తీపి దుఃఖాలు
ఒక అసంపూర్ణ సంధ్యాకాలం
నీవిచ్చిన సంతోషంతో
నువ్వు పంపిన సందేశంతో
ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా.
ఒక్క మాట చెప్పు
నీ తపస్సులో
ఉషస్సుని చూస్తున్న నాకు
ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..!
నీ చూపులు వెన్నెల్ని కురిపిస్తున్నపుడు
నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు
నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు
నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు
ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన
అనురాగ మధురిమల్ని ఏరుకుంటున్నపుడు
నాలో కలల పూలు విరిశాయి.
నీ పెదవులపై మెరిసే నిశ్శబ్దాక్షరాలు
నాలో చెక్కిన మౌన భాషితాలుగా మిగిలాయి.
అలా రువ్విన నవ్వులలో
తడిసిపోతూ తనువు మురిసిపోతూ
కాలాల్ని దాటుతున్నది.
ఇన్ని జ్ఞాపకాల్ని దోసిళ్ళలో పోసి
ఆ ఒడ్డు నుంచి అనుభవాల్ని ఆస్వాదించమంటావు.
ఈ దుఃఖాన్ని ఈదుకుంటూ
నీ జ్ఞాపకాల వైపు
నా పయనం కొనసాగుతుంది.