Menu Close
గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

గల్పికావని - శుక్రవారధుని 12- టర్నింగ్ పాయింట్ - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

అతి పిన్న వయసులో ఆర్టీసీ బస్సుని దోచుకుని చరిత్ర సృష్టించిన చరణ్.., అంటూ టీవీ ఛానెళ్ళూ న్యూస్ పేపర్లూ హోరెత్తించేస్తాయి. ఇంతవరకూ అతి పిన్నవయసులో బస్సుని దోచుకున్న రాబిన్ హుడ్ పేరు చికినోయ్. జపాన్ వాడు. అతను పన్నెండేళ్ళ ఆరు నెలల వయసులో ఈ రికార్డుని సాధించాడు. తను విజయవంతంగా బస్సు దోపిడీ చెయ్యగలిగితే పన్నెండేళ్ళ రెండు నెలల వయసులోనే ఈ రికార్డుని తిరగరాసినవాడవుతాడు. తను దోచుకున్న డబ్బుని అనాథ శరణాలయానికి డొనేషన్ గా ఇస్తాడు. అది ఇంకో రికార్డవుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే ఎన్ని రికార్డులైనా తిరగరాయొచ్చు అనుకుంటూ రికార్డుల కలల్లో తేలిపోతూ బస్సు వెనక సీట్లో కూర్చుని తన జేబులోని పిస్తోలిని తడుముకున్నాడు చరణ్. అది భద్రంగా ఉంది.

బస్సు ఒక ఊళ్ళో ఆగింది. అక్కడ ఏదో పెళ్ళిబృందం ఎక్కింది. ఆడంగులందరి మెడల్లోనూ బంగారు ఆఅభరణాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. అంతమంది ఆభరణాలూ కలిస్తే ఎంతొస్తుందో అతనికి తెలియదుగానీ బంగారం డబ్బుకంటె విలువైందని మాత్రం తెలుసు. తను అందరి బంగారాన్నీ కాజేస్తే శరణాలయంలోని అనాథల పంట పండినట్లే.

రాత్రి తొమ్మిది దాటింది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు చరణ్. ఆ అవకాశం గుట్టపల్లి టర్నింగ్ పాయింట్లో ఉంది. ఆ టర్నింగ్ పాయింట్లోనే తుమ్మచెట్ల వెనక్కాల ఉంది తన బైక్. దాని దగ్గరకి రాగానే తను పైకి లేవడం. తుపాకీ గాల్లోకి పేల్చడం. అందర్నీ భయపెట్టడం. వాళ్ళందరి దగ్గరా ఉన్న బంగారం, డబ్బు, సెల్ ఫోన్లు, వాచీలు, మొదలైన విలువైన వస్తువులన్నింటినీ దోచుకోవడం. అవన్నీ మూట కట్టుకుని బైక్ మీద ఉడాయించడం. విజయవంతంగా చరిత్ర తిరగరాయడం. అంతే!

బస్సు క్రాస్ దగ్గరకి రావాలంటే మరో పది నిమిషాలు పడుతుంది. ఆ పది నిమిషాలూ ఎలా గడపాల్రా బాబూ అనుకుంటూ ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నాడు చరణ్. క్షణమొక యుగంలా గడుస్తోంది. కిటికీలోంచీ బైటికి చూస్తే చిమ్మ చీకటి. గుండె గుబులెత్తిస్తోంది. ఆ చీకట్లో తను చేసే సాహసం అనాథల్లో వెలుగు నింపుతుంది. ఎంతోమందికి భవిష్యత్తునిస్తుంది. తనపేరుని రికార్డుల్లోకి ఎక్కిస్తుంది. ఆ ఊహే అతని గుండెల్ని గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది.

బస్సు ముందుకి వెళ్తోంది. తను ఆ బస్సుని ఆపాల్సిన టర్నింగ్ పాయింట్ దగ్గర పడుతోంది. సరిగ్గా చరణ్ లేద్దామనుకుంటూ ఉండగానే హఠాత్తుగా పెద్ద కుదుపుతో ఆగిపోయింది బస్. ఆ బస్సు ఎందుకాగిందో అర్థమయ్యేలోపే బస్సులోకి ఎక్కారు ముగ్గురు వ్యక్తులు. ముగ్గురి చేతుల్లోనూ పదునైన కత్తులున్నాయి. అవి "దేన్నైనా కసక్కని కోసెయ్యగలం జాగ్రత్త" అంటూ మిలమిలా మెరుస్తూ చూసేవాళ్ళని బెదిరిస్తున్నాయి.

చరణ్ కి పరిస్థితి అర్థమైపోయింది. వాళ్ళూ తనలాగే దోపిడీ చెయ్యడానికొచ్చారు. తను చెయ్యాల్సిన సాహసాన్ని తనకంటే ముందే చెయ్యబోతున్నారు. అయినా రాబిన్సన్ క్రూసోలు ఏకంగా ఇంతమందుంటారా? ఆ ముగ్గురూ తనకంటే చాలా బలవంతులు. ఒక్కొక్కడో ఒక్కో గుద్దుతో నలుగుర్ని పడగొట్టేలా ఉన్నారు. వాళ్ళని తను గెలవడం అంత సులభం కాదు. అయినా వాళ్ళ కత్తులు తన తుపాకీని గెలవగలవా? ఏమో చూడాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా తను ఇన్నిరోజులుగా చేసిన రెక్కీని, సరైన సమయం కోసం మాటువేసి తండ్రికి తెలియకుండా తీసుకొచ్చిన తుపాకీనీ అందులోని గుళ్ళనీ, పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ అన్నీ వృధా అయిపోతాయి. తన కళ్ళముందే తను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అయినా వాళ్ళంతా నాన్నంత పెద్దోళ్ళు. వాళ్ళొకవేళ తనని ఓడించి జయప్రదంగాదోపిడీ చేసినా వాళ్ళ పేర్లు రికార్డుల్లోకి ఎక్కవు. మరెందుకిలా దోపిడీ చెయ్యడం? అదంతా తనకి అనవసరం. చరిత్రని తిరాగరాసే అవకాశం ఎంతమాత్రం తన చెయ్యి దాటిపోకూడదు. అంటే ఆ దొంగల్ని దోచుకోనివ్వకూడదు.

స్థిరమైన నిశ్చయానికొచ్చి తన సీట్లోంచీ పైకి లేచాడు చరణ్..,

తుపాకీని గాల్లోకి పేల్చాడు.

ముగ్గురివైపుకీ తీక్షణంగా చూస్తూ వార్నింగిచ్చాడు,"హేండ్సప్"

*** *** ***

అరగంట తరవాత అన్ని న్యూస్ ఛానెల్స్ లోనూ ఆ మర్నాడు అన్ని వార్తాపత్రికల్లోనూ ఒకటే హెడ్ లైన్"పన్నెండేళ్ళ వయసులోనే దోపిడీ దొంగలబారినుండి బస్సు ప్రయాణీకుల్ని రక్షించిన ఏఎస్పీ రాము ముద్దుల కొడుకు చరణ్"

ఒక తలంపు - స్వాతి శ్రీపాద

సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది చిన్నతనమే.

ఎంత సరదాగా ఎంత ఆనందంగా ఉండే వాళ్ళం ఎంత లేమిలోనూ. ఇప్పటిలా ముగ్గులు వేసుకుందుకు రంగులు లేవు. అయినా పచ్చని పేడనీళ్ళు, చల్లని నలుపు ఎరుపుల నేల తల్లి చెరుగున తెల్లని ముగ్గుపొడిలో బియ్యం పిండి కలిపి వేళ్ళ మధ్యనించి సుకుమారంగా జార్చే అందమైన ముగ్గులకు ఈ కృత్రిమంగా రంగులు అద్దుకోడం ఏ మాత్రం సాటి కాదు. చలి ఒక్కింత ఎక్కువగా ఉండే ఇందూరు (నిజామాబాద్) లో సూరీడు తొంగి చూడకముందే వాకిలి అలంకరించుకోడం లో ఆనందం వేరు. రగ్గులో ముడుచుకు పోయిన వేళ్ళకు చల్లని నీళ్ళు తగలగానే ఒక్కసారి ఒళ్ళంతా జివ్వుమన్నా కాస్త కాత ఉద్దీప్తమై చలనం రెక్కలు విప్పుకునేది.

పండగ ఒకటి రెండు రోజుల ముందే పెద్ద కర్రలపొయ్యి వెలిగించి అదీ రాత్రి అన్ని పనులూ అయినాక అమ్మ తీరికగా జంతికలు, అరిసెలు, ముఖ్యంగా బూందీ లడ్డులు డబ్బాలు డబ్బాలు చేసి పెట్టేది.

మేమూ ఖాళీ అగ్గిపెట్టెలు అట్టముక్కలు, రంగు కాగితాలు, ఉడికించిన మైదాతో బొమ్మలకొలువుకు  మందిరాలు, భవనాలు భువనాలు చేసే వాళ్ళం. అమ్మ లోపల దాచిన బొమ్మలు ప్రాణం ఉన్నట్టుగానే ఉండేవి. అమ్మాయిల బొమ్మలు, అబ్బాయిల బొమ్మలు ఇప్పుడు అమెరికన్ డాల్ చూసినప్పుడు వీటికన్నా అవే నాణ్యంగా ఉండేవి అనిపించింది.  పనికి రాని పుస్తకాలు, పేపర్లు చింపి నానబెట్టి మెంతులతో రుబ్బి వంట సామాగ్రి రకరకాల వస్తువులు బొమ్మల కొలువుకు చేసుకునే వాళ్ళం.
బొమ్మలకొలువుకు స్థలం ఏర్పాటు చేశాక అటూ ఇటూ మట్టిపోసి దొరికిన గింజలు వేసేవాళ్ళం. అవి సరిగ్గా సంక్రాంతి నాటికి మొలిచి మూడంగుళాలు పెరిగి నిజమైన తోటలు ఏర్పడేవి.

ఒకసారి ధనియాలు వేశాను -అవి మొలిచేసరికి నాన్న తిట్టిన తిట్టూ తిట్టకుండా గంట సేపు తిట్టి పీకేశారు. ధనియాలు మొక్కలొచ్చేసరికి ఉన్న ఇల్లు ఖాళీ చేస్తారట.

దొడ్లో ఎండిన చెట్ల కొమ్మలు ఆకులు వాడి పెద్ద ఇత్తడి గిన్నెతో నీళ్ళు కాచుకుని తలస్నానాలు, కుంకుడు రసంతో చేసే వాళ్ళం. ముందు రోజు సుత్తో, రాయో తీసుకుని కుంకుడు కాయలు కొట్టే వాళ్ళం. అవి నీళ్ళలో నానాక పులుసు పిసికి  తల మీద ఒకళ్ళు పోస్తే ఎవరికి వారో మరొకరో తల రుద్దడం... తప్పకుండా కళ్ళలోకి కుంకుడు రసం వెళ్ళి కళ్ళు ఎర్రబడేవి.

పండగ కాబట్టి చద్దన్నాలకు మినహాయింపు. నాలుగు జంతికముక్కలు తిని అరిసె ముక్కో లడ్డూనో తిని అమ్మ వంట అయ్యే వరకూ ఎదురు చూడటం, మధ్యలో ఆకలి వేస్తే దొడ్లో చిన్న ఉసిరి కాయలో, జామ కాయలో ఉండనే ఉండేవి.

వంట కాగానే ’ఇల్లుతుడిచెయ్యండి’ అనేది అమ్మ. అవును ఇల్లు తుడిచి కంచాలు, గ్లాసులతో నీళ్ళు పెట్టాక అందరికీ ఒకేసారి వడ్డన. ముద్ద పప్పు ముక్కల పులుసు ..ముఖ్యంగా సేమ్యా పాయసం ... అదేమిటో అప్పుడు ఏవి తిన్నా బరువు పెరిగేది కాదు.

