Menu Close
sahiti-sirikona

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

కొమ్మ వంచితే కోయిలమ్మా - బులుసు వెంకటేశ్వర్లు

komma-vanchithe_jul2019

వసంతగీతిక - రమాకాంత్ (అంజలి)

వచ్చావా వసంతమా
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి
రా..రా..
వచ్చేశావా వసంతమా
ఋతుకన్యకలలో తిలోత్తమా
మంద్రారుణవర్ణ ప్రభాతమా
ప్రియాతిప్రియవసంతమా
విచ్చేశావా

ఈ యేడు కోకిలమ్మకి
కొత్తరాగాలేవైనా నేర్పవచ్చావా
అధరాలు పొడిబారిన తుమ్మెదల కోసం
రంగురంగుల మధుపాత్రలు మోసుకొచ్చావా
ఈ మోడువారిన తరుశాఖలపై
విరిసీవిరియని పసిసుమదళముల
చారుహాసాన్ని భాసింపవచ్చావా
నా వాంఛావనమంతటా
క్రొంగొత్త విరిలతలు పూయింపవచ్చావా
ఇన్నాళ్ళకి మళ్ళీ వచ్చావా

మూన్నాళ్ళ ముచ్చటే కానీ
నువ్వొస్తే
కలం నిండా ఒక వినూత్నావేశం
గళం నిండా ఒక నవరాగవిలాసం
గుండె నిండా ఒక మధురోత్తేజం
నువ్వొస్తే
మహదానందం
బృహదానందం
పరమానందం

స్వాగతం ఆమనీ..
సుస్వాగతం!

అష్టావక్ర గీత: పద్యానువాదం - అనుమాండ్ల భూమయ్య

జనకు డిట్లనెను :
పొందదగిన జ్ఞానమ్మును పొందు టెట్లు?
అందగాదగు మోక్షమ్ము నందు టెట్లు?
ఏది వైరాగ్య? మది కలుగు టెట్లు నాకు?
తేటతెల్లమ్ముగా నంత తెలుపు మయ్య!

అష్టావక్రు డిట్లనెను:
కుదురుగా నీవు మోక్షమ్ము గోరుదేని
విషయముల నెల్ల విషముగా విడువవలయు;
క్షమ, ఋజుత్వములను, తృప్తి, సత్యములను,
దయ  నమృతముగా నెపు డీవు త్రాగవలయు.

మాట - గంగిశెట్టి ల.నా.

మాట మాత్రమే కదా!
మాటే!ఎంత ప్రాణం పోస్తుంది...

కొమ్మల్లో దాక్కున్న పిట్ట
సూర్యునికంటే ముందే పలకరిస్తుంటే/
చెట్టు చెట్టే నాలో జలదరించి
సూర్య కిరణాలకు విడిది నిస్తుంది/
పూల కల్లాపి జల్లి
'లోగేహం' లోకి స్వాగతిస్తుంది...

అక్కడ ఏ జన్మ బంధాలనో గుర్తు చేసే వాసనలు/
ఇంకాస్త లోనికి దృష్టి సారించగానే
నిశ్చలంగా వెలుగు తున్న దీపాలు/
జననాంతరాలకు దారి చూపుతున్నధూపాలు..

మాటే కదా
ఓ బ్రతుక్కి బాట/
వాలి పోతున్న తీగలకు
ఓ ఆసరా,  ఊరట/
మాటే కదా!
నీ వ్యక్తానికి- నా అవ్యక్తానికి మధ్య/
నిశ్శబ్దం ఎగరేసే బావుటా/
మనిషితనానికి బాసట!

ఆత్మ కథ (తొలి భాగం) - విశ్వర్షి వాసిలి

atma-katha_jul2019

కొత్త బొమ్మ - వేణు ఆసూరి

kottha-bomma_jul2019

విన్నపం - డా. శాస్త్రి

ఓ స్వామీ !
ఆ నాడు
నా చిన్న వయసులో
పొరుగింటికి వెళ్ళి
"అప్పా! మజ్జిగ ఈయ" మన్నప్పుడు
"ఒక్క క్షణం నిలబడు బాబు!" అని
వంటింటిలో నుండి
కుక్క బయటకు వెళ్ళిన తర్వాత
నాకు "కృష్ణార్పణ" మంటూ
మజ్జిగ యిచ్చింది ఆ తల్లి
"ఏం లేదు బాబూ !
తలుపు మూయడం మర్చిపోయాను 
ఆ కుక్కపిల్ల అన్నంలో మూతి పెట్టిందయ్యా
నేను మధ్యలో వెళితే వదిలేసి పోతుందేమో !
పాపం! పిచ్చి ముండ !
మరలా పిలిస్తే వస్తుందో రాదో నని
దాన్నయినా కడుపు నింపు కొమ్మని
నిన్ను నిలబెట్టేశానయ్యా !
వెళ్ళిరా బాబూ !"
అని చెప్పిన
ఆ తల్లి మాటలు
అర్ధమవని వ్యర్థాలుగా అనిపించాయి
కానీ స్వామీ!
ఈ నాడు
నిన్నవగాహన చేసుకోవాలని ప్రయత్నించే నాకు
అప్రయత్నంగా
ఆ మాటలు
గురు వచనాలుగా ప్రతిధ్వనింప చేస్తూ
సాధించదగిన అర్ధాన్ని చూపు వానిగా
కనిపింప చేస్తున్నావా కరుణామయా !
అన్ని జీవాలలో
నిన్ను చూడ గల్గిన
ఆ పరమార్ధ భావసిధ్ధిని
నాకు కూడా  ప్రసాదించు భగవాన్  !

Posted in July 2019, సాహిత్యం

2 Comments

  1. అయ్యగారి సూర్యనారాయణమూర్తి

    అష్టావక్రగీత అనువాదంలో మొదటి పద్యం 3వ పాదం “ఏది వైరాగ్య? మది కలుగు టెట్లు నాకు?” లో “కలుగు” బదులు “కల్గు” ఉంటే గణభంగం తప్పుతుందేమో అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *