Menu Close

Science Page title

రేడియో

Radio

రేడియో (radio), రేడియేషన్ (radiation), రేడియో ఏక్టివిటీ (radioactivity) అన్న మాటలలో పోలికలు ఉన్నా వాటి అర్థాలలో తేడాలు ఉన్నాయి.

ముందు ఆకాశవాణి వారి రేడియో లాంటి ఉపకరణం గురించి చెబుతాను. ట్రాన్సిస్టర్ రేడియో ని “ట్రాన్సిస్టర్” అనటం లేదూ అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో” వచ్చింది.

రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? “రేడియో తరంగాలు” అనే ఒక జాతి విద్యుదయస్కాంత తరంగాలని.

“రేడియో తరంగాలు” అంటే ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే, ఇవి రేడియో కేంద్రం నుండి ప్రసారితమయే, కంటికి కనబడని, విద్యుదయస్కాంత కెరటాలు. అనగా ఇవి విద్యుత్ కెరటాలు, అయస్కాంత కెరటాలు కలసిన జంట కెరటాలు.

ఈ రేడియో తరంగాల సంగతి - అనగా, ఈ విద్యుదయస్కాంత తరంగాల సంగతి - భౌతిక శాస్త్రపు దృష్టితో చూద్దాం. సూర్యరశ్మిని పట్టకం (prism) ద్వారా పోనిస్తే ఆ వెలుగులోని రంగులన్నీ విడిపోయి సప్త వర్ణాలతో ఒక వర్ణమాల మన కంటికి కనిపిస్తుంది కదా. ఆకాశంలో అప్పుడప్పుడు కనిపించే ఇంద్రధనుస్సు ఇటువంటి వర్ణమాలకి ఒక ఉదాహరణ. ఈ వర్ణమాలలో మనకి కనిపించే ఒక్కొక్క రంగు ఒక్కొక్క విద్యుదయస్కాంత తరంగం అన్న మాట! ఈ సందర్భంలో “రంగు” అన్నా తరంగం అన్నా ఒక్కటే! ఆ వర్ణమాలకి ఇటూ, అటూ కంటికి కనిపించని “రంగులు” చాలా ఉన్నాయి. టూకీగా చెప్పాలంటే విద్యుదయస్కాంత తరంగాలలో “కనిపించే రంగులు” కొన్ని, “కనిపించని రంగులు” కొన్ని ఉంటాయి.

కనబడే వర్ణమాలకి ఒక పక్క పరారుణ తరంగాలు, రేడియో తరంగాలు, రెండవ వైపున అతి నీలలోహిత, సూక్ష్మ, x-, గామా తరంగాలు ఉన్నాయి. ఈ పేర్లు అన్నీ తర్కబద్ధంగా పెట్టిన పేర్లు కావు. వీటికి క, చ, ట, త, ప, అని ఒక పక్కా, గ, జ, డ, ద, బ అని రెండవ పక్కా పేర్లు పెట్టేసి ఉంటే సుఖపడిపోయేవాళ్లం. ఆకాశవాణి వారు వారి ప్రసారాల కోసం ఈ రేడియో తరంగాలని వాడతారు కనుక ఈ తరంగాలని గ్రహించే పరికరాన్ని మొదట్లో “రేడియో తరంగ గ్రాహిణి” అనేవారు. క్రమేణా బద్ధకించి రేడియో గ్రాహిణి అన్నారు, ఇంకా బద్ధకించి "రేడియో" అనేస్తున్నారు.

పరారుణ తరంగాల పక్కన ఉన్న తరంగాలకి “రేడియో తరంగాలు” అన్న పేరు పెట్టకుండా మరేదయినా పేరు పెట్టి ఉంటే మన ప్రాణం సుఖాన్న పడి ఉండేది. ఉదాహరణకి “దీర్ఘ తరంగాలు” అనో “భారీ తరంగాలు” అనో పేరు పెట్టి ఉంటే బాగుండిపోయేది; అప్పుడు మన రేడియోకి ఏ భార్గవి అనో పేరు పెట్టుకుని ఉండేవాళ్లం!

sound-waves

బొమ్మ: ఈ బొమ్మలో కంటికి కనబడే విద్యుదయస్కాంత తరంగాలు మధ్యలో ఉన్నాయి. అంతకంటే పొడుగైన తరంగాలు ఎడమ వైపున, పొట్టివి కుడి వైపున ఉన్నాయి.

Posted in July 2019, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!