తిన్న వెంటనే గ్లాసూ కంచమూ శుభ్రంగా కడిగి పెట్టుకోడమే కాదు తిన్న చోట నీళ్ళు చల్లి గుడ్డతో తుడవడమూ చేసేవాళ్ళం. మధ్యాన్నం తీరిగ్గా అందరికీ జడలు వేసి పచ్చని చామంతులతో పూల జడవేసేది అమ్మ.

ఈ పూలకూ నీ రంగుకూ రేపీ పాటికి దిష్టి తగిలి జ్వరం వస్తుంది అనేది అమ్మ. అలాగే వచ్చేది కూడా.

బొమ్మల కొలువుకు మావయసు పిల్లలనే పిలుచుకునే వాళ్ళం. సరదాగా ఆడపిల్లలమైనా గాలి పటాలు ఎగరేసే వాళ్ళం. ఇంటి నుండి దాటి వెళ్ళేవాటిని ఆపి పట్టుకునే వాళ్ళం.

ఏవా రోజులు ఏవా ఆనందాలు.

కుక్క - అత్తలూరి విజయలక్ష్మి

రమణి టీవీ చూస్తోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీస్ స్టేషన్ లో ఇనస్పెక్టర్ కుర్చీ వెనకాల మొహం మీద కర్చీఫ్ కప్పుకుని, తలవంచుకుని రెండు చేతులు కట్టుకుని ఉన్న అతను.. అతను...

శరీరం ఆపాదమస్తం వణికింది.. అతనే... అతనే..

నో ... కాకూడదు... అతను కాదు... ఇంకెవరో .... లేదు అతనే.. మొహం దాచుకున్నా ఆ క్రాఫ్, ఆ పర్సనాలిటీ ... హృదయంతో, హృదయం పెనవేసుకుని ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న వ్యక్తిని గుర్తు పట్టలేదా..

వార్తలు చదువుతూనే ఉంది స్క్రీన్ మీద ఆ అమ్మాయి.

గుంటూరుకు చెందిన ఈ వ్యక్తికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య... తను పెద్ద న్యూరో సర్జన్ అనీ, తనకి జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లు ఉందని నమ్మించి, ఇంతకు ముందు కొందరు యువతులను మోసం చేశాడు.. అతనికి ఇంతకుముందే పెళ్ళయి భార్య, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఇతను చేసే దారుణాలు ఇటీవలే తెలుసుకున్న భార్య విడాకులు తీసుకోడానికి ప్రయత్నించగా ఆమెని బెదిరించి, ఇంట్లో నిర్బంధించాడు.  స్నేహితుడు ఇంట్లో లేని సమయం చూసి ఎప్పటినుంచో కన్నేసిన అతని భార్య మీద అత్యాచార ప్రయత్నం చేసిన ఇతనిని గాయపరచి పోలీసులకి ఫోన్ చేసింది ఆమె. ఎప్పటినుంచో ఈ వ్యక్తి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. ఇప్పుడు .....

ఇంక ఏమి వినిపించడం లేదు... కళ్ళ ముందు పొరలు, పొరలుగా అతనితో పరిచయం, ఇద్దరి ప్రేమ పర్వం ....భగవంతుడా... ఏవిటీ దారుణం! తన కళ్ళు, చెవులు తనని మోసం చేయడం లేదు కదా!

లేదు...ఖచ్చితంగా అతనే... ఈ వార్త చూసే ముందు వరకూ తన చెలికాడు, ప్రాణేశ్వరుడు. కానీ, ఇప్పుడు మోసకాడు, నేరస్తుడు.. క్రిమినల్...

ఎంత మోసం! ఎంత దగా! ఎన్ని కబుర్లు చెప్పాడు! ఎన్ని ఆదర్శాలు వల్లించాడు!

అవన్నీ నిజం కాదనమాట.... ఎంత గుడ్డిగా  నమ్మింది..

ఆశలు పేకమేడల్లా కూలిపోతున్నాయి.. తల తిరుగుతోంది.  ఇంతకాలం నుంచి పెట్టుకున్న  నమ్మకం ముక్కలైపోతోంది. ఒళ్ళంతా  భగ, భగ మండిపోతోంది..

గుండె రగిలిపోతోంది.  తనని మోసం చేస్తాడా! ఎంత ధైర్యం! ఎలా పట్టుబడ్డాడు.. ఎలా ఏముంది? పాపం పండింది.. రగిలిన స్త్రీ గుండె ప్రతీకారంతో గర్జించింది..

రమణి లో కూడా ప్రతీకార వాంఛ ఉవ్వెత్తున లేచింది.. అంతే కాదు,  క్షణ,క్షణానికి పెరిగిపోతోంది.

తను ఎంతో ఉత్తముడు అనుకున్న వాడు ఇంత నీచుడా.. తలచుకుంటేనే కంపరంతో తూలిపోతోంది. ఆడవాళ్ళని మోసం చేయడం వాడి హాబీ... హాబీ.. ఆడదంటే ఏమనుకున్నాడు..ఎన్ని ప్రేమ కబుర్లు చెప్పాడు!

వీడి బతుక్కి ప్రేమ ఒకటా... ప్రేమంటే అర్ధం తెలియని పశువులు ప్రేమ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ... ఇల్లంతా పిశాచాల అరుపులు వినిపిస్తున్నట్టు ఉంది..

ఇదే గదిలో, ఇదే దివాన్ మీద ఎన్ని ఊసులు... భవిష్యత్తు గురించి ఎన్ని ప్రణాళికలు! గబుక్కున దివాన్ మీద నుంచి లేచింది. అవన్నీ ఇప్పుడు గుడ్ల గూబల అరుపుల్లా ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి.

కడుపులో ఇంత విషం పెట్టుకుని అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడాడు.. నటిస్తున్నా అని తెలిసీ అంతగా ఎలా నమ్మించగలడు మగవాడు. .. కనిపించిన ప్రతి ఆడదాని దగ్గరా ప్రేమ కబుర్లు చెప్పేవాడు ప్రేమికుడా...కాదు, కాదు .... ప్రేమ తాయిలం చూపించి అనుభవించే కాముకుడు..

అన్నం తినే మనిషి ప్రవర్తించే విధానమేనా! అసలు మనిషిగా పుట్టినందుకు కొన్ని విలువలు ఉండాలన్న బుద్ధి లేనివాడు మానవసమాజంలో ఎలా మసలుతున్నాడు!  వాడు పశువు కూడా కాదు.. బురద గుంటలో దొర్లే పంది..

అవును పంది... పందికేం తెలుసు పన్నీరు వాసన!

అవును ఎలా తెలుస్తుంది! ఆమె కళ్ళ నుంచి కన్నీరు, కాదు, కాదు గాయపడిన హృదయం నుంచి రక్తం కారుతోంది.

కామంతో కళ్ళు మూసుకుపోయి, ఉచితానుచితాలు మర్చిపోయి, సభ్యతా,సంస్కారాలు లేకుండా స్నేహితుడి భార్య మీద ... ఛీ... ఊహించుకుంటేనే కడుపు రగులుకుపోతోంది.

ఒకపక్క తనతో ప్రేమాయణం.. మరో పక్క అచ్చోసిన ఆంబోతులా కనిపించిన ఆడవాళ్ళ మీద పడడం.. వాడిని ఏం చేస్తే మాత్రం పాపం! ఈ కోర్టులు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది! పట్టుకున్నారు.. ఏం శిక్ష వేస్తారు.. ఇప్పటి దాకా ఇలా పట్టుబడ్డ వాళ్లకి ఏ శిక్షా పడిన దాఖలా లేదు.వీడికి మాత్రం ఎలాంటి శిక్ష వేస్తారు..

రమణి ఆవేశంతో వణికిపోయింది...పైగా  పెళ్లి కూడా అయిందా... ఇద్దరూ పిల్లలా...గొంతు చించుకుని ఒరేయ్ పశువా! ఎందుకురా ఇలా మోసం చేసావు  అని అరవాలని ఉంది... ఆగమేఘాల మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ, చెంపా, ఈ చెంపా ఎడా,పెడా వాయించాలని ఉంది...వాడు వేసిన ఉచ్చులో తను, చదువు, సంస్కారం, బుద్ధి, జ్ఞానం ఉన్న తను కూడా పడిందా.. తను కూడా మోసపోయింది.. నో, నో ఈ అవమానం భరించలేదు.. ఈ ఓటమిని తట్టుకోలేదు ... ఏదన్నా చేయాలి... ఏం చేయాలి... రమణి అస్థిమితంగా అటు,ఇటూ తిరగసాగింది. పరిగెత్తుకుంటూ వెళ్లి  కాండ్రించి ఉమ్మేస్తే!.. రెండు చేతులతో పీక పిసికి చంపేస్తే!

చేయలేదు... అసలు చేయలేదు... ఆమె చుట్టూ కంచె... కుటుంబం, సమాజం, స్నేహితులు అనే కంచె బలంగా ఉంది.  అడుగు ముందుకు వేయనీయడం లేదు.. అవును ఎలా? నీకెందుకు వాడంటే అంత  కోపం అని అందరూ అడిగితే ఏమని చెప్పాలి.. వాడి మాయలో నేను పడ్డాను అని చెప్పాలా.. ఛీ..

విసురుగా టివి ఆఫ్ చేసి బాల్కనీలోకి వెళ్లి రోడ్డు మీదకి చూడసాగింది.

చీకటిగా ఉంది.. ఒకటీ, అరా స్ట్రీట్ లైట్స్ పల్చగా వెలుగుతున్నాయి. రోడ్డు పక్కన చెత్త కుండీ దగ్గర చెల్లా చెదురుగా ఎదురింటి వాళ్ళు వేసిన ఎంగిలి విస్తరాకులను వీధి కుక్క ఒకటి మొరుగుతూ, కాళ్ళతో లాగుతూ ఇంకాస్త చిందర,వందర చేస్తోంది. 
బుద్ధిలేని ఎదురింటి వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ అయితే విస్తరాకులు అలా విసిరేశారు.. సివిక్ సెన్స్ లేని బ్రూట్స్ ... ఆ కుక్క ఆ విస్తరులని అలా లాక్కెళ్ళి, లాక్కెళ్ళి వాళ్ళ ఇంట్లోనో, గేట్లోనో పడేస్తే తెలుస్తుంది సివిక్ సెన్స్ అంటే ఏంటో! కసిగా అనుకుంది రమణి.

సివిక్ సెన్స్ ... ఎస్ ... ప్రతి మనిషికీ పౌరుడుగా ఒక బాధ్యత ఉంటుంది.. కుటుంబం లో ఎలా అయితే బాధ్యతలు ఉంటాయో, సమాజంలో కూడా ప్రతి వాళ్ళకీ బాధ్యతలు ఉంటాయి.. ఆ బాధ్యత ఎరిగి తనకంటూ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, కొంత సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పరచు కుంటేనే మనిషి అనే పదానికి అర్హుడతాడు.. అలా కాని వాడు.... ఏమవుతాడు... ఏమవుతాడు... తన ప్రవర్తనతో సమాజానికి కీడు చేసేవాడు ఏమవుతాడు...ఇప్పుడు ఆ కుక్క చేస్తున్న పనికి వీది మొత్తం తెల్లారేసరికి కలుషితం అయిపోతుంది. వాడిలాంటి వాళ్ళు చేసేపనికి సమాజం మొత్తం నాశనం అయిపోతుంది..

వాడికీ, ఈ కుక్కకీ తేడా ఏం ఉంది!  వీధికుక్క...ఇప్పుడు ఈ కుక్కని ఇక్కడి నుంచి తరమకపోతే ఆ విస్తళ్ళు అన్నీ కాలనీ మొత్తం వెదజల్లినట్టు అవుతుంది.. అటూ, ఇటూ చూసింది. బాల్కనీ మీద పెట్టిన పూలకుండీ కింద ఇటుక కనిపించింది. కుండీ  పక్కికి జరిపి ఇటుక చేతిలోకి తీసుకుంది.. గురి చూసి కసిగా కుక్క మీద  విసిరింది.

చదువులపండుగ - రాజేశ్వరి దివాకర్ల

12 గ్రేడ్ (12 వతరగతి) పదవీ ప్రాప్తి సమారంభాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇంట్లో తండ్రి ఆనందానికి అవధులు లేవు. తల్లిని మిత్రులందరూ పొగుడుతూ వుంటే ఆమె ముఖంలో విజయం సాధించిన తృప్తి. ఈ గ్రాడ్యుయేషన్ ను పండుగలా ఆచరిస్తున్నారు. ఆ రోజు బడిలో ఏవిధంగా ప్రవర్తించాలో, విద్యార్థులకు వారి సంఖ్యా క్రమం ఎప్పుడు వస్తుందో పట్టాను తీసుకునేటప్పుడు అభివాదం ఎలాచేయాలో, పద్ధతులన్నింటినీ శిక్షణనిచ్చేందుకు పరీక్షలు ముగిసాక నాలుగైదు సార్లు ఉన్నత పాఠశాలా విద్యార్థులనందరినీ బడిలో సమావేశ పరిచారు. అప్పుడు ఆ విద్యార్థులకు కావలసిన ఫలహార భోజన సదుపాయాలన్నింటినీ పాఠశాల నిర్వాహకులే కావించారు. ఆ సంవత్సరంలో12 వ గ్రేడ్ పాస్అయిన వాళ్ళ సంఖ్య 500 కు పైగా ఉంది. ఆ ఉన్నత పాఠశాల పేరు "rock ridge". 12 వ తరగతి పాస్ అయినందుకు విద్యార్థులకు పాఠశాల ఇచ్చే ప్రాధాన్యత, విద్యాభ్యాసంలో ఒకదశ ముగిసాక పాఠశాల ఇచ్చే గౌరవప్రదమైన వీడ్కోలు ప్రతి విద్యార్థికి తాము ఒక సఫలతను పొందిన సంతృప్తినిచ్చింది. బాల బాలికలందరూ ఆరోజు చేతిలో తెల్ల గులాబీతో, పట్టా ఉడుపులతో, తలమీద చతురస్రపు కుచ్చు టోపీతో బయటకు వస్తుంటే అమ్మా నాన్నలకూ, వాళ్ళవెంట వెళ్ళిన అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకు కలిగిన ముచ్చట చెప్పనలవి కాదు. మా ప్రణవ్ పట్టాభిషేకానికి నేను వెళ్ళి పురోగామి దేశంలో విద్యకిచ్చే గౌరవానికి ఎంతో మురిసిపోయాను.

చదువునొక పండుగలా ఆచరించి విద్య కు ఒక సార్థకతనిచ్చే సౌందర్యాన్ని తలిదండ్రులతో, ఇతర ప్రియ బంధువులతో పంచుకుని ఆనందించే ఈ సందర్భం అపురూపం అనిపించింది. నేను వాసు తో అన్నాను, ఇక్కడ పాఠ శాలల్లో పిల్లలకు బడిలో అధ్యాపకులు చిన్నప్పటినుంచి ఈ చదువుల పండుగను తరగతుల పరిణామ దశల్లో నిర్వహించడం ఎంతో బాగుందిరా, ఇలా పదవీ ప్రాప్తిని సంబరంలా చేసుకోవడం ఎంతో బాగుంది కదా అన్నాను.

నామాటకు వాసు అందుకుంటూ అంతేకాదు. ఇక్కడ ఉన్నత పాఠశాల వరకూ మనం ఫీస్ (శుల్కం) చెల్లించక్కరలేదు తెలుసా, సమవస్త్రాల ప్రాధాన్యం కూడా లేదు. అవునా, ఈ సంపన్న దేశంలో, కేవలం ఆధునిక నాగరికత మాత్రమే కాదు, ఎన్నో అనుకూలతలు కూడా ఉన్నయని తెలుస్తొందిరా, అన్నాను.

అంతేకాదు మావయ్యా, 12 వతరగతి ముందు 11 వ తరగతిలోనే శాట్ సంసిద్దతా (prep) శిక్షణకు వారానికి రెండు, మూడు రోజులు 25 మైళ్ళ దూరం తీసుకొని వెళ్ళి రాగలిగాం అంటే ఇక్కడే సాధ్యం అయింది అనిపిస్తోంది. ఆ తరగతికి శిక్షణ నిచ్చిందెవరో తెలుసా ప్రణవ్ కంటె ఒక సంవత్సరం ముందు చదివిన అమ్మాయి. వీడికి కూడా మంచి మార్కులు వచ్చాయి కాబట్టి వీడుకూడా తన పరీక్షలు కాగానే క్లాసులు తీసుకున్నాడు అంది రోహిణి. వీడు పోయిన సమ్మర్ లో 1000 డాలర్స్ సంపాదించాడు, అంది. ప్రణవ్ వైపు గర్వంగా చూశాను.

ప్రణవ్ పియానో నేర్చుకున్నాడు. వయోలిన్ బాగా వాయిస్తాడు. తెలుగు బడిలో విద్యార్హతాపత్రాన్ని పొందాడు. బాస్కెట్ బాల్ బాగా ఆడుతాడు.

ఆ రోజు ప్రణవ్ కు అమెరికాలోని అత్యుత్తమ కాలేజీ లో ప్రవేశం దొరికినందుకు గాను, వాసు, రోహిణి తమ మిత్రులందరికీ మంచి విందును ఏర్పాటు చేసారు. మిత్రులందరికీ వాసు అంటే ప్రత్యేకమైన అభిమానం. అదీ ఈమధ్య వాసు నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పటినుంచీ ఆయన మీద కలిగిన గౌరవం వల్ల కూడా వాసు కు మిత్రమండలిలో ప్రాధాన్యం పెరిగింది. విందు భోజనం రక రకాల తెలుగు వంటకాలతో సంసిద్ధం అయింది. అందరూ భోజనానికి కదిలే ముందు ప్రణవ్ ను అభినందించారు. గ్రాడ్యుయేషన్ సందర్భానికి తగినట్లుగా అలంకరించిన గాలి బుడగలతోను, ప్రణవ్ సఫలతకు సంబంధించిన చిత్రపటాలతోను, అందమైన విద్యుద్దీపాలతోను అలంకరించిన ఆ హాలులో అమర్చిన మైకును పట్టుకుని, ప్రణవ్ తనను ప్రోత్సహించిన తలిదండ్రులకు, తాతయ్యకు, అభినందించిన మిత్రులకు తోటి స్నేహితులకు ధన్యవాదాలను తెలిపాడు. వాసు ముందుకు వచ్చి మైకును తండ్రి చేతికిస్తూ "నాన్నా, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి" అన్నాడు ఆయన మనవడి వైపు ఆప్యాయంగా చూస్తూ, అందరికీ పెద్దవాడిగా ఆశీస్సులనందిస్తూ, ఇలా అన్నారు. నేను మన దేశంలో విశాఖ పట్టణంలో లలితామ్మవారి గుడిలో అర్చకుడిని. నా కొడుకు చదువుకుని విదేశానికొచ్చాడు. మీరందరూ కూడా చదువుకుని ఈ దేశంలో మంచి స్థాయిని పొందారు. నాకు తెలిసిన వేద విద్యను మన్నించి, నన్ను ఇక్కడి గుడిలో పురోహితునిగా ఆహ్వానించి, నన్ను నా కొడుకు దగ్గర ఉండే సౌభాగ్యాన్ని కలిగించారు. మీరు ఆంగ్లవిద్యను చదివినా, నేను సంస్కృతం చదివినా చదువు వల్ల సర్వత్రా గౌరవ మర్యాదలు, పదవీ ఉన్నతులు లభిస్తున్నాయి. అందుకనే చదువులో సఫలతకు ఇటువంటి పండుగను జరుపుకోడం ఎంతో బాగుంది. చదువు వల్ల కలిగిన సంస్కారంతో మంచి మనుషులుగా దేశ విదేశాలలో మీ పిల్లలందరూ కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలని కోరుతున్నాను" అని ముగించారు.

ఆయన మాటలతో అందరికీ ఆరోజు నిజమైన పండుగలా అనిపించింది. హుషారుగా కదలి పదార్థాలను వడ్డించుకోడం మొదలు పెట్టారు.

Posted in July 2019, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *