Menu Close
తీరిన కోరిక (కథ)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం --

గతసంచిక తరువాయి »

భార్యావియోగం బసవయ్య తోట యాజమాన్యం మీద ప్రభావం చూపింది. ఇదివరలా అన్ని వ్యవహారాలు సక్రమంగా చూడలేకపోతున్నాడు. బసవయ్య ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణించ నారంభించింది. అది గ్రహించి గణపతి తండ్రికి చేయూతనివ్వడం ప్రారంభించేడు. తానే పూర్తిగా తోట యాజమాన్య బాధ్యత స్వీకరించేడు. అన్నపూర్ణమ్మ పరలోకం చేరిననాటినుండి ఆమె లేని  లోటు బసవయ్య ఇంట తీరలేదు.

వంటింట్లో ఇంటి మహాలక్ష్మి శాశ్వతంగా కనిపించకపోవడాన్ని బసవయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. దీర్ఘమయిన ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు బసవయ్య కొడుకువద్ద తన మనసు విప్పేడు.

"నాయనా గణపతి, నీతో ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడాలి." అని సంభాషణకు తెరలేపేడు, బసవయ్య.

"ఏమిటో అది చెప్పండి, నాన్నా. మీకేమయినా ఇబ్బందిగా ఉందా." అని, ఆతృతగా అడిగేడు, గణపతి.

"నాకేఇబ్బంది లేదు నాయనా."

"అయితే ఆ విషయమేమిటో చెప్పండి."

"మీ అమ్మ లేని ఇల్లు చూడలేకపోతున్నాను బాబూ."

"నాకూ అలాగే ఉంది నాన్నా. అమ్మ లేకపోవడం ఇంటికి నిండుతనం పోయింది నాన్నా."

"ఇంటి ఇల్లాలు ఇంటికి మహలక్ష్మి. దేముడి గదిలో మీ అమ్మ పూజలు చేసుకొంటూ, ఇంట్లో ఉన్న దేముళ్ళ పటాలు అన్నిటికి హారతులిస్తూ, గంట వాయిస్తూ ఉంటే, ఇల్లే ఒక దేవాలయం లాగ ఉండేది."

"నిజమే నాన్నా, అమ్మతోనే పోయింది ఆ కళ."

"మళ్ళీ మన ఇంటికి ఆ కళ రావాలి నాయనా."

"అవును నాన్నా. ఆ కళ వస్తే, మీ మనసు కూడా తేలికవుతుంది. కాని మళ్ళీ ఆ కళ ఎలా వస్తుంది నాన్నా."

"అది నీ చేతిలోనే ఉంది బాబూ."

"నా చేతిలోనా."

"అవును బాబూ నీ చేతిలోనే ఉంది."

"ఏమిటి నాన్నా. మీరు చెపుతున్నది నాకు బోధపడడం లేదు."

"మన ఇంటికి మరో మహాలక్ష్మిని తేవాలి బాబూ."

తండ్రి మరో పెళ్లి చేసుకోదలుస్తున్నాడా అని సంధిగ్ధంలో పడ్డాడు, గణపతి. కాని తన సంశయం తీర్చుకోడానికి తండ్రిని అడిగే ధైర్యం లేదు.

"బాబూ ఏమిటి ఆలోచిస్తున్నావు." కొడుకు ముభావనకు కారణం తెలియగోరేడు తండ్రి.

"ఏమీ లేదు. నేనేమిటి చెయ్యగలను అని ఆలోచిస్తున్నాను."

"నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి కోడలును తెస్తే మళ్ళీ ఆ కళ వస్తుంది బాబూ."

గణపతి సందిగ్ధం తీరింది.

"నన్ను ఆలోచించుకోనీ నాన్నా."

"బాగా ఆలోచించుకో బాబూ. నీ నిర్ణయం తెలిసేక ఆ పనిలో ఉంటాను."

అక్కడితో ఆ సంభాషణ ముగిసింది.

గణపతి దీర్ఘాలోచనలో పడ్డాడు. నాన్న చెప్పింది నిజమే. అమ్మ లేని ఇల్లు ఏదో పెద్ద వెలితిగా కనిపిస్తోంది. తను రోజల్లా పొలంలో ఉండడం వలన తండ్రి ఇంట్లో ఏకాంతంగా ఉంటున్నాడు. ఆ సమయంలో అమ్మ గూర్చే తండ్రి ఆలోచిస్తుంటాడు. అది క్రమంగా అతని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అదే కాక తను లేని సమయంలో తండ్రికి ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే తగు చర్యలు తీసుకోడానికి ఎవరూ ఉండరు. పనివాడు ఉన్నా వాడు తండ్రి గది పైనే ఉంటాడు. ఇవన్నీ ఆలోచిస్తే తను పెళ్లి చేసుకోవడం అవసరమనుకొన్నాడు. అయితే వచ్చిన కోడలు బాధ్యత తీసుకొని మామగారిని ఆప్యాయంగా చూసుకోకపోతే సమస్య ఇంకా జఠిలం కావచ్చు. ఈ విషయాలన్నీ తండ్రితో మాట్లాడి నిర్ణయం తీసుకోదలిచేడు.

ఆ మరునాడు తన మనోభావాల్ని తండ్రితో పంచుకున్నాడు. అవి విన్నాక బసవయ్య అసలు విషయానికి వచ్చేడు.

"బాబూ, నాకోసం నువ్వు ఎన్నాళ్ళు పెళ్లి మానుకొంటావ్. లోకంతో బాటు మనం. కొంతవరకు దేముడిమీద భారం వెయ్యాలి. మనం మంచయితే లోకం మంచవుతుంది."

"నా భయమల్లా వచ్చిన కోడలు ఇంట్లో చిచ్చులు పెడితే, ఇల్లు స్వర్గానికి బదులు నరకమవుతుంది."

"బాబూ, మొన్ననే మీ పెద్దమామయ్య గంగాధర్ నుండి ఉత్తరం వచ్చింది. అతని బావమరిది వెంకటరావుకు పెళ్లీడు కూతురు ఉందట. పేరు కుసుమ. అమ్మాయి డిగ్రీ చేసిందట. సాంప్రదాయ పద్దతిలో పెరిగిందట. అతనికి ఆ పిల్లని చిన్నప్పటినుండి తెలుసునట. చాలా మంచి పిల్ల బుద్ధిమంతురాలు అని రాసేడు. దైవభక్తి ఎక్కువట. పూజలు పునస్కారాలు పద్దతిగా చేస్తుందట. ఎంచడానికి ఏమీ లేదన్నాడు. ఆలోచించుకో. నీకు నచ్చితే మామయ్యకు ఉత్తరం రాస్తాను."

"బాగానే ఉన్నట్టుంది. రేపు మీకు చెప్పేక మామయ్యకు ఉత్తరం రాయండి. "

తండ్రి కొడుకులు భోజనానికి వెళ్లడంతో సంభాషణ ముగిసింది.

గణపతి పరిణామాలన్నీ దయానిధితో చర్చించేడు. అవి విన్నాక -

"అంకుల్ అభిప్రాయం ఏమిటి." దయానిధి తెలియగోరేడు.

"మా నాన్నకు నచ్చినట్టే ఉంది."

"ఇంతకూ నీ అభిప్రాయమేమిటి."

"ఫరవాలేదనిపిస్తోంది."

పక్కనే ఉండి సంభాషణ వింటున్న ముత్యాలమ్మ -

"బాబూ గణపతీ, అమ్మాయి బాగా తెలిసిన కుటుంబంలోనిది. స్వయాన్న మీ మామయ్యగారు పిల్ల బుద్ధిమంతురాలు అని రాసేరన్నావ్. పూజలు అవీ చేస్తుందన్నావ్. నాకేమో సంబంధం మంచిదనిపిస్తోంది." అని తన అభిప్రాయం చెప్పింది.

ఆ సంభాషణ ముగిసినప్పటికి వచ్చిన సంబంధం చేసుకోతగినదని గణపతి నిశ్చిత అభిప్రాయానికి వచ్చేడు.

గణపతి తన నిర్ణయాన్ని తండ్రికి తెలియబరిచేడు. బసవయ్య సంతోషించేడు.

బసవయ్య తమ నిర్ణయం గంగాధర్ కు తెలియబరిచేడు. కథ ముందుకు నడిచింది. ఓ శుభముహూర్తాన్న కుసుమ మెడలో గణపతి మూడు ముళ్ళూ వేసేడు. కుసుమ రాకతో బసవయ్య ఇంటికి కళ వచ్చింది. బసవయ్యకు సంతృప్తి కలిగింది. కోడలు తనకు చేస్తున్న సేవలకు బసవయ్యతో బాటు గణపతి కూడా సంతోషిస్తున్నాడు. కుసుమ త్వరలో ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పరుచుకొంది. నలుగురిలోను మంచి పేరు తెచ్చుకొంది.

బసవయ్య ఇంటిలో అడుగు పెట్టిననాటి నుండి, దానధర్మాలకు ప్రతీకగా నిలచిన అత్తగారు అన్నపూర్ణమ్మ ఖ్యాతికి మచ్చ రానీయకుండా కుసుమ ప్రవర్తించ నారంభించింది. ఆవిడ ఇష్టాయిష్టాలు ముత్యాలమ్మ ద్వారా తెలుసుకొని ఆ బాటనే నడవ నారంభించింది. కుసుమ ఉదయాన్నే లేచి నిత్యకర్మలు ఆచరించి స్నానం చేసి భక్తితో పూజ చేసుకొని దేముని పటాలన్నింటికీ హారతి ఇస్తూ గంట వాయిస్తూ ఉంటే బసవయ్యకు గడచిన రోజులు జ్ఞాపకానికి వచ్చేయి. తన కోరిక తీరిందని సంతోషించేడు.

కుసుమ తెలుగు సాహిత్యాన్ని అభ్యసించింది. పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు ఆమెకు ప్రీతికరమయినవి. పని చేసుకొంటున్న సమయంలో అవి వల్లె వేసుకోవడం ఆమెకు అలవాటు. ఓ మారు –

'అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బెద్దమ్మ ,' అని పోతన భాగవతంలోని పద్యం నెమరు వేసుకొంటూ ఉంటే వంటపని చేస్తున్న సత్తెమ్మ,

"అమ్మగారండీ అంత పెద్దమ్మ ఎవరమ్మా." అని కుతూహలంతో అడిగింది.

కుసుమ స్పందిస్తూ, "అంత పెద్దమ్మ దుర్గాదేవి." అని బోధపరచి చెప్పింది.

ఆ విధంగా సత్తెమ్మకు పోతన భాగవతంలోని పద్యాలు వినే సదవకాశం లభించింది.

కుసుమ రోజూ సాయంత్రం మామగారికి భారత భాగవతాల్లోని కొన్ని పద్యాలు తాత్పర్యంతో సహా వినిపిస్తుంది. బసవయ్యకు అది మంచి కాలక్షేపం. ఈ పురాణ కాలక్షేపం సంగతి ఎదురుగా ఉన్న నాంచారమ్మకు తెలిసింది. ఆవిడ పెర్మనెంటు మెంబరుగా చేరింది.

ముత్యాలమ్మ రోజూ చేస్తున్న పూజలు ఫలించేయి. కేరళ లోని కొట్టక్కల్ లో ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధి చెందిన ఆర్య వైద్యశాలలో ఒక దశాబ్దం సేవలందించి, ఆయుర్వేద వైద్యంలో ప్రావీణ్యత సంపాదించిన డాక్టర్ రాఘవన్ చిన్నరాయుడుపురంలో ఆయుర్వేద చికిత్సాలయం తెరిచేడు. కొద్ది రోజులలోనే నిపుణుడుగా పేరు గణించేడు. బాలాజీ ఆయన వద్ద చికిత్స పొంద నారంభించేడు. వివిధ తైలములతో మర్దన, ప్రత్యేకమయిన ఔషధములు నిత్యం సేవించడం వలన చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించేయి. ఇప్పుడు బాలాజీ కుడి కాలు; చెయ్యి కొంతవరకు స్వాధీనమయ్యేయి. చేతి కర్ర సాయంతో మెల్లగా నడవగలుగుతున్నాడు.

కుసుమకు సావిత్రి బాగా చేరువయింది. సావిత్రి మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పరచుకొంది. కుసుమకు వెంకటాద్రి అని ఒక పినతండ్రి ఉన్నాడు. ఆయన వ్యాపారి. ఆయన భార్య సీతాలు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం- మోహనరావు, శ్రీదేవి. మోహనరావు డిగ్రీ చేసి ఒక పెద్ద మందుల కంపెనీలో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. బ్రహ్మచారి. వ్యసనాలు ఏవీ లేవు. బుద్ధిమంతుడు. శ్రీదేవికి వివాహమయింది. సావిత్రికి మోహనరావును మాట్లాడదామని కుసుమకు ఆలోచన తట్టింది. భర్త, మామగార్లతో విషయం ప్రస్తావించింది. వారిరువురు సంతోషించేరు. వారు బాలాజీ దంపతులకు, దయానిధికి; ఆ విషయం తెలియజేసేరు. వారి కుటుంబ విషయంలో కుసుమ కనబరచిన అభిమానానికి వారు పొంగిపోయేరు. కుసుమనే కథను ముందుకు నడిపించమన్నారు.

బాలాజీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం వలన కుసుమకు వారి ఆర్థిక పరిస్థితి పై అవగాహన ఉంది. దయానిధి భారీ మొత్తాన్ని సమకూర్చలేడని కూడా తెలుసు. ఏ అవరోధము లేకుండా పెళ్లి జరగాలని మనసారా కోరి, మగపెళ్ళివారికి పరిస్థితులు తెలియబరచి; వారి కోరికల జాబితాను చిన్నదిగా చేయగలిగింది. అయినా తప్పించలేని ఖర్చులుంటాయి గదా. బసవయ్య కొంత సాయం అందజేసేడు. దయానిధి అప్పు చేసి కొంత సమకూర్చేడు. ఇలా అనుకూలించి, ఒక శుభ ముహుర్తాన్న సావిత్రి మెడలో మోహనరావు తాళి కట్టేడు. కుసుమ ప్రయత్నాలు ఫలించేయి.

అధికతర బట్టల దుకాణాలికి, అమ్మకమయ్యేక డబ్బు చెల్లించే పద్ధతిన టోకు వ్యాపారులు బట్టల సరుకు సరఫరా చేస్తారు. బాలాజీ బట్టల దుకాణంలోని సరుకు ఆ కోవకు చెందినదే. బట్టల దుకాణం పరశురామ ప్రీతి కావడంతో అందులోని బట్టల భారీ విలువ దయానిధి నెత్తిన బడ్డాది. దురదృష్ట వశాత్తు వాటికి భీమా లేదు. ఆ బాధ్యతతో బాటు చెల్లెలి పెళ్ళికి చేసిన అప్పు తీర్చాలి. దయానిధి ఆ పూర్తి వివరాలు ఏవీ తల్లిదండ్రులకు తెలియజేయలేదు.

కేశవుడు డిగ్రీ పూర్తి చేసేడు. భిలాయి ఉక్కు కర్మాగారంలో గుమస్తా ఉద్యోగంలో ప్రవేశించేడు. చెప్పుకోదగ్గ ఆదాయం వస్తోంది. ఖర్చులు పోగా కొంత మిగులు; బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. ఇంటి ఆర్థిక పరిస్థితి తెలిసినా కేశవుడు పట్టించుకోక పోవడంతో దయానిధి పైన పూర్తి భారం పడింది. ‘కేశవుడు ఎంతయినా డబ్బు పంపుతున్నాడా’, అని బాలాజీ అడిగినా; కొన్నాళ్ల దాకా వాడు పంపలేడని, వీలయిన వెంటనే పంపిస్తాడని, దయానిధి సమాధాన పరచేవాడు. కాని ఆ రోజు ఎప్పటికి రాలేదు. కేశవుడు తన తోటి ఉద్యోగిని, పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకొన్నాడు. క్రమక్రమంగా తల్లిదండ్రులతో తెగతెంపులు చేసుకొన్నాడు.

నవరంగపట్నంలోని ఒక ప్రైవేట్ హైస్కూల్లో అవివాహితుడు సుధాకర్ మేథమేటిక్స్ టీచరుగా చేరేడు. అతనికి సంగీత సాహిత్యాల లో ప్రవేశం ఉంది; వీనుల విందు చేయ గలిగే కంఠం వాటికి తోడయింది. కొద్ది రోజులలో శ్రీరామ నవరాత్రుళ్లు ప్రారంభమయ్యేయి. గుడిలో పూజలు భక్తి శ్రద్ధలతో రోజూ జరుగుతున్నాయి. ఆ రోజు కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం జరుగుతోంది. సందర్శించ జేరిన భక్త సముదాయంలో సుధాకర్ తో బాటు కొందరు గాయనీగాయకులు ఉన్నారు. శ్రీరాముని స్తుతిస్తూ ఇద్దరు గాయకులు తమ కంఠాన్ని వినిపించేక, సుధాకర్, 'సీతారాముల కళ్యాణము చూతము రారండి' గానాన్ని సుమధుర  స్వరంతో వినిపిస్తుంటే భక్త జనం తన్మయత్వంతో ఆనందించేరు. వారి మధ్యలోనే ఉన్న దయానిధి పాట ముగిసేక సుధాకర్ దరి చేరి అభినందిస్తూ తన పరిచయం చేసుకొన్నాడు. అదే వారి స్నేహానికి నాంది పలికింది.

సుధాకర్ దయానిధిల మనస్తత్వాలు చాలావరకు కలియడంతో అతిత్వరలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శలవులలో సుధాకర్ తరచూ చిన్నరాయడుపురంలో దయానిధి, గణపతిల కుటుంబాలతో సరదాగా కాలం గడుపుతుండేవాడు. కుసుమ పురాణాలు చదివి వినిపిస్తుంటే తనూ శ్రద్ధగా వినేవాడు. తనుకూడా అప్పుడప్పుడు భక్తి గీతాలు పాడి వినిపించేవాడు. ఒక రోజు సుధాకర్ తిరుపతి వెంకటకవులు రాసిన, ' జెండాపై కపిరాజు ...' పద్యాన్ని నాటకీయ ఫక్కీలో ఆలపిస్తూ ఉంటే, వంటింట్లోని సత్తెమ్మ వడి వడిగా వచ్చి శ్రద్ధగా విని తనూ చప్పట్లు కొట్టింది. కొద్దిరోజులలోనే ఆ రెండు కుటుంబాలకు సుధాకర్ బాగా దగ్గరయ్యేడు.

సుధాకర్ తండ్రి రామారావు ఒక ప్లీడరుగారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. సుధాకర్ స్కూలు ఫైనలు పరీక్ష మంచిమార్కులతో పాసయ్యేడు. కాని ఉన్న ఊళ్ళో కాలేజీ లేదు. పై ఊరిలోని కాలేజీలో చదివించడానికి రామారావుకు ఆర్ధిక స్తోమతు లేదు. సుధాకర్ మేనమామ వెంకటేశ్వర్లు విశాఖపట్నంలో పౌరోహిత్యుడు. అతని కూతురు జోగమ్మ, సుధాకర్ కన్నా రెండేళ్లు చిన్నది. ఎనిమిది పాసయింది. తెలివయినది. కాని పెద్దమనిషి అయ్యేక తండ్రి ఒత్తిడితో చదువుకు స్వస్తి పలికింది. పెళ్లి కాలేదు. సుధాకర్ మంచి మార్కులతో స్కూలు ఫైనలు పాసయ్యేడని వెంకటేశ్వర్లుకు తెలిసింది. ఒక రోజు రామారావుని కలసి తన కూతురు జోగమ్మను సుధాకరుకు చేసుకొంటే సుధాకర్ కు పై చదువు తను చెప్పిస్తానన్నాడు. రామారావు కుటుంబానికి ఆ ప్రస్తావన నచ్చింది. పెద్దచదువు చదువుకొంటే ఏదయినా మంచి ఉద్యోగం దొరుకుతుంది. అయిదు వేళ్ళూ నోటిలోనికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదనుకొన్నారు. నిశ్చయ తాంబూలాలు అందుకొన్నారు. సుధాకర్ B.Sc. పాసయ్యేడు. B.Ed కూడా చేసేడు. దయానిధి పనిచేస్తున్న  నవరంగపట్నంలో ఒక ప్రయివేటు హైస్కూలులో మేథమేటిక్సు టీచరుగా జాయినయ్యేడు. సంవత్సరం కాకుండా మంచి పేరు తెచ్చుకొన్నాడు. సుధాకర్ మేష్టారి ట్యూషన్లకు గిరాకీ బాగా పెరిగింది.

ఓ సుముహూర్తాన్న సుధాకర్ జోగమ్మల వివాహం జరిగింది. కొత్త జంట నవరంగపట్నంలో వైవాహిక జీవితం ప్రారంభించేరు. సుధాకర్ భార్యను దయానిధికి పరిచయం చేసేడు. దయానిధి నూతన దంపతులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేడు. దయానిధి ద్వారా జోగమ్మ గణపతి కుటుంబానికి పరిచయమయింది. కొద్దిరోజులలోనే దయానిధి గణపతి కుటుంబాలతో జోగమ్మ బాగా చేరువయింది. దయానిధిని గణపతిని, 'అన్నయ్యగారూ', అని సంబోధించడం అలవరచుకొంది.

నవరంగపట్నంలో దయానిధి చదివిన కాలేజీలో హిస్టరీ లెక్చరరుగా పనిచేస్తున్న గోపీచందుగారికి డిగ్రీ చేస్తున్న అమ్మాయి ఉంది. పెళ్లి కాలేదు; పేరు శాంతి. గోపీచందుగారికి దయానిధిపై మంచి అభిప్రాయముంది. శాంతిని దయానిధికి మాట్లాడదామనుకొన్నారు. మంచిరోజు చూసుకొని భార్యాసమేతంగా బాలాజీ దంపతులను కలిసేరు. మనసులోని పెళ్లి ప్రస్తావన వారి ముందుంచేరు. ఇరుపక్కలా అందరకు అంగీకారమయింది. దయానిధి, శాంతి ఒకరికొకరు నచ్చేరు. ఓ సుముహూర్తాన్న పెద్దల సమక్షంలో దయానిధి శాంతి మెడలో తాళి కట్టేడు. శాంతి రాకతో ముత్యాలమ్మకు ఇంటి పని భారం చాలావరకు తగ్గింది. శాంతి బసవయ్య కుటుంబానికి దగ్గరయింది. సుధాకర్ జోగమ్మలతో మంచి సఖ్యత ఏర్పడింది. మూడు కుటుంబాలు ఒకే కుటుంబంలాగ కలసిమెలసి ఉంటున్నారు.

****సశేషం****

Posted in July 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!