Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
వీధి అరుగులేవి (తేటగీతులు)
Veedhi Arugulu

శ్రీకర శుభకర సొదలు సేకరించి
చిలువలు పలువలును చేసి చెంగలించి
సొల్లు విషయాలు సారించి సొబగులిచ్చి
మాటలల్లి మంచి చెడుల బాట జూపు
వేదిక గదరా తెలుగిళ్ళ వీధి యరుగు
వీధి యరుగుతో పల్లెకు వీడలేని
బంధముండు పిల్లలు పెద్దలందరచట
కూడి వేడి వాడి కబుర్లు కూర్మితోడ
ముచ్చటింతురు మాపులు ముదము మీర
రాజకీయాల రచ్చకు రoకు బొంకు
ఊసులకది నెలవు సదా యూరి నందు
పిల్లలు పగలు మాపుల పెద్దలంత
వాద ప్రతివాదముల కూర్చు వేదశాల
బోసిపోయెనకట మూగబోయెనయ్య
ఉమ్మడి కుటుంబములు లేక నూరిలోన
అవ్వ తాత దండ్రుల నాటి యరుగు నేడు
మిగిలె నేకాకిగా పల్లె సొగసులరుగు
జ్ఞాపకాలు మిగిలె కొన్ని జాడలందు
పెంకు టిల్లులు పోయెను పెద్ద మేడ
లాయె కూలెనుగ యరుగులానవాలు
ఊరు కెళ్ళినపుడు వెత లోల లాడు

****************

ఆవలి ఒడ్డు

వసంత కాలపు పుడమి గర్భాన వికసించిన చిగురులను పూలను చూశాను
యవ్వన గీష్మాన కష్టాల కడలి ఇసుక తీరాల ఎండమావులను చూశాను

శ్రావణ మేఘాల చాటున కౌమారపు తలపుల వలపు చిరుజల్లులతో తడిసి పోయాను
కార్తీక మాసపు కోవెల గంటల ఘణ ఘణల మది మురియగా శరదృతువు పండువెన్నెల బొండు మల్లెల పరిమళాల తొలి కౌగిళ్లను చవి చూశాను

హేమంత గాలుల పుష్య మాసపు మంచు తెరల వయసు మడత పొరల జీవిత దుప్పటిలో ఒదిగిపోయాను

అదిగో వచ్చేసాయి నా మల్లి జీవన సాఫల్య ఫలితాలు
అన్ని ఋతువులు సెలవు తీసుకున్నాయి
ఒక్క  శిశిరం నా వెంటనoటి ఉంది

అడవిలోని నదీ ప్రవాహంలో తెరచాపలేని నావ ఊగిసలాడుతుంది
అలలు వయసు మీరి నిట్టూర్పుతున్నాయి
గాలితో అనుభవాల మనసు పిచ్చిగా ఈలలు వేస్తుంది
అక్కడ వ్యర్ధమైన వాడిన పూలు నేలంతా మలి సంధ్య సిందూరాలను తలపిస్తున్నాయి

క్రీనీడలలో పండుటాకులు రాలి గాలికి అటు ఇటు కొట్టుకుపోతున్నాయి
ఆవలి ఒడ్డు నుండి
ఆవల తీరం నుండి
ఈ మలయ మారుతంలో
నాకోసం ఏవో వేడికోళ్లు
ఏవేవో సుస్వరాల వీడికోళ్లు
నన్ను రమ్మంటున్నాయి    మీకు వినిపించడం లేదా!?
అవునులే  మీకు సమయం ఇంకా ఉంది కదా

Posted in July 2023, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!