, శ్రీకాంత్ వైపే చూస్తున్నాడు. అతన్ని చూడగానే శ్రీకాంత్ కి అనుమానం కలిగింది. ఇతడేమైనా ఆచూకీ ఇస్తాడేమో చూడాలి, అనుకుంటూ అతన్ని రమ్మని పిలిచాడు. “సర్” అంటూ శ్రీకాంత్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. “నీ పేరు ఏంటి” అడిగాడు శ్రీకాంత్. “ప్రసాద్. సుశాంత్ క్లాస్స్మేట్ ని” బదులిచ్చాడు అతడు.

“చూడు ప్రసాద్ సుశాంత్ ఆత్మహత్య, నీకు బాధనిపించలేదా” అడిగాడు శ్రీకాంత్. “అవును సర్. చాలా బాధ అనిపించింది. సుశాంత్ చాలా మంచివాడు” అన్నాడు ప్రసాద్. “మరి సుశాంత్ ఇలా ఎందుకు చేసాడో చెప్పగలవా” అడిగాడు శ్రీకాంత్. ఒక పోలీస్ అధికారి ఇలా అడిగేసరికి, ప్రసాద్ కి ఏం చెప్పాలో తెలియలేదు. మనసులో భయంగా ఉంది. తను పోలీసులతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఎలా చెప్పాలో తెలియడంలేదు. కాని మనసులో ఏదోమూల, తనకు తెలిసినది చెప్పటమే కరెక్ట్ అనిపించింది. “సర్, సుశాంత్ నేను ఒకే సెక్షన్. టాప్ టెన్ వ్యక్తులలో నేను ఉన్నాను. కాలేజి మేనేజిమెంటు టాప్ ట్వంటీ స్టూడెంట్స్ ని ప్రతి గ్రూప్ లోను సెలెక్ట్ చేసి, వాళ్ళకు స్టేట్ టాప్ ర్యాంకింగ్ తెచ్చుకోవాలని, చాలా బలవంతం చేస్తున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నకొద్ది, ఈ వత్తిడి ఎక్కువవుతోంది. వారాంతపు పరీక్షలు పెట్టి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళను, అవమానిస్తూ మాట్లాడుతున్నారు లెక్చరర్స్. తమ కాలేజి మిగతా కాలేజీల కన్నా, ముందు ఉండాలన్నదే యాజమాన్యం లక్ష్యం. దీంతో స్టూడెంట్స్, చాలా మానసిక వత్తిడికి గురౌతున్నారు. బహుశా అదే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కావచ్చు సర్” చెప్పాడు ప్రసాద్. శ్రీకాంత్ కి ఆచూకీ దొరికినట్లనిపించింది. వెంటనే ఆఫీసుకి వచ్చి నిర్మల కాలేజి పైన ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో పరిశీలించాడు. గత నాలుగేళ్ళలో నాలుగైదు కంప్లైంట్స్ రికార్డు అయిఉన్నాయి. కాని ఆధారాలు లేక కేసులు ఎత్తివేశారు. కాబట్టి  కాలేజి మేనేజిమెంటు చాలా తెలివిగా స్టూడెంట్స్ పై వత్తిడి తెస్తూ, కాలేజి కి పేరు తెచ్చుకుంటూ డబ్బులు గడిస్తోంది. ఒకపక్క ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూనే, ఇంకోపక్క స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకొంటోంది.

చాలా కాలేజిలు, రాజకీయనాయకుల అండదండలతోనే నడుస్తున్నాయి. ఏమైనా కేసు ఫైల్ చేస్తే, ఎంఎల్యే నో, మంత్రో కల్పించుకొని కేసుని నీరుగార్చేస్తారు. ప్రయోజనంలేదు. ఇదొక విషవలయం. సరైన ఆధారాలు లేకపోతె, కేసు నిలబడదు నిట్టూర్చాడు శ్రీకాంత్.

