తెరవని కన్ను
తీరిన కోర్కెలపై నా తెలివిని ప్రశంసిస్తున్నా
తీరని ఆశలు దేవునిపై తోసేస్తున్నా
చేరిన గమ్యాలను చులకనగా చూస్తున్నా
చేరని తీరాలకై పొగిలి పొగిలి ఏడుస్తున్నా
కదిలిపోయిన కాలం కనకమంటున్నా
కట్టెదుట క్షణాన్ని మట్టి పాలు చేస్తున్నా
పూమొక్క పైని స్వేచ్చాపుష్పాలను
పూజ పేరుతో రాల్చేస్తున్నా
వాసనరాని రంగుల పూలతో
మాధవునికి మాలలల్లుతున్నా
అనంతాలలో నిండిన ఆనందాన్ని
అరచేతిలో ఇరికిస్తున్నా
నిరామయమైన నిరంజనుని
జర్జరదేహంలో బంధిస్తున్నా
రెప్పచాటు స్వప్నాలను కళ్ళు తెరిచికంటున్నా
రెప్పపాటు జీవితాన్నే శాశ్వతమంటున్నా