Menu Close
Page Title

చక్కని రాజమార్గమే యుండగా...

“అది కాదురా! నాలుగురోజులనాడు మా తమ్ముడు మరదలు వచ్చారు. వారేగాదులే అంతకుమునుపు మా మొహాలు చూడని వారు కూడా ఇప్పుడు అది పనిగా వచ్చి ఆప్యాయత కుండలతో తెచ్చి కుమ్మరించి వెళుతున్నారు. అయితే మా నాన్నగారి కోరిక మేరకు మా తమ్ముడి కొడుకును దత్తత తీసుకొంటే ఎలా ఉంటుంది? అన్నది నా ఆలోచన. కాని సరోజకు అంతగా ఈ ఆలోచన ఇష్టం లేదు. తను మొదటినుంచీ ఏదైనా సాధించాలి అన్న ఆలోచన కలది గదా! అందుకే మాకు ఈ సమస్యవల్ల ఊగిసలాట ఏర్పడింది.” రమేష్ చెప్పడం ఆపాడు.

సుకుమార్ ముఖం కోపంతో కందగడ్డలా తయారయింది. “ఒరే! ముందు నా ఒళ్లో నుంచి లెయ్. ఇంతకన్నా ఆలోచనలు నీ మనసులోకి రావా? నువ్వు కూడా మీ నాన్న తరం వాడివేనా? నీ చుట్టూ పరిసరాలు, సాటివారి బాధలు, దేశం పట్ల, సమాజం పట్ల మీకున్న బాధ్యతలు ఏవీ నీకు పట్టవా?” అన్నాడు సుకుమార్ కోపం, విసుగు కలిసిన గొంతుతో. రమేష్ సుకుమార్ కు కోపం వచ్చిందని గ్రహించి

“అయ్యా! కొంచెం తగ్గి నా మొర ఆలకించు. నాకు చిన్నప్పటినుండి వివాహానికన్నా సంతానం గూర్చిన ఆలోచనే జాస్తి. ఇంటినిండా మగ, ఆడ సంతానం కళకళలాడుతూ తిరగాలని నా ఆశ. నాకు తగ్గదే సరోజ. అందుకేనేమో భగవంతుడు ఇలా చేశాడు. నాకూ కొన్ని ఆశయాలు ఉన్నా వాటిని తీర్చుకొనే శక్తి నా దగ్గర లేదు. డబ్బు ఒక్కటే చాలదుగా. ఏదైనా సమర్థవంతంగా నిర్వహించే నిర్వహణా సామర్ధ్యం ఉన్నవారే రాణిస్తారు. అందుకని నా ఆలోచన అలా ఇలా ఊగిసలాడుతున్నది. అందుకే నీ సాయం మాకు కావాలి.” అన్నాడు రమేష్ స్నేహితుని భుజం మీద చేయివేసి.

సుకుమార్ రమేష్ మాటలు విని “అయితే ఓ.కె. నువ్వు చేయలేవు గాబట్టి మీ నాన్నగారి దారిలో నడిస్తే ఫలితం ఉంటుందేమోనన్న ఆలోచనకు మీరు దగ్గరగా వస్తున్నారు. నా సాయం కూడా కోరుతున్నారు. ముందుగా మీకు మరొక మార్గం ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నా. అందుకే ముందు నేనొక యదార్థగాధ చెప్తాను. అది విన్న తర్వాత మీ అభిప్రాయాలు నాకు తెల్పితే అటు తర్వాత కార్యక్రమం గూర్చి ఆలోచిద్దాం.” అని సుకుమార్,

“మనుషులు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఏ క్షణాన ఎవరు ఎలా మారుతుంటారో తెలియదు. ఒకటి చెయ్యాలని అనుకొంటాం. కాని మరొకటి చేసేస్తాం. అందుకే నేను చెప్పే ఈమె జీవితగాథ తో మీలో ఆలోచనా విధానం మారుతుందేమో అని నా ఆశ. ఒక చిన్న ప్రయోగమిది.

చరిత్రలో జరిగే కొన్ని మార్పులవల్ల అప్పుడప్పుడు గొప్ప విషయాలకు గ్రహణం పడుతుంటుంది. అయితే నిప్పు కప్పిపెడితే ఆరదన్నట్లు వాటి పూర్వ వైభవం కొందరి మహామహుల విశేష కృషి వల్ల గ్రహణం వీడిన దినకరుడిలా ప్రకాశమానమవుతుంది. ఆ గ్రహణం వీడడానికి తమ జీవితాలను అంకితం చేసే వారినే ‘మార్గదర్శకులు’, ‘ఆదర్శమూర్తులు’ అంటారు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భరతనాట్యం తర్వాత దానికి గ్రహణం పట్టి సమాజంలో ఒక వర్గం వారికి పరిమితమయింది. సమాజానికి దూరమైనా భరతనాట్యానికి పూర్వకళావైభవాన్ని తెచ్చిపెట్టిన వనిత ఎవరో తెలుసా? రుక్మిణీ అరండేల్.

మధురైలో పుట్టిన ఒక బ్రాహ్మణ కన్య ఆంగ్లేయుణ్ణి వివాహమాడితేనే మండిపడ్డ ఈ సంఘం, ఆమె ఒక పెనుమార్పుకు స్వీకారం చుట్టడాన్ని తప్పుపట్టింది. బ్రాహ్మణ కన్య అందునా వివాహిత తన కాలికి గజ్జె కట్టడం క్షమించలేకపోయారు ఆనాటి ప్రజలు. అయినా ఆమె బెదరలేదు. ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదర లేదు. కృతనిశ్చయంతో భరతనాట్య కళను బ్రహ్మరథం ఎక్కించి ప్రపంచం నలుమూలలా తన నాట్య ప్రదర్శనలతో భరతముని ఆశీస్సులను పొందింది. మదరాసులో ‘కళాక్షేత్రం’ అన్న సంస్థను స్థాపించింది. ఆనాటి నుండి ఈ నాటి వరకు నిత్యకళ్యాణం పచ్చతోరణం గా ఆ సంస్థ విరాజిల్లుతున్నదంటే ఆమె కృషి, భరతనాట్య వైభవం ఎంతటిదో కదా!

ఆమె కథ మీకెందుకు చెప్పానంటే మీకు వచ్చిన సమస్యే ఆమెకు వచ్చింది. అదే సంతాన లోపం. ఆమె కూడా కొన్నాళ్ళు ఆ లోపానికి బాధపడింది. అయితే ఆమె తన సమస్యను తానే పరిష్కరించుకోగల సమర్ధురాలు. అందుకే తన ఆలోచనలను ప్రపంచం వైపు మరల్చింది. అమెది విశ్వసంతానం ఈనాడు. వేలమంది యువత నేడు ఆమెకు భగవంతుడిచ్చిన బిడ్డలు.

నేను చెప్పడం అయిపోయింది. ఇక మీరు ఆలోచించుకొని, మార్గాన్ని ఎన్నుకోవడం మిగిలివుంది. మరి నేను వెళ్ళనా?” సుకుమార్ కుర్చీలోంచి లేచాడు.

“అన్నయ్యా! ఒక్కమాట. ‘ఆలస్యం అమృతం విషం’ అన్న మాట ఉంది కదా. నీవు కథ మొదలుపెట్టి ముగించేలోగానే నా తుది నిర్ణయం ఖరారయింది. నేను బ్రతికితే రుక్మిణీదేవి లాగా కొంతైనా ఆదర్శాలకు కట్టుబడి బ్రతుకుతా. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యాన్ని నీ సహకారంతో ప్రారంభిస్తా. ఇదే నా నిర్ణయం. అందుకే నువ్వు మా సమస్యకు పరిష్కార మార్గం చెప్పిగాని వెళ్ళవద్దన్నయ్యా!” సరోజ కళ్ళనిండా నీళ్ళు నింపుకొని సుకుమార్ కాళ్ళకు దండం పెట్టింది.”

“ఏయ్! సరోజా! ఏంటిది? లెయ్. వాడితో కూడా మాట్లాడి తప్పక నేను చేయగల సహాయం చేస్తా.” సుకుమార్ సరోజను ఆశీర్వదిస్తూ అన్నాడు.

“అన్నయ్యా! మాట్లాడి, ఆలోచించి అందరం అలసి పోయాం. అందుకే వేడివేడిగా కారం దోసలు చేస్తా.” సరోజ వంటింటి వైపు నడిచింది వడివడిగా.

