నీ బ్రతుకుతెరువు కోసం..
నీ భావి కోసం..
నీ ఊరు విడిచి
నీ సీమ విడిచి
ఒక భవన నిర్మాణం కోసమో..
ఒక వంతెన నిర్మాణం కోసమో..
నీ వారిని వదలి..
నీ దారిన కదలి..
నీ కండలు కరగిస్తూ,
నీ శ్రమను ధార పోస్తూ
నీ బ్రతుకు చక్రాన్ని
ముందుకు నడిపిస్తున్న
అలుపులేని వలస జీవివి నీవు..
కూలీ కోసం నీ ఆరాటం
కూడు, గుడ్డ కోసమే నీ పోరాటం
కుటీరం నీ ఆవాసం,
కాయా కష్టం నీ అభిమతం..
రెక్కాడతే గాని నీకు
డొక్కాడదు..
చాలీ చాలని కూలీతో
నీకు కడుపు నిండదు..
అయినా….
నీవు జీవితంతో
ఎప్పుడూ రాజీనే..
విపత్తులైనా, విభవములైనా నీకు,
భూదేవికున్నంత సహనమే..
దుఃఖాన్ని దిగమింగుతావు..
కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుతావు..
కానీ…
కాల భ్రమణం లో వింత మార్పులు…
కలలో కూడా ఊహించని విపత్తులు..
కసిగా నిన్ను కాటేసిన కరోనా
చేసె నీ బ్రతుకును హైరానా..
కర్ఫ్యూలు,లాక్ డౌన్లు
కూర్చె నీ మనసుకు ఆందోళన..
చేతినిండా పని లేదు..
చేతిలో కాసు లేదు..
తినేందుకు తిండి లేదు..
పిడుగు పాటు విపత్తుకు
దిక్కుతోచగ లేదు..
పనులు కానరానాయె..
పూట గడవడం కష్టమాయె..
ఆకలి బాధలు తీరవాయె..
ఆదుకునేవారే కరవాయె..
నీ మొర అరణ్య రోదనాయె..
నీ కళ్లలో నీ ఊరు కదలే
నీ వాళ్లు నీ మదిలో మెదిలే
నీ కనులు చెమ్మగిల్లే
నీకు ఊరు వెళ్లే చింతనాయే..
నీ ఊరేమో దూరమాయె..
చేతిలో చిల్లి గవ్వ లేదాయె
అయినా, నీ ఊరు చేరాలనే
ఘర్షణ నీ మనసులో మొదలాయె..
కాలి నడకే నీకు తప్పదాయె..
ఎండనకా, వాననకా
పగలనకా, రాత్రనకా
సాగిన నీ నడక
నీ గుండె ధైర్యానికి మచ్చుతునక..
నిత్య ఆశా జీవి ఓ వలస జీవి..
నీవు అలుపులేని జీవి..
నీ జీవన పోరాటం లో
నీవు నిరంతరం కష్ట జీవివే…