ఈ రాత్రే
దేహాక్షరంతో
జీవితానికి తొలిమాట వ్రాసేది.
కళ్ళ దారిలో
పెదవి వాకిలిన
వెచ్చని వాక్యం
మధుర జీవన యాత్రకు
ముస్తాబౌతుంది.
తియ్యని దారులలో
సిగ్గుపడిన కొత్తదనాన్ని
చేతుల సంకెళ్లతో
కౌగిటి సెగల నడుమ
చూపుల ప్రేమాగారం
స్వాగతం పలికింది.
వెన్నెల వానలో తడిసి
మల్లెల చాటున
ముడుచుకుపడుకొన్న కల
కళ్ళు తెరచి ఒళ్ళు విరచుకొన్నది.
నుదుట నడివీధిలో నిలబడి
దేహమంతా వినపడేలా
నిన్ను కవితగా కలవరించి,
ఎద అమృతం తాకిడికి
అందం పుట్ట పగిలి
విరహపు ఒరవడి
గట్లు తెగాయి.
కల నిజమయ్యే వేళలో
ఒడిసిపట్టిన ప్రతి క్షణంలో
తృప్తి రేణువులు పెదవిపై ఎర్రగా
వేకువ దాకా నడిచిన మధురానుభూతికి
"తొలి అనుభవం" అంకితం.
విప్పారిన కళ్ళు పంచిన పరవశానికి
ఆమె అధరకాగితంపై
ఓ ప్రేమ లేఖ చెక్కాను.
మరో జన్మలొ సైతం గుర్తుకొచ్చేలా....
జవాబిచ్చేలా......
కవిత చాలా బావుంది సర్