“అయ్యా! రమేష్ బాబూ! నీ మాటేవిటి?”

సుకుమార్ మాటలకు

“నీవెప్పుడైనా నా మాట నెగ్గనిచ్చావా? ఎప్పుడు చూచినా మార్కులన్నీ నీవే. నేను మొదటినుండి మొద్దబ్బాయినే. నా సరోజ ఉంది కాబట్టి ఇంతమాత్రం రాణిస్తున్నా. సమయానికి మాకు కావల్సిన కథ చెప్పి మా దారి రహదారి చేశావు. నువ్వు చెప్పినట్లు దత్తత మొదలైనవి ఏకవ్యక్తికి సమర్పణ చేయడమే. కాని ఇలాంటి ఒక ఆశయంతో చేసే ప్రయత్నాలు ఒక వ్యక్తి పదిమందికి పనికివచ్చే పని చెయ్యడమే గదా. ఒరే స్నేహితుడా! నీ మేలు మరిచిపోలేమురా! అయితే ఇల్లు అలకగానే పండగ కాదు గదా. నా సంగతి తెలుసు నీకు. ఇంత పెద్ద ఘనకార్యం సఫలం కావాలంటే ఎంతో శ్రమ, ఓర్పు కావాలి” రమేష్ నిరుత్సాహంగా అన్నాడు.

“ఒరే నిరుత్సాహమూర్తి! నీలానే ఈ ప్రపంచమంతా ఆలోచిస్తే ఇంత ప్రగతి ఎలా సాధ్యం? తెల్లారేసరికి బిల్డింగులు లేచిపోతున్నాయి. అవన్నీ నువ్వు నాకు వదిలేయ్. సరోజ సహాయంతో నేను నిర్వహిస్తా. నువ్వు చూస్తుండలా. అయితే ముందు నేను ఏర్పరిచిన ప్రణాళిక, వేసిన ప్లాను, మీరిరువురూ మనస్ఫూర్తిగా అంగీకరించాలి. మీ నాన్న గారి సూచన పాటించకపోతే వచ్చే ఇబ్బందులు నేను చెప్పినవాటి వల్ల మీ వాళ్ళతో, బంధువులతో వచ్చే ఘర్షణలు ఇవన్నీ ఆలోచించుకో.” సుకుమార్ మాటలకు అడ్డుపడుతూ,

“ఒక మంచి పనికి పది అడ్డుపుల్లలు తప్పవు గదా! ఏవీ మన ఆదర్శానికి అడ్డుపడలేవు సరేనా.” అన్నాడు రమేష్.

“రండి! రండి! దోశలు చల్లారిపోతున్నాయి.” సరోజ పిలుపుతో డైనింగ్ టేబుల్ వైపు నడిచారు ఆ స్నేహితులు.

“అమ్మా! మీ వారు కూడా ఓ.కే చెప్పారు. ఎందుకైనా మంచిదని మీ సమస్యకు పరిష్కార మార్గంగా ఒక ప్లాను, దానికి కావాల్సిన లెక్కలు మొదలైన వితరణలు తయారుచేసి ఉంచాను. ఇవిగో ఆ పేపర్లు.” అని కొన్ని పేపర్లు రమేష్ చేతికందించాడు. దానికి బదులుగా అన్నట్లు సరోజ, రమేష్ తమ బ్యాంకు పాస్ బుక్, చెక్ బుక్ సుకుమార్ చేతిలో పెట్టారు. సుకుమార్ వాటిని టేబుల్ మీద పెట్టి.

“మీరు కంటినిండా నిద్రపోవాలంటే నా ప్రయత్నం గూర్చి మీరు వినాలి. ఆ ప్లాను మీకు నచ్చినప్పుడే మీకు పూర్తి ఆనందం కలుగుతుంది. అందుకని ఇంకొక అరగంట గడిపి నా మాటలు వినండి.” అంటూ, సుకుమార్ కూర్చొన్నాడు.ఆయన మాటలకు సరోజ, రమేష్ దంపతులు కూడా కూర్చొన్నారు.

 

**** సశేషం ****

Posted in April 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!