Menu Close
గ్రంథ గంధ పరిమళాలు
చాటు (మరుగు) వీడిన
చాటుపద్య, గద్య మణి మంజరులు

“తీరు తీయములు గల భాషా వాహిని యందు సుకవుల కవితామృతము ప్రబంధ రూపముననే కాక చాటు రూపమునను జాలువాఱును....గ్రంధములుగా నేర్పడమిచే దొల్లింటి యాంధ్ర కవీశ్వరులు రచించిన చాటు పద్యములు వెన్నేని యునికి తప్పినవి...పల్లెటూళ్ళలో ముదుసళ్ళ నోళ్ళయందును....ప్రాచీన తాళపత్ర సంపుటములందును జీర్ణించుచున్నవి. ఇంపారు ఇట్టి పద్యరత్నముల గ్రంథ రూపమున వెల్వరింప...నానాట కొన్ని చాటువులను గూర్చితిని...వే.ప్రభా.శాస్త్రి”

ఇది పూజ్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తను సంకలనం చేసిన “చాటు పద్య మణిమంజరి” తొలిపలుకులలో చాటువులను గూర్చి వెలువరించిన అభిప్రాయము.

మహాకవులు, ప్రబంధములు మొదలైనవేగాక రాజసభలలో, మార్గమధ్యంలో తామేదైనా చూచినప్పుడు ఇలా అనేక సందర్భాలలో వారికి కలిగిన ఆనంద ఆవేశానుభూతులను అక్కడికక్కడే ఆశువుగా గాని సమయం తీసుకొని గాని రచించిన కొన్ని పద్యములు చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్లు పడివున్నప్పుడు వాటికి “చాటువులు” అని పేరుపెట్టి ఒకచోట చేర్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు వే.ప్రభా.శాస్త్రి వంటి మహానుభావులు.

చాటువుల లక్షణాలు క్లుప్తంగా:

౧. చాటువులు గ్రంథ రూపంలో మొదట ఉండవు. విడివిడిగా ఉంటాయి. ఆధునిక కాలంలో వాటిని గ్రంథస్తం చేశారు.

౨. ఇవి ఎక్కువగా ఆశుకవితా ప్రక్రియ ద్వారా ఆవిర్భవిస్తాయి. (ఆశు కవిత అంటే ఏదో ఒక విషయం తీసుకొని అక్కడికక్కడే కాగితం, కలం లేకుండా ఆ విషయం మీద కవిత్వం లేక ఇతర ప్రక్రియల ద్వారా రచన చెయ్యడం.

౩. వీటికి చాలామటుకు రచయిత ఎవరో కూడా తెలియక పోవచ్చు.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తన చాటు పద్య మణిమంజరి (చా.ప.మ) తొలిపలుకులో ఇలా అన్నారు. “ప్రాచీన కృతుల యందలి పద్యము లేవేని ఇందు చేరినచో గుర్తింపులేని నా యవరిజ్ఞానమును క్షమింప వేడెదను.” అని చెప్పి కొన్ని శిధిలమైపోయిన శతక పద్యములను మాత్రము తన చా.ప.మ లో చేర్చినట్లు చెప్పారు. కాబట్టి చాటువులు మట్టిలో మాణిక్యాల వలె అక్కడక్కడా విడివిడిగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది.

వేటూరి వారు జగమెరిగిన పండితోత్తములు, సర్వజ్ఞులు. అన్నింటికన్నా మంచి మనసున్న మారాజు. అన్ని విషయాలలో ఆయనకు ఆయనేసాటి.

శ్రీ శ్రీ చెప్పినట్లు ఎవరు ఎప్పుడు ఓటు వెయ్యాలనుకొన్నా మొదటి ఓటు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికే.

చా.ప.మ లో ప్రముఖ కవీశ్వరుల చాటువులు, పద్య రూపంలో, గద్య రూపంలో గూడా ఉన్నాయి. ‘దేవతాస్తుతి స్తబకము’ మొదలు ‘కవి ప్రశంస, రాజ ప్రశంసాబ్తకములు’ ‘బిరుదావళులు, వంశావళులు,’ గద్య పద్య సమన్వితంగా అనేక చారిత్రకాంశాలతో గూడి ఉన్నాయి. అధిక శ్రమకోర్చి వేటూరి గారు వీటిని సంపాదించి పరిష్కరించి ముద్రించినందుకు మనం శాస్త్రి గారికి సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

అలాగే పూజ్యులు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు “చాటు పద్య రత్నాకరము” అనే దానిని ప్రచురింపజేశారు. తను సంతరించిన చాటువులను “తరంగములు” అను పేర విభజించారు. “సంభాషణలతో దశావతారస్ఫురణ” “అక్షర ప్రశ్న” మొదలైన కొన్ని ప్రయోగాలను దీపాలవారు ప్రకటించారు. కృష్ణదేవరాయల జననం గూర్చిన చాటువు (ద్వి.త), రాయన జన్మ సంబంధమైన విషయాలను తెలుపుతున్నది.

చా.ప.మ లో ‘దేవతాస్తుతి స్తబకము’ అనంతరము “కవిప్రశంసాస్తబకము’ పేర్కొనబడినది. ఇందులో సంస్కృతాంధ్ర కవుల యొక్క చాటువులు, పద్య గద్య రూపమున చిన్న చిన్న కథలవలె కొందరు ప్రసిద్ధ కవుల జీవిత విశేషాలు పాండితీ వైదుష్యము మొదలైనవి వివరింపబడినవి. ఇవి పాఠకులకు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉండటం విశేషం. అట్టి వానిలో పెద్దిభట్టు కథ ఒకటి.

పెద్దిభట్టు కథ

పెద్దిభట్టు వెలుగోటి సింగభూపాలుని కాలం (1383-1398) నాటివాడు. పెద్దిభట్టుకు మల్లినాథుడు అనే అన్న ఉండేవాడు. మల్లినాథుడు మందబుద్ధి గలవాడు. పెద్దిభట్టు పెద్ద బుద్ధి (తెలివి) గలవాడు. మల్లినాథుడు తమకు దగ్గరలో ఉన్న అడివిలో తపస్సు చేసుకొంటున్న ఒక యోగీశ్వరుని దగ్గర చేరి అతనికి సేవ చేసుకొంటూ బ్రతికేవాడు. ఒకనాడు మల్లినాథుడు వేరే ఊరికి వెళుతూ తన తమ్ముడైన పెద్దిభట్టును ఆ యోగికి సేవ చెయ్యమని చెప్పి వెళ్ళాడు. కానీ ఆ సమయంలోనే ఆ యోగీశ్వరునికి మరణ సమయమాసన్నమైనది. అప్పుడతడు పెద్దిభట్టుతో “నన్ను చాలా కాలం నుండి సేవిస్తున్న మల్లినాథునికి నేను ఒక మంత్రం చెప్పాలని అనుకొన్నాను. కాని ఇప్పుడతడు లేడు. అతని యసన్నిధిచే నేను నీకు ఆ మంత్రం చెప్తాను. నీవు ఆ మంత్రం యొక్క ఫలమును మీ అన్న గారికి అందచేయ్యి” అని మంత్రం ఉపదేశించి పరమపదించాడు.

పెద్దిభట్టు తన సొంత తెలివి, మంత్రం మహిమ కలిసి మహా మహాపాధ్యాయుడయ్యాడు. గొప్ప వ్యాఖ్యాతగా కవిగా ప్రసిద్ధి పొందాడు. పెద్దిభట్టు గురువాజ్ఞ ప్రకారం తాను వ్రాసిన ప్రతి గ్రంథము తన అన్నయైన మల్లినాథుని పేరుననే రచించాడు. పెద్దిభట్టు అనే పేరు ఎక్కడా వాడలేదు. ఇకనుండి మల్లినాథుడనే చెప్పబడుతుంది.

మల్లినాథుని వైదుష్యము :

భారతదేశంలో సంస్కృత భాషలో ‘వ్యాఖ్యాన చక్రవర్తి’ గా పేర్కొనదగినవాడై, ఆసేతుహిమాచలము పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మల్లినాథసూరి ఈ మల్లినాథుడే, మల్లినాథ వ్యాఖ్యలు విద్యార్థుల పాలి కల్పవృక్షములు.

‘తార్కిక రక్ష’ అనే గ్రంధంలో మల్లినాథుడు “స్పుతీకృతం చైవ దస్మాభిః పంచకావ్య తీకాసు” అని చెప్పాడు. ఆ పంచ కావ్యాలు ౧. రఘువంశం, ౨. కుమారసంభవము, ౩. మేఘసందేశం, ౪. కిరాతార్జునీయం మరియు ౫. శిశుపాల వధ. వీటినే విద్యార్థులు ఎక్కువగా చదవడానికి కారణం మల్లినాథుని వ్యాఖ్యలేనని పరిశీలకుల మాట. ఇతని సొంత గ్రంథాలు తక్కువ. కొన్ని పేర్లు వున్నా గ్రంథాలు అలభ్యం.

పెద్దిభట్టు సింగభూపతి కాలంలో ఉన్నట్లు తెలిపే ఒక శ్లోకాన్ని ‘చమత్కార మంజరి’ అనే పుస్తకంలో చూసినట్లు వేటూరి గారు తెలిపారు (పేజీ 91). ఆ శ్లోకం;

“కిం వాససా చీకిరి బావిరేణ. కిందారుణా వంకరటింకరీణ శ్రీ సింగ భూపాల విలోకనార్థం వైదుష్యమేకం విదుషాం సహాయమ్”

Posted in July 2019, సమీక్షలు

1 Comment

  1. మైలవరపు

    ఈ అమూల్యమైన సంకలనమునతు బహుధా కృతజ్ఞతలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *