Menu Close

Adarshamoorthulu

థామస్ ఆల్వా ఎడిసన్
Thomas Alva Edison

ఆధునిక పరిజ్ఞాన ఆసరాతో, విద్యుత్ రంగంలో వచ్చిన అనూహ్యమైన మార్పులతో, మనిషి జీవన విధానం నేడు LED దీప కాంతులతో వెలిగిపోతున్నది. అయితే దాదాపు 150 సంవత్సరాల క్రితం పరిస్థితిని విశ్లేషిస్తే, నాడు మనిషి సూర్యుని వెలుగు మీదనే ఆధారపడి తన జీవితాన్ని కొనసాగించేవాడు.  సహజ వనరులతో కొవ్వత్తులు, బుడ్డి దీపాలు ఉన్ననూ అవి కేవలం సంపన్నుల వరప్రసాదాలుగా ఉండేవి. నేటి ఆధునిక జీవన విధానంలో సామాన్యునికి కూడా విశేష భోగ వసతులు అందుబాటులో ఉన్నాయి. అందుకు కారణం తమ మెదడులోని ఆలోచనలకు పదునుపెట్టి సరికొత్త విధానాలను, సాంకేతిక వసతులను, పరికరాలను కనుగొన్న ఎందఱో శాస్త్రవేత్తలు. ఆ కోవలోనే పయనిస్తూ తన పరిశోధనల ద్వారా విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ చేసి, నేడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక పరిజ్ఞానానికి మూలపురుషుడు అయిన థామస్ ఆల్వా ఎడిసన్ నేటి మన ఆదర్శమూర్తి.

ఎడిసన్ జీవితం అంతా పూలపాన్పుల మయం కాదు. బాల్యంలో తాను కూడా ఎన్నో ఇబ్బందులకు గురైనారు. 1847, ఫిబ్రవరి 11న, యు.ఎస్. ఎ. లోని ఒహాయో రాష్ట్రంలో మిలాన్ అనే పట్టణంలో జన్మించిన ఎడిసన్  పెద్ద చదువులు చదవలేదు. పన్నెండో ఏటనే రైలురోడ్డు కంపెనీ లో చేరి చదువును వదిలేశాడు. కానీ తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఎదో కొత్తదనం కోసం వెంపర్లాడుతూనే ఉన్నాయి. అందుకనే సాంకేతిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సరికొత్త విధానాలను కనుక్కోవడానికి సమయాన్ని వెచ్చించడం ప్రారంభించాడు.

అమెరికాలో ఏర్పడిన సివిల్ వార్ సమయంలో టెలిగ్రాఫ్ యొక్క ఉపయోగం వెలుగులోకి వచ్చింది. ఒక టెలిగ్రాఫర్ గా ఎడిసన్ పనిలో చేరి ఇంకా ఆ సాంకేతికతను ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చని ఆలోచించడం ప్రారంభించాడు.  సహజసిద్ధంగా తనకు ఉన్న చెముడు ప్రభావం వలన ఆ టెలిగ్రాఫ్ కోడ్స్ విని డీకోడ్ చేయడం చాలా కష్టమైంది. అందుకనే ఆ విద్యుత్ తరంగాలను యధాతధంగా అక్షరాలుగా మార్చి ప్రింట్ చేసే పరికరం కోసం శ్రమించడం మొదలుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తను అనుకొన్న టెలిగ్రామ్ పరికరాన్ని తయారుచేశారు. అది మొదలు ఎన్నో విధములైన విధ్యుత్ పరికరాలు ముఖ్యంగా ధ్వనికి సంబంధించిన విషయాలమీద దృష్టి పెట్టారు. బహుశా తన వినికిడి ఇబ్బంది తనను ఈ విధమైనా పరిశోధనవైపు మళ్ళించిందేమో!

Thomas Alva Edison1877 సంవత్సరంలో, టెలిఫోన్ లో వినికిడి సామర్ధ్యతను పెంచి ఎక్కువ మాటలను చాలా స్పష్టంగా వినగలిగిన కార్బన్ ట్రాన్స్ మీటర్ ను తయారుచేశారు. అది మొదలు తన పరిశోధనా ప్రవాహం, ఎన్నో వినూత్న సాంకేతిక అద్భుతాలను సృష్టించడం మొదలు పెట్టింది. తన సొంతంగా ఒక పరిశోధనాశాలను, పరికరాలు తయారుచేసే కర్మాగారాన్ని న్యూ జెర్సీ లోని మెన్లో పార్క్ లో నిర్మించుకొని ఎన్నో ప్రయోగాలకు, సాంకేతిక విప్లవానికి తెర తీశారు.

1879 వ సంవత్సరం ఎడిసన్ కు తన జీవిత కాలంలో ఒక గొప్ప సంవత్సరం అని చెప్పాలి. ఆయనకే కాదు మనందరం నేడు విద్యుత్ దీపకాంతులతో పగలు రేయి అనే బేధం లేకుండా అన్ని పనులనూ చక్కగా చేసుకునేందుకు కారణం ఆ సంవత్సరమే.  విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే విధానాలను కనుగొని నాటికి ఏభై సంవత్సరాలు అయినను విద్యుత్ ఉపయోగించి కాంతిని సృష్టించే ప్రక్రియ మాత్రం అందని ద్రాక్షపండే అయింది. ఎడిసన్ ఆ దిశగా పరిశోధనలు జరిపి ప్లాటినం ఫిలమెంట్ ను ఉపయోగించి పనిచేసే లైట్ బుల్బ్ రూపొందించారు. అది నిజంగా శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మైలురాయి అని చెప్పవచ్చు. నాడు అమెరికాలో మంచి పేరుపొందిన జె పి మోర్గాన్ కంపెనీ మరియు వాండర్ బెల్ట్ ఫ్యామిలీ కలిసి పెట్టుబడి పెట్టి ఎడిసన్ చేత ఎడిసన్ ఎలక్ట్రిక్ కంపెనీ ని ప్రారంభించి ఆ విధంగా వ్యాపార రంగంలో కూడా ప్రవేశించారు.  ఆ పిమ్మట విద్యుత్ ను నిల్వచేసేందుకు విద్యుద్ఘటమాల (ఆల్కలిన్ బాటరీస్) కూడా కనుగొని అమ్మకాలు ప్రారంభించారు. ఇలా ఎన్నో సరికొత్త సాంకేతిక కల్పనలు, పరికరాలు సృష్టించడమే కాకుండా, వాటి మీద సర్వహక్కులూ తానే ఉంచుకొని (పేటెంట్) వ్యాపార రంగంలో కూడా చక్కగా రాణించారు. ఈ విధమైన రెండు విభిన్న పోకడలు (శాస్త్రవేత్తగా, వ్యాపారవేత్తగా) కలిగిన మహా మనిషి ఎడిసన్ ఒక్కడే కావచ్చు.

ఎడిసన్ యొక్క ముద్ర దాదాపు అన్ని రంగాలలో నేటికీ మనకు కనపడుతుంది. ఉదాహరణకు ఆటో రంగంలో నేడు బాటరీస్ దే ముఖ్య పాత్ర. మరి ఆ విద్యుద్ఘటమాలను మొదట తయారుచేసింది ఆయనే. అలాగే నేడు మనం ఆనందిస్తున్న సినిమాలు చిత్రీకరించిన కెమెరాల మూలపురుషుడు ఆయనే. నాడు ఆయన కనుగొన్న పరికరం పేరు కెనెటోగ్రాఫ్. ఇక నేటి విద్యుత్ బల్బులు ఆయన సృష్టించినవే. కాలక్రమేణ ఎన్నో మార్పులు జరిగి ఆధునికత, సామర్ధ్యం పెరిగి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరిగి ఉండవచ్చు. కానీ మూల సూత్రాలు ఆయన ఆపాదించినవే కదా!

అతి బీద రైల్ రోడ్ కార్మికుని స్థాయి నుండి సూర్యునికి పోటీగా ప్రపంచానికే వెలుగునిచ్చే స్థాయికి చేరి అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక గొప్ప శాస్త్రవేత్తగా, వ్యాపారవేత్తగా మరియు నాయకునిగా వెలుగొందిన ఆ గొప్ప మహనీయుడు, ఆదర్శమూర్తి తన ఎనభై నాలుగవ ఏట పరమపదించారు.

Posted in July 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!