సుశాంత్ మరణంతో చాలా కృంగిపోయాడు చక్రధర్. చాలా కోపంతో ఊగిపొతున్నాడు. కానీ ఏం చేయాలి. చక్రధర్ కి కూడా, కాలేజి మేనేజిమెంట్ సుశాంత్ మరణానికి కారణం అని మెల్లగా తెలిసింది. చిన్నప్పటినుంచి సుశాంత్ ని అల్లారుముద్దుగా పెంచాడు. తనకి సుశాంత్ ఒక్కడే కొడుకు. ఇంక పిల్లలు లేరు. సుశాంత్ మరణంతో ఇల్లంతా బోసిపోయింది. ఒక్కసారిగా డిఎస్పీ శ్రీకాంత్ గుర్తొచ్చాడు. అవును. కంప్లైంట్ చేయాలి. కాలేజి మేనేజిమెంట్ పై కేసు వేయాలి. వాళ్లకి తగిన శిక్ష పడాలి. ఉద్వేగంతో ఊగిపొయాడు చక్రధర్.

“సర్” అన్న స్వరంతో తల పైకెత్తి చూశాడు శ్రీకాంత్. ఎదురుగా చక్రధర్. “రండి చక్రధర్ కూర్చోండి” చెప్పాడు శ్రీకాంత్. “ఏం ఇలా వచ్చారు” అడిగాడు శ్రీకాంత్.

“సర్ మీకు తెలుసుకదా మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. ఆ విషయమై కాలేజి యాజమాన్యంఫై కేసు పెడదామనుకుంటున్నాను” మెల్లగా అన్నాడు చక్రధర్. ఒక నిముషం తరువాత శ్రీకాంత్ మాట్లాడటం ప్రారంభించాడు. “చూడు చక్రధర్ మీ అబ్బాయి ఆత్మహత్య, నాకు కూడా చాలా బాధగా ఉంది. సరియైన ఆధారాలు లేకపోతే, కేసు నిలవదు. దాని వలన ప్రయోజనంలేదు. నేను నా సర్వీస్ లో, ఇలాంటివి చాలా చూసాను. నువ్వు కంప్లైంట్ చేస్తే, తీసుకోవటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ దాని వలన, నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగటం తప్ప నీకు న్యాయం జరుగదు. ఇంచుమించు నాలుగు సంవత్సరాల క్రితం, మా బంధువులమ్మాయి కూడా వేరే కాలేజిలో ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ తల్లితండ్రులు, నేనున్నాననే ధైర్యంతో, కాలేజీపై కేసు పెట్టారు. కోర్టులచుట్టూ తిరుగుడు తప్ప, కేసు గెలవలేక పోయారు. పైగా కాలేజి వాళ్ళే, ఆ అమ్మాయికి ప్రేమ వ్యవహారం ఉందని, కోర్టులో రుజువు చేసి, వాళ్ళని ఇంకా బాధ పెట్టారు. నన్ను సిటీనుంచి దూరప్రాంతానికి బదిలీ చేసారు. ఈ సమాజంలో బలం గల వాడిదే రాజ్యం. మామూలు మనిషికి న్యాయం జరగడమనేది ఎండమావి లాంటిదే. ఆలోచించు” అన్నాడు శ్రీకాంత్. “సర్ ఒక డిఎస్పీ అయివుండి, మీరే ఇలా అంటే, సామాన్య మానవుడికి న్యాయం ఎలా జరుగుతుంది” బాధపడుతూ అడిగాడు చక్రధర్. “ఇక్కడ హోదాలతో సంబంధంలేదు. అవినీతిపరులు అన్నిచోట్లా ఉంటారు. నాకు నీ పట్ల సానుభూతి ఉంది. కాబట్టే జరగబోయేది చెపుతున్నాను. లేకపోతే నీ కంప్లైంట్ తీసుకుని, పంపించి ఉండేవాడిని. మరొకసారి ఆలోచించుకొని, నీకు అప్పటికి కంప్లైంట్ చేద్దామని ఉంటే, రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వు” చెప్పాడు శ్రీకాంత్. “సరే సర్” అని బయటికి వచ్చాడు చక్రధర్.

తను వస్తున్న దారిలో గుడి ఉంటే, మానసిక ప్రశాంతత కోసం దేవుణ్ణి దర్శించుకొందామని, గుళ్ళోకి అడుగు పెట్టాడు చక్రధర్. అప్పటికి టైం రాత్రి ఎనిమిదైంది. ఎవరో ప్రవచనం చెపుతున్నారు. ఆసక్తి పెరిగి కాసేపు విందాం అని, కూచున్నాడు చక్రధర్. ప్రవచనం చెప్పే వ్యక్తి ఉపన్యాసం కొనసాగిస్తున్నాడు. “ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మ బద్దమైన జీవితం గడిపేవారికి, వారు నమ్మిన ధర్మమే, రక్షాకవచమై కాపాడుతుంది. మనలో చాలామంది గుడికి వెళతారు. అనేక కోరికలతో దేవుణ్ణి ప్రార్ధిస్తారు. ఇంకొంచెం ముందుకువెళ్ళి, ప్రతికోరికకు నీ కిది సమర్పిస్తాను అని మొక్కుకుంటారు. నిజానికి సృష్టికర్తకు మనము ఏమీ ఇవ్వలేము నిజమైన భక్తి తప్ప. గుడినుంచి బయటకు వచ్చి యధాలాపంగా పాపకర్మలు చేస్తుంటాము. మనము కోరుకొన్నవి జరగనప్పుడు, దేవుణ్ణి తప్పుపడుతుంటాము. నిజానికి సమాజంలో అందరూ ధర్మబద్ధంగా వుంటే, మనకెప్పుదూ మంచే జరుగుతుంది. నేను పాపాలు చేస్తుంటాను కానీ, సమాజం లోని మిగతావారు మాత్రం నీతిగా ఉండాలి అని ప్రతివ్యక్తి అనుకుంటాడు. నేను చేసే పాపం ఎవరు చూడలేదు అని ధైర్యంగా ఉంటాడు. అలాఅనుకొని, సర్వాంతర్యామి అయిన భగవంతుని ముందు దోషిలాగా నిలబడతాడు. ప్రవచనాలు విని చప్పట్లు కొట్టటం కాదు. విన్నదానిలోని మంచిని ఎంతవరకు అమలు చేస్తున్నామని అందరూ ఆలోచించాలి.”

ప్రవచనం కొనసాగుతోంది. చక్రధర్ మనసులో పాప పుణ్యాల మీమాంస చోటుచేసుకొంది. తనూ అప్పుడప్పుడూ గుడికి వస్తుంటాడు. ఈనాడు తనకి ఇలా జరిగింది కాబట్ట్టి, మంచి చెడు గురించి ఆలోచిస్తున్నాడు. లేకపోతే ఆలోచించేవాడు కాదేమో. నా కొడుకు చనిపోయినందుకు కాలేజి యాజమాన్యాన్ని నిందించాను. కానీ నేను రొజూ చేస్తున్నదేమిటి. తను చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచింపసాగాడు చక్రధర్.

చక్రధర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. రోజూ చాలామంది, క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కు వస్తుంటారు. తన ఆఫీసు, సిటీమధ్యగా ఉండటం వలన, రిజిస్ట్రేషన్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బ్రోకర్లు డాకుమెంట్స్ తయారుచేసి, కొన్నవాళ్ళ దగ్గరనుంచి, అమ్మినవాళ్ళ దగ్గరనుంచి కమీషన్ తీసుకొని దాన్ని ఆఫీసులో ప్యూన్ నుంచి పైవాళ్ళ దాక అందరికి, సమన్యాయాన్ని పాటించి పంచుతారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్త్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ జరగటం చాల కష్టమవుతుంది. అందువలన వచ్చినవాళ్లందరూ, కమిషన్ ఇవ్వక తప్పదు.

ఈ విషవలయంలో నేను కూడా భాగస్వామినే. డబ్బులిచ్చినవాళ్ళు పైకి చెప్పకపోయినా లోపల ఎంత తిట్టుకొంటారో. అవన్నీ తగిలి మన కుటుంబాలు బాగుపడతాయా? చక్రధర్ ఆలోచిస్తున్నాడు. సమాజంలో లంచం ఒక భాగమైపోయింది. ఇష్టమున్నా లేకున్నాలంచం ఇవ్వక తప్పటంలేదు. నేనొక్కడినే మానేసినా, తీసుకొనే వాళ్ళు వేలల్లో ఉంటారు. గుళ్ళో ప్రవచన కర్త చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మంగా లేనప్పుడు, ధర్మం మనల్ని ఎలా కాపాడుతుంది. మనం ధర్మంగా లేకుండా దేవుణ్ణి ప్రార్ధించినా ఫలితం వుంటుందా. నేను నావాళ్ళు బాగుండాలి. మిగతావాళ్ళు ఎలాపోయినా పరవాలేదు అనే భావన ప్రతి మనిషిలో ఉన్నంత సేపు సమాజం ఆర్ధికపరంగా ఎదుగుతుందేమో కాని, ధర్మ పరంగా పతనమౌతుంది. ప్రతీవ్యక్తీ తను ఏదోఒక సమయంలో లంచం ఇవ్వక తప్పటం లేదు. లంచం తీసుకొనేవాడు కూడా, వేరే సందర్భంలో లంచం ఇచ్చే పరిస్థితి, సమాజంలో ఉంది. ఇది నిజం కాదా.  మనకు మనం మోసం చేసుకుంటూ, దేవుడిని కూడా మోసం చేసే టెక్నిక్, బహుశా మనుషులకే తెలుసేమో! ఆలోచనలు పరిపరి విధాలుగా తిరుగుతున్నాయి. చక్రధర్ మొహమంతా చెమటలు పట్టాయి. సుశాంత్ గుర్తొచ్చి మనసు చాలా బాధ పడుతోంది. తను చేసే ఈ అవినీతి, సుశాంత్ ని బలితీసుకొంది. ఇది నిజమా కాదా. నా అవినీతికి సుశాంత్ చావుకు సంబంధం లేదేమో! సమర్ధించుకోవటానికి ప్రయత్నించాడు చక్రధర్.

ఎదురుగుండా దేవుని విగ్రహం. చక్రధర్ దేవుని కళ్ళల్లోకి చూడలేకపోయాడు. రోజూ చూసే దేవుని విగ్రహం, ఈనాడు దేదీప్యమైన కాంతితో వెలుగుతున్నట్టు అనిపించింది. తప్పుచేసినవాడిలా తలదించుకుని గుడి బయటకు వచ్చేసాడు.    రేపటినుంచి కొత్త జీవితం ప్రారంభించాలి. అలాంటి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు అధిగమించే శక్తి నివ్వు అని మనసులో భగవంతుణ్ణి ప్రార్ధించాడు చక్రధర్.

తరువాత కొన్నిరోజులకే, చక్రధర్ దూరప్రాంతానికి బదిలీ అయ్యాడు. తనకీ తన పై అధికారులకి, లంచాల విషయంలో గొడవలు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నందుకే, తనని బదిలీ చేసారని తెలిసింది. పాపకూపం నుంచి బయట పడినందుకు, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో, అంత మానసిక ఆనందం ఇస్తుందని గ్రహించాడు. ధర్మో రక్షతి రక్షితః అన్న దానికి అర్ధం తనకి ఇప్పుడు పూర్తిగా అర్థమయింది అనుకొన్నాడు చక్రధర్.

* * * సమాప్తం * * *

Posted in July 2019, కథలు

2 Comments

  1. RAMANA PRASAD

    anubhavam tho chala vishayalu avagathamoutai, vignulaina varu etarula anubhavala nundi kooda avagatham chesukoni masulukuntaaru. anubhavalanu spruha tho anubhavinchadamu….. aacharana ku daari teestundi. pi katha lo ee vishayam prasputimpachesina……… Bhanumurthy gaariki……Dhanyavaadamulu.

  2. Dr. Savitri

    Satyameva jayathe……atlage Dharmanni rakshisthe kada manishiki manugada. …..Enno vodudukulni edurukovali nijayateeparudu ga vundadaniki. Aa taruvata prasantata labhyam……manchi jayanni pondadam tadhyam….. Manchi kathani andimcharu. Subham Bhuyath.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *