Menu Close

Alayasiri-pagetitle

శ్రీ మురుడేశ్వర ఆలయం, కర్ణాటక రాష్ట్రం, ఇండియా

Murudeswara Alayam

మన మనస్సులో రగులుతున్న వ్యాకులతను తొలగించుకునేందుకు మనం సాధారణంగా ఆలయానికి వెళుతుంటాం. తద్వారా మనసులోని బాధలకు ఉపశమనం కలిగి మనసు తేలికౌతుంది.  అయితే అందుకు ప్రకృతి కూడా మనకు సహకరించి చక్కటి సముద్ర తీరంలో, పచ్చటి కొండ మీద, చల్లటి సముద్ర గాలి తో మనలను ఆహ్లాదపరిస్తే, ఇక ఆ కోవెలను దర్శించుకోకుండా ఎవరైనా ఉంటారా? అక్కడే సమయమంతా గడపాలని కోరుకోకుండా ఉంటారా? అదే ఉత్తర కర్ణాటక రాష్త్రం లో అరేబియా సముద్రపు ఒడ్డున కందూక పర్వతం మీద నిర్మితమైన మురుడేశ్వర క్షేత్రం, నేటి మన ఆలయసిరి.

Murudeswara Alayam

మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. అంటే సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి మురుడేశ్వరం అనే పేరు సార్థకం అయ్యింది. ఈ మురుడేశ్వరం, కర్ణాకట రాష్ట్రం లోని పంచలింగ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన క్షేత్రాలు గోకర్ణ, సజ్జేశ్వర, గుణవంతేశ్వర, ధారేశ్వరాలు. వీటిలో గోకర్ణ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఇతిహాసం ఉంది.

Murudeswara Alayamపూర్వం రావణాసురుడు భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, సరిగ్గా అదే సమయంలో రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. అయితే పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు మన విఘ్నేశ్వరుడు. ఇంకేముంది, ఆత్మలింగం భూమిలో దిగబడిపోతుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, కవచం, దారం తదితర వస్తువులను విసిరి పారేస్తాడు. ఆ వస్తువులు పడిన ప్రదేశాలే పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వినాయకుడు ఆత్మలింగాన్ని మోయలేక భూమిపై ఉంచిన ప్రదేశం "గోకర్ణ"గా కీర్తించబడుతోంది. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరం. మురుడ అంటే కన్నడంలో వస్త్రమనీ, సంతోషమనీ అర్థాలున్నాయి. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మరుడేశ్వరక్షేత్రమయిందని అంటారు. ఈ ఇతివృత్తంలో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ క్షేత్రానికి విచ్చేసిన వారికి మానసిక ఉల్లాసంతో ఎంతో సంతోషం కలగడం మాత్రం వాస్తవం.

Murudeswara Alayam

ఈ కొండ మీద 123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగి పాలరాయితో నిర్మించిన శివుని విగ్రహం ఎంతో పెద్దదిగా ఉండి చాలా దూరం నుండి కనిపిస్తుంది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంత పెద్ద శివుని విగ్రహం లేదంటే అతిశయోక్తి కాదేమో!

మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఒక కోట ఉంది. ఆ కోటను టిప్పుసుల్తాన్ పునర్ నిర్మించాడని ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి.

Murudeswara Alayam

Murudeswara Alayamఈ మురుడేశ్వర క్షేత్రంలో గల మరో ముఖ్య కట్టడం  పర్యాటక ప్రదేశాల విషయానికి వస్తే 20 అంతస్థులతో భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రాజగోపురం. నిట్టనిలువుగా ఉన్న ఈ కట్టడం యొక్క నిర్మాణం 2008 లో పూర్తయింది. ప్రపంచంలో ఏ రాజగోపురానికి లేని విధంగా ఈ గోపురం లో లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లి పైనుండి పరిసరాలను వీక్షించవచ్చు.

నిజానికి ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. నాడు ముర్దేశ్వర్ గా పిలువబడి, మృదేశలింగ లేక ముర్దేశ్వరునిగా శివుని ఆత్మలింగ భాగము సేవలందుకొన్నాది. కాలక్రమేణ ఈ దేవాలయము శిధిలావస్థకు చేరుకొనగా భక్తుల సహాయ సహకారాలతో నేటి నూతన రూపాన్ని సంతరించుకొన్నది. కానీ ప్రధాన గర్భగుడి అందులోని శివలింగం మాత్రము యధాతతంగా ఉండి ప్రత్యేక పూజలను అందుకొంటూ నాటి పాండవుల మొదలు నేటి సామాన్య మానవ భక్తుల వరకూ అందరి కోరికలను తీర్చే భోలా శంకరుని మహిమలను చాటిచెపుతున్నది.

ఈ మురుడేశ్వర క్షేత్రానికి మంగళూరు 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగుళూరు నుండి ఈ ఆలయానికి అతి సులభంగా చేరుకోవచ్చు

Posted in July 2019, ఆధ్యాత్మికము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *