Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

(1) చిమ్మపూడి అమరేశ్వరుడు (2) ఎఱ్ఱాప్రగ్గడ

చిమ్మపూడి అమరేశ్వరుడు

“శ్రీనాథుడంతటి వాడు చేతులెత్తి నెన్నెదుట కరాంజలి సమర్పించే సత్కవి మనకు పద్మనాయక యుగంలో దొరుకుతాడు. అతని పేరు చిమ్మపూడి అమరేశ్వరుడు.” ఆరుద్ర.

“నన్నయభట్టు తిక్కకవి నాయకులన్న హుళక్కి
భాస్కరుం-డన్నను తిమ్మపూడి యమరేశ్వరు
డన్నను సత్కవీశ్వరుల్ – నెన్నెదుటం గరాంజలులు
నింతురు జేయని....” క్రీడాభిరామం – 36

శ్రీనాథుడే గాక అమరేశ్వరుని స్తుతించిన ఇతర కవులు, కొరవి గోపరాజు, ప్రౌఢకవి మల్లన, సూరన, రామరాజ భూషణుడు మొదలైన వారున్నారు. స.ఆం.సా. పేజీలు 522-23

పైవిధంగా అమరేశ్వరుని తొమ్మిదిమంది కవులు స్తుతించిన విషయం తప్ప మరే ఇతరత్రా తిమ్మపూడి అమరేశ్వరుని గురించిన సమాచారం తెలిపే మార్గాలు దొరకలేదు. అయితే అదృష్టవశాత్తు అమరేశ్వరుడు రచించిన ‘విక్రమసేనం’ అనే గ్రంథం నుండి 54 పద్యాలు దొరికాయి.

పెదపాటి జగ్గన్న కవి ‘ప్రబంధ రత్నాకరం’ అనే సంకలన గ్రంథం వ్రాశాడు. అందులో కవీంద్ర కావ్య నామాలతో వివిధ కవుల రచనల నుండి గొప్ప పద్యాలను సేకరించి చేర్చాడు. ఇందులో అమరేశ్వరుని ‘విక్రమసేనం’ నుండి చాలా పద్యాలు చేర్చబడ్డాయి. అలాగే ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో ‘ఉదాహరణ పద్యము’ అనే పేరుతో మరో సంకలన గ్రంథం ఉన్నది. పై రెండు గ్రంథాల నుండి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పద్యాలను తీసుకొని “ప్రబంధ రత్నావళి’ అనే మరొక సంకలన గ్రంథాన్ని తయారు చేశారు. ఈ సంకలన గ్రంథాన్ని గూర్చి చెప్తూ ఆరుద్ర

“నవకము, చవి, చక్కన కలిగి, ఆంధ్రతా వాసనలు పరిమళించే ఈ కూర్పులో చిమ్మపూడి అమరేశ్వరుని మొత్తం 52 పుష్పాలను (11 వ సంఖ్యనుండి 63 దాకా) వేటూరి ప్రభాకర శాస్త్రి గారు దండ గుచ్చారు.

విక్రమసేనము:

విక్రమసేనము పూర్తిగా దొరకలేదు. అందువల్ల అందలి కథను తెలుసుకోవడానికి ఆరుద్ర ఒక ప్రణాళిక ఏర్పరుచుకొన్నారు. విక్రమసేనము లోనివని చెప్పిన మొత్తం 54 పద్యాలను ఒకచోట చేర్చారు. కందుకూరి వీరేశలింగం పంతులు, చాగంటి శేషయ్య గారు, ఇద్దరు కలిసి చెప్పినవి మొత్తం 34 పద్యాలు కూడా ఉన్నాయి. “ఈ పద్యాలన్నింటినీ ఒకచోట చేర్చి శీర్షికల వారిగా వింగడించి వాటిని కవి ఏ క్రమంలో వ్రాసి ఉంటాడో ఉజ్జాయింపుగా ఊహించుకొంటూ ఒక కావ్య రూపం తయారుచేశాను” అని అన్నారు ఆరుద్ర. స.ఆం.సా. పేజీ 527.

ఈ విధంగా అమరేశ్వరుని పద్యాలను ఒకచోట చేర్చి అందులోని కథావిధానాన్ని తెలుసుకొని వివరించే నేపధ్యంలో ఆరుద్ర ఒక పరిశోధనాత్మకమైన వ్యాసం తయారుచేశారు. ఆరుద్ర 54 పద్యాలను ఆధారం చేసుకొని పూర్తి కథను, పుర వర్ణనను, ఇతర వర్ణనలను గూడా విక్రమసేనము నుండి మనకు అందించారు. అంతేగాక అమరేశ్వరుని పద్యాలను, ఇతరుల పద్యాలతో పోల్చి ఎవరిని ఎవరు అనుకరించారో కూడా వివరించారు. అందుచేతనే ఇదొక పరిశోధక వ్యాసం అనదగి ఉంది. ప్రముఖులను గూర్చే గాక, కొన్ని పద్యాలు మాత్రమే దొరికిన కవిని గూర్చి, అతని ప్రతిభను ఆ పద్యాల ద్వారా పఠితలకు అందించిన ఆరుద్ర కృషి ప్రశంసనీయమైనది.

కథ-నగర, సూర్య, చంద్రాది వర్ణనలు

కథానాయకుని వూరిపేరు ఉజ్జయినీ పురం అని 7వ పద్యం – ‘ప్రత్యగ్ర రచనాతి ....నిర్జితాలాక నుజ్జయినీపురంబు’ ద్వారా తెలుస్తున్నది. స.ఆం.సా. పేజీ 526.

కథానాయకుడు విక్రమసేనుడు అనే రాజు ఉజ్జయినీ పురానికి రాజు. అతనిని గూర్చి 19వ పద్యం ( పేజీ 530) చెప్తున్నది.

‘కులశైలంబులలో సువర్ణగిరి దిక్కుంభీంద్ర వర్గంబులో ... అనే పద్యం వల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఆ రాజుకు ఎవరి వల్లనో గొప్ప పర్వతాలను గూర్చి తెలుసుకొని అక్కడికి ఆ వచ్చినవానితో లేక సఖునితోనో బయలుదేరాడు. మధ్యలో కైలాసపర్వతం కనిపించింది. అది దాటాక ఒక ఉద్యానవనం కన్పిస్తుంది. సఖుడు ఆ వనంలోని వృక్షాలు మొదలైన వాటిని వర్ణించాడు. 24 వ పద్యంలో సూర్యాస్తమయ వర్ణన ఉంది. ఆ తర్వాత చంద్రోదయ వర్ణన.

అమరులమృతాబ్ది లోపలి యమృతరసము
వెండి చేరుల పటికంపు కుండగట్టి
చేదుకొని యెదరో నాగ శీత రోచి
మెల్ల మెల్లన రుచులతో మిన్నువ్రాకెం

చంద్రబింబాన్ని దేవతలు అమృతాన్ని చేదుకొనే చేదలా (కుండలా) వర్ణించడం మనోహరంగా ఉంది. 26 వ పద్యం కూడా చంద్రుని వర్ణనే. అయితే ఈ పద్యం నిజంలో శ్రీనాథుని పద్యం అని (బీమ.పురా. 2-43) అని చెప్పిన ఆరుద్ర “ఆ మాటకొస్తే అది శ్రీనాథుని సొంతమూ కాదు.. దీనిని ఆయన బాల రామాయణం నుండి అనువదించాడు.” అని మూల శ్లోకం ఇచ్చారు. శ్లోకం లోని దూతద్యుతులకు బదులు శ్రీనాథుడు దంత వజ్రాలను పేర్కొన్నాడు అని చెప్పి ఈ అనుసరణను కుందూరి ఈశ్వరదత్తగారు చూపించారు” అని తెల్పారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 530-32)

ఆ తోటలోకి మన్మధుని దండువలె కొందరు కన్యలు పూలకై వచ్చారు. అందులో కధానాయిక కాబోలు చెట్లలో చివరికొమ్మలలో చీకటిగా ఉన్న చోట్ల పూలు కోయడానికి ప్రయత్నించింది. అయితే చీకటిగా ఉన్నా ఆమె బాహువులు ఎత్తి పూలకై ప్రయత్నించడం వల్ల ఆమె బాహుమూల కేశముల కాంతితో ఆమె పూలు కోసుకొందట.

అక్కడ పొదలమాటున దాగిన నాయకుని ఆ కన్యాసమూహం చూచారు. నాయికా నాయకులు కలుసుకోవడం, విరహవేదనాది వర్ణనలను అమరేశ్వరుడు వసుచరిత్ర వంటి కావ్యాల స్థాయిలో సాగించాడు. విరహవేదన చెందే నాయికతో చెలికత్తెలు మన్మధుని గూర్చి భయపడవలదని చెప్తూ,

“మకరధ్వజుని విల్లు మనము వాయినినిడి
నమలింపుగా జేయు నల్ల చెరుకు
మదన బాణావళి మనము క్రొమ్ముళ్ళపై
బొలుపార దురిమెడు పుష్పచయము ....”  పేజీ 537

అని నాయికకు ధైర్యం చెప్పే ఈ పద్యంలో నల్ల చెరుకుగడే మన్మధుని విల్లు అన్న విషయం, అలాగే ‘వాయి’ అనే ద్రవిడ పదం మనకు కనపడుతుంది. వివాహానికి సంబంధించిన పద్యాలు దొరకలేదు. అనంతరం భార్యా భర్తలిద్దరి యొక్క జలక్రీడా విశేషాలు అయిదు పద్యాలలో వర్ణించబడ్డాయి.

చంద్రోదయం శృంగార రసోద్దీపము. చంద్రుని గూర్చి చెప్తూ కాముని నిరంజనౌషధి అని, కుముదుని రాగ రససిద్ధి ఘటిక యని...అభివర్ణించిన అమరేశ్వరుడు నాయకానాయికలకు ఏకాంతం కల్పించాడు. “మరి మనం కూడా ప్రక్కకు తప్పుకొందాం” అంటారు ఆరుద్ర. అమరేశ్వరుని పద్యాలను గూర్చి ఆరుద్ర పరిశోధించిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. నగర వర్ణనలు గూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

1910 లో మానవల్లి రామకృష్ణ కవిగారు ‘ప్రబంధమణి భూషణము’ అనే గ్రంథాన్ని ప్రకటించారు. ఇందులో 867 పద్యాలు ఉన్నాయి. అందులో 411 పద్యాలకు మాత్రం కవుల పేర్లు ఉన్నాయి. మిగతా వాటిలో పేర్లు లేనివి ఉన్నాయి. ఇందులో కూడా పేరు లేకపోయినా అమరేశ్వరుని విక్రమసేనం లోని పద్యాలు ఉన్నాయి అని ఆరుద్ర తెలిపారు.

ఎఱ్ఱాప్రగ్గడ

ఆంధ్ర మహాభారత అనువాద రచనలో రెండు కొసలను కలుపుతూ భారతానికి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసినవాడు ఎఱ్ఱాప్రగ్గడ.

ఎఱ్ఱన తండ్రి పేరు సూరన్న. తాతగారి పేరు ఎరపోతనూరి. తాత విష్ణు భక్తుడైతే ఎఱ్ఱన శివభక్తుడు. ఎఱ్ఱన గురువు శంకర స్వామి. ఆయన నిత్య శివరాత్రి వ్రతాన్ని, రోజూ ఎనిమిది ఝాములు నియమంతో శివార్చన చేసే శివ భక్తుడు. ఎఱ్ఱన గురువు వద్ద శివతత్వాన్ని గ్రహించి ‘శంభుదాసుడు’ అనే లక్షనాభిధేయం పొందాడు.

సూరన్న తన కుమారునికి సంస్కృతాంధ్ర భాషా వైభవాన్ని బోధించాడు. ఎఱ్ఱన వంశీయులు మొదట వేగినాడు లోని కరాపర్తి గ్రామంలో ఉండి అక్కడినుండి పాకనాడు లోని గుడ్లూరుకు వచ్చి స్థిరపడ్డారు.

ఎఱ్ఱన తన బాల్యంలో గుడ్లూరులోని నీలకంఠేశ్వర స్వామిపై కొన్ని పద్యాలు చెప్పారు. “నిను సేవించిన గల్గు మానవులకున్...” అనే పద్యం అల్లసాని పెద్దన గారి ప్రఖ్యాతమైన ‘పూత మెరుంగులు’ అనే దాని సంస్కృత భాగానికి ఒరవడి పెట్టిందేమో నని ఆరుద్ర అభిప్రాయం.

అనువాద విధానం: 

నన్నయ, తిక్కనలు అనువదించిన ఆంధ్ర మహాభారతం అసంపూర్ణంగా ఉండడం ఎఱ్ఱనకు కొరతగా అన్పించింది. అందుకే దాన్ని పూరించాలనుకొన్నాడు. ముందుగా నన్నయ గారి రచనా విలాసాన్ని, శిల్పరహస్యాలను ఆకళింపు చేసుకొన్నాడు. తిక్కన గారి శైలిని, ప్రతిభను అర్థం చేసుకొన్నాడు. అటు తర్వాత ఆ రెండు రచనలను కలుపుతూ ఒక వంతెన లాగా తన రచనను సాగించాడు.

నన్నయ గారు భారతంలో అరణ్యపర్వంలో మూడు ఆశ్వాసాలు పూర్తిగా రచించాడు. నాల్గవ ఆశ్వాసంలో 142 పద్యాలు మాత్రం చెప్పారు. అక్కడితో నన్నయ రచన ఆగింది. నన్నయ గారి చివరి పద్యం- “శారదరాత్రులుజ్జ్వలలసత్తర తారక హారపంక్తులం...” . మొదటి మూడు ఆశ్వాసాలు రాజరాజనరేంద్రుని కే అంకితం ఇవ్వబడ్డాయి. ఎఱ్ఱన గారి అభిప్రాయాన్ని గూర్చి ఆరుద్ర ఇలా వివరించారు.

“..తాము పూర్తిచేయబోయే మూడున్నర ఆశ్వాసాలు అతనికే అంకితమిచ్చి నన్నయగారి పేరుతోనే ఎఱ్ఱన గారు ప్రకటించదలిచారు. అది నన్నయగారి పట్ల వారి కుండే భక్తిని, భారతం సంపూర్ణంగా విరాజిల్లాలనే ఆకాంక్షను తెలియజేస్తుంది.” అన్నారు. ఇక్కడ ఎఱ్ఱన ఉద్దేశ్యం – నన్నయ గారి పేరుమీదనే రచించడంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే (తన పేరు పెట్టినప్పుడే గదా కష్టనష్టాల భయం) అవి తొలగిపోతాయని కూడా ఎఱ్ఱన గారు భావించి ఉండవచ్చు అని అనుకోవడానికి కూడా ఆస్కారం లేకపోలేదు.

**** సశేషం ****

Posted in October 2022, సమీక్షలు

1 Comment

  1. Pillalamarri Krishna Kumar

    దోషాల గురించి భయపడి ఎఱ్ఱాప్రగడ వారు తన రచనని నన్నయకు అంకిత మిచ్చారని ఆరోపించడం అసహజం. అది ఎఱ్ఱాప్రగడని, ఆయన కవితా ప్రతిపత్తిని అవమానించడమే అవుతుందని నా అభిప్రాయం. ఆయన రచన నన్నయ, తిక్కనలకి తక్కువేంకాదు. అయితే కవులలో ఒక వరవడిని సృష్టించినవాడు నన్నయ. ఆయనకీ దీటుగా రాయాలని కృషి చేసినవాడు ఎఱ్ఱాప్రగడ. నన్నయకు చాలా ఏళ్ల తరువాత వచ్చిన తిక్కన శైలి సహజంగానే తేడాగా ఉంటుంది. ఇద్దరూ ఉద్దండులే. వారికి వారధి అయిన ఎఱ్ఱాప్రగడ ధన్యుడు. 

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!